Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 8


    అతని ముఖంలో ఎంతో అలసట, భరించరాని విసుగూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడు చెరువులో నీళ్ళను చూడటం లేదు. ఆ నీళ్ళలో ప్రతిఫలించే సూర్యకాంతుల్నీ చూడటం లేదు. ఆ మాటకొస్తే దేనినీ చూడటం లేదు. ఎక్కడికో పారిపోవాలని ఆరాటపడుతున్న వాడిలా ఉన్నాడు. జ్యోత్స్న వచ్చింది కూడా గమనించలేదు.   
    తనను చూసీ చూడగానే ఆకొన్న మృగాలలా చూపులతో తనను కబళించే మొగాళ్లనే చూసింది జ్యోత్స్న. ఎలాగైనా తనతో మాట్లాడాలని తాపత్రయపడే వాళ్లనే చూసింది. కానీ తన ఉనికిని కూడా గమనించకుండా ఆలోచనలో పడిన వాళ్ళను చూడటం అదే మొదటిసారి.    
    అతడు తనను చూడటం లేదని నిర్ధారించుకున్నాక అతణ్ణి పరిశీలనగా చూసింది. నిండైన విగ్రహం - చామనచాయ అయినా కళగల ముఖం. జుట్టు సరిగా దువ్వుకోక పోవటంవల్ల చిందరవందరగా ముఖం మీద పడుతోంది. అయినా అదీ ఒక అందంగానే ఉంది. కళ్ళు కాంతిమంతమైనవే. చురుగ్గా ఉన్నాయి, కానీ చాలా అలసటగా ఉన్నాయి.     
    ఆ క్షణంలో అతణ్ణి చూస్తోంటే చాలా జాలి కలిగింది. అప్పటి వరకు ఎన్నడూ చేయనిపని.... తనంతట తాను.... ఒక మొగాణ్ణి పలకరించింది.    
    "భాస్కర్ గారూ!" అంటూ దగ్గరగా వచ్చింది.
    "మీరా!" అంటూ ఆశ్చర్యపోయాడు భాస్కర్.
    "మీరు ఇక్కడికి వస్తారా!" అన్నాడు.
    "మీరు.... అంటే! నేను రోజూ వస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఇవాళ చూస్తున్నాను...."
    "రోజూ వస్తారా! దేనికి!"
    "భలే ప్రశ్న - మీ రెందు కొచ్చారు!"        
    "నా మనసు చికాగ్గా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తాను, మీరెందుకు వస్తున్నారు!"
    "ఏకాంతంలో దొరిగే ఆనందాన్ని సృష్టి సౌందర్యంలో అనుభవించడానికి...."
    "నేను ఒంటరినని బాధపడుతున్నాను. మీరు ఏకాంతంలో ఆనందం ఉందంటున్నారు!...."
    "ఒంటరి కాని వాళ్ళెవరు! ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా మానవుడెప్పుడూ ఒంటరిగానే ఉంటాడు...."     
    "ఇది నిజమా! ఈ రకమైన భావన నా కొక్కడికే అనుకుంటున్నాను...."  
    "మనం మనకొక్కరికే అనుకుంటున్న అనేక భావాలు అందరును కొక్కరికే అనుకుంటూ ఉంటారు, లోలోపల...."  
    "కానీ, అందరూ తోడుకోసం తాపత్రయపడుతూ ఉంటారు సుమా!"
    "అవును. ఏనాటికైనా తనకు తానే తోడు అని అర్థం చేసుకోలేక...."
    "మీ మాటలు చిత్రంగా ఉన్నాయి."
    "మాట్లాడకండి- ఆ సూర్యాస్తమయాన్ని చూడండి. ఆ కాంతులు నీళ్ళలో ప్రతిఫలిస్తున్నప్పటి అందాలు చూడండి."    
    ఇద్దరూ కొన్ని క్షణాలు మాట్లాడలేదు.
    అతడు నిట్టూర్చి "నిజంగా చాలా అందంగా ఉంది. చిత్రం మీరు అనేంత వరకూ ఇంత అందాన్ని నేనేనాడూ చూడలేదు" అన్నాడు.
    కొన్ని విషయాలింతే! మన కళ్ళ కెదురుగానే ఉన్నా - మరొకరు తమంత తాము చూడగలిగిన వాళ్ళు.... చూపించే వరకూ చూడరు.   
    మనంతట మనం ఎందుకు చూడలేమూ?"
    "చూడగలం ప్రయత్నిస్తే. కానీ ప్రయత్నించం. మరొకరు చూపించినప్పుడు చూస్తే వాళ్ళ దృక్పథంలోంచే మనమూ చూస్తున్నాం. మనంతట మనమే చూస్తే అనేక కోణాలలోంచి, అనేక విధమైన అందాలు అనేక రకాలుగా కనిపిస్తాయి. ఆలోచించిన కొద్దీ చేసుకోవలసినది మిగిలిపోతూనే ఉంటుంది."     
    'చిత్రమైన వ్యక్తి, చాలా తెలివిగా మాట్లాడుతోంది' అనుకున్నాడు భాస్కర్.
    'నా జీవితంలో మొదటిసారిగా స్వచ్చమైన స్నేహ భావం ఒక యువకుడితో మాట్లాడగలిగాను' అనుకుంది జ్యోత్స్న.
    చీకటిపడడంతో ఇద్దరూ లేచారు.
    భాస్కర్ తటపటాయిస్తూ "నేను సైకిల్ మీద వచ్చాను అన్నాడు.
    జ్యోత్స్న నవ్వి "నేను బస్ లో వెళ్తాను" అంది.
    బస్ లో కూచున్న జ్యోత్స్న "ఇతనితో నేను స్నేహం చేస్తే అందుకు పశ్చాత్తాప పడవలసిన అవసరం రాదు" అనుకుంది....  
    కాలింగ్ బెల్ విని తలుపు తీసిన జ్యోత్స్న తన ఎదుట హిప్పీ స్టయిల్ లో ఉన్న అపరిచిత యువకుణ్ణి చూసి తెల్లబోయింది.
    అతడు వెకిలిగా నవ్వుతూ, "ఎక్స్ క్యూస్ మీ మేడం! విపరీతంగా వచ్చిన తలనొప్పి ఈ మచ్చల డాక్టర్ ఇచ్చిన మందు తగ్గిపోయిన మాట నిజమేనా?" అన్నాడు.
    ఆశ్చర్యపోతూ చూసిన జ్యోత్స్నకి ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదు. ఊపిరి బిగబట్టి తన సమాధానం కోసం నిరీక్షిస్తోన్నట్టు కనిపించాడు. జ్యోత్స్నకి అర్థమయింది. తన మనసులోని మాటను చెప్పటానికి  ఒక అడ్వర్ టైజ్ మెంట్ సాధనంగా ఉపయోగించుకుంటున్నాడు. ముందు వల్లమాలిన కోపం వచ్చింది. తరవాత అతని ముఖం చూసి జాలివేసింది.
    "అవును" అంది ఆ హిప్పీ.                    

 Previous Page Next Page