Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 10

   
    మధుర స్వప్నకి ప్రాణంలాంటి స్నేహితురాలని తెలుసు స్వరూప్ కి. మధుర మాటలకి కాస్త నొచ్చుకొని స్వప్న ముఖంలోకి ప్రశ్నార్దకంగా చూసాడు స్వరూప్. "అసలేం జరిగింది స్వప్నా? హఠాత్తుగా ఎందుకీ మార్పు? చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది?" కలవరంగా అడిగాడు.

    కదిలిస్తే చాలు జలజలరాలే వానకు  తడిసిన చెట్టులా వుంది స్వప్న పరిస్థితి. దుఃఖం గొంతును బిగబట్టేసింది.

    మధుర చేతులు జోడించి ప్రార్దిస్తున్నట్టుగా అంది, "మీరు స్వప్నను మరిచిపోవాలి! మీరు వత్తిడిచేస్తే తను ఆత్మహత్య చేసుకు చచ్చిపోతుంది."

    నెత్తిన పిడుగుపడినా అంత నిశ్చేష్టుడు అయ్యేవాడు కాదేమో! వెలవెల బారిన ముఖంతో "ఎందుకని?" అడిగాడు. హఠాత్తుగా తననెవరో పట్టుకొని "నీకు ఉరిశిక్ష పడింది" అని అంటే ఎందుకని అడిగినట్టుగా.

    "స్వప్న తలిదండ్రులు ఉత్త ఛాందసులు! మీ పెళ్లి జరగడం చాలా అసంభవం! స్వప్న మిమ్మల్ని మరిచిపోకపోతే ఆమె తలిదండ్రులు శవాలు ఆ ఇంట్లోంచి లేస్తాయని వాళ్లు స్పష్టంగా చెప్పేశారు. దయచేసి మీ ఇద్దరి  మధ్య స్వప్నని నలుపకండి! స్వప్నని మరిచిపోండి!"

    "నేనొకసారి వచ్చి వాళ్లతో మాట్లాడనా?"

    "వద్దు" జవాబు ఖచ్చితంగా స్వప్ననుండి వచ్చింది. "అలాంటి పిచ్చిపని చేయకండి. మాఇంట్లో మీకు జరిగే అవమానానికి  నేను ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాను!"

    ఈ మాట అనేసి తనకేసి కన్నెత్తి అయినా చూడకుండా మధుర చేయిపట్టుకొని చరచరా వెళ్ళిపోతున్న స్వప్నని ఖిన్నుడై చూడసాగాడు స్వరూప్.   

    స్వప్నది పిరికితనమా?నిర్లక్ష్యమా?ప్రేమించి, ప్రేమించబడి ఇద్దరు కలిసి కట్టుకొన్న ప్రేమసౌధాన్ని కూల్చడానికి ఎలా సంకల్పించింది? చదువుకొని సంపాదిస్తూకూడా ఒక వ్యక్తిత్వం ఏర్పరుచుకోలేదా ఈ దేశంలో ఆడపిల్ల?

     మరునాడు స్వప్న బడిలో క్లాసు తీసుకొంటున్న సమయంలో ప్యూన్ ఒక కవరు తెచ్చి ఇచ్చింది. "స్కూటర్ మీద ఒకాయన వచ్చి ఇది మీకిమ్మని చెప్పాడమ్మా!"

    స్వప్నకి ఆ కవరు చించాలనీ, చదవాలనీ లేదు. స్వరూప్ అందులో ఏం రాసి వుంటాడో తనకు తెలుసు! "స్వప్నా! ఎందుకిలా మారిపోయావ్?" అని గోలపెట్టి వుంటాడు. "మనం దూరం కావడానికి వీల్లేదు" అని అరిచి వుంటాడు?"

    స్వప్న కవరు చించింది.

    "స్వప్నా!

    సాయంత్రం దేవీబాగ్ కి రా! లేకపోతే నేనే మీ ఇంటికి వచ్చేస్తాను! నేను మీ ఇంటికివస్తే నువ్వు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతానన్నావు! మన ప్రేమ విఫలం  కావడమే జరిగితే ముందు నా చావే నువు చూస్తావు!

                                                                                                             - స్వరూప్"

    చివరి వాక్యం టైంబాంబులా భయపెట్టకపోతే దేవీ బాగ్ కి ఎంతమాత్రం వెళ్లిదికాదు స్వప్న. దేవీబాగ్ లో  స్వరూప్ ని కలుసుకోవడమే జరిగితే తనేమైపోతుందో తనకే తెలియదు!

    సాయంత్రం ఇంటికి వచ్చి ముఖం కడుక్కొని టీ తాగి మధురని తోడు తీసుకోకుండానే దేవీబాగ్ కు బయల్దేరింది స్వప్న.

    గుండెల్లో గుబులు పుట్టించే ఎరుపును పులుముకొంటున్న ఆకాశంకేసి చూస్తూ స్వప్నకోసం ఆదుర్దాగా నిరీక్షిస్తున్నాడు స్వరూప్ దేవీబాగ్ లో.

    స్వప్న వస్తుందో లేదో?

 Previous Page Next Page