అతని వ్యక్తిత్వం మీద, క్యారక్టరు, ఇంటిగ్రిటీమీద తనకు వ్యక్తిగతంగా ఉన్నతాభిప్రాయం వున్నా, దర్యాప్తు అధికారిగా - దర్యాప్తులో భాగంగా - అతనిని అనుమానించవలసివస్తున్నది చటర్జీకి. ఆయన సిక్త్స్ సెన్స్ ఆయనను హెచ్చరిస్తున్నది...
శవ పరీక్ష నివేదిక అందిన తరువాత కాని మరణానికి కారణం తెలియదని, అప్పటి వరకు దర్యాప్తు కుంటుపడుతుందని సహజంగా అందరూ అనుకుంటారు. కాని, చటర్జీ విషయం వేరు! అతని సుదీర్ఘమైన ఆలోచనలో ఒక్క అంశం ఆశాజనకంగా తళుక్కున మెరిసింది.
రాణాప్రతాప్ బంధు-మిత్రులను ఇంటరాగేట్ చేసి, వారి ఇళ్ళను క్షుణ్ణంగా సోదా చేస్తే ఏదేని ఒక చిన్న 'క్లూ' దొరక్క పోదు!
వెంటనే ఎంతో ఆశతో భారతదేశంలోని సంబంధిత అధికారులకు రహస్య ఉత్తర్వు పంపాడు చటర్జీ. ఉత్తర్వును అందుకున్న ఉత్తర క్షణమే రంగంలోకి దిగారు పోలీస్ అధికారులు.
చటర్జీ సర్వీస్ కంటే ఆయన అనుభవం, అనుమానం కంటే వ్యూహం ముందుగా పరుగులు తీస్తుంటాయి.
* * *
కొత్తగా పదివిలోకి వచ్చారు భారత ప్రధాని.
ప్రధాని చక్రవర్తికి తొలిసారిగా పత్రికలవారితో ఇష్టాగోష్ఠి ఏర్పాట్లు జరిగాయి.
ఉత్సుకతను కనబరచారు ప్రధాని.
అన్ని పత్రికలకు, వార్తా సంస్థలకు చెందిన చీఫ్ రిపోర్టర్లు అందరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్ లో సుఖాశీనులయారు.
ప్రధాని మీద ప్రశ్నల వర్షం కురిపించడానికి సర్వసన్నద్దులయి మరీ కూర్చున్నారు.
ఖచ్చితంగా నియమిత వేళకు హాలులోకి ప్రవేశించారు ప్రధాని.
గౌరవ సూచకంగా లేచి నిలిచారు రిపోర్టర్లు.
చిరుమందహాసాలతో నమస్కార ప్రతినమస్కారాలయాయి.
సమాచార శాఖాధికారి పరిచయాలు, కరచాలనాలు పూర్తయాయి.
"సర్ ! మీ పూర్తి పేరు..." యువక రిపోర్టరు ఆతృతగా అడగనే అడిగాడు!
"హానరబుల్ సర్...హానరబుల్ సర్...అనాలి..." సమాచార శాఖాధికారి గొణిగాడు.
ప్రధాని చిరునవ్వుతూ, అప్పుడే బట్లర్లు తీసుకువచ్చిన మంచి నీళ్ళు గ్లాసుల వైపుకు చేయి చాపారు. అందరికీ సైగ చేస్తూ, తనూ ఒక గ్లాసు నందుకున్నారు.
ఆ వెంటనే టీ వచ్చింది. ప్రధానితోసహా అందరూ తేనీటిని సేవించారు.
వాతావరణం ఆహ్లాదకరంగా వుంది. హాలులో చుట్టూ గోడలకు వున్న కార్వింగ్స్ తో పోటీపడుతున్నట్టు నలుమూలలా ఇండోర్ ప్లాంట్స్ వ్రేలాడుతూ మరింత అందాన్ని చేకూర్చుతున్నాయి.
"హోప్, ఆల్ ఆర్ కంఫర్టబుల్ !" ప్రధాని పెదవి విప్పారు.
పత్రికా ప్రతినిధులంతా చిరునవ్వుతూ తలలు ఊపారు.
"థాంక్స్ ! దెన్, షెల్ వుయ్ ప్రొసీడ్ ?"
"సర్ ... మీ పూర్తి..."
"హానరబుల్ ! హానరబుల్..."
ప్రధాని సైగతో సమాచార శాఖాధికారి నిష్క్రమించాడు.
"ఇట్స్ ఆల్ రైట్ ! లెటజ్ ఫాలో క్లాక్ వైజ్. ఆర్..."
"హానరబుల్ పి.ఎం. గారు సూచిస్తున్నట్టు, మనం క్లాక్ వైజ్ గా ఫాలో అవుదాం. దీనిలో, తొలి రౌండ్ లో ఒక్కొక్కరు మూడు ప్రశ్నలు అడగవచ్చు. అలా మొత్తం మూడు రౌండ్లలో మనందరం గౌరవనీయ ప్రధాని గారిని అడగవలసినవి, తెలుసుకోవలసినవీ దాదాపు అన్నీ రాసుకోవచ్చు. ఏమంటారు ?" వయసులో పెద్ద అయిన ఒక ప్రతినిధి లేచి నిలిచి సూచనగా అడిగాడు.
అంతా మౌనంగానే మరల తలలూపుతూ తమ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాని కుతూహలంగా వారినే గమనిస్తున్నారు. వారంతా మేధావులే, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలవారే !
వారిని, వారు అడిగే ప్రశ్నలను తను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఆ సత్తా తనకు వుంది ! కాని, తన సమాధానాలు వారిని తృప్తిపరచవచ్చు, పరచలేకపోనూవచ్చు. అటువంటి సందర్భాలే తటస్థిస్తే...కాంట్రవర్సీస్ ను ఫేస్ చేయవలసిందే ! అప్పుడు... రిఫరెన్స్ వెతకాల్సిందే !
ప్రధాని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, ప్రశ్న వినిపించింది.
"మీ వయసు....?"
"ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎంత కాలమయిందో, సరిగ్గా అంతే !"
"అంటే ?"
"Yes ! I born Exactly at the stroke of the mid night hour, while the world sleeps and when India awakes to life and freedom" (on the mid-night of 14th Aug., 1947)
"ఆఁ...!"