Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 8


    చక్రవర్తి భారతీయతను, భారత జీవనవేదాన్ని ఆకళింపు చేసుకున్న మేధావి. ప్రాచ్య ,పాశ్చాత్య దేశాల సంస్కృతీ సంప్రదాయాలను ఔపోసన పట్టిన రాజర్షి. పాశ్చాత్య ప్రజాస్వామిక విలువలను ఆకళింపు చేసుకున్న రాజకీయ తత్వమసి.

    మానవుడు మహోన్నత మానవతా దీప్తిని గుర్తించవలెనని, మనిషి నిజమైన మనిషిగా బ్రతకవలెనని, అతను నిలువుటెత్తున మూర్తిమంతమై ముందుకు నడవవలెనని విశ్వసించి, నిర్వచించే మహామనిషి, మేరునగ ధీరుడు మన ప్రధాని చక్రవర్తి.

    భగవద్గీతను, బైబిల్ ను, ఖురాన్ ను, త్రిపిటకాలను దొంతరగా పేర్పించి, వాటి మీద కుడిచేతిని ఆన్చి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకరణకు సన్నద్దులయారు చక్రవర్తి. గంభీర స్వరంతో స్పందించారు :

    "I, Mr. Chakravarthy, do solemnly swear in the name of god of one and all religions that I will faithfully Execute the office of the prime Minister of India, above cast, creed, Religion, political affiliations corruption Nepotism, Religionalism and self comforts and I will do the best of my ability, preserve, protect and defend the constitution of India, strive hard for national Intigrity and fraternity and universal peace so help me my fellow beings and my people" 

    ఆనవాయితి ప్రకారం భారత రాష్ట్రపతి కొత్త ప్రధాని చేత ప్రమాణస్వీకారం చేయించారు.

    భారత రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్ లో  సూచించిన అన్ని భాషలలోకి చక్రవర్తి ప్రమాణ ప్రసంగాన్ని అప్పటికప్పుడే యథాతథంగా అనువదించాయి కంప్యూటర్లు.

    భారతీయులే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు, వారి వారి ప్రభుత్వ ప్రతినిధులు ఈ ప్రమాణ స్వీకరణోత్సవాన్ని  ప్రత్యక్షంగా పరోక్షంగా రేడియోలలో, టీవీలలో విన్నారు, కన్నారు.

    "జీవితం కేవలం జీవించడం కోసమే అయితే, మనిషికే కాదు, పశు-పక్ష్యాదులకు కూడా జీవం వుంది, అవి బ్రతికేస్తున్నాయి. మానవ జన్మ ప్రాధాన్యత ప్రత్యేకం కదా!

    ఆశ-నిరాశలు, కోర్కెలు-ఎండమావుల మధ్య కొట్టుమిట్టాడే మనిషి జీవితంలో ఎన్నో, ఎన్నెన్నో అనుభవాల పుటలు. సంపుటలు. ఒక్కొక్క పుటనూ తెరుస్తూపోతే అది ఒక్కొక్క రసరమ్య కావ్యమే అవుతుంది. మానవ జీవనం నాగరికతా ప్రాభవ చిహ్నం.

    సృష్టి అమోఘం. సృష్టిలో మానవుడు మహోన్నతుడు. వీరిలో కొందరు నాయకులో, నాయికలో అవుతారు. అలా అని, ప్రతినాయకులు వుండకపోరు! ఎవరి స్థాయి వారిది. తప్ప-తాలు, పొల్లు-నెల్లు సహజం! మొత్తంమీద మనిషి మనిషే - అతను నరావతారం!

    మంచి-చెడుల మిశ్రమం వలెనే, మనుషులలో సయితం అనేకానేక మనస్తత్వాలు వుండడం సహజం. వారి వారి ప్రవృత్తులకు అవే సంకేతాలు.

    పక్షులన్నీ ఒకే గూటికి చేరవు. ఏ జాతి పక్షి ఆ గూటికే చేరుతుంది.

    ఉదబిందువులు అన్నీ ఒకే రీతిలో వుండవు. జలనిధి మాత్రం ఒక్కటే!

    శాసించగల సత్తా వున్నప్పటికీ, జీవన్నాటక సూత్రధారి మానవపాత్రలను సృష్టించి, నిజ జీవనంలో నరుడు కనబరుస్తున్న ఈర్ష్యా సూయలను, వర్గ వైషమ్యాలను, రాగ ద్వేషాలను చూస్తూ, వీక్షిస్తూ విచారించడం లేదా? అదే సమయంలో వ్యక్తిగత ప్రేమానుబంధాలను, ఆప్యాయతానురాగాలను వర్షిస్తూ కరిగిపోవడం చూసి ఆనందించడం లేదా? ఏమిటి ఈ సృష్టి వైచిత్రి? సృష్టికర్త లీలలకు అర్ధం - పరమార్ధం ఏమిటి?

    జీవితాన్ని, జీవన విలువలను పరిపూర్ణంగా అవగాహన చేసుకోగలిగితేనే మనిషి జీవితానికి ఒక అర్ధం చేకూరుతుంది. అదే గమ్యం. మన తాపత్రయం, తపన యావత్తు అందుకోసమే! అప్పుడే సాటి మనిషిని గుర్తించగలుగుతాము, గౌరవించగలుగుతాము.

    దంత వేదాంత మేదో నూరిపోయడం మా అభిమతం కాదు. అవినీతిని, బంధుప్రీతిని, ఆశ్రితజన పక్షపాతాన్ని అవలీలగా ఆవలికి నెట్టివేయ గలిగినవాడే నిజమైన నాయకుడు. మనం అందరం మానవతను మూర్తిమంతం చేద్దాం, నిజాయితీని ఆవిష్కరించుదాం.

    నామటుకు నేను మానవ జీవన మహోన్నతత్వాన్ని ద్వేషించే జిజ్ఞాసువును అని ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నా ప్రజలను నా దేశాన్ని ఈ మహోన్నత దిశగా నడిపించగలనని త్రికరణశుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. 

    ధర్మం సరణం గచ్చామి, సంఘం సరణం గచ్చామి, అసతో మా జ్యోతిర్ గమయ, మృత్యోర్ మా అమృతమ్ గమయ!"

    భారత ప్రధాని గౌరవనీయ చక్రవర్తి దేశప్రజలను ఉద్దేశించి చేసిన ఈ తొలి ప్రసంగ పాఠం దశదశలా ప్రసారమై, ప్రచురితమై ప్రాచుర్యమందింది. ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయ ఆత్మను విశ్వజనీయంగా అది ప్రతిఫలింప చేసింది. ప్రభుత్వ విధానాన్ని ప్రతిధ్వనింప చేసింది.

 Previous Page Next Page