Previous Page Next Page 
కాంతం కాపరం పేజి 8


                                  మొండి వాదన
           
    తొందర పని మీద ఒంగోలుకు పోవలసి వచ్చింది. ఇవ్వాళ సాయంత్రం ఆరుగంటల బండికి నేను ప్రయాణం. రెండు మూడు ధోవతులూ, తువాళ్ళూ, చొక్కాలూ, ఏవో కావలసిన బట్టలు సూట్ కేస్ లో పెట్టేసి నేను వచ్చేసరికి రెడీగా వుంచాలే నేను స్కూలు నుంచి వచ్చే రావడముతోనే భోజనం చేసి చప్పుని వెళ్ళిపోవాలె. టైము అట్టే వుండదు తెలిసిందా.

    "తెలిసింది...తెలిసింది. ఇందులో ఏముంది తెలియటానికి!"

    'నేను చెప్పినట్లు చేస్తావా?'

    'ఆ అట్లాగే'

    అన్నది మా కాంతం. ఈ మాటలు చెప్పేసి నేను కోటు వేసికొని వెళ్ళిపోయినాను. సాయంత్రం కాళ్ళు ఈడ్చుకొంటూ వచ్చేసరికి అయిదు అయింది. వచ్చే రావడంతోనే కాంతాన్ని పిలచి 'ఏం పెట్టెసద్దావా?' అన్నాను నవ్వుతూ.

    'ఎంతలోకి సద్దాలే ఏమిటి మీరు స్నానం చేసి భోజనం చేసే టప్పటికి నేనూ సద్దేస్తాను. ఏ మంత మహాభాగ్యం?' అన్నది.

    'ప్రొద్దుననగా చెప్పానే ప్రొద్దుటి నుంచి ఇంత వరకునూ తీరనేలేదా!'

    మీరు వెళ్ళిన దగ్గరనుంచీ నేనొక్కక్షణం అయినా కూర్చోలేదు. మిమ్మును పంపించి, పిల్లల బట్టలన్నీ ఉతికి, కూడు తినే సరికి ఫిరంగి వేశారు. ఒక్క క్షణం కూర్కానో లేదో పిల్లలు రెండోసారి తిళ్ళ కొచ్చారు. వాళ్ళకు అన్నాలు పెట్టి తలలు దువ్వి పంపాను. ఇంతలో మహా లక్ష్మమ్మగారు వస్తే ఆవిడతో రెండు నిమిషాలు మాట్లాడినాను. ఆవిడ అట్లా వెళ్ళింది మీరు రానేవచ్చారు.
"
    "ఇంతకూ నీవు పెట్టె సద్దలేదు?"

    "అన్నీ సిద్ధంగానే వున్నాయి. సూట్ కేసులో వేయడమే.

    "అదే నేను చేయమన్నా పనీనీ! నీవు చేయందీని!"

    "మీరు స్నానం చేయండీ! నే నెంతలోకి చేస్తానూ?"

    "పొద్దుననగా చెప్పిన పని చెయ్యడానికి నీకు ఇంత వరకు తీరిక కాలేదు. నీ మొండితనం చూస్తే వళ్ళు మండుతుంది. ఏ మాత్రం పని ఇది, నీవు మాట విననందుకు అనాలెగాని!"

    "ఇందులో మాట వినక పోవటం ఏముందండీ?..."

    ఇక చాలించని అన్నాను ఆ వరస చూచి, ఇందులో మాటవినకపోవడం ఏమీ లేదుట మాట వినక పోవడం కాకపోతే మరేమిటి యిది ఈ ఆడవాళ్ళకు ఈ మొండివాదనలో ఇంత తెలివి ఇచ్చినందుకు ఆయనను ఏం జేసినా పాపంలేదు.

ఏదో బద్ధకించాను క్షమించండి అనరాదూ? క్షమించండి అని చస్తే నోట అనదు ఆవిడ. అనాలని జ్ఞానమే లేదు. కాబట్టి వాదించి లాభం లేదని "సరే ఇప్పుడైనా వేగిరం సద్దు" అని చెప్పి నేను భోజనానికి వెళ్ళిపోయినాను. మా అమ్మ నాకు వడ్డించింది. నేను భోజనం చేస్తూన్నంత సేపూ ఆవిడ ఇటూ అటూ తిరుగుతూ ఆ పిల్లనూ, ఈ పిల్లనూ, కేకలు వేస్తున్నది. తీరంటా నేను భోజనం చేసి బట్టలు వేసుకొని ఏదీ పెట్టె...అని అంటే అప్పుడూ కావిడి పెట్టెలోనుంచి ధోవతి తీసి యిది కావాలా అని అడగటం.

    "నీకు బుద్ధి ఉందా లేదా? అవసరంగా బండికి పోవాలని నెత్తి నోరు కొట్టుకొని అరుస్తుంటే నీకు చీమ కుట్టినట్టు అయినా లేదు. ఇప్పుడు బట్టలు తీసి అది కావాలా ఇది కావాలా అని అడుగుతావూ? ఈ వెధవ నిర్లక్ష్యం దేహశుద్ధితో గాని అణగదు."

    నేనింకా గట్టిగా తిడుతున్నా, ఆవిడ కదలకుండా ఆ ధోవతిని అల్లాగే పైకెత్తి పట్టుకొని నాకు కోపం వచ్చిందని భయంగాని విచారంగాని లేని గొంతుకతో _ఇంతకూ ఇది సూట్ కేసులో వెయ్యనా వద్దా చెప్పండి అంటుంది.

    నా కోపానికి భయపడలేదు. అందుకని నేను కొరకొర చూశాను. ఆ చూపుకు జవాబుగా నేను బ్రతికున్నన్నాళ్ళు మీకీ కోపం పోదులెండి అనడం.

    నాకు ఈ అన్యాయం భరించరానిదని అనిపించింది. ప్రొద్దున చెప్పిన పని సాయంత్రం వరకూ చేయకపోవడం, నేను వచ్చిన తరువాత అయినా పశ్చాత్తాపపడి చేసిందా? అదీ లేదూ! నేను విసుక్కుంటే గడ్డిపరక కింద లెక్కేసి ప్రవర్తించి, కోపపడితే నిర్లక్ష్యంగా చూసి, పైగా ఈ కోపం నాకు అలవాటైనట్లూ, తాను దాని వలన బాధలు పడుతూ సహిస్తూ, సద్దుకుపోతున్నట్లూ మాట్లాడే మనిషికి మొగడై వుండేకంటే చస్తేనే మేలు అనిపించింది.

    నేను యింత బాధపడ్డా ఆవిడ, చాలా శాంతంగా తొణకకుండా, నిర్లక్ష్యంగా "ఆ పట్టండి. అవతల నాకు పనుంది పోవాలె. మీకేం అల్లాగ మూడు రోజులైనా శపించి పోట్లాడుతూనే వుంటారు,"

    "అంటే నేనెప్పుడూ పోట్లాడే మనిషివన్నమాట?"

    "నే నన్నానా ఏమిటి? అన్నీ మీరే అనుకుంటారు."

    మరి ఏమిటి నీ వన్నది. నీవన్న దాటికి అర్ధం ఏమిటి?"

    "ఏదో అన్నా లెండి. ఈ అర్ధాలూ గిర్ధాలూ నాకు తెలియవు. నేనేం చదువుకొన్న దాన్ని గాదు."

    మూడురోజులైనా శఠించి పోట్లాడుతూనే వుంటారని మళ్ళీ మీరు పోట్లాడే మనిషిని నేనన్నానా అంటుందీ__ ఇదేమన్నా మనిషా లేకపోతే గ్రీకు కధలలోని మెడూసా ఆ...

    బండికి పోవలసిన టైము అవుతున్నది. ఈ మాటలు చూస్తే, మండి పోతున్నది. కోపం దిగమ్రింగి పారేయ్, ఆ నాలుగుదోపతులూ, ఆ చొక్కాలు మూడూ ఆ రెండు తువాళ్ళూ అందులో పడెయ్యి. ఆ సిల్కు ఉత్తరీయం కూడా కావాలె, వెయ్యి అన్నాను.

  అది వద్దులెండి.

    ఏం ? నీ ఆజ్ఞ ఏమిటి? నాకు కావాలె. అది కూడా అందులో పడెయ్యి టైముఅయింది. తొందరగా స్టేషనుకు పోవాలె.

  "నా ఆజ్ఞట? నా ఆజ్ఞలన్నీ సాగి ఏడుస్తున్నాయా? అది ఇంట్లో వుంచి ఇంకో వుత్తరీయం తీసుకొని వెళ్ళండి. ఎందుకు చెప్పానో నా మాట వినండి.

    అబ్బబ్బ! ఎందుకు వద్దో చెప్పరాదూ?

    మీరెందుకు వింటారు. ముద్దుగావినే మొగుడైతే గదా! అనోము నేనోచుకోలేదు. ప్రతిదానికి కారణం చెప్పేడవాలె. ఆడచచ్చిందాన్ని ఎన్నింటికని చెప్పేది కారణాలు, మీరు దాన్ని పారేసుకొస్తారు.

    ఇన్ని మాట్లు యిన్ని ప్రయాణాలు చేస్తున్నాను. ప్రతి దఫా పారేసుకొని వస్తున్నానా, ఏమిటా మాట?

    ప్రతి దానికీని విసుకేనా? అయిన దానికీ కానిదానికీ కూడా? మీరు అసలు అజాగ్రత్త మనుషులు. ఎక్కడో మరచిపోయి వస్తారని మంచిమాట చెప్పినారు సరుసులైతే ఎట్లా ఏడ్చేది?

    నేను అజాగ్రత్త మనిషినా? బట్టలు ఊళ్ళ వెంట పారేస్తున్నానూ? రెండు పెట్టెలూ, మూడు మూటలూ, తట్టలూ బుట్టలతోటి నీవు వెళ్ళినపుడు ఎందుకని నేను ఏమన్నా అన్నానా? అందులో మళ్ళీ ఎన్ని తిరిగి వచ్చినవి. అని లెక్కచూశానా? నా బట్టల విషయమై కూడా నీకింక అధికారమేమిటి?

    నా యిష్టం వచ్చిన బట్ట నేను వాడుకోవడానికి కూడా నాకు అధికారం లేదా?

    'అదిగో మళ్ళీ మొదలు పెట్టారూ.'

    'మొదలు పెట్టింది నీవా నేనా? ఒకమాటు చీవాట్లు సేస్తే  సిగ్గు వుండి, అయ్యో, ఆయనకు మనస్సు కష్టం కలిగించే మాట అనకూడదని బుద్ధి, జ్ఞానం, వివేకం తెలివి తేటలు వుంటేగా?

 Previous Page Next Page