రోగి తాలుకు బంధువు _ ఆమె పెనిమిటి నా వంక ఆతృతగా చూడటం తెలుస్తోంది. నా చేతులు వణికినట్లయింది అలాగే ఆమె చెయ్యి పట్టుకుని నాడి చూడటానికి ప్రయత్నించాను.
ఎక్కడనో పలుచగా ,వుండీ వుండనట్లు తగుల్తోంది నాడి. కొన్ని సెకండ్ల సేపు అలా వుందేమో! తర్వాత నా చేతికేమీ తగలటం లేదు.
నేను వచ్చిన దాదిగా యీ లోకంతో సంబంధం లేకుండా మృత్యువుతో ఎక్కడో బలహీనపు పోరాటాన్ని సాగిస్తూన్న ఆ నిర్భాగ్యపు శరీరంలోని ప్రాణి అందులోంచి వెళ్ళిపోయింది.
చెయ్యి వదిలేసి మౌనంగా నిలబడ్డాను.
పరిస్థితి అర్ధం చేసుకుని ప్రక్కనున్న ఆ స్త్రీ 'దేముడా!' అని చిన్నగా రోదిస్తూ కళ్ళు తుడుచుకోసాగింది. రోగి పెనిమిటి మాత్రం యీ పరిణామాన్ని మునుపే ఊహించిన వాడిలా ప్రక్కకి చూస్తూ మౌనంగా గంభీరంగా నిలబడ్డాడు.
నా మనసు వికలమైపోయింది. బాహ్యస్మృతి లేకుండా ఆ రోగి సాగించిన అంత్య పోరాటమే కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆ వాతావరణంలో వుండలేక యివతలకు వచ్చి కుర్చీలో కూలబడుతూ "సిస్టర్ !" అని పిలిచాను నీరసంగా.
"ఏమండీ డాక్టర్ !"
"త్వరత్వరగా డెత్ సర్టిఫికేట్ తతంగం పూర్తిచేద్దాం రండి."
ఇలాంటి సంఘటనలు సిస్టర్ లో ఏమాత్రం అలజడి కలిగించేటట్లు లేవు. నవ్వుతూ పుస్తకం తెరిచి, కాయితాలు కూడా కొన్ని నా ముందుపెడుతూ "ఏమంత అర్జంటు ? వేరే ఏ వార్డుకైనా పోవాలా ?" అంటూ అడిగింది.
"చాలా చోట్లకు వెళ్ళాల్సి వుంది" అని ఎక్కడెక్కడ ఏమేమి పూర్తి చేయాలో, ఒకసారి అలవాటయిందేమో, తల వంచుకుని గబగబా వ్రాసేస్తున్నాను.
అయిదు నిమిషాల్లో పని పూర్తిచేసుకుని అక్కడ నుండి బయటపడి డ్యూటీ రూమ్ కేసి బయల్దేరాను. కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని పించింది. కాళ్ళీడ్చుకుంటూ నీరసంగా నడుస్తున్నాను.
డ్యూటీ రూమ్ సమీపించి తలుపుమీద చెయ్యి వెయ్యబోయేటంతలో "సార్!" అన్న పిలుపు.
వార్డు బాయ్. మెమో ! మెడికల్ వార్డు నుంచి వచ్చింది. ఇందాక ఎడ్మిట్ అయిన హార్టుకేసు సీరియస్ గా వుందిట, లిల్లీ సంతకం పెట్టింది. నా మనస్సులో ఏదో అనుమానం పొడసూడింది. నా నీరసం విషయం మరిచిపోయి గబగబ వార్డుకేసి నడవసాగాను.
వెళ్ళేటప్పటికి పరిస్థితి చాలా సీరియస్ గానే వుంది. రోగి గుండె నొప్పితో లుంగలు చుట్టుకుపోతున్నాడు. శరీరమంతా చెమటలు క్రమ్మివేసి ధారగా ప్రవహిస్తున్నాయి. చూస్తుండగానే రెండు వాంతులు కూడా అయిపోయాయి "అయ్యో....అయ్యో....అయిపోయింది" అంటున్నాడు మధ్య మధ్య తేలకళ్ళు పడుతున్నాయి.
నేను ఒక్కసారిగా ఒణికిపోయినట్లు అయిపోయాయి. డ్యూటీలోని కష్టం కళ్ళ ముందు ఒకసారి కారుచీకటిలా కదిలింది. "సిస్టర్, పెథిడిన్ తీసుకురండి" అని గట్టిగా కేక పెట్టాను.
"నాన్నా! ఇటు చూడు నాన్నా! ఎలా వుంది నీకు ?" అంటున్నాడు కొడుకు, ఆతృతగా.
రోగికి ఊపిరందటంకూడా కష్టంగా వుంది. సిస్టర్ హడావుడిగా తీసుకువచ్చిన యింజక్షన్ చేసేసి "సిస్టర్ ! ఆక్సిజన్ స్టార్టు చేయండి వెంటనే. నేనీ లోపున అసిస్టెంటును పిల్చుకువస్తాను" అని, వెనక నుండి ఆమె "మీ కెందుకండీ శ్రమ ? వార్డుబాయ్ తో మెమో పంపిస్తే పోలా ?" అంటున్నా వినిపించుకోకుండా గబగబ బయటకు వెళ్ళిపోయాను.
అసిస్టెంట్ డ్యూటీరూమ్ లో రామదాసుగారు మంచంమీద, గాఢనిద్రలో మునిగివున్నాడు. దగ్గరకు వెళ్ళి "సార్ !" అని పిలిచాను.
ఆయన కదిలాడు. నిద్రలో ఆయన ముఖంచూస్తే మరీ కోపంగా కనిపిస్తున్నాడు. లేచి విసుక్కుంటాడేమో ననుకున్నాను. కాని మరోసారి పిలిచాక, కళ్ళు విప్పి, ఎదురుగా నేను కనిపించగానే గబుక్కున లేచి కూర్చుంటూ "వాట్ డాక్టర్ ! కేసేదైనా సీరియస్ గా వుందా ?" అని ఎంతో అనునయంగా అడిగాడు.
నేను చెప్పిన విషయం వినగానే హడావుడిపడుతూ లేచి నిల్చుని "అరెరె, ఆ కేసు అలా టరన్ అవటం మంచిది కాదే" అంటా చెప్పులు తొడుక్కుని గబగబ బయటకు వచ్చాడు.
ఆయన ఎంత వేగంగా నడిచాడంటే ఆయనకంటే ఎంతో భారీగా వున్నా, ఎంత అందుకుందామని ప్రయత్నించినా, ఆయనకంటే నాలుగడుగులు వెనకే వుంటూ వచ్చాను.
మేము వెళ్ళేసరికి పేషెంటు యిందాక నేనిచ్చిన యింజక్షన్ పనిచేయటం వల్లో, రోగ ఉద్రిక్తతవల్లో తెలివితప్పిపోయి వున్నాడు. పల్స్ చూసి రామదాసుగారు పెదవి విరిచాడు. ఒక్క క్షణం వూరుకుని "మన ప్రయత్నం మనం చేద్దాం" అంటూ, చప్పున అతని పక్కనే కూర్చుని ,గట్టిగా వొత్తుతూ, కార్డియాక్ మసాజ్ చేయసాగాడు.
అలా ఓ అరగంటసేపు యిద్దరం విశ్వప్రయత్నం చేశాము. ఆయన పురమాయించిన యింజక్షన్ లు గబగబ చేశాను. ఆయనకు చేతులు నొప్పి పుడితే నేను మసాజ్ చేశాను.
ఏమి చేసినా ప్రయోజనం లేకపోయింది .ఆఖరికి రామదాసుగారు లేచి నిల్చుని, "హియీజ్ ఎక్స్ ఫైర్డ్ డాక్టర్ !" అని, ఒక క్షణం మౌనంగా నిలబడి, "ఆల్ రైట్ ! డెత్ రిపోర్టు రాసెయ్యండి" అంటూ, అక్కణ్నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు.
అక్కడే నిలబడి రోగి ముఖం వంకపరీక్షగా చూశాను. గంభీరంగా వీరోచితంగా కనిపించింది అతని ముఖం. ధైర్యంగా, సులువుగా పోట్లాడాడు మృత్యువుతో.
కాసేపు అక్కడ్నుంచి కదల్లేకపోయాను. అతను తెలివిగా వున్నప్పుడు ఆఖరి క్షణాల్లో కోరిన కోరిక జ్ఞాపకం వచ్చింది. ఒక సిగరెట్ కాల్చుకోటానికి అనుమతి అడిగాడు. అతని కోరిక తీర్చలేకపోయాను.
ఎవరో అతను ? అతని జీవిత చరిత్ర ఏమిటో ! కుటుంబగాథ ఏమిటో ? అనుభవాలు, సంఘటనలు, సాధన ఏమిటో !
కొడుకు చిన్నగా ఏడుస్తున్నాడు.
"డాక్టర్ !" అని వినిపించింది, సిస్టర్ కంఠస్వరం.
మెల్లగా కదిలి, బరువుగా అడుగులు వేస్తూ, టేబుల్ దగ్గరకు వెళ్ళాను.
తల వంచుకుని డెత్ సర్టిఫికెట్ తతంగం ముగిస్తున్నాను.
"సిస్టర్ ! బాడీని తీసుకుపోవచ్చా ?" అని ఎవరో అడుగుతున్నారు. తల ఎత్తి చూడలేదుగాని మరణించిన వ్యక్తికి కొడుకని తెలుస్తోంది.
"మీరు ఆదాయం నెలకు నూరు రూపాయల కన్న ఎక్కువ వ్రాశారండీ. డబ్బు కట్టి మరీ తీసుకు వెళ్ళాలి."
"ఎంత ?"
"ఏమేమి వాడామో చూసి చెబుతానుండండి."
సిస్టర్ ఏవో లెక్కలు వేసి రెండు నిమిషాల తర్వాత, "పద్దెనిమిది రూపాయలు అయింది" అంటోంది.
"ఎలా ? అంత డబ్బు తీసుకురాలేదే ?" అంటూ అతను, తికమక పడుతూ.
"లేకపోతే యింటికి వెళ్ళి తీసుకురండి. డబ్బు చెల్లించకుండా బాడీని జెప్పటానికి హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవు. తల ఎత్తి అతని వంక చూశాను, ఎర్రగా వున్న అతని కళ్ళు కర్తవ్యం తెలియక సందిగ్ధంతో అటూ యిటూ కదుల్తున్నాయి. కడకేదో నిశ్చయించుకుని తన తూలూకు మనుషుల దగ్గరకు పోయి ఏదో చెప్పి మళ్ళీ సిస్టర్ దగ్గరకు వచ్చి, "వాళ్ళిక్కడే వుంటారు. నేను పోయి డబ్బు తీసుకు వస్తాను" అని చెప్పి, కంగారుగా వెళ్ళిపోయాడు.
సిస్టర్ వెళ్ళి మరణించిన వ్యక్తి ముఖం మీదకు ఎర్రటి దుప్పటి కప్పేసి ప్రక్క పేషెంట్లకు యిబ్బందిలేకుండా మంచంచుట్టూ మూసేలాగా స్క్రీన్ అమర్చి నా దగ్గరకు వచ్చింది.
నేను లేచి నిలబడి, "వస్తాను సిస్టర్" అని కదలబోయాను.
"అప్పుడేనా ?" అన్నదామె, ముందుకు వచ్చి.
"అప్పుడేనా ?" అన్నాను నే నీరసంగా.
ఆమె నవ్వి, "అంత దిగులుగా కనిపిస్తున్నారేం ? ఆ మనిషి మరణం గురించి వెత చెందుతున్నారా? గవర్నమెంటు ఆసుపత్రిలో పని చేసే డాక్టర్లు ఎంత సున్నితంగా వుండకూడదు. మీరు డ్యూటీ మొదటి రోజు అనుకుంటా. అందుకని అట్లా కలతపడ్డారు. పోను పోనూ యివన్నీ ఎంత తేలిగ్గా తీసుకుంటారో చూడండి" అంది ,అనునయిస్తున్నట్లు.
నేను బలవంతాన నవ్వి "చాలా అలిసిపోయానండీ కాస్త విశ్రాంతి తీసుకుంటాను" అని బయల్దేరాను.
ఆమె వెనక నుండి, "నిజమే పాపం, చాలా అలిసిపోయినట్లే కనిపిస్తున్నారు. కొత్త ఎడ్మిషన్లేవీ లేకపోతే మిమ్మల్నిక ట్రబుల్ చెయ్యన్లెండి" అంటోందామె.
బయటకు వచ్చి పొడవైన ఆ వసారాలో ఒంటరిగా నడుస్తూంటే టైమెంతయిందో ననిపించింది. ఆ మందమైన విద్యుద్దీప కాంతిలో అప్పుడు చూసుకున్నాను, టైము. రెండు దాటిపోయింది.
ఇంత టైము ఎప్పుడు గడిచింది. ఎలా గడిచింది అనుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తున్నాను. ఆ సమయంలో నామీద నాకు ఆత్మవిశ్వాసం నశించిపోయినట్లూ, ఎందుకు పనికిరానివాణ్నిగా అయిపోయినట్లూ అనిపించింది. ఒకదాని వెంట మరొకటి మూడు చావులు ఎంత తేలికగా, అనుకోకుండా జరిగిపోయింది ! ఇవన్నీ చూస్తూ వుండటానికేనా నేను డ్యూటీ చేస్తున్నది ? లేకపోతే మరేమిటి ? ఈ విద్య అంతా వొట్టి మిథ్యయేనా ?
మెల్లగా డ్యూటీ రూమ్ చేరి, తలుపులు తెరిచేసరికి లోపల ఓ మంచం మీద మృదుల నిద్రపోతూ కనిపించింది. బాగా అలిసిపోయిన చిహ్నాలు కనిపిస్తున్నాయామె ముఖంలో. నిర్మలంగా, అమాయకంగా నిద్రపోతున్నది.
ఒక నిముషం ఆమె వంక తదేకంగా చూసి, తర్వాతి కుర్చీలో కూర్చుని బల్లమీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాను. తలంతా దిమ్ముగా వుండి, బరువుగా ముందుకు పడిపోతున్నట్లు అనిపిస్తూ, కళ్ళు భగభగమని మండిపోతున్నాయి.