"బట్టలూ నగలూ వాళ్లనే తెచ్చుకొమ్మనాలి కట్నం కాష్ గా మనచేతికిస్తే అది స్వప్నకివ్వొచ్చు! ఇద్దరి పెళ్లి ఏ కొండమీదో చేస్తే నాలుగైదు వేలతో పోతుంది!"
"చెల్లెలికి కట్నం సంపాదించి పెట్టడానికే నన్ను కన్నావేమిటి?" చిటపట లాడాడు. "కట్నం తెచ్చే కొడుకు లేకపోతే నీ కూతురికి పెళ్లేచేయవా!"
"వెధవా! కూతలు నేర్చావురా! నువ్వు కట్నం లేకుండా ఆ సుజాతను చేసుకోవడమే జరిగితే నీ ముఖం మాకు చూపించకు! నువ్వసలు పుట్టలేదనుకొంటాం. లేదా చచ్చాడనుకొంటాం!" పురుషోత్తం చిటపటల మధ్య, విశ్వేశ్వరయ్య చిందులు మధ్య స్వప్న ప్రవేశించింది.
"అన్నయ్యా! నువ్వు నా కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నువు నా కోసం నీ మనసుకు నచ్చిన అమ్మాయికి, మనసు చెప్పిన దానికీ దూరం కానక్కరలేదు!"
"నాన్నగారూ! నా పెళ్లికోసం మీరు తలలు బద్దలు కొట్టుకో నక్కరలేదు. వేలకు వేలు డబ్బుదోసిట్లో ఉంచుకొని వరుణ్ణి అన్వేషించడానికి నేనేం అంత వ్యక్తిత్వంలేని ఆడపిల్లని కాదు. నాకూ ఆదర్శాలున్నాయి. ఆలోచనలున్నాయి. ఇంత చదువుకొని సంపాదిస్తూ కూడా నా తలిదండ్రుల్ని పీడించి కట్నం తీసుకువెళ్లాల్సిన దుస్థితిలోలేను," అంది కాస్త ఆవేశంగా.
"కట్నం లేకుండా పెళ్లాడడానికి నీ కోసం అంత విశాలహృదయుడెవడు కాచుకుకూర్చున్నాడే?" తల్లి వెటకారం చేసింది, నోరు విప్పి ఎప్పుడూ ఇంతింత పెద్ద మాటలనని కూతుర్ని వింతగా చూస్తూ.
లోపల బెరుగ్గానే వున్నా స్వరూప్ మీది ప్రేమ ఇస్తున్న ధైర్యంతో అంది స్వప్న. "నిజానికి కాచుకొనే వున్నాడమ్మా. అతడు ఈ వూళ్లోనే జూనియర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. తండ్రి నాగార్జునసాగర్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. హోదా, ఐశ్వర్యం, వున్నవాళ్లు. మేం ప్రేమించుకొని పెళ్లిచేసుకోడానికి నిశ్చియించుకొన్నాం. మీరు ఆశీర్వదిస్తే మీకు నా సమస్య తీరడమేకాదు, మీకు సహృదయుడైన అల్లుడు లభిస్తాడమ్మా!"
"మన వాళ్లేనా?"
తల్లీ, తండ్రీ, అన్నా ఒకేసారి అడిగారు. వాళ్ల గొంతులో ఉత్కంఠ, భయం ముప్పిరిగొని వినిపించాయి.
"కా.......దు!" ఈ రెండక్షరాలు పలుకడానికి స్వప్న చాలా శక్తి కూడ దీసుకోవాల్సి వచ్చింది.
అంతే!
ప్రళయపు కెరటం విరుచుకుపడ్డట్టుగా అయింది. భీభత్సమైన అరుపులు ప్రారంభమయ్యాయి.
కమలమ్మ శోకం తీసింది.
విశ్వేశ్వరయ్య నిప్పులు కక్కాడు.
ఆదర్శాలు పలకే అన్నగారు ముఖం చిట్లించాడు.
మిగతా పిల్లలు స్వప్నని వింత మృగంలా చూశారు.
"మే మిచ్చేది ఆశీర్వాదం కాదే! సర్వనాశం కమ్మని శపిస్తాం. నాలుగు డబ్బులు కళ్లజూడగానే
కులమతాన్ని మరిచిపోయేదాని వయ్యావా? ఏదో కాస్త గొడవపెట్టి తరువాత వాళ్లే చల్లబడతారులే అని నువ్వనుకొంటున్నావేమో! అలాంటిది కలల్లో కూడా తలవకు. ప్రేమ గీమా అని మళ్లీ అన్నావో నా శవం ఈ ఇంటిదూలానికి వేళాడడం చూస్తావు!" అన్నాడు విశ్వేశ్వరయ్య.
ఇంచుమించు ఇలాంటి మాటలే తిట్టిపోసింది కమలమ్మ. స్వప్న తన నిర్ణయం మార్చుకోకపేయేట్టయితే తన శవం పెరటి నూతిలో తేలుతుందని ఖచ్చితంగా చెప్పేసింది.
స్వరూప్ ను పొందడం అంత సులభం కాదన్న సత్యం స్వప్నని కృంగదీయసాగింది. మరునాడు బడికి సెలవు చీటి పంపి ఇంట్లో వుండిపోయింది.
చెల్లెలి పరిస్థితి జాలిగొలిపేదిగా వున్నా ఆమె అలాంటి ప్రేమ వ్యవహారంలో చిక్కుపడడం హర్షించలేకపోయాడు పురుషోత్తం. హితవు చెప్పాడు. "జీవితం ఎవరితోనో ఒకరితో ముడివేసుకోవడం తప్పనిసరయినా, ఆ ముడి పెద్దల నిర్ణయం మీద ఆధారపడితేనే బాగుంటుంది, స్వప్నా!"