Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 9


    ఆ యువకుడు అంతటితో వదలలేదు.
    "మీకు తలనొప్పి అప్పుడు మాత్రమే వచ్చిందా? మొదటనుంచీ లేదా?"   
    "మొదటి నుంచీ అప్పుడప్పుడు వస్తూ ఉండేది."
    "మచ్చల డాక్టర్ మందుతో పూర్తిగా తగ్గిపోయిందా?"
    "ఇప్పుడు రావటం లేదు మరి...."
    "థేంక్యూ! మీకు ఇబ్బంది కలిగించినట్లున్నాను."
    "ఫరవాలేదు లెండి."
    జ్యోత్స్న మళ్ళీ ఒకసారి మచ్చల డాక్టర్ ముఖంలోకి చూసింది. ఆ ముఖం వెయ్యి ఓల్టుల బల్బ్ లా వెలిగిపోతోంది.  
    ఆ యువకుడు మందు పనిచేసిందో, లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో కంటె, తనతో మాట్లాడాలనే సరదాతోటి, తన దగ్గిరకి వచ్చాడని జ్యోత్స్నకి తెలుసు. ఒక నిట్టూర్పు విడిచి లోపలకు వచ్చి తలుపు వేసేసుకుంది.   
    ఆ మరునాడు మళ్ళీ యధాప్రకారం సుశీల నల్లా బంద్ చెయ్యలేదు. ఈసారి సుశీలను అసలు అడగదలచుకోలేదు జ్యోత్స్న.
    బకెట్ పుచ్చుకుని క్రిందకు దిగబోతుంటే, అది చూసిన మచ్చల డాక్టర్ అడ్డుపడి "ఇదేమిటీ? మీరు క్రింద నుంచి నీళ్ళు తెచ్చుకోవటమేమిటి? పోనీ మా ఇంట్లోంచి తీసికెళ్ళండి" అన్నాడు.  
    "వద్దులెండి" అంది జ్యోత్స్న మొహమాటంగా.
    "మా యింట్లో ఇంకెవరూ లేరని సంకోచపడుతున్నారా?" అన్నాడు మచ్చల డాక్టర్.
    అతడంత స్పష్టంగా అలా మాట్లాడటం ఎలాగో అనిపించింది జ్యోత్స్నకి. ఏమీ సమాధానం చెప్పలేదు.
    "పోనీ నేను తెచ్చిపెడతాను ఇవ్వండి" అని స్వతంత్రంగా బకెట్ అందుకోబోయాడు.
    "వద్దు! వద్దు!" అంది కఠినంగా.
    ఆ కఠిన స్వరానికి తగ్గిపోయి "అయినా క్రిందవాళ్ళు నల్లా బంద్ చెయ్యకుండా ఉంటే ఎలా? ఇది ఒకరోజుతో సమస్యా. మనం మాత్రం అద్దె కట్టుకోవటం లేదూ! నేను భాస్కర్ ని అడిగివస్తా నుండండి - అంటూ క్రిందకు దిగాడు.
    'ఇది ఒకరోజు సమస్యా?' అన్నది జ్యోత్స్నని కూడా ఆలోచనలో పడేసింది. ప్రతిరోజూ తను మాజీ తహసీల్దారుగారి ఇంట్లో నీళ్ళు మోసుకుని తెచ్చుకోవాలంటే కష్టం కదూ? బకెట్ చేత్తో పట్టుకుని మెట్ల దగ్గిరే నిలబడిపోయింది.
    తలుపు తట్టి "భాస్కర్" అని పిలిచాడు మచ్చల డాక్టర్ భాస్కర్ బయటికొచ్చాడు.
    "మీరు నల్లా బంద్ చెయ్యకపోతే పైన నీళ్ళు రావటం లేదు ప్రతిరోజూ ఇలా అయితే ఎలా?"
    భాస్కర్ ఏ సమాధానమైనా చెప్పేలోపుగానే లోపల నుంచి రుసరుసలాడుతూ సుశీల వచ్చేసింది.
    "మేం నల్లా బంద్ చెయ్యకపోతే మీకేం నష్టమండి" కసురుకుంది.
    "నాకు కాదు - పాపం, జ్యోత్స్న గారు చాలు అవస్థ పడుతున్నారు!"
    "అయ్యో! పాపం! ఆవిడ తరపున మిమ్మల్నెవరు వంత పుచ్చుకోమన్నారు? ఆవిడకూ, మీకూ ఏం సంబంధం?"   
    గతుక్కుమన్నాను భాస్కర్. అప్రయత్నంగా అతని చూపులు మెట్ల మీద నిలిచిన జ్యోత్స్న మీద పడ్డాయి. పాలిపోయిన ఆవిడ ముఖం చూడగానే సుశీల మీద ఎన్నడూ కలగనంత అసహ్యం కలిగింది.  
    మచ్చల డాక్టర్ సుశీలను చీదరించుకుంటూ "నాకూ ఆవిడకూ సంబంధమా? ఆవిడకేం కర్మకాలిందండీ, నాతో సంబంధం పెట్టుకోవడానికి? మీలా కళ్ళు సరిగా కనపడని వాళ్ళెవరైనా పెట్టుకోవాలి నాతో సంబంధం?" అనేశాడు - అనేసి భాస్కర్ ఏమంటాడో నన్నట్టు భయంగా చూశాడు.
    భాస్కర్ ఏమీ అనలేదు. తనకు ఏదీ పట్టనట్లు ఇంటిమీద వ్రాసి ఉన్న 'ఆనంద నిలయం' అన్న అక్షరాలు చూస్తూ నిలబడ్డాడు.
    జ్యోత్స్న గతుక్కుమంది. ఎలాంటివారు ఈ మచ్చల డాక్టర్? తనను తాను హీనపరుచుకోటానికైనా సిద్ధపడి తన మర్యాదను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడు!
    సుశీల మాత్రం పిచ్చిదయిపోయింది, గట్టిగా అరుస్తూ "ఎంత మాటన్నావురా! ఇలాంటి వెధవ బుద్ధులుండబట్టే నీ డాక్టర్ గిరీ అలా తగలబడింది. మచ్చల డాక్టర్ కి మచ్చలే తప్ప డాక్టర్ గిరీ లేదని అందరికీ తెలుసు" అనేసింది.    
    ఏ విషయం అంటే తనకు మనసు క్షోభించిపోతుందో, ఆ విషయమే ఎత్తిపొడిచే సరికి, సహజంగా సాత్వికుడయిన మచ్చల డాక్టర్ కీ ఎంతో కోపం వచ్చేసింది.
    "ఈ లోకంలో బుద్ధులబట్టే అదృష్టం ఉండే మాట నిజమే. అయితే, నా మచ్చల సంగతి ఏమో కానీ, నీ కా కాస్త చూపు కూడా ఉండదు" అన్నాడు.
    సుశీల ఘొల్లుమంది. ఎందుకంటే, ఈ మధ్య లావుపాటి కళ్ళద్దాలలోంచి చూపు సరిగ్గా ఆనటంలేదు.
    ఇదంతా ఎదుటి గుమ్మంలోంచి చూస్తోంది రేవతి. ఆవిడ ప్రత్యేకించి 'ఉమన్ లిబ్' కోసం కృషి చేస్తోంది.
    "దారుణమైన అన్యాయం! తన భార్యని ఇలా అవమానిస్తున్నా పురుషుడు పట్టించుకోవటంలేదు. ఈనాటి యువతి ఇలాంటి అవమానాన్ని సహించరు!" అంది.
    రేవతిని చూస్తే చాలా అసహ్యం మచ్చల డాక్టర్ కి. తనేదో అందరికంటే చాలా గొప్పదానినన్నట్లు తప్ప మాట్లాడదు....  
    "ఈనాటి యువతి అంటే ఎవరు? సాటి ఆడదానికి అయినా దొరక్కుండా ఏడిపించే వ్యక్తా? ఒంటరిగా ఉంటున్న ఆడదాన్ని పరమనీచంగా మాట్లాడడానికి సంకోచించిన వ్యక్తా? వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళూ, ఉన్నవీ, లేనివీ కల్పించి చెప్పుకుని రాద్ధాంతాలు చేసుకునే వ్యక్తులా?- చెప్పండి! ఈనాటి యువతి?"

 Previous Page Next Page