Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 9


    "శ్రమలేదు. నువ్వు మాఇంటికి రావడమే భాగ్యం. నీకోసం అంత చెయ్యలేనా?" మనసారా అంది.
    ఆవిడ ప్లేట్ లో పెట్టినవన్నీ తిన్నాడు వివేక్!. యశోదకే ఆశ్చర్యం కలిగింది. అంత తింటున్నందుకు ! పార్వతి ఆనంద భాష్పాలతో మురిసిపోతూ చూసుకుంది కాబోయే అల్లుడిని! అవన్నీ తినటమేకాక పార్వతి ఇచ్చిన కాఫీ కూడా తాగాడు.

    "ఇంక వెళ్ళొస్తానండి" అని లేచాడు.
    "అప్పుడప్పుడు వస్తూండు బాబూ!" అంది పార్వతమ్మ అభిమానంగా.
    "తప్పకుండా వొస్తానండీ!" మర్యాదగా సిన్సియర్ గా చెప్పాడు.
    అతడితో కాంపౌండ్ గేటు వరకూ వచ్చింది యశోద.
    "ఇక్కడికి దగ్గరలో డాక్టర్ ఎవరన్నా ఉంటే చెప్పగలరా?" అడిగాడు ఇబ్బందిగా ముఖంపెట్టి.
    "ఏం ఏమయింది?" కంగారుగా అడిగింది.
    "ఏంలేదు! కడుపులో ఇంత బరువు మొయ్య లేకుండా ఉన్నాను. వెంటనే ఎనీమా తీసుకోవాలి. లేదా వాంతులవ్వటానికి మందు తీసుకోవాలి!"

    నవ్వింది.
    "మరీ అంత కడుపు బరువెక్కేలా ఎందుకు తిన్నారు? కొంచెం రుచి చూసి వదిలేస్తే పోయేది కదా!"
    "ఆవిడ ఎంతో అభిమానంతో నాకోసం ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు తయారు చేశారు. అవన్నీ నేను తింటే ఆవిడకు ఎంత తృప్తి కలుగుతుందో నాకు తెలుసు. పొట్ట ఖాళీ చేసుకొనేందుకు లక్ష మార్గాలు ఉన్నాయి.

    కళ్ళు విప్పార్చి చూసింది యశోద. అంతకు ముందు ఆమె మనసులో అతడంటే కలిగిన గౌరవం రెట్టింపయింది. బయటికి వచ్చి కాంపౌండ్ గేటు మూసి "పదండి!" అంది.
    "మీ టి.వి.యస్. ఏదీ?"
    "ఉంది లోపల! ఇప్పుడెందుకది? నేను మీ మోటార్ సైకిల్ మీద కూర్చోగలను."  

    కొన్ని సెకన్లు అతను ఏమి మాట్లాడలేదు. జేబు రుమాలు తీసుకుని మొహంతుడుచుకున్నాడు.
    "ఒద్దు! టి.వి.యస్. మీదేరండి!"   
    యశోద హర్ట్ అయింది. ముఖం పాలిపోయింది.
    అతడి ముందు నిలబడకుండా వెనక్కి తిరిగి లోపలికి పోవాలనిపించింది.
    "ప్లీజ్! అలా అయిపోకు. నా మోటార్ సైకిల్ మీద ఎందుకు రావద్దన్నానో నీకు సాయంత్రం చెపుతాను. క్లాసులు అయిపోయాక హోటల్ సంపూర్ణాలో కూర్చుందాం. వొస్తారా!"
    "వస్తాను!" వెంటనే ఒప్పుకుంది.
    వివేక్ హోటల్ కి ఆహ్వానించడం చాలా అపురూపమైన విషయం. ఈ అవకాశం వదులుకుంటే మళ్ళా రాకపోవచ్చు.
    రెండు వీధుల అవతల డాక్టర్ జగన్నాధ్ ఉన్నాడు. అతడి ఇల్లుకం...డిస్పెన్సరీ చూపించింది. వివేక్ నిజంగానే డాక్టర్ దగ్గరకి వెళ్ళడం చూసి జాలి పడింది. వచ్చే వరకూ ఉందామనుకుని అభిమానం అడ్డొచ్చి టి.వి.యస్. మీద కాలేజీకి బయలుదేరింది.
    సాయంత్రం ఎప్పుడవుతుందా అని పగలంతా గడియారం చూస్తూనే గడిపింది యశోద. ఆఖరుకు క్లాసు కాగానే పుస్తకాలు లెదర్ బేగ్ లో వేసుకుని స్కూటర్ స్టాండ్ వైపు నడుస్తోన్న యశోదకి వెనకాల నుంచి కారు హారన్ వినిపించింది. ఆగి చూసింది. అది జానీకారు. అయితే డ్రైవర్ సీట్లో జానీ లేడు. ఎవరో డ్రైవర్ ఉన్నాడు. జానీ వెనుక సీట్లో జారగిలబడి ఉన్నాడు. అతడి ఎడమ కన్నుబాగా ఉబ్బి ఉంది. కమిలిన నలుపు కాళ్ళ చుట్టూ అలాగే ఉంది. కుడి చేయిలేపలేకపోతున్నాడు. కూచున్నాడు గనక కాళ్ళు ఎలా ఉన్నాయో తెలియటంలేదు.
    జాలి కలిగింది యశోదకి. అతడు చేసింది చిన్న తప్పు. శిక్ష బాగా పెద్దది అనుభవిస్తున్నాడు అతను. పాపం ! వివేక్ అంతలాకొడతాడని ఊహించలేదు.

    "యశోదగారూ!" అని కార్లో కూచునే పిలిచాడు. మామూలుగా అయితే ఈపాటికి కారుదిగి ఈలవేసి ఉండేవాడు. కాళ్లకి బాగా దెబ్బలు తగిలాయన్నమాట.
    "చూశారా! లేచి నిలబడలేకపోతున్నాను. న్యాయంగా నేనిప్పుడు ఆస్పత్రిలో ఉండవలసిన వాణ్ణి. డ్యూటీ డాక్టర్ కి లంచం పెట్టి తప్పించుకొచ్చాను" నవ్వుతూనే చెప్తున్నాడు. తనే అతడిని కొట్టించిందన్న కోపం లేదు.

    "ఏమిటో చెప్పండి! అంత అర్జంటుగా మాట్లాడాలని వచ్చారు?" అని సౌమ్యంగానే అంది.
    "మీరు వివేక్ ని పెళ్ళి చేసుకోబోవాలనుకుంటున్నారని అరుణ చెప్పింది. నిజమేనా?"

    "నిజమే!"
    "నిశ్చితార్థం కూడా అయిపోయిందా?"
    "అది మీకంత అవసరమా?"
    "నాకు మీ మీదున్న అభిమానాన్ని బట్టి.... అవసరమే!"
    "ఆ అవసరం ఏమిటో చెప్పండి! దానిని బట్టి చెపుతాను."
    "వివేక్ దీ. మాదీ. స్వగ్రామం ఒకటే. మా నాన్నగారిది మొదటి నుంచీ తివాచీల వ్యాపారం. వివేక్ తండ్రిది వ్యవసాయం. ఒకసారి పంటకాలువ తగాదాలో పక్క పొలంలో పని చేస్తున్న రైతుని పదిమందిలో తల పగులగొట్టించి, ఒక్కడు నోరెత్తకుండా కేసు మాపు చేయించాడు.  

    తను అనుకున్న దానికి అడ్డు తగిలితే ఊరుకోరు. సంకల్పించుకున్నది ఏ మార్గంలో అయినా సాధించకుండా వదలడు. పరమకర్కోటకుడని చెప్పుకుంటారు. వివేక్ తండ్రి మాటకి ఎదురు చెప్పని ఉత్తమపుత్రుడు."

    యశోద మనసంతా చేదుగా అయింది. వివేక్ తెచ్చిన విడాకుల ప్రస్తావన మనసులో మెదిలింది.
    "థేంక్స్ ఫర్ ద ఇన్ఫర్ మేషన్! ఇది చెప్పడానికే వచ్చారా?"
    "మరోటి కూడా చెప్పాలని....."
    "చెప్పండి!"
    గొంతు సవరించుకున్నాడు జానీ" మేము కోటీశ్వరులము కాకపోయినా ! ఉన్నవాళ్లలోకే లెక్కకొస్తాం. మా నాన్నగారికి జూట్ మిల్ ఉంది. తివాసీల వ్యాపారం ఉంది."
    యశోద మాట్లాడలేదు.
    "నేను అమ్మాయిలతో తిరిగేమాట నిజమే. కానీ చదువులో ఏనాడు వెనుక బడలేదు..

    ".............."         

 Previous Page Next Page