Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 10


    "నా వెంట ఎందరో అమ్మాయిలు పడుతున్నారు. వాళ్ళలో అందమైన వాళ్ళూ ఉన్నారు. కానీ నాకెప్పుడు ఎవర్నీ చేసుకోవాలనే ఆలోచనరాలేదు...."
    "..............."
    "మీరు వప్పుకుంటే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను."
    "సారీ నాకు వివేక్ తో పెళ్ళి అయిపోయినట్లే! అదీగాక మిమ్మల్ని పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం నాకెన్నడూ లేదు. నా కారణంగా మీకిన్ని దెబ్బలు తగిలాయనే సానుభూతితో మాత్రమే ఇంతసేపూ మాట్లాడుతున్నాను. బై!"

    గిర్రున తిరిగింది వెనక్కి. అక్కడి నుంచి వెళ్ళిపోయే ఉద్దేశంతో. కొంతదూరంలో నిలబడి ఎర్రబడ్డకళ్ళతో చూస్తున్నాడు వివేక్! ఆ కళ్ళు ఎంత ఎర్రగా మండుతున్నాయంటే ఆ చూపులు తనను నిలువునా భస్మం చేస్తాయేమో అనిపించింది! చటుక్కున చూపులు దించుకుంది.

                                      * * *
    సాయంత్రం నాలుగు గంటలైనా బయట ఎండ చిరచిరలాడిస్తోంది. ఆ ఎండలో నుంచి టి.వి.యస్. మీద వచ్చాక. హోటల్ సంపూర్ణాలో ఎ.సి. రెస్టారెంటు హాలు చాలా హాయిగా ఉంది. వివేక్ మాత్రం ఆ చల్లదనాన్ని అనుభవిస్తున్నట్లు లేదు. కళ్ళింకా ఎర్రగానే ఉన్నాయి.
    వెయిటర్ వచ్చి టేబిల్ దగ్గర నిలబడ్డాడు. ఆర్డర్ కోసం... వివేక్ మాట్లాడకపోవడంతో తనే ఆర్డర్ చేసింది.
    "రెండు బాసుందీ! రెండు మసాలాదోసె!"

    అప్పటికీ వివేక్ మాట్లాడలేదు. ఎరుపు తగ్గని కళ్ళతో ఎదురుగా ఉన్న కిటికీ అద్దాన్ని చూస్తున్నాడు.

    అతని చూపులు కిటికీ అద్దాన్ని దాటి మరెక్కడికో పోతున్నాయని యశోద గ్రహించింది.
    "ఏమిటో చెప్తానన్నారు! చెప్పండి మరి?" నవ్వుతూ మాటలు మొదలుపెట్టింది యశోద.
    "జానీ నీతో ఏం మాట్లాడాడు?" సూటిగా అడిగాడు వివేక్! మెత్తని పదును ఉంది మాటల్లో.
    అప్పటి వరకూ అతడిని ఆ విషయమే మధిస్తోందని యశోద గ్రహించింది. ఆమెకి ఆనందమూ, భయమూ రెండూ కలిగాయి.    
    జానీ వివేక్ తండ్రిని గురించి చెప్పినదంతా చెప్పింది. చివరికి "నువ్వు తండ్రి మాట దాటని ఉత్తమపురుషుడివట?" అంది వేళాకోళంగా అంటున్నట్లు....
    "చివరిది తప్పు" శాంతంగా అన్నాడు వివేక్.
    "ఏది?"
    "నేను తండ్రి మాట జవదాటని ఉత్తమపుత్రుడు కావటం...."
    "అంటే?"
    "అంటే మిగిలినవన్నీ నిజమేనా?"
    "నిజమే! పూర్తిగా కాదు. వ్యవసాయాల్లో పంటకాలువ నీళ్ళు వదలటం దగ్గర ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ గొడవల్లో కొందరు చావటం కూడా జరుగుతుంది. అలా జరిగింది. నాన్నగారు ఆ కేసు బయటికి పొక్కకుండా మేనేజ్ చేశారు! అది ఎంతో నాకు తెలీదు."
    లోలోపల వణికింది యశోద.
    "ఇప్పటికీ మీ నాన్నగారి స్వభావం అదేనా?"
    "స్వభావం ఎందుకు మారుతుంది? ఆయన అనుకున్నది ఎలాగైనా సాధించే పట్టుదల అలాగే ఉంది."
    "మీరు ఆయనను ఎదిరిస్తారా?"
    "ఎదిరించను! అసలు ముఖాముఖీమాట్లాడను!"
    "మరి ఉత్తమపుత్రుడు కాదంటే అర్థం?"  

    "నేను చెయ్యదలుచుకున్నది నేను చేస్తాను. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నాన్నగారికి కోపం వస్తుంది. నన్నేమీ అనరు! అమ్మని తిడతారు. అన్నాడు నాన్నగారి తిట్లు అమ్మకి అలవాటే! శాంతంగా భరిస్తుంది. నాకు నాన్నగారుకీ మధ్యన జరిగేది కోల్డ్ వార్!"
    "అంతకంటే. మీ నాన్నగారిని వదిలేసి మీకిష్టమైనట్లు ఉండవచ్చు కదా."
    "అది కుదరదు. అమ్మ నాన్నగారిని వదలదు. నేను అమ్మను వదలను."
    కొంచెంసేపు మాట్లాడకుండా ఊరుకుని ఆలోచిస్తూ అడిగేసింది "ఇందుకేనా మీరు విడాకుల ప్రస్తావన తెచ్చారు?"  
    "కాదు."
    నిదానంగా అన్నాడు. గుండె ఝల్లుమంది యశోదకి. మరోసారి లోలోపలి నుంచి "పారిపో! పారిపో!" అని వినిపించినట్లయింది.  
    తలెత్తి యశోద కళ్ళలోకి చూశాడు. ఆ సమయంలో కళ్లనిండా ఆమెపట్ల ఆరాధన. ఆ కళ్ళు చూస్తోంటే ఇంకేమి ఆలోచించలేకపోతోంది. సంకోచాలన్నీ ఎక్కడివక్కడ పటాపంచలయిపోతున్నాయి.
    "యశూ!" నెమ్మదిగా పిలిచాడు. ఆ పిలుపులో అనురాగం ఉట్టిపడుతోంది.
    "బయటి వాతావరణాన్ని గురించి నీవస్సలు ఆలోచించవేం?" అంది మనిద్దరి మధ్య ఎప్పుడైనా ఏదైనా డిస్టబెన్స్ వస్తే. పాతకాలపు సెంటిమెంట్లతో జీవితం నాశనం చేసుకోకుండా ధైర్యంగా నీ జీవితం పునర్నిర్మించుకోగలిగి ఉండేందుకే అడిగాను."
    "ఏమిటీ?" అసహనంగా అంది.
    "జానీ నీతో మాట్లాడింది అంతేనా?"
    "కాదు!"
    "మరేమన్నాడు ఇంకా?"
    "చెప్పమంటారా?"
    "......... మీ ఇష్టం!"
    "మీరు నన్ను 'నువ్వు' అని పిలవొచ్చు!"
    "మీరు నన్ను 'మీరు' అంటున్నారుగా?"
    "నువ్వు అనమంటావా?"

    "అలాగే నాకిష్టం!"
    "సరే అయితే!"                         

 Previous Page Next Page