'యిప్పుడేమన్నానని చెప్పండి, అన్ని మాటలు అనటం నన్నూ?'
ఎన్నో మాటలు అన్నట్లు మాట్లాడుతావేం? ఆ మాటలకన్నిటికీ ఒకటే అర్ధం.
"అవునవునూ, మీరెన్ని అన్నా బాగానే వుంటుంది! మీరన్న మాటల కన్నిటికి ఒకటే అర్ధం. నేనేమన్నా ఒక్క మాట తెలిసో తెలియకో అంటే నానా అర్ధాలూ, తీస్తారు.
ఇక కట్టిపెట్టి ఆ సూట్ కేస్ ఇల్లా యిచ్చేయి. వెళ్ళి పోవాలె. ఇంతకూ ఆ సిల్కు వుత్తరీయం వేశావా?
రేపు శుక్రవారంనాడు! పేరంటానికి ఆ వుత్తరీయం వోణీగా వేసుకొంటానని పిల్ల సరదాపడ్డది అందుకని ఉంచేశాను. మీ కిష్టం కాకపోతే తీసుకెళ్ళండి.
పిల్ల కావాలన్నదని మొదటనే చెప్పక పోయినావూ? సరే ఆ పెట్టి యిలా ఇచ్చెయ్యి.
"ఇదండి. అయితే మొన్న మా తమ్ముడిచ్చిన నీలం అంచు ధోవతులు తీసికెడుతున్నారు. ఎక్కడో పారేస్తారు. మీకు తగని మరువు."
"అబ్బా, మనిషిని వుండే తెలివి తక్కువతనం, మరువూ, మొదలుగా గల దుర్గుణాలన్నీ నా ఒక్కడిలోనే చేరినట్లు మాట్లాడుతావు గదా! నీతో నాకూ..."
"పోనీ లెండి. ఇక బయలు దేరండి."
"బండిని కేకెయ్యవే అమ్మాయీ"
బండి ఎందుకూ! సూట్ కేస్ చేతపట్టుకొని నాలుగు అడుగులు చర చర నడిచిపోరాదూ?"
"ఈ ఒకటిన్నర మైలూ, ఈ పెట్టి నెత్తిన వేసుకొని నేను నడవాలిసిందే?"
"మొగాళ్ళూ ఎంతలోకి నడుస్తారూ?"
"ఇక నీవు ఊరుకో, నన్ను మండించక, వెధవ వాగుడు వాగకూ, బండిని పిలవ్వే."
"................"
'ఉండవోయ్ గురన్నా బండిని ఆపమనవే అమ్మాయీ'
"ఎందుకే అమ్మాయీ?"
"అమ్మ ఆపమంటుంది నాన్నా."
"అమ్మకేం అట్లాగే అంటుంది. నాకు టైము అయింది"
వస్తున్నా, వస్తున్నా వుండండి. అబ్బ అయినంత సేపూ కాంగా ఇంతలో తొందర వచ్చిందే? ఇందాక పోట్లాట వేసుకొని కూర్చుంటానికి ఏ తొందర లేదూ!"
సరే కాని, నేనా పోట్లాట వేసుకొని కూర్చుందీ? పోట్లాడటానికైనా టయిము లేదు. ఎందుకు ఆపినావు? అదేమిటి? ఆ చేతులో బుట్ట ఏమిటి?"
"కొత్త ఆవకాయ. దార్లో గుంటూరులో మా అక్కయ్యగారింట్లో ఇవ్వండి"
ఏడ్చినట్లే వుంది. తీసుకొనిపో, వెధవ ఆవకాయబుట్ట మోసుకు పొమ్మంటావు? ఎర్రని ద్రవం దానిలో నుంచి కారుతూ వుంటుంది గదా?"
"మిమ్ములను మొయ్యమన్నానా? మీరు మొయ్యాలనా? స్టేషనుదాకా ఎట్లాగా బండి వుంది గదా? ఇక్కడ రైలులో పడేస్తే అక్కడ దింపటమే కదా! ఇక మీరు మోసేదెక్కడ"
"స్టేషను దగ్గరనుంచీ ఇంటికి ఎవరు మోస్తారు."
స్టేషను దగ్గర నుంచి ఆ కాస్తదూరం చేత్తో పట్టుకు పోవచ్చు. పాపం. దాని పిల్లలకు చద్ది వణ్ణంలోకైనా వుంటుందని ఆశపడ్డాను. పోనీలెండి, ఆపేక్ష వుంటేగదా, నా మీదనూ మా వాళ్ళమీదనూ, సరేపొండి ఏం జేస్తానూ?"
'ఓసి' తెలివి తక్కువ మొద్దూ' బందరు నుండి ఒంగోలుకు పోయే దోవలో గుంటూరు తగలదు. అదీ అసలు సంగతి!"
"ఆ తగలకేం లెండి. ఇష్టమైతే బాగానే తగులుతుంది!!"
* * *
ఇరుగు-పొరుగు
మన ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళను బట్టి ఉంటుంది మన సౌఖ్యం.
ఇరుగూ పొరుగూ అన్నారు. మనకు కీర్తి వచ్చినా అపకీర్తి వచ్చినా వాళ్ళవల్లే వస్తుంది. మన ఇంటి ప్రక్కన ఒక ప్లీడరు గుమస్తా ఉన్నాడనుకోండి, ఇక మన కర్మం కాలిందన్న మాటే, ఆ యింట్లో అత్తకూ కోడలకూ పడదు. అత్త ఆపిల్లను కాల్చుకు తింటూ వుంటుంది, ఆ పిల్ల అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ వుంటుంది. ఆ అమ్మాయి మనతో ఏవో నేరాలు చెప్పుతున్నదని ఆ ముసలిదానికి అనుమానం.
ఓ మారు సరిగ్గా అలాగే జరిగింది గదా. మా ఆవిడ మా యింటి ప్రక్కావిడ కోడలూ ఒక్క ఈడువాళ్ళు. అంచేత ఆ పిల్ల మా యింటికి వచ్చి ఏదో పిచ్చాపాటి కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతుండేది. ఆ ముసలిదానికి మా ఆవిడపైన కొర్రుగా వుండేది. ఏమీ అనలేక వీలైనప్పుడల్లా ఏవో సూటీ పోటీ మాటలు అనటం సాగించింది.
అందరిళ్ళల్లోనూ వుంటై తగూలు, పొరుగింటితగూ అంటే కొందరు చెవి కోసుకుంటారు, అత్త మామాల్లో, ఆడబిడ్డల్లో కాపురం చేయకుండా అదృష్టవశాత్తు పొరుగూరిలో ఒంటరి కాపురం చేస్తూన్నది కాబట్టి ఆ కాంతమ్మ ఠింగురంగా అంటూ కులుకుతున్నదీ. అర్ధశేరు బియ్యం అత్తెసరు వేసి, రెండు వంకాయలు వేయించిందా అంటే ఇక పనేలేదు ఆ అమ్మాయికి. అల్లాగ వుండాలంటే ఎల్లాగ వీలు అవుతుందమ్మా అందరికీ-అని యిల్లాగ ఏవో సాధింపు మాటలు అంటూ వుండేది. అప్పుడు మా కాంతం కొత్తగా కాపురానికి వచ్చినరోజులు. ఇంకా మాకు సంతానం కలగలేదు.
పిల్లా జల్లా లేకుండా ఒంటరి కాపురం చేస్తున్న రోజుల్లో పొరుగింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా మనకు అట్టే బాధ వుండదు. అయితే కాస్త జాగ్రత్తగా వుండాలిసిందల్లా భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడే. ఆ నాలుగు నెలలో ఆరు నెలలో మటుకు వంచిన తల ఎత్తకుండా నడవాలి ఆ వీధిలో. అప్పుడే మన గౌరవం దక్కుతుంది. ఇంటావిడ, బిడ్డకు మూడో నెల వెళ్ళక మునుపే వచ్చినపుడు, ఇంటి ప్రక్క వాళ్ళు మనలని గురించి మంచిగా చెబుతారు. లేక...
నీవు ఒకరోజున స్నానం చేస్తూ వుండటం-ఆ సమయాన్నే పొరిగింటి ఆవిడ కోడలు పూలజడ వేసుకొని దొడ్డి గోడ మీదుగా తొంగి చూడటం నీవు ఆ చక్కని పిల్లను నివ్వెరపోయి చూస్తూ అవతల వంటింటి గుమ్మంలో నుంచి ఆ అమ్మాయి అత్తగారు గుడ్లు మిటకరించి చూస్తున్నట్లు గమనించక పోవటం, ఇత్యాది విషయాలు జరిగినయ్యో, నీ కర్మం కాలిందే.
అసలే అనుమాన పడుతుంటుంది మీ ఆవిడ. మొగుడి మీద ప్రేమ వున్న ప్రతి మానవతికి అటువంటి అనుమానం వుండటం సహజం. అందులో తాను లేనప్పుడు ఏమి అన్యాయం జరిగిందోనని భయపడుతూనే వస్తుంది మీ ఆవిడ. వచ్చే రావటంతోనే కొంప మునిగిపోయినట్లు పని గట్టుకొని వచ్చి ఆ ముసలిముండ నీ మీద నేరాలు చెప్పేస్తుంది వున్నవి కొన్ని, లేనివి కొన్నిని నీవు ఎంతో వుత్సాహంతో ఇంటికి వస్తావు ఎన్నాళ్ళకో వచ్చిన భార్యను చూచి కబుర్లు చెప్పుకుందామనీ బిడ్డను ముద్దాడుదామనీ ఆదుర్దాతో ఇంటికి వచ్చేసరికి బుసబుసలూ రొసరొసలూ మీ ఆవిడ. కారణమూ నీకు తెలియదు ఆవిడ చెప్పనూ చెప్పదూ, ఏమిటి కాంతం, అదినేననేమాట. నీవు కూడా ఏదో పేరు పెట్టి పిలుస్తావుగా. ఏమిటే రాజ్యం, సుబ్బులూ, లక్ష్మీ (ఏదో ఒకటి) ఎందుకే అల్లాగ వున్నావు. సంతోషంగా లేవేం? అమ్మాయికి ఇంకా నీళ్ళు పోశావుకావేం, మధ్యాహ్నం కాఫీ తాగలేదా అంటూ ఏవో వెయ్యి ప్రశ్నలు వేస్తావు, నా సంగతి మీ కెందుకు లెద్దురూ. మీకు నేనే కావలసి వచ్చాను. అనో లేకపోతే ఇంకా మృదువుగానో ఏదో నీరసం మాట అనేస్తుంది, మీ ఆవిడ. అసలు సంగతి చెప్పదు. ఆ సాయంత్రం నీవు బ్రతిమిలాడినా, ఒట్టిదే భయపెట్టినా ఒట్టిదే ఆ రాత్రికి ఎప్పుడో బయట పెడుతుంది అసలు సంగతి నీవు ఎంతో బ్రతిమిలాడిన తరువాత, ఆ తరువాత అదంతా అబద్ధం అని నచ్చజెప్పేటప్పటికి తలప్రాణం తోకకు వస్తుంది, ఇదేమైనా నలుగురిని పిలిచి నిలవదీసి అడిగి నిజం తేల్చే విషయం కాదాయె. ఎల్లాగ మీ ఆవిడను నమ్మించటం. చాలా కష్టం ప్రాణం మీదికి వస్తుంది.