"నన్ను కలవరిస్తున్నాడా?"
"వంటి మీద తెలివిలేని దశలో ఒకటి రెండుసార్లు నీ పేరు కలవరించి ఏదో చెప్పటానికి ప్రయత్నించాడట! నిన్ను తీసుకు రావటానికి వీలైతే. నిన్ను తీసుకురమ్మన్నారు డాక్టర్లు."
"చెంపపగలగొడతాను. మళ్ళీ ఏదో వెధవ పన్నాగం పన్నుతున్నావు!"
"రామ! రామ! నీ ప్రేమల మీదవొట్టు. జానీ నా అబార్షన్ కి డబ్బిచ్చేశాడు. అతడు నన్నెలాగూ పెళ్ళి చేసుకోడుగనక! అతడి మీదనాకేమి ఇంట్రెస్ట్ లేదు. నేనూరికే ఈ విషయం చెప్పాను అంతే! వెళ్లడం వెళ్ళకపోవటం నీ ఇష్టం. ఇందులో నాకొచ్చేదీపోయేదీ ఏమీ లేదు."
యశోద మాట్లాడలేదు. మనసు కొంచెం కరిగింది. వివేక్ జానీని మరీ ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు.
జానీ తనను కలవరిస్తున్నాడనేది యశోద నమ్మలేదు. అరుణ అతి తేలికగా కట్టుకధలు అల్లగలదు. విన్నవి కొన్ని. లేనివి చాలా ఇంగ్లీష్ లోనూ తెలుగులోను చవకబారు ప్రేమకధలన్నీ చదివి. అవన్నీ తన పరంగా ఊహించుకుని నిజంగా జరిగినట్లు చెప్పేస్తుంది.
తనని తిరస్కరిస్తే ఎలా కుమిలిపోయారో ప్రేమకథలో లాగవర్ణించి చెపుతుంది. అంచేత మనసులో కొంచెం సానుభూతి కలిగినా హాస్పిటల్ కి వెళ్లలేదు.
వివేక్ తనను పెళ్ళిచేసుకుంటాననటం తల్లిదండ్రులతో చెప్పింది యశోద. గొప్పింటి అబ్బాయి కూతుర్నికోరి పెళ్ళి చేసుకుంటానన్నందుకు పార్వతి చాలా ఆనందించింది. దక్షిణామూర్తికి సంతోషం కలిగినా పార్వతిలా తొందరపడలేదు.
ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించాడు. అతడికంత సంతృప్తి కలగలేదు. ఆ రోజు భోజనాల దగ్గర సంభాషణ ప్రారంభమయింది.
"నేను ఆ కుటుంబం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాను...." ప్రారంభించాడు దక్షిణామూర్తి.
"ఏమిటట?" అడిగింది పార్వతి.
చెవులప్పగించి వింటోంది యశోద.
"ఆ పిల్లాడి తల్లి మంచిదిట ! కానీ తండ్రి చాలా కర్కోటకుడట! తన అభిప్రాయం కచ్చితంగా అమలు జరిపిస్తాడట ! అతడి రైస్ మిల్ లోని వర్కర్స్ కీ స్టాఫ్ కీ కూడా అతనంటే టెర్రర్ ట"
"ఇందులో కర్కోటకత్వం ఏముందీ? వ్యాపారమన్నాక ఆ మాత్రం గట్టిదనం లేకపోతే ఎలాగ?"
"ఏమో! ఆ అబ్బాయి మరీ మెత్తనివాడులా అమాయకుడిలా ఉన్నాడు. తండ్రి చాటు బిడ్డలా ఉన్నాడు. ముందు ముందు తండ్రి ఎలా ఆడిస్తే అలా ఆడతాడనుకో! మన యశూ ఏమైపోతుందీ?"
"ఏమికాదు! అబ్బాయి మంచివాడు. అంతే! చదువుకున్నవాడు. తండ్రి చేతిలో కీలుబొమ్మ ఎలా అవుతాడు? అమ్మాయి అతడ్ని చేసుకోవాలనుంది. మీరు అవి ఇవి చెప్పి అడ్డుపుల్లలు వెయ్యకండి! ఈ సంబంధం బాగుంది నాకు! కలిగిన కుటుంబం!"
"అంతే! నీ కెంతసేపూ 'కలిగిన కుటుంబం' అని ఆశ! తండ్రి నాకసలు ఏమి నచ్చలేదు. ఈ సంబంధం నాకు నచ్చలేదు!"
"ఈ అబ్బాయితోనే పెళ్ళి జరగాలి!"
"ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదు!"
"అమ్మా! దయచేసి మీ 'లవ్' ఆపండి!" అంది యశోద కల్పించుకుని.... పార్వతీ దక్షిణామూర్తి ప్రతీ చిన్న విషయానికీ అవునంటే కాదని వాదించుకుంటూంటారు. ఆ వాదనలకి యశోద ముద్దుగా "లవ్ సీన్స్" అని పేరు పెట్టుకుంది.
"ఈ పెళ్ళి చేసుకోవాలో వద్దో నిర్ణయించుకోవలసింది నేననుకుంటాను!" అంది నెమ్మదిగా.
"ఒక్క విషయం ఆలోచించుకో అమ్మా! నీవు ఆ ఇంట్లో ఉండవలసి వస్తే అందరి గురించీ కూడా ఆలోచించుకోవాలి!" అన్నాడు దక్షిణామూర్తి.
"నీ భర్త నీకు ముఖ్యం. మిగిలిన వాళ్లతో ఏమిటి? అంతగా ఇష్టం లేకపోతే నువ్వూ మీ ఆయనా ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేయండి" అంది పార్వతి.
మూర్తి మళ్ళీ అనబోతుంటే. యశోద అడ్డుకుని అంది "నేను వివేక్ ని పెళ్ళిచేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అతనికి కూడా ఇష్టం గనక పెళ్ళి చేసుకుంటాము. ముందు ముందు ఏ సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు ఊహాగానాలు చెయ్యటం అనవసరం. సమస్యలు తలెత్తినప్పుడు అప్పుడు తగిన విధంగా వాటిని పరిష్కరించుకుంటాను."
* * *
కాలేజీకి వెళ్ళటానికి తయారవుతోంది యశోద. ఇంటి బయట మోటార్ సైకిల్ ఆగిన చప్పుడు వినిపించి బయటికి వచ్చింది.
వివేక్! మోటార్ సైకిల్ దిగి లోపలికి రాకుండా బయటే నిలబడ్డాడు. అతడు తమ ఇంటికి రావటం... అది తమ మధ్య ఒక అండర్ స్టెండింగ్ కి వచ్చిన రెండు రోజులకే రావటం యశోద కి ఆనందం కలిగించింది.
"అక్కడే నిలబడిపోయారేం? లోపలికి రండి!" అంది.
"ఇక్కడ కాలింగ్ బెల్ లేదు!" బిడియంగా అన్నాడు.
కొంచెంసేపు తమ ఇల్లు అంత పెద్దభవంతి కానందుకు సంకోచం కలిగినా అంతలోనే తేరుకుంది.
ఇందులో సిగ్గుపడవలసిందేమీ లేదు.
"మా ఇల్లు మీ ఇళ్లలాగా'భవంతులు'కావు. నాలుగైదు వాటాలకి ఇదే కాంపౌండ్ గేటు. అందుచేత కాలింగ్ బెల్ ఉండదు. అదీగాక మా ఇంట్లో ఆల్షేషియన్ డాగ్ లేదు. అందుచేత కాలింగ్ బెల్ నొక్కకుండా వచ్చినా ఫర్వాలేదు!."
నవ్వాడు.
"అమ్మ చెప్పింది. మా టింకూ ధాటికి ఎవరూ నిలబడలేరు. మీరు దానిని ఎదుర్కొన్నారంటే జీవితంలో ఎంతైనా ఎదుర్కోగలరు. అమ్మ మిమ్మల్ని మెచ్చుకుంది."
"లోపలికి రండి! మా అమ్మ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటుంది."
మోటార్ సైకిల్ ఆవరణలో పార్క్ చేసి లోపలికి వచ్చాడు వివేక్. కుషన్స్ వేసిన కేన్ ఛెయిర్ లో కూచోమని తల్లికి చెప్పింది. పార్వతి కంగారు అంతా ఇంతా కాదు. ఇండియన్ ప్రెసిడెంట్ లాంటి వి.ఐ.పి. ఎవరో తమ ఇంటికి వచ్చినట్లే అయిపోయింది.
పక్కింటి పిల్లాడిని బ్రతిమాలుకుని కొంత దూరంలో ఉన్న స్వీట్ షాప్ నుంచి అజ్మీర్ కలాకండ్ తెప్పించింది. అప్పటికప్పుడు పెసరపప్పు నానబోసి నానకుండానే గ్రైండర్ లో వేసి రుబ్బి, పెసరట్లు పోసింది. ఉన్న కొంచెం పాలతో పాయసం చేసింది.
అయిదు నిమ్మకాయలు కోసి తయారుగా ఉన్న అన్నంలో పిండి నిమ్మకాయ పులిహోర కలిపింది. ఒక ప్లేట్ లో కలాకండ్, కప్పులో పాయసం, మరో ప్లేట్ లో పెసరట్లు నిమ్మకాయ పులిహోర పెట్టి అతని ముందుంచింది.
"నాకోసం మీరు చాలా శ్రమ పడ్డారు!" అన్నాడు మొహమాటంగా.