తమ కబంధ హస్తాలతో నాశనం చేసే మగవాళ్ళే. ఆడవాళ్ళను వేలెత్తి చూపుతూ వుంటారు. నాగరికత ఎంతగా పురోగమిస్తున్నా స్త్రీ స్థానం ఎప్పుడూ ఒక మెట్టు కిందే వుంటున్నది.
ఇప్పుడు తనున్న పరిస్థితులలో తెలివిగా ప్రవర్తించకపోతే మొదటికి మోసం వస్తుందని లేని చిరునవ్వును తెచ్చుకుని అవతల పక్కగా వచ్చి డోర్ తెరిచి కుమార్ ప్రక్కన కూర్చున్నది.
కృష్ణప్రియ అలా చేస్తుందని వూహించని కుమార్ చకితుడయ్యాడు.
గుటకలు మింగుతూనే స్టీరింగ్ అందుకున్నాడు.
ఫోర్ వీల్డ్ వెహికల్ డ్రయివ్ చేయడం నేర్చుకున్నాడే కానీ అంత ట్రాఫిక్ లో ఎప్పుడూ డ్రయివ్ చేయలేదు. అందులో అప్పుడు అన్నీ ఆఫీసులు వదిలే టైమ్ కావడం వలన అతని గుండెదడ హెచ్చింది.
రోడ్లు అన్నీ మరీ రష్ గా వున్నాయి.
తన స్కూటర్ ను తప్ప హాస్పిటల్ లోనే వదిలేసి ప్రియ కోసం రావడం ఎంత పొరపాటు అయిందో అప్పుడు అర్ధం అయింది.
తన అసమర్ధతను అంగీకరించలేక ఆమెకు అనుమానం రాకుండా కారు స్టార్టు చేశాడు కుమార్.
అతని అవస్థను చూస్తున్న కృష్ణప్రియకు నవ్వు ఆగడం లేదు.
సీరియస్ గా ముఖం పెట్టి పళ్ళ బిగువున డ్రయివ్ చేస్తున్నాడు కుమార్. తన ప్రతాపాన్ని చూపాలన్నట్టు టౌన్ స్పీడ్ లిమిట్స్ దాటి నడుపుతున్నాడు.
అప్పటికే రెండు సెంటర్లలో ట్రాఫిక్ పోలీసులు విజిల్ వేయడం జరిగింది.
కుమార్ ముఖం అప్పటికే చెమటతో నిండిపోయింది.
కారును హోటల్ తాజ్ ముందు ఆపి గాలి పీల్చుకున్నాడు.
"ఏయ్ కుమార్...నువ్వు లోపలకు వెళ్ళి ఆర్డర్ యివ్వు...నేను ఇప్పుడే వస్తాను" అంటూ అతని వైపు చూడకుండానే కౌంటర్ దగ్గరున్న ఫోను వైపు నడిచింది కృష్ణప్రియ.
ఆమె పిలుపుకు నిర్ఘాంతపోయాడు.
అందరూ అతనివంకే వింతగా చూడడం మొదలుపెట్టారు.
ఆ చూపులనుంచి తప్పించు కోవాలనేమో ఫామిలీ రూముకు దారితీశాడు.
స్ప్రింగ్ డోర్ తీసి గదిలో అడుగుపెట్టిన కృష్ణప్రియ... "ఇంకా ఆర్డర్ ఇవ్వలేదా?" ముఖం మాడ్చుకుని కూర్చున్న కుమార్ ను యింకా ఉడికిస్తూ అన్నది.
బేరార్ రావడంతో రెండు గులాబ్ జామ్స్ కు ఆర్డర్ ఇచ్చింది.
కుమార్ కక్కలేక మింగలేక అన్నట్టు ఆమెవైపు చూస్తుండిపోయాడు.
గులాబ్ జామ్స్ వచ్చాయి.
అవి అతనికి ఇష్టంకాకపోయినా ఆమె ఆర్డర్ ఇవ్వడంతో అది తన దౌర్బల్యం అనుకుని తినక తప్పలేదు.
ఒక గండం గడిచింది అనుకునే లోపల రెండు ఐస్ క్రీమ్స్ కు ఆర్డర్ ఇచ్చింది.
వచ్చినంత స్పీడుగానే బేరర్ వెళ్ళిపోవడంతో కుమార్ గుడ్లు వెళ్ళబెట్టి చూడడం మినహా మరేమీ చేయలేకపోయాడు.
ఐస్ క్రీమ్స్ తేవడంతో రెండు బాదంఖీర్ కు ఆర్డర్ ఇచ్చి కుమార్ బాధకు లోలోపలే నవ్వుకున్నది కృష్ణప్రియ.
జరుగుతున్న అవమానానికి కుమార్ మనసు కుతకుతలాడిపోతున్నది.
అన్నీ ఆమె ఈజీగా తీసుకోవడం అతనికి ఒకవైపు వింతగా వుంది.
కృష్ణప్రియ మధ్యాహ్నం భోజనం చేయలేదన్న సంగతి పాపం కుమార్ కు ఏం తెలుసు?
బేరర్ బిల్లు తెచ్చాడు.
కృష్ణప్రియ చేసిన లోకల్ కాల్ తో కలిసి బిల్ పెద్ద మొత్తమే పడింది.