Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 9


    చాలా చిత్రమైన  అనుభూతి. హౌస్ సర్జన్ గా ప్రవేశించే  కొన్ని గంటలసేపే  అయింది. అయినా ఎంతో  ఎదిగినట్లు, ఎన్నో  బాధ్యతలు  చుట్టుముట్టినట్లు, మనస్సు  వికసించి  ఎన్నోరెట్లు  విశాలమైనట్లు  అనిపిస్తోంది.

    "డాక్టరుగారూ ? డాక్టరుగారూ !!" అని పిలుస్తున్నారు కొందరు పేషెంట్లు. దగ్గరకు  వెళ్తే  నిద్రపట్టటం  లేదని ఒకరూ, తల తిరుగుతూందని మరొకరూ, కడుపునొప్పిగా వుందని  యింకొకరూ  యిలా  రకరకాలుగా  బాధలు చెప్పుకుంటున్నారు. నాకు తోచింది  చేసి తిరిగి  వస్తున్నాను.

    "వీళ్ళంతే. వార్డులో  కనిపించామా ? వాళ్ళు  చేసే కంప్లెయింట్సుకి అంతువుండదు. ఎవరూ  కనిపించకపోతే  శుభ్రంగా  పడుకుని  నిద్రపోతారు" అంది సిస్టర్, నన్ను  చూసి  జాలితలుస్తున్నట్లు.

    ఇంతలో  డాక్టర్  రామదాసుగారు  వచ్చారు. అప్పటికి  రోగికి  మాగన్నుగా నిద్రపట్టింది. ఆయన పరీక్షచేసి "పెథిడిన్  యిచ్చారా ? గుడ్! హెపారిన్ కూడా  యింట్రావీనస్ గా యిచ్చేయండి. ప్రస్తుతానికి  అది చాలు. రేపట్నుంచీ  వేసోడైలటార్స్  మొదలుపెడదాం" అని  చెప్పి వార్డంతా ఒకసారి  కలయజూసి  వెళ్ళిపోయాడు.

    మనసులో  అనేక  సందేహాలు  అలుముకున్నాయి. హెపారిన్! ఎంత యివ్వాలి ? సరాసరి యిచ్చెయ్యవచ్చా ?గ్లూకోజ్ లో కలిపి  యివ్వాలా ?

    "డాక్టర్ ! హెపారిన్ తీసుకురమ్మంటారా ?" అనడిగింది సిస్టర్.

    ఇహ  మొహమాటపడితే  లాభం  లేదని సిస్టర్ని  అడిగేశాను! "సాధారణంగా ఎంత యిస్తారేం ?" అని.

    "టెన్ థౌజండ్  యూనిట్స్ తో మొదలు పెడతారు. గ్లూకోజ్ కలిపి తీసుకువస్తాను" దేవత  వరమిచ్చినట్లు  యిచ్చి  వెళ్ళింది.

    ఆ సమయంలో  ఆమెను  చూస్తూంటే  ఎనలేని  గౌరవమూ, ఆప్యాయతా కలిగాయి. కప్ బోర్డుదగ్గరకు  ఆమె నడుస్తూంటే  వెనకనుంచి  చూశాను. ఆకుపచ్చని  గీతలు  మూడు  కనిపిస్తున్నాయి, ఎడమ మోచేతికి పైన.

    ఇంజక్షన్ చేస్తూంటే  ఆయన కళ్ళు తెరిచి  బాధగా  మూలుగుతూ, "ఏమిటి ? సూదా ?అక్కడ కాకుండా  సరాసరి గుండెల్లోనే  గుచ్చకూడదూ  డాక్టరుగారూ !" అన్నాడు.

    "తప్పు. అలా అనకూడదు" అని,చెయ్యడం  ముగించి, యివతలకు  వచ్చి  వాష్ బేసిన్ దగ్గర  చేతులు  కడుక్కుంటున్నాను.

    "వెళ్ళిపోతున్నారా ? మళ్ళీ  అరగంట  తిరక్కుండానే  మెమో పంపిస్తాను చూడండి" అంది సిస్టర్, దగ్గరకు వచ్చి నిలబడి.

    "అంతేకదా. సంతోషంగా  వస్తాను."
   
    "అలాగేం ? చూస్తాను."

    కదలబోయాను.

    "కాస్త టీ త్రాగి వెళ్దురుగాని, వుండండి డాక్టర్."   

    "వద్దండీ ! థ్యాంక్స్."

    నేను నడవలోకి  వెళ్ళాక  ఆమె గుమ్మందాకా  వచ్చి  "అన్నట్లు డాక్టర్ ! మీ పేరేమిటి ?" అనడిగింది.

    "మధు అనండి  చాలు. వస్తానండీ  లిల్లీ!" అని చెప్పి  యిహ ఆగకుండా  బయల్దేరాను.

    పైకి, సర్జికల్ వార్డుకువెళ్ళి  మృదుల  ఏ స్థితిలో  వుందో  చూద్దామని  మెట్లెక్కబోతున్నాను. ఇంతలో  "అయ్యగారూ !" అన్న  కేక.

    వెనుతిరిగి  చూసేసరికి  యిరవై ఏళ్ళ స్త్రీ  నిలబడివుంది  ఆయా అంటే  నమ్మశక్యంగా లేదు.

    "మెడికల్  హౌస్ సర్జన్ గారు మీరేనా....?"

    "నేనే" అంటూ  పుస్తకం  అందుకుని  చూశాను .చెస్ట్  వార్డు నుంచి వచ్చింది.

    ఒక కేసు  సీరియస్ గా  వుందిట. వెంటనే  రమ్మని  వ్రాసింది  అక్కడ సిస్టర్....సరే అని సంతకం  పెట్టి వెంటనే  బయల్దేరాను.

    ఆయా; నేనూ  ప్రక్క  ప్రక్కనే  నడుస్తున్నాం.

    నల్లటి  ఆ చీకటి, ఆ చీకటిలో  నల్లగా  కదిలే  చెట్లు. కొద్దిగా ముందుకు సాగేసరికి  భరించలేని  నిశ్శబ్దం. ఊపిరాడనంత  ఏకాంతం.

    మార్చ్యుయరీ  ప్రక్కగా  నడిచి  పోతూంటే  అంది  ఆయా, నిశ్శబ్దాన్ని  భగ్నం చేస్తూ.

    "ఇక్కడ శవాల్ని  కోస్తారుకదా  అయ్యగారూ ? చీకట్లో  వొంటిగా నడిచివస్తూంటే  భయంతో  రక్తం గడ్డ  కట్టుకుపోయింది. అడుగు ముందుకు  పడలేరు .ప్రాణాలు  అరిచేతిలో పెట్టుకొని  వచ్చేశానయ్యా" అంది.

    ఆమె చెప్పింది  నిజమే. ఈ నిశీథినిలో  ఆడది  వంటరిగా  వస్తుంటే  ఏం జరిగినా  జరగవచ్చు. ఆమెమీద జాలివేసింది.

    "అక్కడ  నువ్వొక్కదానివేనా? ఎవరూ  లేరా  యింక ?" అన్నాను సానుభూతిగా.

    "ఎందుకు  లేడు  బాబూగారూ ? బడేసాయిబున్నాడు. వాడికి  వొంటిమీద  తెలివుంటేగా ! మస్తుగా  తాగేసి  చాపమీద  పడి దొర్లుతున్నాడు. 'సాయిబూ సాయిబూ' అని ఎన్నో కేకలేశాను. ఈ లోకంలో  వుంటేగా ! ఇంక స్తాఫమ్మగారు  గాబరాపడుతూంటే  విధిలేక  వొచ్చా" నన్నది.

    హాస్పిటల్  వెనకవైపు  గేటు దాటి  రోడ్డుమీదకు వచ్చాం. రోడ్డు కవతల  నూట యాభయి  గజాల  దూరంలో వున్న టి. బి. వార్డు లోంచి  వెల్తురు  కనిపిస్తోంది. దగ్గరపడుతూన్న  కొద్దీ  ఎవరో  రోగి  ఊపిరితిత్తులు తెగిపోయేటట్లు  ఖంగ్ ఖంగ్ మని  దగ్గుతూన్న  ధ్వని  వినిపించసాగింది.

    లోపలకు  వెళ్ళేసరికి  స్టాఫ్  ఎదురుగా  వచ్చింది  "రండి  డాక్టర్" అంటూ.

    "ఎలా వుంది ?" అని ప్రశ్నించాను.

    "చాలా క్రానిక్  పేషెంట్ డాక్టర్ ! అయిదారు  రోజులబట్టి  సీరియస్ గా వుంది. మీకు మెమో  పంపిచేసరికి  లాస్ట్ స్టేజన్ లో వుందన్న  మాట. తర్వాత  అయిదు నిమిషాలకే  చనిపోయింది. రండి, చూసి  డెత్ సర్టిఫికేట్  యిద్దురుగాని" అంటూ  లోపలికి  కదిలింది.

    ఆమెను  అనుసరించి లోపలకు  వెళ్ళాను. అది ఆడవాళ్ళ  టి.బి.వార్డు. మొగవాళ్ళది రెండో వైపున  వుంది. చాలామంది  రోగులు నిద్రపోతున్నారు. కొంతమంది  నిద్రపట్టక  అటూ యిటూ  కదుల్తున్నారు. కొంతమంది  కళ్ళుతెరిచి  పైకప్పు కేసి  చూస్తూ  ఆలోచిస్తున్నారు. మరి కొంతమంది  ఎడతెరిపి  లేకుండా  దగ్గుతూ  ఊపిరాడక  మధ్య మధ్య మూలుగుతున్నారు.              

    చనిపోయిన  రోగి  దగ్గరకు  వెళ్ళాము. పాతికేళ్ళు  మించని  స్త్రీ. బక్కచిక్కి, ఎండిపోయిన  గుండెలతో, అస్థిపంజరంలా వుంది. కళ్ళు విప్పబడి, తదేకంగా  పైకి  చూస్తున్న  భంగిమలో  నిలబడి పోయాయి.

    ఒకసారి  నేను కూడా  పరీక్షచేసి  "ఈమె తరపు  వాళ్ళెవరూ  లేరా ?" అనడిగాను.

    "లేరండీ. ఎవరూ  కనబడ్డం లేదు తెల్లవారేదాకా  యిక్కడే  వుంచి  తర్వాత  మార్చ్యుయరీకి పంపించివెయ్యాలి. అక్కడ  ఎయిర్ కండిషనింగ్ ఛాంబర్ లో ఎవరైనా  వస్తారేమోనని  రెండు  మూడు  రోజులు చూసి, అప్పటికీ  ఎవరూ  క్లెయిమ్  చెయ్యకపోతే  హాస్పటల్  స్వంతం  చేసుకుంటుంది."

    ఇద్దరం  నడిచి  ముందు  గదిలోకి  వచ్చాం, స్టాఫ్ నేను  పూర్తి  చేసి సంతకం  పెట్టవలసిన  కాయితాలు  నా ముందు  పెట్టింది.

    "డెత్ సర్టిఫై చెయ్యవలసింది  నేనేనా ? అసిస్టెంట్ కు  కబురంపనక్కర్లేదా ?" అన్నాను.

    "ఈ హాస్పిటల్  హౌస్ సర్జన్ కు  చాలా  పవర్స్ వున్నాయి. మిగతా చోట్ల ఎలా  వుంటుందో  తెలియదుగాని; ఇది మీ డ్యూటీక్రిందికే  వస్తుంది."

    ఆమె చెప్పినట్లు  పూర్తిచేసి, సంతకాలు  కూడా  పెట్టి లేస్తూ  "మీ రొక్కరే  కనిపిస్తున్నారేం  యిక్కడ ? వేరే సిస్టరెవర్నీ  పోస్ట్ చెయ్యలేదా ?" అనడిగాను.

    "చూడండి  డాక్టర్, చుట్టు ప్రక్కలెక్కడా  నరసంచారం  కూడా లేదుకదా. ఈ ఊరిబయట  వున్న  వార్డులో  నన్నొక్క దాన్నీ  పడేశారు. బిక్కు బిక్కుమంటూ  గడుపుతున్నాను. బడేసాయిబేమో  మస్తుగా  తాగేసి పడుకుంటాడు. ఏ క్షణాన  వాడు లేచి  రగడచేస్తాడో  అని  అదో  భయం" అంది స్టాఫ్ _ "చూశారా, ఎన్ని కష్టాల్లో  వున్నానో" అన్నట్లు.

    నా సానుభూతిని  చూపుల్లో  ప్రదర్శించి, వస్తానని  చెప్పి  బయల్దేరాను.

    చీకట్లో  వంటరిగా  మార్చ్యుయరీ  ప్రక్క నుండి  తిరిగి  వస్తూంటే టి.బి. వార్డులోని  మరణించిన  ఆ స్త్రీ  గుర్తువచ్చింది. ఆఖరి దశలో  ఎవ్వరూ  చెంతనుండటానికి  నోచుకోని  అభాగ్యస్త్రీ....తెరచి  వున్న ఆమె కళ్ళు.... ఆస్థిపంజరంలాంటి  ఆమె శరీరం....!

    విద్యార్ధిని  డాక్టరుగా  మారాక  ఎదుర్కొన్న  మొదటి  మృత్యువు. ఇది ఆసుపత్రి. ఎందరో  మనుషులు  ప్రతిరోజూ  యిక్కడ  శవాలుగా మారుతూంటారు. వళ్ళు  గగుర్పొడిచింది  నా ఆలోచన్లకు.

    మెడికల్  వార్డ్సువైపుగా  నడుస్తున్నాను. ఐసొలేషన్  వార్డులో సిస్టర్ బల్లమీద  తల  వాల్చి  నిద్రపోతోంది. ఇద్దరు సిస్టర్లు  ఏదో వార్డుకు  వెళ్ళి  తిరిగిపోతున్నారు. వార్డులకు  యివతలవుండే  వసారాలలో  రోగుల  తాలూకు బంధువులు, స్నేహితులు నేలమీద  పడి  దొర్లుతున్నారు. యాంటీనేటాల్ థియేటర్  బయట  బెంచీలు మీద  ఆడవాళ్ళు  కూర్చుని  కబుర్లు  చెప్పుకుంటున్నారు.

    మెడికల్  వార్డును  సమీపించి  మెట్లవైపు  మలుపు  తిరిగేచోట  ఒక క్షణం  ఆగి ఆలోచించాను. మృదుల ఆపరేషన్ థియేటర్ లో  వుండి వుంటుంది. ఆపరేషన్ అనుకోగానే  నా మనసు  ఆనందంతో  ఉరకలు వేసింది. థియేటర్ లోకి వెళ్ళి  ఎవర్జన్సీ  ఆపరేషన్  చూద్దామన్న  కుతూహలాన్ని  అణుచుకోలేక మెట్లెక్కబోయాను.

    వెనక నుండి అయ్యగారూ !" అన్న కేక  వినబడింది.

    తల త్రిప్పి  చూసేసరికి  ఆయా  చేతిలో  మెమో  పుస్తకం. ఆడవాళ్ళవార్డులో  హార్టు పేషెంటుకు  ఎక్కువగా  వుందిట....ఆమె  వెనకే  బయల్దేరాను.

    వెళ్ళేసరికి  ఆ స్త్రీ  చావు బ్రతుకుల మధ్య  కొట్టుకుంటూ  వుండటం కనిపించింది .ఆక్సిజన్ పోతోంది. రోగి  కొన ఊపిరితో  వుంది. ఒక్కక్షణం  భయంవేసింది  ఏం చెయ్యటానికి  పాలుపోలేదు. 'ఒక మనిషి నిండు ప్రాణాలతో  వ్యవహరిస్తున్నాను. ఆ సమయంలో  అక్కడ  నా బదులు  మరెవరైనా  వుంటే  నాకు  తెలియని  ప్రయత్నాలేమైనా  చేసేవాడా? ఆమె జీవించే  అవకాశాన్ని  నా అవ్యక్తతతో  పాడుచేస్తున్నానా ?' కంగారుతో  మతి పోతోంది.

 Previous Page Next Page