తనకు ఇష్టం సరే ఆయన వచ్చి ఏం అంటారో!
ఆ అమ్మాయిని ఎన్ని మాటలు అంటారో!
కొడుకుని ఎన్ని చివాట్లు వేస్తారో!
ఇక ఆయన వచ్చేస్తారు, ఇందు కూడా తండ్రితో కలిసి ఏం గొడవ పెడుతుందో.
తండ్రి పిల్లలు ఇద్దరి మనస్తత్వాలు ఒకటే. జయరాంలో యేదో మార్పు వచ్చింది.
కొడుకులో మార్పు ఆ అమ్మాయి తీసుకువచ్చిందా! అలా మారాలనే నేను కోరుకునేది.
ఇప్పుడు భర్తకి తను ఏమని చెప్పాలి.
అయన ఇంటికి వస్తే యిల్లు రణరంగం అయిపోతుంది. యిప్పుడు ఏం చెయ్యాలి! ఆయనకి ఎలా నచ్చ చెప్పాలి! ఆయన్ని శాంతపర్చడం యెలా!
సుభద్రమ్మ భయపడసాగింది.
గణేశ్ రావుగారు గంట తరువాత యింటికి వచ్చారు. జయరాం అంబిక మేడమీద ఉన్నారు.
ఆయన వస్తే ఏం గొడవ పెడతారో అని జయరాం మనసులో తండ్రికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాను అని బాధపడసాగాడు.
అంబిక మాత్రం సంతోషంగా ఉంది కారణం తనకు అతనితో పెళ్ళి జరిగిపోయింది అనికాదు. ఎవరు అయితే తన తల్లిని చిన్న చూపు చూశారో, ఆ యింటిలోనే తను అడుగుపెట్టి దెబ్బతియ్యడానికి సిద్ధంగా ఉంది. ఇక ఆ ఇంటిలో ఒకరిమాట ఒకరికి పడకుండా చెయ్యడానికి నిశ్చయించుకుంది.
అది మొదలు యిల్లు రణరంగంగా మారిపోతుంది. మారిపోతుంది ఏమిటి, తను మార్చేస్తుంది. అలా అంబిక మనసులో గర్వంగా నవ్వుకుంది.
* * *
సుభద్రమ్మ భర్తకు ఈ విషయం ఎలా చెప్పాలా అని మనసులో తర్జనభర్జన పడసాగింది.
అయినా చెప్పక తప్పదు. యెలా చెప్పాలో ఏమిటో చెపితే యేం అంటారో!
ఆవిడ ఏమయితే అయింది అని ధైర్యంచేసి భర్తకు మెల్లగా నచ్చ చెప్పినట్టుగా అసలు విషయం చెప్పేసింది. గణేశ్ రావుగారు ఆవిడ చెప్పిన మాట వినగానే మొదట నిర్ఘాంతపోయినట్లుగా అలా ఉండిపోయారు. తన కొడుకు జయరాం తనకు తెలియకుండా యెప్పుడూ చేయనివాడు ఈరోజు ఇంతపని చేశాడా!
ఆయనకి కోపం ముంచుకొచ్చింది.
ఇక తన పెద్దరికం ఏముంది! ఆ వచ్చిన కోడలు తనకి గౌరవము ఇస్తుందా!
ఆయనకి మతిపోయినట్టు అయింది.
సుభద్రమ్మ అలా చెపుతూనే ఉంది.
కృష్ణమౌళి ఆ అమ్మాయిని చేసుకుందామనుకున్నాడట. ఆ అమ్మాయికి ఇష్టంలేక మన అబ్బాయిని కోరి ఇష్టపడి పెళ్ళిచేస్కుని ఆ ఇంటిలో నుండి పారిపోయి వచ్చేసింది అంటూ ఆవిడ అలా చెపుతూనే ఉంది. అంతే ఆయన ఆలోచనలు ఠక్కున ఆగిపోయాయి. పైపైకి పొంగి వస్తున్న కోపం మెల్లమెల్లగా తగ్గిపోనారంభించింది.
ఆయన కళ్ళు అదో విధంగా అయ్యాయి. ఊహించని సంఘటన మనిషికి ఎదురయితే కలిగిన ఆనందం ఆశ్చర్యంలా కళ్ళల్లో కదలసాగింది.
కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి.
"ఏమిటి! ఆ అమ్మాయి ఆ కృష్ణగాడ్ని కాదని మన అబ్బాయిని కోరి చేసుకుని మన యింటికి వచ్చేసిందా!" ఆయన యెడం చెయ్యి గర్వంగా మీసాలమీదకు వెళ్ళింది.
జయరాం తన కొడుకు అనిపించాడు.
తను కృష్ణగాడిమీద దెబ్బ తీసినట్లు అయింది.
ఆ అమ్మాయి వాడిని కాదని వచ్చేసింది అంటే ఆస్తిలో, అంతస్తులో, అందంలో, గుణంలో ఆ కృష్ణగాడి కంటే జయరాం గొప్పవాడనే కదా!
ఆయనకి చాలా సంతోషం అనిపించింది.
"సుభద్రా ఈరోజు నాకు చాలా ఆనందంగా వుంది. ఆ కృష్ణగాడి మీద దెబ్బతీసినట్టు అయింది. దాంతో వాడిరోగం చప్పున కుదిరిపోయినట్టు అయింది. వాడికి యిప్పుడు అర్ధం అవుతుంది. నాలుగు డబ్బులు గడించగానే గొప్పవాడ్ని అయిపోయాను అనుకున్నాడు ఇన్నాళ్ళు. ఈ అమ్మాయి వాడికి తగినట్టు చేసింది. నాకు చాలా ఆనందంగా, తృప్తిగా ఉంది యేడి వాడ్ని పిలు! అమ్మాయి ఎక్కడ!" ఆయనలో సంతోషం పొర్లిపోతుంది.
సుభద్రమ్మ భర్తవైపు విడ్డూరంగా చూసింది.
ఆయనకు చెప్పకుండా కొడుకు పెళ్ళి చేసుకువస్తే యెంత గొడవ జరుగుతుందో, ఆ అమ్మాయి ఏమనుకుంటుందో అని జడుస్తుంటే ఈయన ఆలోచనలు మరోదారి పట్టాయి. యెంతసేపూ ఈయనకి కుత్సిపు ఆలోచనలే గాని మంచి ఆలోచనలు ఎప్పుడూ రావు. ఆ కృష్ణమీద దెబ్బతీశాననే ఆయన సంబరం అంతేకాని చెల్లెలు కొడుకు అన్న కనికరం, మమకారం లేవు ఈయనకు అనుకుంది మనస్సులో కోపంగా.
జయరామ్ భార్యతో మేడదిగి వచ్చాడు మెల్లగా. అంబిక మామగారివైపు రెప్ప వాల్చకుండా క్షణంసేపు అలాగే చూసింది. ఆయన ముఖంలో భావాలు జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నిస్తూ.
కొడుకుని చూడగానే శభాష్ అంటూ మెచ్చుకున్నారు. ఆ కృష్ణగాడికి తగినట్లు చేసి వాడి గర్వం అణిచారు. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది అంటూ కొడుకును తెగ పొగిడారు.
సుభద్రమ్మ నిశ్చేష్టురాలై అలా నిలబడి పోయింది.
చెయ్యెత్తు పొడవు ఈ తండ్రి కొడుకులు ఉన్నారు మనసుల్లో గడుసుతనాలే తప్ప బుర్రలో తెలివితేటలు మాత్రం సున్నాయె.
నన్ను వీళ్ళు సునాయాసంగా నమ్మేశారు.
ఇకముందు జరగబోయేది వీళ్ళు గ్రహించుకోవటం లేదు. కృష్ణమౌళి మీద దెబ్బతీశాననే సంబర పడిపోతున్నారు కానీ తను ఎవరో ఏమిటో ఈ పెళ్ళి తను ఎందుకు చేసుకుందో ఈ యింటిలోకి ఎందుకు ప్రవేశించిందో యిల్లు ఇకముందు ఎలా మారి అవుతుందో గ్రహించలేకపోతున్నారు. పాపం ఈ తండ్రీ కొడుకులు.
గూఢచారిణిగా తను ఈ యింటిలో ప్రవేశించింది. అందరి ఆటకట్టు అంబిక మనసులో గర్వంగా నవ్వుకుంది.
జయరామ్ అంబిక ఆయనకి నమస్కరించి దీవెనలు అందుకున్నారు.
గణేశ్ రావు గారు క్షణంసేపు ఆలోచించి భార్యవైపు తిరిగి అన్నారు. మనకి ఒక్కగానొక్క కొడుకు వాడు ఇలా మనకి తెలీకుండా పెళ్ళి చేసుకోవడం మనకి బాధగా అనిపిస్తుంది. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. మన జయ పెళ్ళి ఇలా కాకుండా ఎంతో ఘనంగా మన చేతుల మీద చెయ్యాలని అనుకుంటున్నాను. రెండురోజుల్లో పదిమంది పెద్దల ఎదురుగా దర్జాగా వాళ్ళిద్దరికి పెళ్ళి జరిపిస్తాను."