Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 9


    తమ కొత్త ప్రధాని రాజనీతిజ్ఞత, జీవన మౌలిక తత్వం ఎందరికి సరిగా అర్ధం అవుతుందో, ఎంతమందిని ఎలా ప్రభావితం చేయగలుగుతుందో అని చర్చించుకోవడం ప్రారంభించారు  భారత ప్రజలు. సామాన్య ప్రజలు. సగటు మనుషులు.


                          *    *    *


    సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సి.బి.ఐ.)డైరెక్టరు శ్రీ చటర్జి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

    భారత మాజీ ప్రధాని అమరేంద్ర కేసు వీడని చిక్కుముడిగా వున్నది. అంతుచిక్కక, నిగూడంగా వున్న సాక్ష్యాధారాలకోసం అతను శతథా యత్నిస్తున్నాడు.

    అతని నైపుణ్యం, నిజాయితి, కార్యదక్షత, వ్యక్తిత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి వున్న అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా కీలకమైన ఈ కేసు దర్యాప్తును చటర్జీకి అప్పగించారు. ఇది అతనికి అగ్ని పరీక్షే అయింది. అసిధారావ్రతం...

    దర్యాప్తులో భారతప్రభుత్వానికి పూర్తి సహాయ- సహకారాల నందించడానికి అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రదేశాలు కూడా తమ అంగీకారాన్ని తెలియజేశాయి. సి.బి.ఐ; ఎఫ్.జి.బి; ఇంటర్ పోల్ ఈ కేసులో కూపీలు తీయడానికి ఈపాటికే ప్రయత్నిస్తున్నాయి!

    దేశంలో నేరస్తులను గుర్తించేందుకు ఇంటిలిజన్స్ బ్యూరో ('ఇ బి.'), రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ('రా')' నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఇండియన్ ఆర్మీవారు వారివారి సహాయ సహకారాలను దర్యాప్తు బృందానికి ఎప్పటికప్పుడు అందిస్తూనే వున్నారు.

    ఇవన్నీ ఒక ఎత్తు కాగా, ప్రధాని భద్రత విషయంలో అసలు లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం మరొక ఎత్తుగా వున్నది. సరిగా ఈ కోణం నుంచి దర్యాప్తును ముమ్మరం చేయడం ఈ కేసు మిష్టరీని ఛేదించడానికి  ముఖ్యచర్య అని చటర్జీ అభిప్రాయపడుతున్నాడు.

    దర్యాప్తు బృందం ప్రస్తుతం వాషింగ్టన్ లో వుంది.

    నాటి భారత-పాకిస్తాన్ ప్రధానుల మధ్య మైత్రీ ఒప్పందం చర్చలను ఏర్పాటుచేసిన అమెరికా ప్రెసిడెంటు అప్పుడు తాముగా తీసుకున్న ఉభయ ప్రధానుల భద్రతా చర్యల గురించి, ప్రధానులు ఇరువురూ అమెరికా చేరినప్పటినుంచి ప్రధాని ప్రధానితో జరిపిన చర్చల సరళి, సారాంశం గురించి, ఇలా అనేకానేక విషయాలను అనేక కోణాలనుంచి కూపీలాగుతున్నాడు దర్యాప్తు బృందం నాయకుడు చతర్జి.

    దేనినీ వదలదలచుకోలేదు చటర్జీ. సూక్ష్మదర్శిగా ఆయనకు పేరు!

    ...అప్పటి భారత ప్రధాని ఆ రోజు రాత్రి 'ప్రెస్'తో ముఖాముఖీ గడిపారు.

    రాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించారు.

    ప్రధాని నిద్రించేంతవరకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసరు రాణాప్రతాప్ అన్ని జాగ్రత్తలు స్వయంగా తీసుకున్నట్టు సిబ్బంది సాక్ష్యం చెప్పారు.

    తెల్లవారాక  ప్రధానిని తొలిగా చూసిన వ్యక్తి పి.ఎస్.ఒ. రాణాప్రతాప్. అప్పటికే ప్రధాని తమ పడకపై విగత జీవులై వున్నారు.

    అంటే, ప్రధాని జీవించి వుండగా ఆయనను చివరిసారిగా చూసిన వ్యక్తి, అయన మృతి చెందిన పిదప తొలిసారిగా చూసిన వ్యక్తి ఒక్కరే _ అతను పి.ఎన్.ఒ. రాణాప్రతాప్.

    కనుక, ఈ కేసుకు సంబంధించిన ఏ కొద్దిపాటి సమాచారం అయినా అతని ద్వారానే తెలుస్తుంది. కాని, ఆ అవకాశం ఇప్పుడు లేదు. ముందే జారిపోయింది...!

    ప్రధాని మృతదేహాన్ని విమానంలో ఇండియాకు చేర్చకముందే అదే విమానంలో రాణాప్రతాప్ అనూహ్య పరిస్థితులలో  మరణించాడు...!

    అతనిది కూడా  సహజ మరణం కాదు. అది హత్యా, ఆత్మహత్యా అనే అంశం తేలవలసింది వుంది.

    చటర్జి దృష్టిలో రాణాప్రతాప్ చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసరు. అయితే, అతను తన విధి నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యాడు! తను తీసికోవలసిన ప్రత్యేక జాగ్రత్తలు ఏమీ అతను తీసికోలేదు. సామాన్యునిలా వ్యవహరించాడు.

    ప్రధాని ఇంకా కొనవూపిరితో వున్నారనే భ్రాంతితో ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్ళడంలో అతను చొరవతీసుకున్నాడే కాని, ఇతర విషయాలను గమనించలేదు. ప్రధాని విడిది చేసిన బంగళా నుంచి ఏ వస్తువూ ఏ వ్యక్తీ కదలిపోకుండా వుండేందుకు ఎటువంటి కట్టుదిట్టమైన చర్యనూ అతను తీసికోలేదు! ఫలితం - ఏ ఆధారమూ దొరకలేదు...

    అంతటి సీనియరం సిన్సియర్ పోలీస్ ఆఫీసరు తన విధిని ఎందుకని సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు? అసలు అప్పుడు అతనికి  ఏం జరిగింది?

 Previous Page Next Page