Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 9

   
    "సుజాతను నువ్వెలా చేసుకోవాలనుకున్నావు, అన్నయ్యా?"విస్మయంగా అడిగింది స్వప్న.

    "సుజాత మన కులంపిల్లే. బంధుత్వం వుంది. అమ్మనీ నాన్ననీ ఒప్పించడం  పెద్ద కష్టమైన పనికాదు! ఈ సంబంధం చేసుకోవడంవల్ల వాళ్లకు తలంపులయ్యేదేమీ వుండదు!"

    "చదువుకొన్న మనం కూడా కులం పట్టింపు పెట్టుకోవాలా? ఈ కాలంలో వర్ణ, మతాంతర  వివాహాలు  ఎన్ని జరగడంలేదు!"

    "ఎన్ని జరిగినా అవి కొద్దివే! సంప్రదాయ పద్దతిగా పెద్దలు జరిపే పెళ్లిళ్లు ముందు, ఫలానా  అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకొని కులాంతర వివాహం చేసుకొన్నారని  వింటాంగాని,  ఆ తరువాత వాళ్లు ఆ వివాహంవల్ల పడే కష్టాలు, మనస్పర్దలు, సమాజం బహూకరించే చీత్కారాలు చిత్రహింసలు మనదాకా రావు! ఎవరో వర్ణాంతర, మతాంతర వివాహం చేసుకొన్నారని వాళ్లని ఆదర్శం చేసుకోవడం అభ్యుదయ మంటావా?" ఈ సమాజంలో రంకులు బొంకులూ, దోపిడీలు, అవినీతి పనులు జరగడం సహజం సర్వసాధారణమే అయినా మనం వాటిని ఆదర్శం చేసుకోగలమా? చెడ్డకి ఎంత మెజారిటీ, బలం వున్నా మనిషి దానికిదూరంగా వుండాలనే కోరుకుంటాడు కదా?

    "కులమతాలు పాటించడం సుంకుచితం, సంఘవిద్రోహచర్య అంటావా, కలిసిపోవడంలోనే  సమాజ శ్రేయస్సు వుంటుందాని  నేనడుగుతాను! మనుషులంతా ఒకటి కావడమనేది చాలా అసంభవం, స్వప్నా! కులవిభజన నువ్వు రూపమాపదల్చుకొన్నా ఆర్దికంగా అంతస్తుపరంగా మనుషులమధ్య విభజన ఎప్పుడూ వుండనే వుంటుంది! ఎన్ని  ఉపన్యాసాలు దంచినా, ఉద్యమాలు లేవదీసినా ఈ హెచ్చు తగ్గులు ఎవరూ రూపుమాపలేరు!

    "స్వరూప్ ని చేసుకొనవి నీపాటికి నువ్వు సుఖంగా వుండగలిగినా ఇక్కడ మా పరిస్థితి నువ్వు కొంచెం ఆలోచించాలి! కుటుంబంలో ఒక్కరు తప్పుచేస్తే దాని శిక్ష కుటుంబమంతా అనుభవించాలి! నీ తరువాత ముగ్గురు ఆడపిల్లలున్నారు వాళ్ళ అక్క కులంతక్కువాణ్ణి కట్టుకొంటే వాళ్ళకు సంబంధాలు అంత తేలిగ్గా రావు! ప్రతిచోటా మమ్మల్ని వేలెత్తి చూపినట్టుగానే వుంటుంది!

    "మేంకట్నమిచ్చి పెళ్లిచేయలేమన్న నిరాశతో నువ్వు స్వరూప్ కి దగ్గరయి వుంటే నేను నీకోసం కట్నం తీసుకొని నీకు పెళ్లి జరిపిస్తాను స్వప్నా!"

    అన్నగారి మాటలు పట్టుతాళ్లతో కట్టివేయడంలా కనిపించింది స్వప్నకి. ఇవి పట్టుతాళ్లయినా, ఇనుప సంకెళ్లయినా వీటిని తెంచుకోలేదు. స్వరూప్ ని చేరలేదు. వయసొచ్చాక ప్రతి ఆడపిల్లా పెళ్ళంటూ చేసుకొని పుట్టింటికి దూరం కావడం సహజమే అయినా ఆ దూరం తల్లిదండ్రుల గుండెలమీద బరువుదించేది కావాలిగాని గుండెలో నిప్పుపెట్టేది కాకూడదు!

                                                                    3

    సాయంత్రం బడి వదిలాక ఇంటికి వస్తున్నది స్వప్న, మధురతో, స్కూటర్ శబ్దం చెవినిబడుతూనే గుండెలు టకటక కొట్టుకోసాగాయి. మధుర చెయ్యి బిగించి పట్టుకొని వేగంగా నడవసాగింది స్వప్న.

    స్కూటర్ దారికి అడ్డంగా నిలిపి నేలమీద ఓ కాలు ఆన్చి, అడిగాడు స్వరూప్, "మూడు రోజులనుండి బడికి రాలేదేం?"

    జవాబివ్వకుండా స్కూటర్ని తప్పించుకొని ముందుకు వెళ్లసాగింది స్వప్న.

    ఆమెను నాలుగడుగులు పోనిచ్చి మళ్లీ స్కూటర్ ఆమెకు అడ్డంగా తీసికెళ్లి ఆపాడు. "ఆరోగ్యం బాగా లేదా, స్వప్నా? ముఖం అలా వాడిపోయిందేమిటి?" ఆదుర్దాగా అడిగాడు.

    "....."స్వప్న మధుర చెయ్యి వదలకుండా ముందుకు వెళ్లసాగింది.

    ఆమెను పది అడుగులు ముందుకుపోనిచ్చి స్కూటర్ని ఆమె చుట్టూ ప్రదక్షిణం చేయించి దారికి అడ్డంగా ఆపాడు.

    "రోడ్డుమీద ఇలా అల్లరిపెట్టడం ఏమిటి, మిస్టర్?" మధుర కోపంగా అడిగింది. "పోలీసుల్ని పిలవనా?"

 Previous Page Next Page