Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 8


    ఆమె ఆశ్చర్యంగా  నా ముఖంలోకి  చూసింది. "మరీ అంత గంభీరంగా  మాట్లాడకు. నాకు భయమేస్తుంది. లోపలకు పోదాంరా" అంటూ చెయ్యి పట్టుకు లాగి, వెంటనే  వదిలేసింది.

    అడుగులు బరువుగా  పడుతున్నాయి. మా కిద్దరికీ  మా హాస్పటల్ సూపరింటెండెంట్ దయానందరాజు గారంటే  ఎనలేని గౌరవాభిమానలూ, భక్తీ వున్నాయి. ఆయన హృదయం నిష్కల్మషమైనదనీ, నిర్మలమైనదనీ మా అచంచల విశ్వాసం.

    ఎప్పుడూ నవ్వుతూ, ఛలోక్తులతో, సరదాగా  మాట్లాడుతూ, అందరితో చనువుగా  మసులుతూంటారు  దయానందరాజుగారు. ఆయన్ని కలుసుకున్నంత తేలిగ్గా  యీ భూమ్మీద మరో హోదాగల వ్యక్తిని కలుసుకోలేం. అంత సులభంగా లభ్యమౌతాడు.

    క్యాజుయాలిటీలో  డ్యూటీరూమ్ తాళంచెవి  తీసుకుని, ఆ చీకట్లో చెట్ల క్రిందుగా  నడిచి డ్యూటీరూమ్ చేరుకుని, తలుపు  తెరిచాక లైటు వెలిగించాను.

    గదిలో  రెండు బెడ్లు ,రెండు కుర్చీలు, ఒక బల్ల, అద్దం వగైరాలు వున్నాయి.

    "ఇది చాలా అన్యాయం" అన్నాను.

    "ఏది ?"

    "ఫిమేల్ హౌస్ సర్జన్ లకూ, మేల్ హౌస్ సర్జన్ లకూ  విడివిడిగా డ్యూటీరూమన్నా వుండాలి. లేకపోతే  యిద్దరు మొగవాళ్ళని మాత్రమే లేదా యిద్దరు ఆడవాళ్ళను మాత్రమే  ఒకే రోజు డ్యూటీ వచ్చేటట్లుగా  పోస్టుచేయాలి. అప్పుడు సరసంగా  వుంటుంది."

    "ఇప్పుడు సరసంగా  లేదా ?"

    వాడిగావున్న  యీ జవాబు  విని ఆమె ముఖంలోకి చూసి తల దించుకున్నాను.     

    మళ్ళీ అంది మృదుల, నవ్వుతూ,! "అలాంటి సందర్భం తటస్థించినప్పుడు ఆడపిల్లలు యిక్కడ పడుకుని, మొగపిల్లలు  ఏ వార్డులోనో, లేకపోతే స్టూడెంట్స్ సిక్ రూమ్ లోనూ గడుపుతున్నారని విన్నాను."

    "అయితే నేనూ అక్కడే  గడుపుతాను" అన్నాను, హఠాత్తుగా వెళ్ళడానికి  ఆయత్తపడుతూ.

    "ఆగవయ్యా మహానుభావా ! నీతో ఏ మాటన్నా  చిక్కేలాగుంది. అసలు జరిగే పద్ధతి అని చెప్పాను. మనం నిద్రపోయినప్పుడు కదా సమస్య ఉత్పన్నమయేది. రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ  కూర్చుంటాం. లేకపోతే   మెమోస్ అటెండ్ అవుతూవుంటాం" అని మృదుల లేచి అబ్బ ! ఉక్కగా  వుంది" అంటూ ఫ్యాన్ వేసివచ్చి  తిరిగి కుర్చీలో  కూర్చుంది.

    నేను మరో కుర్చీలో  కూర్చుని "సరే. నాకేం" అన్నాను.

    మరో అరగంట సేపలా ఏవో కబుర్లు  చెప్పుకుంటూనే  వున్నాం. మధ్యలో  ఎందుకో  తల పక్కకి త్రిప్పి బయటకు చూసేసరికి  ఎదురుగా  ఆఫ్ థాల్ మాలజీ  వార్డులో  కూర్చుని వున్న సిస్టర్ మాకేసి వింతగా  చూస్తూ వుండటం కనిపించింది.

    ఇంతలో  బయట  అడుగుల చప్పుడై, "అమ్మగారూ!" అన్న పిలుపు వినవచ్చింది.

    "అయ్యో ! నాకే" అని మృదుల  అనేలోపల గుమ్మందగ్గర  మెమో పుస్తకం పట్టుకుని ఓ ఆయా ప్రత్యక్షమయింది.

    "ఏమిటి ?" అని, మృదుల లేచివెళ్ళి ఆమె చేతిలోని  పుస్తకం  అందుకుని, "ఎపెండిసైటిస్ కేసట. ఎమర్జన్సీ ఆపరేషన్  అవసరమవుతుందేమో" అని సంతకం చేసి పుస్తకం  యిచ్చేసి "వస్తున్నానని చెప్పు" అంది ఆయాతో.

    "అదృష్టవంతురాలివి ,మొదటిరోజునే  ఆపరేషన్  అసిస్ట్  చేసే అవకాశం కొట్టేస్తున్నావు" అన్నాను, కొంచెం అసూయగా.

    "ఊ. అదృష్టం. ఒక్కడివే కూర్చుని  ఏంచేస్తావు ? సాయం రాకూడదూ ?" అనడిగింది జాలిగా.      వీలైతే కాస్త విశ్రాంతి తీసుకుంటే  బాగుండునని  నాకు వుందిగాని, ఆమె మాటను కాదనలేక "సరే" అంటూ లేచి నిలబడ్డాను. తలుపులు దగ్గరకు  జారవేసి  స్టెతస్కోపులు మెడలచుట్టు  వేసుకుని నడుస్తున్నాం.

    పదిగజాలైనా నడిచామో  లేదో  ఓ వార్డుబోయ్  ఎదురుగా  వచ్చి "సార్! మెడికల్ సైడ్ డ్యూటీ మీదేనా ?" అనడిగాడు.

    "అవును."

    "భూతం వచ్చాడు. భూతం వచ్చాడు" అని గొణుగుతోంది  మృదుల చిన్నగా.

    "కేసొచ్చింది  సార్ !"

    పుస్తకం  అందుకుని, సంతకం పెట్టి, "వస్తున్నాను. పద" అన్నాను. ఒక్కరోజులోనే  ప్రొసీజర్ అంతా అర్ధమయిపోయినట్లు  తోచింది.

    "సారీ మృదులా !" అని అంటూండగానే  ఆమె కోపంగా  ఓ చూపు చూసి "ఇందులో  సారీ ఎందుకు ? మన మిద్దరం  ప్రజాసేవ చేస్తున్నాం" అంటూ గబగబ అడుగులు వేస్తూ  అక్కడినించి  వెళ్ళిపోయింది.

    "మృదులా   ఆగు ! నేను  వచ్చేదీ  అటువైపేగా" అంటున్నా వినిపించుకోలేదు.

    ఒక్క నిట్టూర్పు విడిచి  నెమ్మదిగా  నడవసాగాను, వసారాలోకి  వచ్చేసరికి  ఆమె మెట్లు ఎక్కి  పైకి  వెళ్ళిపోవటం  కనిపించింది.

    వార్డుకి వెళ్ళేసరికి  సిస్టర్  ఎదురుగా వచ్చి, "త్వరగారండి  డాక్టర్! హార్ట్ కేసులా  వుంది. చాలా బాధపడుతున్నాడు  పేషెంటు" అంది.

    నేను రోగిని  సమీపించాను. యాభయి  అయిదేళ్ళుంటాయి. బలంగా, భారీగా  వున్నాడు. బట్టతల, మనిషిలో హుందాతనం కొట్టవచ్చినట్లు  కనిపిస్తోంది. ఆయన్తో  వచ్చినట్లున్న  యిద్దరు  మనుషుల్లో  ఒకతను కొడుకులా  కనిపిస్తున్నాడు.

    డాక్టర్, వచ్చారా? ఈ బాధ భరించలేను  నొప్పి. గుండెల్లోంచి  భుజంలోకి  దూసుకు వస్తున్నది అబ్బా ! రానురానూ  తీవ్రమైపోతున్నది డాక్టర్."

    అతను ధైర్యంగా  ఎంత  బాధను  అణచుకుంటున్నదీ  అతని ముఖం చూస్తే  తెలుస్తున్నది  పల్సు  చూశాను. వడివడిగా, పలుచగా  కొట్టుకుంటున్నది. వళ్ళంతా  చెమట  ముద్దలా  అయిపోతున్నది.

    "ఏమిట  చూస్తున్నారు డాక్టర్ ! నేను చెబుతాను  వినండి. నాది గుండె జబ్బు. రెండేళ్ళక్రితం  మొదటిసారి  హార్ట్  ఎటాక్ వచ్చింది. ఆరునెలల  క్రితం  రెండోసారి  వచ్చింది. అప్పుడు బ్రతకనన్నారు డాక్టర్లు. కాని  రోగాన్ని  అదిమేశాను. ఇప్పుడు మళ్ళీ  నా మీదకు దూకింది  డాక్టర్! ఈసారి యీ  బెబ్బులిని  జయించటానికి శక్తి చాలటంలేదు. నాది గుండెజబ్బు  మయోకార్డియల్  యిన్ ఫార్ క్షన్. అబ్బా ! గుండె నలిపేస్తున్నది డాక్టర్, కళ్ళముందు  చీకటిలా  క్రమ్ముకు వస్తున్నది. చూస్తారేం ? ఒక పెథిడిన్  పొడిచెయ్యండి. ఊ, త్వరగా, ఈ నొప్పి భరించలేకుండా  వున్నాను."

    ఏం చెయ్యాలో  తెలియక  కంగారుపడుతున్న  నాకు  అతనే  మార్గం చూపించాడు. వెంటనే  సిస్టర్ని  పిలిచి  "పెథిడిన్  హండ్రెడ్  మిల్లీగ్రామ్స్ తీసుకుర"మ్మని  చెప్పాడు.

    "నో నో డాక్టర్, వంద  ఏ మూలకి ? నాకు  రవ్వంత కూడా పని చెయ్యదు, టూ హండ్రెడ్  యివ్వండి ప్లీజ్."

    "వద్దు. అంత యివ్వకూడదు, ప్రమాదం" అన్నాను.

    "ప్రమాదం, యింతకన్నా  ఏమిప్రమాదం  చేస్తుంది  డాక్టర్ ? నా బాధ మీకు తెలియదు."

    "మీరు అనవసరంగా  గాభరాపడుతున్నారు. ఇప్పుడిచ్చే  యింజక్షన్ తో  నొప్పి తగ్గి  హాయిగా  నిద్రపడుతుంది."

    "గాభరానా ? నాకు గాభరానా ?" అన్నాడు. ఇంతలో  సిస్టర్ యింజక్షన్  తీసుకువచ్చింది. చేశాక  అతను నా చెయ్యి పట్టుకుని, "డాక్టర్! ఒకమాట" అన్నాడు.

    "ఏమిటి ?"

    "ఒక సిగరెట్ కాల్చుకుంటాను, షెర్మిష  నివ్వండి."

    "నో, నో, అది చాలా తప్పు. ఇప్పుడు  మీరున్న  స్థితిలో  సిగరెట్టు కాల్చకూడదు."

    "అదేమిటి డాక్టర్ ! అలా అంటారు ? బ్రతికి  వుండాలని  నా నుదుటిమీద వ్రాసివుంటే  ఒక్క సిగరెట్టు నా ప్రాణాలను  తీస్తుందా ? ప్లీజ్ ! ఒక్క సిగరెట్టు"

    నేను అతని  చెయ్యి మెల్లగా  విదిలించుకుని, "మీరలా  మంకుపట్టు పడితే  నేను మరింత  గట్టిగా  చెప్పవలసి వస్తుంది" అని  "మీరు మాట్లాడకుండా  రెస్టు  తీసుకోండి. ఇప్పుడే వస్తాను" అని యివతలకు వచ్చాను.

    "నేనందుకే  హాస్పటల్ లో  ఎడ్మిట్  కానన్నాను. మన మాట సాగుతుందా ఏమన్నానా ?" అని తన మనుష్యులమీద  విసుక్కోవటం  వినిపించింది.

    వెళ్ళి కుర్చీలో  కూర్చునేసరికి  "అసిస్టెంట్ కి మెమో  వ్రాస్తారా ?" అంటూ సిస్టర్ పుస్తకం  అందిచ్చింది.

    కేసు  వివరాలు  ఆయనకు  తెలిసేటట్లు  వ్రాస్తూ, "రోజూ రాత్రుళ్ళు  యిలా  ఎద్మిషన్లు  వుంటూనే వుంటాయా ?" అనడిగాను  యధాలాపంగా.

    "ఒక్కోరోజు  వుండదండీ  ఈరోజు మీరు డ్యూటీ  చేస్తూన్నారని  చాలా ఎడ్మిషన్లు  వున్నట్లే  కనిపిస్తుంది _ వాలకం చూస్తూంటే."

    ఆమె చనువుకు  ఆశ్చర్యపోతూ  తలెత్తి  చూశాను. కనిపించీ కనిపించనట్లు  చిరునవ్వు కనిపించింది  ఆమె పెదవులపై.

    బయటకుమాత్రం  ఏమీ  పట్టించుకోనట్లు  వార్డుబాయ్ ని పిలిచి, డాక్టర్ రామదాసుగారికి  మెమో  పుస్తకం  చూపించిరమ్మని  చెప్పాను.

    వార్డులో  పేషెంట్లు  కొంతమంది  నిద్రపోతున్నారు. కొంతమంది ప్రక్కవాళ్ళతో  బాతాఖానీ  కొడ్తున్నారు. కొంతమంది  బాధలో  మూలుగుతున్నారు. కొంతమంది సిస్టర్ని  పిలిచి  వాళ్ళ  మొర  ఆలకించమని   గోడు చెప్పుకుంటున్నారు. కొంతమంది  ఎవరో, ఎవరి  కోసమో  తెలియకుండా  వసారాలో అటూ ఇటూ  తిరుగుతున్నారు.

                                *    *    *

 Previous Page Next Page