Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 10


    మచ్చల డాక్టర్ ఇలా మాట్లాడేసరికి రేవతి సమాధానం చెప్పలేక ఉడుక్కుని "ఛీ! ఈ మచ్చల డాక్టర్ తో నాకు మాటలేమిటీ అని లోపలకు వెళ్ళిపోయింది.
    చుట్టూ చూసి మూర్ఖుడిలా పైకి చూశాడు మచ్చల డాక్టర్ బొమ్మలా నిలబడి అంతా చూస్తోంది జ్యోత్స్న,   
    దురదృష్టవశాత్తూ ముఖం మీద మచ్చలు ఏర్పడి ముఖం వికారంగా తయారయినంత మాత్రాన ఆ దురదృష్టాన్నే అతనిని గాయపరచటానికి ఒక ఆయుధంగా వాడుకునే ఆ వ్యక్తులందరి మీదా విపరీతమైన జుగుప్స కలిగింది జ్యోత్స్నకి.... ఆ క్రౌర్యానికి గురైపోతున్న మచ్చల డాక్టర్ మీద జాలి కలిగింది.
    "ఏకాంబరంగారూ! పోనీ, మీరే మీ యింట్లోంచి కాసిని నీళ్ళు తెచ్చి పెట్టండి. ఎందుకొచ్చిన గొడవ" అంది....
    మచ్చల డాక్టర్ "ఓ యస్." అంటూ పట్టరాని సంతోషంతో జ్యోత్స్న చేతిలో బకెట్ అందుకున్నాడు.  
                                          5
    ఎప్పటిలా చెరువు గట్టున పచ్చికలో కూచుని సూర్యాస్తమయాన్ని చూస్తోంది జ్యోత్స్న.
    భాస్కర్ వచ్చి జ్యోత్స్నకి కొంచెం దూరంగా కూచుని "ఇవాళ మీ కోసమే వచ్చాను" అన్నాడు.
    జ్యోత్స్న నవ్వింది. ఆ రోజు భాస్కర్ తనతో మాట్లాడిన తరువాత ఆ మరునాడే అతడు తనకోసం వస్తాడనుకుంది. అతను రాలేదు. రానందుకు కొంచెం ఆశాభంగం కలిగింది.
    తన మనసులో కలిగే ఈ సంచలనానికి తనమీద తనే చిరాకు పడింది. భాస్కర్ పట్ల గౌరవం పెరిగింది. ఆ తరువాత కూడా అతడు రాకపోగా. జ్యోత్స్న మనసు అదుపుతప్పి అతని రాకకోసం నిరీక్షించ సాగింది.   
    ఆ రోజు భాస్కర్ రాగానే - వచ్చి 'మీకోసమే వచ్చాను' అనగానే - జ్యోత్స్న సార్థక నామదేయురాలే అయింది.
    "మీరిక్కడ ఉంటారని తెలుసు. రోజూ రావాలనే అనిపించేది. అతి ప్రయత్నంమీద నిగ్రహించుకునేవాడిని. కానీ, ఇవాళ.... ప్రొద్దున్న అంత జరిగాక.... మిమ్మల్ని క్షమాపణలు కోరుకోకుండా ఉండడం నాతరం కాలేదు...."
    అత్యంత మధురంగా వినిపిస్తున్నాయి భాస్కర్ మాటలు జ్యోత్స్నకి.
    ప్రసన్నమైన చిరునవ్వుతో "మీరెందుకు నన్ను క్షమాపణలు కోరుకోవటం?" అంది.
    "నా కళ్ళముందు మీకంత అవమానం జరుగుతున్నా, ఏమి చెయ్యలేని అసమర్థుణ్ణయినందుకు.... నిజానికి నా మనసు ఎలా రగిలిపోతోందో మీకు వివరించలేను. కానీ, ఏం చెయ్యగలను నేను? ఆ క్షణంలో నేను ఏమైనా అన్నానంటే నా భార్య మరీ విజృంభిస్తుంది. ఇక ఆ నోటికి హద్దూ పద్దూ ఉండదు. ఎంతమాటంటే అంతమాట అనేస్తుంది. మంచీ మర్యాదా మరిచి, ఔదార్యం వదిలేసి, - నోటి కొచ్చినట్లు వాగేవాళ్ళకి ఎవరు సమాధానం చెప్పగలరు? ఇక చెయ్యి చేసుకోవాలి. ఆ పశుత్వపు స్థాయికి దిగజారలేను. ఒకవేళ దిగజారినా ఫలితముండదు - ఆవిడ తన తప్పు ఒప్పుకోదు సరిగదా, సంసారాన్ని వీధిన పడేస్తుంది - ఇక ఒక్కటే మార్గం. విడిపోవాలి! కానీ నాకా మార్గం కూడా మూసుకుపోయింది. నాకు చదువు చెప్పించే షరతు మీద పెళ్లి చేసుకున్నాను, ఈవిడని చిన్నతనంలోనే.... నా దయవల్ల, చదువుకుని, నా దయవల్ల ఉద్యోగంలో చేరి - ఇప్పుడు నన్నొదిలేస్తావా? అని నిలేస్తుంది - నా అంతరాత్మ కూడా ఆవిడ పక్షమే నిలబడి నాకు ఊపిరాడనివ్వదు. లోకంలో ఏ మొగవాడైనా పరాయివాడు తన భార్యను మాటలంటే భరించగలడా? కాని - నిజం చెపుతున్నాను. ఇవాళ మచ్చల డాక్టర్ సుశీలని తిడుతోంటే నా ప్రాణానికి హాయిగా అనిపించింది-"
    'అర్థం చేసుకోరూ!' అన్నట్లు జాలిగా చూశాడు భాస్కర్.
    అలా జాలిగా చూస్తోన్న భాస్కర్ పసిపిల్లవాడిలా తోచాడు జ్యోత్స్నకి - దగ్గిరకి తీసుకుని అనునయించి, అతని అశాంతి నుండి తనూ మరిపించాలనిపించింది - ఈ యువకునికి అందముంది - చదువుంది - ఉద్యోగముంది - కానీ జీవితంలో సుఖమేది? జీవితంలో అశాంతి అసౌఖ్యమూ ఆడవాళ్ళకేననుకుంటోంది! పాపం. భాస్కర్ లా నలిగిపోతున్న యువకులు కూడా ఉన్నారన్నమాట!    
    "ఆవిడకు నెమ్మదిగా నచ్చజెప్పటానికి ప్రయత్నించకపోయారా?"
    "ఓ విధంగా కాదు - చాలా చాలా విధాలుగా ప్రయత్నించాను. కానీ, లోకంలో ఏం చేస్తే ఆవిడకి సంతోషం కలుగుతుందో మాత్రం ఈనాటికీ గ్రహించలేకపోయాను - కావాలంటే పందెం వేస్తాను - మీరు ఆవిడకి ఎంతమంచి అయినా చెయ్యండి తన అసాధారణ చాతుర్యంతో అదంతా ఆవిడ చెడుగా వ్యాఖ్యానించగలదు - ఆవిడకు మంచి చెయ్యబోయినందుకు మీరు పశ్చాత్తాప పడేలాగ చెయ్యగలదు-"      
    అలా మాట్లాడుతున్న భాస్కర్ ని చూసి జాలిపడటం కంటే, ఏం చెయ్యగలదు జ్యోత్స్న.
    భాస్కర్ కొంచెం సేపు తటపటాయించి "మీతో కబుర్లు చెపుతోంటే నా ప్రాణానికి చాలా హాయిగా ఉంది - కానీ, నాకారణంగా పెళ్ళి కావలసిన మీరు నిందల పాలవుతారేమోనని భయపడుతున్నాను-" అన్నాడు -

 Previous Page Next Page