ఆ ఆఫీసర్ వెంటనే ఓ సబ్ ఇన్స్ పెక్టర్ ర్యాంక్ ఉన్న వ్యక్తిని మఫ్టీలో పంపించాడు.
స్మగ్లింగ్ కార్యకలాపాలు విషయం నిజమేనని తెలిసింది. అతని కోసం బ్యాంకాక్ పోలీసులుకూడా వెతుకుతున్నారని తెలిసింది.
వెంటనే వ్యూహం పన్నాడు క్రయిం బ్రాంచి ఆఫీసర్ రాబర్ట్.
అప్పటికే పీటర్సన్ చాలా తెలివిగా తను అనుకున్న విధంగా రెబకా అనే పదహారేళ్ళ అందమైన యువతిని యాక్సిడెంట్ పేరుతో చంపించాడు.
ఆ విషయం ఏ మాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు.
ఆ అమ్మాయి పేరెంట్స్ దగ్గరకు వెళ్లి ఓదార్చి వాళ్లను కొన్ని వందల డాలర్లు ఇచ్చి తనే దగ్గరుండి పాలరాతితో సమాధి కట్టించాడు.
రామశర్మకు ఎప్పటికప్పుడు ఆ విషయాలు తెలుస్తూనే వున్నాయి. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చాడు.
తను ఇక్కడ్నుంచి ఇండియా వెళ్లిపోవాలి...పీటర్సన్ తనని ఏమీ చేయకముందే...తను పారిపోవాలి...
కూతురు తరళ ఫ్రెండ్స్ తో కలిసి చివరిసారిగా సిటీ అంతా తిరిగేసి షాపింగ్ చేసి వస్తానని చెప్పింది. రెండ్రోజుల్లో తన ప్రయాణం తన ప్లాట్ అమ్మకానికి పెట్టాడు.
ఓ ఫ్రెండ్ ఆ పని చూసి డబ్బులు పంపిస్తానని చెప్పాడు. రామశర్మ టెలిఫోన్ దగ్గరికి వెళ్లాడు. కూతురు తన ఫ్రెండ్ ఇంటి ఫోన్ నెంబర్ ఇచ్చింది.
ఆ నెంబర్ కు డయల్ చేశాడు రామశర్మ.
తరళ ఫ్రెండ్ రూబీ రిసీవర్ ఎత్తి, తర్వాత తరళకు రిసీవర్ ఇచ్చి చెప్పింది "మీ డాడీ" అని.
ఇంత అర్దరాత్రి తండ్రి ఎందుకు ఫోన్ చేశాడో అర్ధం కాలేదు. "హలో డాడీ...ఏం...టి?" కంగారుగా అడిగింది తరళ.
* * *
నలుగురు దుండగులు నిశ్శబ్దంగా ఆ ప్లాట్ వెనుక భాగానికి వచ్చారు.
బ్యాక్ సైడ్ గ్లాస్ విండోస్ వున్నాయి.
అందులో నుంచి చూస్తుంటే ఫోన్ లో మాట్లాడుతున్న రామశర్మ కనిపిస్తున్నాడు వాళ్లకు.
ఓ దుండగుడు గ్లాస్ కట్టర్ బయటకు తీశాడు.
"నేనేనమ్మా...నువ్వు రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేయ్...రేపే మనం ఇండియా వెళ్తున్నాం..."
తండ్రి గొంతులోని కంగారును గమనించి...
"ఏమైంది డాడీ...ఇంకా టైముందిగా"
"లేదమ్మా..మనం పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాం" రామశర్మ గొంతులో ఆదుర్దా వ్యక్తమవుతోంది...
"వాట్ హేపెండ్ డాడీ...నేను వెంటనే వచ్చేస్తాను.."
"వద్దమ్మా...అది..."
భళ్ళుమన్న శబ్దం వినిపించి రామశర్మ తలతిప్పి చూసేడు.
విండో గ్లాస్ పగులగొట్టి లోపలికి వస్తున్న నలుగురు దుండగులను చూశాడు.
"డాడీ..."
"తరళా..మై స్వీట్...నా కోసం నువ్వు ఎదురు చూడొద్దు...ఆయామ్ ఇన్ డేంజర్...నువ్వు వెంటనే ఇండియా వెళ్లిపో...నా డైరీలో పరమహంస అనే వ్యక్తి చిరునామా వుంది. నా చిన్నప్పటి ఫ్రెండ్..నువ్వు అతని దగ్గరకు వెళ్లిపో...వెళ్లిపో మై చైల్డ్...ప్లీజ్ గో..ప్లీజ్ గో..."
ఆ దుండగులు రామశర్మను సమీపించారు.
"వద్దు...నన్ను చంపొద్దు...ప్లీజ్ డోంట్ కిల్ మీ...ప్లీజ్..."
ఆ నలుగురిలో ఒకతను పొడవాటి కత్తి బయటకు తీశాడు...
"డాడీ...డా...డీ..." అటువైపు నుంచి తరళ ఆందోళనగా మాట్లాడుతోంది.
ఆ పొడవాటి కత్తి గాల్లో నుంచి చీల్చుకుని టెలిఫోన్ వైర్ ని కట్ చేసింది.
మరోసారి గాల్లోకి లేచిన కత్తి రామశర్మ తలను తాకింది.
శబ్దం కూడా రాకుండా రామశర్మ తల మొండెం నుంచి పేరయింది.
కొద్ది క్షణాల వ్యవధిలోనే ఓ బీభత్స కాండ ముగిసింది.
పాతికేళ్ళ క్రితం పొట్ట చేత్తో పట్టకుని వచ్చిన రామశర్మ తన తుదిశ్వాసను విడిచాడు.
* * *
"రూబీ...నేను వెళ్తాను...ఇప్ యూ డోంట్ మైండ్...నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయగలవా?" తన ఫ్రెండ్ ని రిక్వెస్ట్ చేసింది తరళ.
ఫోన్ లో తన తండ్రి ఎవర్నో రిక్వెస్టు చేయడం వినింది. తనని చంపొద్దని వేడుకుంటున్నాడు. ఎవర్ని? తన తండ్రికి ఏమైంది? నాలుగైదు రోజులుగా టెన్షన్ తో వుంటున్నాడు.
ఆమె మనసు కీడును శంకించింది.
"డోంట్ గెట్ ఎక్సయిటెడ్...నేను డ్రెయ్ వు చేస్తాను" రూబీ డ్రెస్ మార్చుకుని వచ్చి కారు బయటకు తీసింది.
* * *
"మన వాళ్ళు రామశర్మని చంపేశారు..." డేనియల్ ఉత్సాహంగా చెప్పాడు పీటర్సన్ తో...
"వెరీ గుడ్...వాళ్లని వెంటనే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోమ్మని చెప్పు...వాళ్లకు కావలసిన డబ్బు ఇచ్చేయ్...బై ది బై...మరో పది నిమిషాల్లో మనం ఇంటికి వెళ్లాలి...అక్కడ్నుంచి రెబకా డెడ్ బాడీని గెస్ట్ హౌస్ కు తీసుకు వెళ్లాలి...రెబ్ కాని 'బలి' కి సిద్దం చేయాలి. టైం లేదు...సరిగ్గా అర్దరాత్రి రెండు గంటలకు మనం బిత్రోచికి రెబ్ కాని స...మ...ర్పిం...చా...లి"
డేనియల్ అలాగే నన్నట్టు తలూపాడు.
ఇద్దరూ బయటకు వచ్చారు.
అప్పటి వరకూ ఆ సంభాషణ అంతా విన్న వాచ్ మేన్ పక్కకు తప్పుకున్నాడు.
వాళ్లిద్దరూ బయటకు వెళ్లగానే, విషయాలు అన్నీ క్రయిమ్ బ్రాంచికి ఫోన్ ద్వారా తెలియజేశాడు...
రెండ్రోజుల క్రితమే రాబర్టు, ఆ వాచ్ మేన్ ని పిలిచి తనకు అనుకూలంగా మారిపోమని చెప్పాడు...
* * *
కారు అరబ్ స్ట్రీట్ లోని ఓ అపార్టుమెంట్ ముందాగింది. తరుళ కారు దిగి తన ప్లాట్ వంక చూసి షాకైంది. లైట్లు వెలుగుతున్నాయి. పోలీసు వెహికల్స్ కనిపించాయి.
అంత రాత్రి...వేరే ప్లాట్లలోని వాళ్ళుకూడా తన ప్లాట్ ముందే గుమిగూడి వున్నారు.
తరళ లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తింది. రూబి కూడా ఆమె వెంటనే వెళ్ళింది.
ప్లాట్ దగ్గరకి వచ్చేసరికి పోలీసులు కనిపించారు.
లోపలికి అడుగుపెట్టిన తరళ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకుంది.
హాలంతా రక్తం మరకలతో వుంది. తండ్రి శరీరంలో భాగాలు చెల్లా చెదురై పడివున్నాయి. తరళ గొంతులోంచి పెద్ద కేక వెలువడింది.
రాబర్ట్ తరళ దగ్గరకి వచ్చాడు.
అతనికి తరళ పరిస్థితి అర్ధమైంది.
తరళ వయస్సే ఉన్న కూతురు అతనికి వుంది. వృత్తిలో ఎంతో కాఠిన్యం చూపించే రాబర్ట్ ది స్వతహాగా జాలిగుండె.
ఓదార్పుగా తరళ తలపై చేయివేశాడు. ఏ మాటలూ ఆ పిల్లకిప్పుడు ఉపశమనం ఇవ్వలేవని అతనికి తెలుసు.
మోకాళ్లమీద కూచొని ఏడుస్తోంది తరళ.
రామశర్మని పీటర్సన్ చంపేయమని చెప్పినప్పుడే, రాబర్ట్ తన సార్జెంట్స్ ని పంపించాడు.
కానీ వాళ్ళు వచ్చేలోగా రామశర్మ హత్యకు గురయ్యాడు.
ఫోటోగ్రాఫర్ డెడ్ బాడీని వివిధ కోణాల్లో ఫోటోలు తీస్తున్నాడు.
ఫింగర్ ఫ్రింట్స్ ఎక్స్ పర్ట్ తన పని తను చేసుకుంటూ పోతున్నాడు.
తరళని ఎలా ఓదార్చాలో అర్ధం కాలేదు రాబర్ట్ కు. కేవలం తన డిపార్టుమెంట్ అసమర్ధత వల్లే రామశర్మ చనిపోయాడనే గిల్లీ కాన్షియస్ నెస్ కలిగింది అతనిలో...అప్రయత్నంగా అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
తమకు సాయం చేయబోయిన రామశర్మని చంపించిన పీటర్సన్ ని వదిలిపెట్టకూడదు. రామశర్మ ఆత్మ శాంతించాలంటే పీటర్సన్ ని తాము అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోయాలి.
పోలీసు ఆఫీసర్స్ కు సూచనలిస్తున్నాడు రాబర్ట్. తను వెంటనే పీటర్సన్ ఇంటికి వెళ్లాలి.
అతను పారిపోకముందే అరెస్టు చేయాలి. వెంటనే అతను తరళ దగ్గరకు వెళ్లి...
"బేబీ మీ డాడీని నేను తెచ్చి ఇవ్వలేకపోవచ్చు...బట్...మీ డాడీ చావుకు కారణమైన పీటర్సన్ ని వదిలిపెట్టను"
తరళ తలెత్తింది...
"డాడీని చంపింది పీటర్సనా?"
"యస్...మీ డాడీ పనిచేసే కంపెనీ ఎండియే మీ నాన్నని చంపించాడు. తన రహస్యాలు మాకు తెలిపాడన్న కోపంతో ఈ పనిచేశాడు. అయామ్ వెరీ సారీ...మీకే సాయం కావాలన్నా మా డిపార్టుమెంట్ సిద్దంగా వుంటుంది. మీ నాన్న మాకు చేసిన హెల్ప్ కు ప్రభుత్వ పరంగా మీకు ఉద్యోగంకూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాను..."
"థాంక్యూ సార్ బట్...నాకు మీరు చేయాల్సిన సాయం ఒక్కటే...ఆ పీటర్సన్ ను అరెస్టు చేశాక ఒక్కసారి నాకు చూపించండి.
రాబర్ట్ ఆశ్చర్యంగా చూసి "ఆల్ రైట్...అలాగే.,,," అన్నాడు.
* * *
పీటర్సన్ వార్డ్ రోబ్ దగ్గరికెళ్లి అందులో నుంచి బ్లాక్ గౌన్ తీశాడు. పొడవాటి ఆ బ్లాక్ గౌనుకు నిలువుగా అడ్డంగా రెండేసి చొప్పున ఎరుపు రంగు పట్టీలు వున్నాయి.
ఆ పొడవాటి గౌనును వేసుకున్నాడు.
కుడివైపు గదిలో నడిచాడు. లోపల పెద్ద బల్లవుంది. దానిమీద రెబ్ కా డెడ్ బాడీ వుంది...
సే...కె...డ్..గా...
గది లోపలికి వచ్చి డోర్ వేశాడు. బల్లమీద వున్న ఐదు క్యాండిల్స్ తీసాడు.
ఐదు క్యాండిల్స్ వెలిగించి బల్లకు నాలుగు వైపులా నాలుగు క్యాండిల్స్ పెట్టాడు. ఐదవ క్యాండిల్ రెబ్ కా పొట్టమీద పెట్టి క్యాండిల్ వెలిగించి లైట్ ఆఫ్ చేశాడు.