Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 10


    సుభద్రమ్మ ఆ మాటలు వినగానే ఆవిడకూడా మనసారా సంతోషించింది.


    ఇంద్రసేన ఫ్రెండ్ యింటినుండి రాగానే అన్నయ్య అంబికలను జంటగా చూసింది.


    ఆమెకు మతిపోయి నోటమాట రాలేదు.


    అంబిక ఆమెవైపు నిర్లక్ష్యంగా చూసి అదోలా నవ్వింది. ఆ నవ్వు ఆమెను హేళన చేస్తున్నట్టుగా అనిపించింది. పైకి ఏమీ అనలేకపోయింది. తండ్రికూడా ఆమెను మెచ్చుకోవడం ఇంద్రసేన సహించలేకపోయింది. తనకి తెలీకుండా అన్నగారిని పల్టీకొట్టించి వలలో పడేసి, పెళ్ళిచేసుకుని దర్జాగా ఈ యింటికి వస్తుందా!  చెప్తా, చెప్తా ఈ ఇందూ అంటే ఏమిటో అనుకుంటుంది.


    కొద్ది రోజుల్లో తెలుస్తుంది తన సంగతి ఈవిడగార్కి ఇంద్రసేన మనసులో కసిగా, కోపంగా అనుకోసాగింది. నువ్వు ఎంత కొరకొర చూసినా నన్ను ఏం చెయ్యలేవు. నిన్ను గిరగిర తిప్పి అవతల పారేశాను అంటే తిన్నగా వెళ్ళి తిన్నగా కృష్ణమౌళి యింటిలో పడతావు జాగ్రత్త అన్నట్లు నిర్లక్ష్యంగా చూసింది అంబిక ఆమె వైపు.


                                *    *    *


    గణేష్ రావు గారు అన్నట్టుగానే జయరామ్, అంబికల పెళ్ళికి రెండు రోజుల్లో ముహూర్తం పెట్టించి పెళ్ళి పనులు చాలా చురుగ్గా గబగబా చేయించి కొడుకు పెళ్ళి అతి వైభవంగా భారీ ఎత్తున జరిపించారు.


    సుభద్రమ్మకి గర్వంగా అనిపించింది. ఇంద్రసేన పైకి నవ్వుతూ తిరిగినా మనసులో కోపం రాజుకుంటుంది.


    అన్నగారి పెళ్ళి గురించి ఎన్ని అనుకుంది. బట్టలు విషయంలో, వస్తువుల విషయంలో ఎన్నో కొనుక్కోవాలనుకుంది. ఫ్రెండ్స్ నంద్రనీ పిలిచి ఎంతో సరదాగా తిరగాలని అనుకుంది. తను అనుకున్నట్లు, ఊహించుకున్నట్లు ఏం జరగలేదు. అందుకే ఆమె మనసు మౌనంగా మారిపోయింది. సంతోషం, సరదా మచ్చుకి లేకుండా మాయం అయ్యాయి.


    తప్పనిసరి బాగుండదు అని పెళ్ళిలో అలా అంటీ అంటనట్టు తిరిగింది.
    పెళ్ళి అయిపోయింది.
                         *    *    *


    ఆ రాత్రి భోజనాలు అయ్యాక అంబిక ఒక గదిలో మౌనంగా ఉండిపోయింది.


    ఆమె మనసు రకరకాల ఆలోచనలతో నులిమేసినట్లుగా అవుతుంది.


    కార్యసాధనకై ఆశించింది ఏమిటి? ఇప్పుడు జరిగింది ఏమిటి?


    కార్యసాధనకై తన ఇష్టాఇష్టాలని సమాధిచేసి నడుంకట్టి ముందుకు ఉరికింది. తనకి ఈ యింటిలో నమ్మకమైన స్థానంకోసం దానికి ఫలితంగా తన మెడలో మూడుముళ్ళు వేయించుకుంది. మూడు ముళ్ళు వేయించుకోవటం అంటే సులభం అయిందిగానీ ఇష్టంలేని మనిషితో జీవితంలో ఆనందాన్ని, మాధుర్యాన్నీ పంచుకోవాలి అంటే మనసు అందుకు వ్యతిరేకిస్తుంది.


    అలా ఆలోచిస్తుంటే అంబిక అంతరాత్మ నవ్వినట్లు అయింది. అంబిక ఉలిక్కిపడింది.


    ఎందుకానవ్వు! అని తెల్లబోయింది.


    అంబికా నువ్వు ఎంత అమాయకురాలివి.


    కవులు స్త్రీలని పూలతో పోల్చారు. పూలు ఎంత అందంగా ఉంటాయో, స్త్రీలు అంత అందంగా సుకుమారంగా ఉంటారని.


    మనిషిలాగే మనసు సుకుమారంగా ఉండాలి.


    ఆలోచనలు అంత మృదువుగానే ఉండాలి.


    మంగళసూత్రం కట్టిననాడే అతను నీ భర్త.


    నీ భర్త అంటే ఎవరు? జీవితాంతం నిన్ను నీడలా కనిపెట్టుకుని ఉండేవాడు.


    నీ కష్టసుఖాల్లో భాగం పంచుకునేవాడు నిన్ను పువ్వుల్లోపెట్టి చూసుకునేవాడు.


    భార్యకంటే వయసులో పెద్దవాడు. భర్త అన్ని విషయాల్లో భార్య కంటే ఎక్కువే.


    అతన్ని గౌరవించి పూజించాలి భార్య.


    అతను దుష్టుడు అయినా దుర్మార్గుడు అయినా అతన్ని మిన్నగా ప్రేమించాలి.


    మగవాడిని మంచిదారిలో పెట్టాలి అన్నా ఆ మంచితనాన్ని మసి చెయ్యాలన్నా అది స్త్రీ చేతిలో ఉంది.


    ఎవరికీ లొంగని పురుషుడు స్త్రీ యెదుట మంచుముక్కలా మారిపోయి తలవంచుతాడు. ఆమె అందచందాలకి మంచితనానికి బానిస అవుతాడు.


    అది ఆధారం చేసుకోవాలి స్త్రీ.


    రాళ్ళల్లో పూలు పూయించి మండుటెండల చల్లదనాన్ని కురిపిస్తుంది స్త్రీ.


    నీ భర్త జయరామ్ ఎంతటి కఠినాత్ముడు అయినా నువ్వు అతన్ని అసహ్యించుకోవటం మహానేరం అవుతుంది.


    నీ అనురాగాభిషేకంతో అతనిలో కఠినత్వాన్ని కరిగించి ఈ సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబడేటట్టు తీర్చిదిద్దు. భర్త నడవడిక భార్య చేతులో వుంటుంది.


    ఆమె తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది అతని ప్రవర్తన.


    భార్య ప్రేమంతా తనకే దక్కాలని ప్రతి పురుషుడూ ఆశపడతాడు.


    నీవు నిండు మనసుతో నీ భర్త ప్రేమానురాగంలో కలిసిపో అంటూ ఆమె అంతరాత్మ నొక్కి నొక్కి చెప్పింది. అంబిక కళ్ళ నీళ్ళు గిర్రున తిరిగాయి.


    మనిషికి ఎన్ని కోరికలు ఉంటాయి.


    ఆ కోరికలు అన్నీ నెరవేరవు.


    తను పుట్టినప్పుడే పెద్దవాళ్ళు నిర్ణయించేశారు.


    తన నుదుట విధాత ఏనాడో వ్రాసేవాడు.


    జయరామ్ తో తనకి పెళ్ళి జరుగుతుంది. అతనే తన భర్త అని అలాగే జరిగిపోయింది.


    ఇక విచారించటం అనవసరం.

 Previous Page Next Page