క్యాండిల్స్ వెలుతురులో రెబ్ కా శవం భయానకంగా అనిపించింది.
బల్ల ముందు మోకాళ్లమీద కూర్చున్నాడు,. క్లియరో...క్లిమో...గ్లిమో... బ్రెహో...బ్లిమో...శ్లుమో...బిత్రో...బిత్రో.. .బిత్రో...." పీటర్సన్ పెదవులు కదులుతున్నాయి. క్షణక్షణానికి అతని మొహంలో రంగులు మారుతున్నాయి. ఉద్వేగంతో వణికిపోతున్నాయి.
అతని దవడ కండరాలు బిగుసుకుపోతున్నాయి.
హ్రిక్లో...క్లిమో...గ్లిమో...బ్రెహో...బ్లిమో...బిత్రో...బి..త్రో...బి..త్రో.."
ఆ గదిలో పరుచుకున్న క్యాండిల్స్ వెలుతురులో మార్పు రాసాగింది. ఒక్కో క్యాండిల్ ఒక్కో రంగులో వె...లు...గు...తోం...ది...ఎరుపు...నీలం...పసుపు...ఆరెంజ్...ఇవి కలిసి మరో వింత రంగు...మెదడు నరాలు చిట్లిపోయే ఉత్కంఠ నెలకొంది. అప్పుడే రెబ్ కా కన్నులు మెల్లిమెల్లిగా తె...రు...సు...కో...బో...తు...న్నా...యి.
సరిగ్గా అదే సమయంలో...
పీటర్సన్ లో ఉలికిపాటు.
బిత్రోచికి స్త్రీని సమర్పించే ప్రయత్నంలో ఏ ఆటంకమూ కలగకూడదు. అలా జరిగితే బిత్రోచి కళ్ళెర్ర చేస్తుంది. ఆ సమర్పణ వృధా అవుతుంది.
క్లిమో...గ్లిమో...బ్రెహో...బ్లిమో...హిక్లీ...అతని పెదవులు మంత్రాలను ఉచ్ఛరిస్తూనే వున్నాయి.
మళ్ళీ అప్పుడు...అప్పుడు తలుపు మీద శబ్దం...కాలింగ్ బెల్ శబ్దం...రెండు కలిసి అతని కర్ణభేరిని తాకాయి.
తెరుచుకోబోతున్న రెబెకా కన్నులు..తిరిగి...మూ..సు..కు..పో..తు..న్నా..య్...
రెబెకా...ఓపెన్ యువర్ అయిస్...
క్లీ...
ఆ శబ్దం క్షణక్షణం పెద్దదవ్వసాగింది.
విసురుగా లేచాడు పీటర్సన్..పీటర్సన్ లేవడంతోనే క్యాండిల్స్ వెలుతురులో మార్పు వచ్చింది. రంగులు మారి ఒక రంగులోకి వచ్చాయి. పెద్దగాలి వీచినట్టు ఒక్కో క్యాండిల్ ఆరిపోతూవుంది.
ఎవరో ఉఫ్ మని ఊదినట్టు ఐదు క్యాండిల్సూ ఆరిపోయి గదిని చీకటి మయం చేసాయి.
బిత్రోచికి స్త్రీని సమర్పించడానికి ముందు, మంత్రోచ్చారణతో ఆ కన్నెపిల్లని శుద్దిచేయాలి. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని ఆ శవం కళ్ళు తెరిచి తిలకించి సంతృప్తి పడుతుంది.
ఆ తర్వాత పాడుబడిన పురాతనమైన, నిర్మానుష్యమైన ప్రాంతంలో బిత్రోచికి ఆ అమ్మాయిని సమర్పించాలి.
దీన్నే "పెరిగిమియో..." అంటారు. ఓ స్త్రీ మృతదేహానికి ప్రాణం పోసి, ఆ శరీరాన్ని సమర్పించే ప్రక్రియ ఇది.
ఆ ప్రయత్నంలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు. చిన్న అలికిడి కూడా మంతోచ్చాటనను ఆటంక పర్చకూడదు.
* * *
హాలులోకి వచ్చి, కుడివైపు వున్న షెల్ప్ దగ్గరికి వెళ్లి, రిమోట్ కంట్రోలర్ తీసుకుని 'ఆన్' అన్న బట్టన్ నొక్కాడు.
ఎదురుగా ఉన్న పోర్టబుల్ టీవీలో బయట దృశ్యం కనిపిస్తోంది. హాలు బయట పోలీసు ఆఫీసర్ రాబర్ట్, మరికొంతమంది పోలీసులు వున్నారు.
పీటర్సన్ ఇంక ఆలస్యం చేయలేదు. గబగబా స్టోర్ రూమ్ లోకి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు. ఆ స్టోర్ రూమ్ కి మరో తలుపు వుంది. అది ఔట్ హౌస్ వైపు దారితీస్తుంది.
నిశ్శబ్దంగా అటువైపు వెళ్లి వెనుక మార్గం గుండా రోడ్డుమీదకి వచ్చాడు. రోడ్డుపై వెళ్తోన్న ఓ క్యాబ్ ని ఆపి 'ముస్తార్ మార్గ్' అని చెప్పాడు.
పీటర్సన్ చేతిలో బ్రీఫ్ కేసువుంది. అందులో సింగపూర్ డాలర్లున్నాయి. మరికొంత డబ్బుని అప్పటికే డేనియల్ ద్వారా మరోచోటికి తరలించాడు.
* * *
రాబర్ట్ తలుపులు బద్దలుకొట్టించి లోపలికి అడుగుపెట్టాడు.
ఐదు నిమిషాల్లో అర్ధమైంది. పీటర్సన్ 'ఎస్కేప్' అయ్యాడు. వెంటనే వైర్ లెస్ లో మెసేజ్ పంపించాడు.
ఎయిర్ పోర్టులో సహా అన్ని చోట్ల నిఘా ఏర్పాటు చేయమని ఆదేశాలు పంపించాడు.
* * *
రెబ్ కా డెడ్ బాడీని చూసిన రాబర్ట్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతని మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తోంది.
రెబ్ కా యాక్సిడెంట్, ఆమెకి బరియల్ గ్రౌండ్ లో పాలరాతి సమాధి కట్టించడం...అన్నీ గుర్తుకొచ్చాయి.
ఆ గదిని పరిశీలనగా చూశాడు.
క్యాండిల్స్ బల్లకు నలువైపులా వున్నాయి. ఓ క్యాండిల్ రెబ్ కా పొట్టమీద...వుంది. గోడలకు కొన్ని వికృతమైన ఫోటోలు వేలాడుతూ వున్నాయి.
రెబ్ కా డెడ్ బాడీని అక్కడనుంచి తరలించాడు. ఆమెను పడుకోబెట్టిన బల్లమీద బ్లాక్ చాక్ పీసుతో ఉన్న అక్షరాలు గమనించాడు.
బల్లమధ్యలో వృత్తాకారంలో ఓ సర్కిల్ గీయబడి వుంది. అందులో బిత్రోచి అనే పదం వుంది. ఆ సర్కిల్ నుండి నాలుగు వైపులా నాలుగు గీతలున్నాయి. ఒక్కో గీత దగ్గర ఒక్కో పదం వుంది.
క్లిమో...
గ్లిమో...
శ్లుమో...
బ్లిమో...అన్న పదాలున్నాయి. ఒక్కో పదం మీద ఒక్కో క్యాండిల్ వుంచాడు.
రాబర్ట్ వెంటనే బయటకు వచ్చి ఆ గదిని లాక్ చేసి సీల్ చేయించాడు.
* * *
క్యాబ్ దిగి ఫేర్ చెల్లించి ఎదురుగా ఉన్న సెవెన్ లెవెన్ రెస్టారెంట్ లోకి అడుగు పెట్టాడు పీటర్సన్.
ఆ రెస్టారెంట్లో రైట్ టర్న్ లో ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూచొని కోక్ తాగుతున్నాడు డేనియల్.
పీటర్సన్ డేనియల్ దగ్గరికి వచ్చి అతనెదురుగా కూచోన్నాడు.
"బుల్ షీట్...మనం అనుకున్నదంతా అయ్యింది. ఆ రాబర్ట్ మన ప్లాన్ ని తలక్రిందులు చేసాడు" కోపంగా అన్నాడు బేరర్ కు వైన్ ఆర్డర్ చేసేక పీటర్సన్.
"కూల్ డౌన్ ఫ్రెండ్...ఇదంతా మనం ఎక్స్ పెక్ట్ చేసిందే...ఇంతకీ 'పెరిగిమియో' ఏమైంది?"
"లాస్ట్ సెకన్ లో ఆ రాబర్ట్ డిస్ట్రబ్ చేసాడు. నేను పారిపోయి వచ్చేసాను"
"దట్స్ గుడ్...మంచి పని చేసావు. మన ఆఫీసును సీజ్ చేసారు. మన గెస్ట్ హౌస్ చుట్టూ మఫ్టీలో పోలీసులు కాపలా వున్నారు. మనకు సెకెండ్ చాయిస్ లేదు. బైది బై మరో విషయం...ఇంపార్టెంట్ మోటల్స్ ని (అక్కడ హోటల్స్ ని మోటల్స్ అంటారు) కనిపెట్టుకు ఉండమని కూడా పోలీసులకు ఆదేశాలు అందాయి. ఓన్లీ వన్ వే...
మనం ఇక్కడ్నుంచి జెండా ఎత్తేయడం తప్ప మరో మార్గం లేదు" సీరియస్ గా చెప్పాడు డేనియల్.
ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు పీటర్సన్. రెండో క్షణం డేనియల్ వైపు తిరిగి...మనం వెంటనే సింగపూర్ వదిలి వెళ్లిపోవాలి. ఏదైనా ప్లయిట్ కు ట్రైచేయి.."
డేనియల్ తల అడ్డంగా వూపి చెప్పాడు.
"చెప్పానుగా...ఎయిర్ ఫోర్టులన్నీ బందోబస్తుతో వున్నాయి. మనం వెళ్తే, వెంటనే అరెస్టు చేస్తారు. కనీసం బెయిల్ దొరికే అవకాశం కూడా లేదు"
"మరెలా?"
"అదే ఆలోచిస్తున్నాను...నువ్వు వైన్ తాగుతూ వుండు..ఈలోగా నేను నా ప్రయత్నాలు చేస్తాను" అంటూ లేచాడు డేనియల్...
* * *
బ్రైట్ హిల్ టెంపుల్
సింగపూర్ లో పేరున్న టెంపుల్..ఆ ప్రాంతంలో జ్యోతిష్కులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఫుట్ పాత్ కు ఓ పక్కన చిన్న షెల్టర్స్ లాంటి వాటిలో చైనా జ్యోతిష్కులు కూడా వుంటారు. నాలుగు నెంబర్లుగల సంఖ్యని అడిగి భవిష్యత్ చెప్పే జ్యోతిష్కులు కొందరు.
(మన ఇండియాలో కూడా న్యూఢిల్లీలో న్యూచౌక్ దగ్గర మనకు ఇష్టమైన ఒకే అంకెని అడిగి ఆ అంకె ఆధారంగా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కనిపిస్తారు. అందుకు ఇరవై ఐదు రూపాయలు వసూలు చేస్తారు)
* * *
ఒపెన్ మార్గ్
బ్రెట్ హిల్ టెంపుల్ దాటి కుడివైపు రెండు మైళ్ళు దాటితే వచ్చేదే ఓపెరా మార్గ్.
అక్కడ తాంత్రికులు వుంటారు. చిన్న చిన్న ఇరుకు గదుల్లో నివసిస్తారు. ఎక్కువగా బయటకు రారు. రాత్రంతా పూజలో వుంటారు.
దుష్టశక్తులను పారద్రోలడం వాళ్ల పని. వాళ్ల పని వాళ్ళు కామ్ గా చేసుకుపోతారు.
ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు.
రాబర్ట్ తన వెహికల్ ని ఒపెరా మార్గ్ లో ఓ పార్కింగ్ ప్లేస్ వద్ద పార్కు చేసి ఓ ఇంటిముందు ఆగాడు.
కుడిచేతి చూపుడు వేలితో చిన్నగా నాక్ చేసాడు డోర్ ని.
తలుపు మెల్లిగా తెరుచుకుంది.
రెడ్ కలర్ గౌను వేసుకున్న ఓ వ్యక్తి తలుపు తీసాడు.
కిందినుంచి మీదివరకు వుందా గౌను.
పోలీసు దుస్తుల్లో ఉన్న రాబర్ట్ ని చూసి ఒక్కక్షణం ఆశ్చర్యానికి గురైంది అతని మొహం.
"అయామ్ రాబర్ట్...పోలీసు డిపార్టుమెంటు..." అంటూ తన ఐడెంటిటీ చూపించి...
"మీరేనా మిస్టర్ సుసిరియో..." అడిగాడు.
"యస్..." అంటూ లోపలుంచి ఓ రెండు కుర్చీలు తెచ్చి బయట వేసాడు.