Previous Page Next Page 
ఆఖరి మజిలి పేజి 9


    టీచర్ రానప్పుడు డాన్స్ ప్రాక్టీసు చేసే టింకూ మొండికేస్తే తనుకూడా డాన్స్ చేయవలసి వచ్చేది. అప్పుడు తను రాంగ్ స్టెప్ వేస్తే అది తప్పు అని టీచర్ ఫోజులో చెప్పేవాడు!

    అలా చెబుతున్నప్పుడు అచ్చం డాన్స్ టీచర్ లానే ఫోజు పెట్టడం చూస్తుంటే తన చిన్నతనం రోజులు గుర్తుకువచ్చి కృష్ణప్రియ ఆనందపడేది...

    ఎప్పుడయినా నవల చదువుతూ అన్నీ మరచిపోతే పంక్చువల్ గా తనే గుర్తు చేసేవాడు.

    క్రమశిక్షణ గురించి చెబుతూ తను ఎప్పుడయినా అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే తన తప్పును వేలెత్తి చూపేవాడు. అప్పుడు కోపగించుకోవడానికి బదులు ముచ్చటేసేది...

    అలాంటి టింకూ ఇప్పుడు నీరసంగా బెడ్ పై విశ్రాంతి తీసుకుంటూ ఉండడంతో కృష్ణప్రియ మనసునిండా అశాంతి చోటుచేసుకున్నది.

    తను ఎదురు చూస్తున్న వ్యక్తి కనిపించకపోవడంతో నిరుత్సాహంగా కారువైపు నడిచింది కృష్ణప్రియ!


                        *    *    *


    డాక్టర్ కృష్ణప్రియకు హాస్పిటల్ లో తన స్థానం రోజు రోజుకు దిగజారుతున్నట్టు కనబడుతున్నది.

    తోటి డాక్టర్లు, సిస్టర్స్ చివరకు వార్డ్ బోయ్స్ సయితం చులకనగా చూస్తున్నారు.

    తన ఎదురుగానే  తన ఉనికిని గమనించినట్టు  తన గురించి అసహ్యంగా కధలు చెప్పుకుంటున్నారని కృష్ణప్రియకు అర్ధమౌతూనే వుంది.

    అలా అడుగడుగునా జరుగుతున్న అవమానాలను సహించలేక ఒక్కొక్కసారి ఉద్యోగానికి రిజయిన్ చేసి మనశ్శాంతి లభించే చోటుకు పారిపోవాలనిపిస్తుంది.

    పరిస్థితులకి భయపడి పిరికిగా పారిపోవాలను కుంటున్నదే కానీ...పరిస్థితులు తనని వదలవని తెలియకనా!

    క్షణ క్షణం చచ్చి బ్రతకాలన్న  సత్యాన్ని తెలుసుకోవడానికి ఆమె అనుభవమే ఆమెకు ఎన్నో గుణపాఠాలను నేర్పింది. పడుతున్న మానసిక అశాంతికి తోడు క్షణాలు యుగాలుగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది.

    ఆలోచనలతో మనసు బాగోకపోవడం వలన కనీసం లీవ్ పెడదామనుకున్నది కానీ__సగం రోజు గడిచాక ఎందుకులే అని మౌనం వహించింది.

    లంచ్ టైమ్ లో ఏమి తినాలనిపించక  టీ మాత్రం తాగి వూరుకుంది.

    పేషెంట్స్ ఎక్కువగా లేకపోవడం వలన సాయంత్రం త్వరగానే వార్డులో నుంచి బయట పడింది డాక్టర్ కృష్ణప్రియ.

    "ఏయ్ ప్రియా..."

    ఆ పిలుపుకు ఉలిక్కిపడి కారు ఆపింది.

    కుమార్ వెకిలిగా నవ్వుతూ నిలుచుని వున్నాడు.

    అసభ్యంగా వున్న అతని పిలుపుకు లోపల బాధగానే వున్నా బయటపడలేదామె.

    "మేనర్ లెస్ బ్రూట్ ..." మనసులోనే తిట్టుకున్నది.

    "సారీ...నీకు ముందుగానే చెబుదామనుకున్నాను పేషెంట్స్  ఎక్కువగా వుండడంతో బిజీలో మరచిపోయాను. రామకృష్ణాలో పిక్చర్ మారింది. టికెట్స్ బుక్ చేశాను కాసేపు అలా తాజ్ కు వెళ్ళి, తరువాత పిక్చరుకు-నా స్కూటరుకు ట్రబుల్ వచ్చింది. ఎటూ నీ కారు వుంది కదా అని దాన్ని హాస్పిటల్ లోనే వదిలేశాను" ముక్తసరిగా చెప్పి ఆమె అంగీకారం కోసం చూడనయినా చూడకుండా ఫ్రంట్ డోర్ తెరచి కూర్చున్నాడు కుమార్.

    అతని ధైర్యానికి ఆశ్చర్యపోయింది డాక్టర్ కృష్ణప్రియ.

    తన ముందు నీళ్ళు నములుతూ మాట్లాడే కుమార్ ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటా అని ఊహిస్తున్నది.

    సమాజంలో స్త్రీకి వున్న అల్పస్థానాన్ని  తలుచుకోగానే ఆమె హృదయం ఆర్ద్రమయింది.

    అందులోనూ పెళ్ళి కాకుండానే ఒక బిడ్డను దగ్గర వుంచుకోవడం వలన ఎలాంటి అపవాదులు వస్తాయో ప్రత్యక్షంగానే తెలుసుకోగలుగుతున్నది.

 Previous Page Next Page