Previous Page Next Page 
అతని భార్య ప్రియుడు పేజి 9

   
    ఆ మాటలకి పూనకం వచ్చినట్లు వూగిపోయాడు జి.కె.

    ఒక చేత్తో కంఠాన్ని పట్టుకుని బిగించి "నిన్ను చంపేస్తాను" అన్నాడు.

    ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. రెండు చేతులతో గట్టిగా పట్టుకుని విదిలించుకొంది నాగమణి.

    "పశువులకి బలం ఎక్కువట. నువ్వు ముసలివాడివైనా, నేను పడుచుదాన్ని అయినా మనకి పెళ్ళయింది. ఇది మొదటి రాత్రి. మనసు విప్పి ఒకరి మనసులోని మాట ఒకరికి చెప్పుకుంటారు. కానీ ఇదా పద్ధతి? నేను ఎంతమంది దగ్గర పడుకున్నానన్న విషయం తెలుసుకోడానికి కాదు ఈ రాత్రి!

    నిజంగానే నేను ఇదివరలో అలాంటి పని చేస్తే "లంజ" అనే బిరుదు ఇచ్చేదీ సమాజం. ఆ బిరుదుని నేను సంపాదించుకోలేదు. ఇప్పుడు అలాంటి పనిచేసే జి.కె. భార్య చాలా సోషల్ గా వుంటుంది, అంటుంది సమాజం. నన్ను చంపటం అంత తేలిక కాదు" హెచ్చరించింది.

    అతను పగలబడి నవ్వాడు.

    "ఈ జి.కె. తలచుకుంటే కాని పని అంటూ ఏదీ లేదు."

    "నేను జి.కె. భార్యని!"

    "సో వాట్!"

    "అంటే నిన్ను నీవే తేలిక చేసుకొంటున్నావా జి.కె.?"

    "యూ.........?"

    "అరవకు, బి.పి పెరుగుతుంది. హార్ట్ ఎటాక్ వస్తుంది. పక్షవాతంతో నీ నోరు పడిపోవచ్చు."

    ఊహించని రీతిలో జి.కె. చేతిలోని సిగరెట్ చెంపని తాకింది. చుర్రుమని కాలింది.

    బాధతో కెవ్వుమంది. అతను ఆనందంతో వెర్రినవ్వు నవ్వాడు.

    "ఏంటీ నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? నిన్ను ఏం చేస్తానో చూడు" గబగబా బీరువా దగ్గరికి నడిచి హంటర్ తీసాడు.

    తను నిర్ఘాంతపోయింది.

    తనని హింస పెడతానని కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చుకున్నాడన్నమాట.

    వికటాట్టహాసంతో..... అడుగు ముందుకేస్తున్నాడు.

    తను ఆ రోజే ఆ ఇంట అడుగు పెట్టింది. ఇంట్లో పనివాళ్ళుంటారు వాళ్లెలాంటివారు కూడా తనకి తెలీదు. పరిచయమూ లేదు.

    తనని కాపాడేదెవరు?

    ఆ రాక్షసుడి బారినుంచి రక్షించేదెవరు?

    పచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడు.

    ఇంత గొప్పవాడు.

    ఇదేం అలవాటు!

    ఇంతలో కళ్లు..... దిక్కులు చూసాయి.

    "నిన్ను ఓ పట్టాన చంపను. రోజూ..... కొద్ది కొద్దిగా.........." కొరడా ఆమె వంటిని తాకింది.

    పళ్ళు బిగించి ఆ దెబ్బని ఓర్చుకుంది.

    మరో దెబ్బ.....

    "అమ్మా!" అని మూలిగింది.

    ఇంకో దెబ్బకి భయంకరంగా ఆర్తనాదం చేసింది.

    "యూ ఓల్డ్ బాండీ కాట్!" మంచం మీద నుంచి చెంగున దుమికింది.

    జి.కె. అవాక్కయ్యాడు.

    టీపాయ్ మీద వున్న ప్లవర్ వాజ్ ని చేతిలోని తీసుకుని "నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను. అసలే బట్టతల. రెండు చెక్కలవుతుంది" కీచుగా అరిచింది.,

    జి.కె. అడుగు వెనక్కి వేశాడు.

    కసిగా, క్రోధంగా చూస్తూ గదిలోంచి విసవిస బయటికి నడిచాడు.

    తలుపులు బిగించి మంచంపైన బోర్లాపడిపోయి భోరుమంది.

    ఇదెక్కడి గొడవ?

    ఆ ముసలాడితో ముద్దు ముచ్చట తీరదని ముందే తెలుసు. కానీ ఆ విధమైన నరకం వుంటుందని మాత్రం ఊహించలేదు.

 Previous Page Next Page