సంధ్యాసమయం కావడంవలన చల్లని పిల్లగాలులు చెట్లనుంచి వస్తున్నాయి.
ఆ చల్లని వాతావరణంలో తనను తను మరచి నవల చదవడంలో లీనమయిపోయింది డా|| కృష్ణప్రియ.
ఒక్కసారిగా వీచిన గాలికి కృష్ణప్రియ చేతిలోని నవల జారి కిందపడింది.
నవలను పైకితీస్తూ పరిసరాలు గుర్తుకువచ్చి తలఎత్తి చూసింది.
స్విమ్మింగ్ ఫూల్ లో టింకూ లేడు...
టైమ్ చూసిన కృష్ణప్రియకు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయింది.
"టింకూ..."
ఖంగారుగా పిలుస్తూ నాలుగువైపులా చూసిందామె.
ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూడడంతో ఆమెకు మతిపోయినట్టయింది.
ఆరోజు ఎవరినయితే టింకూ పరుషంగా మాట్లాడాడో అతనే టింకూ కడుపుమీద చేయిపెట్టి నొక్కుతూ కనిపించాడు.
అతను నొక్కినప్పుడల్లా టింకూ నోటిలో నుంచి నీరు బయటకు వస్తున్నది.
కృష్ణప్రియ ఖంగారుగా టింకూ దగ్గరకు పరుగు దీసింది.
అతను పక్కకు తప్పుకోగానే టింకూ ముఖం చీర చెంగుతో తుడిచి గాలికోసం విసిరింది. అప్పుడే స్పృహలో కొచ్చిన టింకూ అటూ ఇటూ కదిలాడు.
కృష్ణప్రియ అతనికి కృతజ్ఞత చెప్పుకుందామని తిరిగి చూసేసరికి అతను అక్కడ లేడు.
ఉస్సూరుమని నిట్టూరుస్తూ టింకూను ఎత్తుకుని బయలుదేరింది కృష్ణప్రియ.
* * *
కృష్ణప్రియ పబ్లిక్ గార్డెన్స్ లో ఒంటరిగా కూర్చున్నది.
ఒంటరితనానికి తోడు మనసు ఏమీ బాగోలేదు...
టింకూ ఆరోగ్యం మెరుగవుతున్నా, ఒకవైపున ఆందోళనగానే వుంది. స్విమ్మింగ్ ఫూల్ లో యాక్సిడెంట్ నుంచి కోలుకున్నా ఇంకా టింకూ బెడ్ దిగడంలేదు.
టెంపరేచర్ నార్మల్ కు వస్తూ వెంటనే నూటరెండు డిగ్రీలకు పెరిగిపోతున్నది. అదంతా గంటల తేడాలో జరుగుతున్నది.
అసలు గత ఆదివారం గార్డెన్స్ కు వెళ్ళకపోతేనే బాగుండేదేమో...
అప్పటికీ పిక్చర్ కు వెళదామని టింకూ గొడవచేసినా తనే గార్డెన్స్ కు లాక్కువచ్చింది. స్విమ్మింగ్ చేస్తానంటే ఆరోగ్యం బాగానేవుందని తను సరేనని అన్నది కానీ, అలా జరుగుతుందని అనుకోలేదు.
అలా అనుకుంటే అసలు తను ఛస్తే గార్డెన్స్ ముఖం చూసేది కాదేమో!
తను ఆ సంఘటనను ఇంకా మరచిపోలేక పోతున్నది.
అతనే గనుక ఆ సమయంలో ఆదుకుని వుండకపోతే టింకూ ఏమై వుండేవాడో...? తన చిన్నారి ప్రాణం లేకుండా తను బ్రతకగలదా?
స్విమ్మింగ్ చేస్తూనే బిగుసుకుపోయి మునిగిపోయానని టింకూ స్పృహవచ్చాక చెప్పాడు.
టింకూని రక్షించిన అతను ఒక యుగపురుషునిగా కనిపిస్తున్నాడు.
ఏం ఇచ్చినా అతని రుణం తీరదు అనిపిస్తున్నది...కనీసం కృతజ్ఞతలు అయినా అందుకోకుండా వెళ్ళిపోయాడే అని బాధగా వుంది.
నిశ్చలంగా, నిబ్బరంగా, గంభీరంగా వున్న అతని రూపం ఇంకా కృష్ణప్రియ మనసులో కదులుతూనే వున్నది.
పైజమా, లాల్చీలో ఉన్న అతని ముగ్ధ మనోహర రూపాన్ని మరచిపోలేక పోతున్నది.
పరిచయం లేని వ్యక్తి గురించి అంతటి ఆలోచన ఎందుకని ఆమె స్త్రీ హృదయం హెచ్చరిస్తున్నా అతనితో ఎలాగయినా పరిచయం పెంచుకోవాలని మనసు ఆరాటపడుతున్నది.
అప్పటికీ తను ప్రతిరోజూ పబ్లిక్ గార్డెన్స్ కు వస్తూనే వుంది.
అయినా అతను కనబడితేగా...
టింకూ అనారోగ్యంగా వుండడంతో తను మరీ ఒంటరిది అయింది... తనకు టింకూ సమక్షంలో అనందం, తృప్తి కలిగేవి. ఏమయినా బాధలు మరచిపోవాలంటే వాడి ముందు కూర్చుంటే చాలు...అమాయకంగా అడిగే చిన్న చిన్న విషయాలు నవ్వు తెప్పించేవి.