కాబట్టి ఇరుగూ పొరుగూతో బహు జాగ్రత్తగా ప్రవర్తించాలె. అనుభవం మీద వ్రాస్తున్నాను.
సాధారణంగా నీవు అద్దెకు ఇల్లు తీసుకొనేటప్పుడు మీ యింటి ప్రక్కవాళ్ళకు ఫోనుగాని రేడియోగాని ఉండేటట్లు చూచుకో. సాధారణంగా వెన్నెలరాత్రుళ్ళు, భోజనానంతరం వాళ్ళు ఫోను పెట్టుకొని కూర్చుంటారు. మనకు అది చాలా అనుకూలం. మనకే ఫోను వుంటే, వుండే బాధలు ఏమీ లేకుండా ఫోను వుండటం మూలాన కలిగే సౌఖ్యం అంతా అనుభవించవచ్చు మన నెవ్వరూ ఫోను ఇవ్వమని అడగరు. రికార్డుల విషయంలో అప్ టు డేట్ గా మాట్లాడుతూ, స్వంతానికి పోను కలిగివున్న వాళ్ళలాగే మాట్లాడవచ్చును.
మన ఇంటిప్రక్కవాళ్ళకు పిల్లలు వుండకూడదు. అంటే నీవు అట్లా కోరాలని నేను అనను. నీవు కోరినంత మాత్రాన వాళ్ళకు పిల్లలు కలగకుండా వుండటమూ జరగదు. అయినా అటువంటి కోరికలు కోరమని కాదు నేననటము, పిల్లలు లేనిసంసారం ప్రక్కనే నీవు ఉండూ అంటాను.
పిల్లలు వుంటే...
వాళ్ళ పిల్లలకు మన పిల్లలకూ పోట్లాటలు తప్పవు. ఒకమారు నేను వున్న ఇంటి ప్రక్క ఆయనకు నలుగురు పిల్లలుండటం తటస్థించింది. ఇక మా అవస్థ చెప్పటానికి వీలులేదు. మొదట్లో వాళ్ళ పిల్లలూ మా పిల్లలూ కలిసి ఆడుకుంటారని సంతోషించాను. కాని ఏం జరిగింది?
వాళ్ళరామూ ఎర్ర కాగితం ఒకటి పుల్లకు గుచ్చి ఆడుకొంటూ వున్నాడు. మా రాధాయి చూశాడు దాన్ని, పోనీ తనకూ అటువంటిది ఒకటి కావాలని చెపితే చేసి ఇవ్వనూ, ఊహు, అల్లాగ చెప్పక, వాడిచేతులో కాగితాన్ని గద్దతన్ను కొచ్చినట్లు లటిక్కున లాకొచ్చాడు ఇంక వాడి సంగతి, చప్పున వచ్చి నాతోనో, తల్లితోనో, మీ అబ్బాయినా ఎర్ర కాగితం లాక్కున్నాడు. నాది నాకు ఇప్పించండి అని అడగవచ్చునా. మాటలు వచ్చిన వెధవ అహ అట్లా అడక్క, ఠపీమని నేలపై పడిపోయి, కెవ్వున కేకేసి, ఒక్క పెట్టున ఏడ్పు సాగించాడు. బట్టలు బాడి అయినై. వాళ్ళ అమ్మ ఒచ్చి ఏమిట్రానాయనా అని ఎంతో సేపు అడిగితే చివరకు చెప్పాడు ఈ అన్యాయాన్ని గురించి.' ఆమె వచ్చి మా ఆవిడ మీద కేక వేసింది. ఏమిటమ్మా మీ రాధాయ పిల్లల చేతుల్లో చిల్లిగవ్వ అయినా నిలవనీయడు, ఠపీమని గద్ద తన్నుకు పోయినట్లు తన్నుకుపోతాడు ఎట్లాగ ఏడ్చేదమ్మా అని, ఈవిడకూ వుక్రోషం. నా కొడుకు అంత చెడ్డవాడా అని...మీ వాడు అంతేనమ్మా అన్నది. అక్కడ నుంచి వేసుకొన్నారు పోట్లాట ఒక అరగంట సాగింది. ఇంతలో మా రాధాయ ఆ కాయితం కాస్త చింపేశాడు. ఆ సంగతి రామూ కనిపెట్టి మళ్ళీ కెవ్వుమన్నాడు. ఇంతలో నేనొచ్చి రామూను ఊరుకో పెడదామని ఇంకో ఎర్రకాయితం ఇస్తే ఒప్పుకోడే! పోనీ ఎన్ని రంగుల కాయితాలిచ్చినా ఒప్పుకోడే! ఆ కాయితమే కావాలంటాడు. చినిగిపోయిందిరా నాయనా ఆ కాయితం ఇంకోటి తీసుకోరా అంటే వినడే! ఎల్లాగ వీళ్ళ తగూ తీర్చటం !!! కాబట్టి ఇంతకూ చెప్పేవచ్చే దేమిటీ అంటే ఈ పిల్లల తగూలతో ప్రాణం హైరాన అవుతుంది. కొంచెం ముందుగానే జాగ్రత్తపడి పిల్లా జెల్లా లేనివాళ్ళకు దగ్గరగా వుండటం మంచిది. ప్రక్క ఇంటి వాళ్ళకు పిల్లలు లేకపోతే మన పిల్లలనే ఎత్తుకొని ముద్దాడి మిఠాయి, లడ్డూ, అవీ తురుచు వాళ్ళకు పెడుతూ వుంటారు.
మన ఇంటి ప్రక్కవాళ్ళకు కారు కూడా వుంటే మంచిది ఎప్పుడైనా అందులో ఎక్కి మనం కూడా షికారు వెళ్ళటానికి అవకాశం వుంటుంది.
మన ఇంటిప్రక్క ఆవిడ చక్కనిదై ఫ్యాషన్ తెలిసినదైతే చాలా అదృష్టం, ఆమె మన ఆడవాళ్లకు అప్పుడప్పుడు తలదువ్వి పూలుపెట్టి కట్టూ బొట్టూ నేర్పుతుంది.
మన పిల్లలను రోజూ ముస్తాబు చేసే పని ఆమెకే అప్పజెప్పయ్యాలి. మన పిల్లలు ఆమెను అత్తయ్య అని పిలుస్తూ, ఎప్పుడూ అక్కడే కాలం గడుపుతూ ఆడుకుంటూ వుండటం జరుగుతుంది.
దేముడు మేలుచేసి, మన యింటి ప్రక్కవాళ్ళు డబ్బున వాళ్ళు అయివుండాలని మనం కోరుకోవాలె. అలాగ అయితే వాళ్ళు మనలకు ఎన్నడూ డబ్బు అప్పు అడగరు. కాస్తో కూస్తో వాళ్ళవద్దే మనము అప్పు పుచ్చుకోవచ్చు.
మన యింటి ప్రక్కవారి దొడ్లో కాస్త కాయా కూరా పండుతూ వుండటం, పూలూ అవీ పూస్తూ వుండటము కూడా అవసరం__
* * *
వెన్నెలలో
తెల్లచీర కట్టుకొన్నది. తల దువ్వుకొని అర్ధచంద్రాకారంగా మల్లెపూలు పెట్టుకొని, వాటి మధ్య గులాబీలు అమర్చింది. పచ్చని మెడలో జెర్రిపోతులాగ బంగారపు గొలుసొకటి మెరుస్తూంది పిల్లలను నిద్రపుచ్చి వచ్చింది. నా దగ్గరకు నేను పండు వెన్నెలలో మంచంమీద పరుపు వేసుకొని, పైన తెల్ల దుప్పటి పర్చుకొని, తలవైపు దీపం పెట్టుకొని, పడుకొని చదువుకొంటున్నాను వచ్చీ,
'ఏమిటండీ చదువుతున్నారూ' అన్నది మందహాసం చేస్తూ, మాట్లాడ లేదు.
'మాట్లాడరా, మీలో మీరే నవ్వుకోవాలేం? చెప్పండి అదేమిటో అన్నది దీపం తగ్గిస్తూ.
"చెప్పమంటావా?"
"మరేమిటి నేననటమూ?"
'పద్మములతో సమానమైన ముఖము గల సుందరీ_' అంటూంటే మా ఆవిడ మాటకు అడ్డం వచ్చి,
"అదేమిటి అవి కారం మళ్ళీనూ" అన్నది.
ఇది వరలో ఇల్లాంటి వికారాలు నాకు తరుచూ రావటం మా ఆవిడ చికిత్స చేయటం చాలాసార్లు జరిగినాయి అందుకని అలాగ అన్నది. "ఏమి వికారం కనపడ్డది అప్పుడే నీకు" అన్నాను నేను.