ఆమె అందచందాలు ఠీవి క్షణంసేపు అలా ఉండిపోయాడు.
అంబిక ముస్తాబు అయినా అవకపోయినా అందం మాత్రం మీగడ తరకలా చిక్కగా చక్కగా ఉంటుంది ఆమె.
అతని గుండెల్లో చిరుగంటలు మ్రోగాయి.
పురుష సహజమైన తియ్యని భావాలు మొట్టమొదటిసారిగా అతనిలో తలెయెత్త నారంభించాయి.
"అంబికా!" మృదువుగా పిలిచాడు.
ఆమె వెనుతిరిగి చూడలేదు. అటుతిరిగి నిలబడింది.
దగ్గరగా వెళ్ళి ఆమె భుజాలపై రెండుచేతులూ వేసి "అంబికా!" అన్నాడు ఈసారి చిన్నగా నవ్వుతూ అతని చేతులని తోసేయడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం సాగనివ్వలేదు. ఆమె భుజాలచుట్టూ చెయ్యి వేసి తనవైపుకి తిప్పుకున్నాడు.
అంబిక క్షణంసేపు అలా చూస్తూ ఉండిపోయింది.
అతనిలో మార్పు వచ్చిందా! నిజమా! కలా! అన్నట్టు.
"ఏమిటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు" చిరునవ్వుతో అడిగాడు.
ఆమె అనుమానం ఇంకా పోలేదు. ఇంకా అలాగే చూడసాగింది.
"నీవు కోరినట్టే నిన్ను నా అర్ధాంగిని చేసుకుని మా యింటికి తీసుకు వెళతాను" అన్నాడు.
"నిజమా!" అడిగింది ఆశ్చర్యంగా.
"నిజంగానే, నామాట అబద్ధమయితే సురేష్ ఎదురుగా అతని భార్య ఎదురుగా చెప్తాను వాళ్ళే మన పెళ్ళికి సాక్ష్యు" లన్నాడు.
అంబిక ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
సురేష్ నీలలని పిలిచి చెప్పాడు. వాళ్ళు అతని నిర్ణయానికి మనసారా సంతోషించి అప్పటికప్పుడు దేముడి పటంముందు అంబిక మెడలో జయరామ్ చేత మూడుముళ్ళు వేయించేశారు.
వాళ్ళు ఎలా చెప్తే అలా చేశాడు జయరామ్.
అంబిక మౌనంగా ఉండిపోయింది.
సురేష్ నీలల సాక్ష్యంతో అప్పటికప్పుడు దేముడిపటం దగ్గర జయరామ్ అంబికల పెళ్ళి జరిగిపోయింది.
సురేష్ సలహా ప్రకారం జయరామ్ అంబికను తీసుకొని ఇంటికి బయలుదేరాడు.
జయరాం కారు డ్రయివ్ చేస్తున్నాడేగాని మనసంతా అదోలా అయిపోసాగింది.
అంబికను ఇలా చెప్పా చెయ్యకుండా పెళ్ళి చేసుకొని తీసుకువెళితే తండ్రికి కోపం వస్తుందని తెలుసు. తల్లి ఏమనదు కాని బాధపడ్తుంది ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి తన చేతులమీద జరగలేదని.
ఇంద్రసేన సరేసరి మండిపడిపోతుంది.
ఇంతమంది ఎదుట నిలబడి తను ఏమని సమాధానం చెప్పాలని ఆలోచించసాగాడు.
కారు తిన్నగా పోర్టికోలో ఆగింది.
అంబిక ఏమీ భయపడలేదు. మొండి ధైర్యంతో అతనివైపు చూసింది.
జయరాం ఆమె ముఖంలో భావాలు సరిగ్గా గమనించలేదు. అతడు కంగారులో ఉన్నాడు.
ఆమెను ఉండమని తను లోపలకు వెళ్ళాడు.
అతను వెళ్ళేసరికి గణేష్ రావు గారు ఇంటివద్ద లేరు. పని వుందని ఎక్కడికో వెళ్ళారు.
ఇంద్రసేన ఎవరో ఫ్రెండ్ యింటికి వెళ్ళింది.
సుభద్రమ్మ వుంది యింట్లో.
తిన్నగా తల్లి దగ్గరకు వెళ్ళి "అమ్మా!" మెల్లగా పిలిచాడు.
చేస్తున్న పని వదిలి అటు కొడుకువైపు చూసింది ఆవిడ.
"ఏమిటి బాబూ పిలిచావా!" అడిగింది.
అతను తలవూపాడు.
"అమ్మా! మీకు తెలియకుండా ఒక పని చేశాను. దానికి నీవు, నాన్నగారు నన్ను క్షమించాలి" అన్నాడు మెల్లిగా.
"ఏమిటి బాబూ ఏం చేశావు! అంత క్షమించరాని తప్పు చేశావా?" అడిగింది ఆవిడ కొడుకు భుజంపట్టి ఊపుతూ.
అవును అన్నట్టు తలఊపుతూ...
జరిగింది అంతా ఆవిడకు వివరంగా చెప్తూ, "నేను ఆ అమ్మాయిని అనుకోకుండా పెళ్ళిచేసుకోవలసి వచ్చింది. అందుకు నువ్వు, నాన్నగారు ఏమంటారో" అంటూ చెప్పడం ఆపేశాడు.
సుభద్రమ్మ తల గిర్రున తిరిగిపోయింది. కొడుకు చెప్పకుండా పెళ్ళి చేసుకున్నాడని తెలిస్తే ఆయన ఊరుకుంటారా-- కోపంతో చిందులు తొక్కరూ! ఆయనకి ఎలా నచ్చచెప్పటం! అని ఆలోచిస్తూ.
"ఇంతకూ ఆ అమ్మాయి ఎక్కడ ఉంది?" అడిగింది ఆవిడ.
"కారులో ఉంది" అన్నాడు.
లోపలకు తీసుకురా అంది ఆవిడ. ఆవిడకు కొడుకు పెళ్ళి చేసి తీసుకువచ్చింది డాక్టర్ అంబిక అని తెలీదు.
జయరాం భార్యను లోపలకు తీసుకురావడానికి అవతలకు వెళ్ళాడు.
సుభద్రమ్మకి మతిపోయినట్లుగా అనిపించసాగింది.
వాడి పెళ్ళి జరిగిపోయిందా! అనుకుని బాధపడసాగింది.
జయరాం భార్యతో లోపలకు అడుగుపెట్టాడు.
సుభద్రమ్మ ఆలోచనలు ఆపి అటు చూసింది.
అంబిక ఆవిడ్ని చూసి చిన్నగా నవ్వి తలతిప్పి భర్తవేపు చూసింది.
ఇద్దరూ వెళ్ళి ఆవిడ కాళ్ళకి నమస్కరించారు.
సుభద్రమ్మ అంబికను చూస్తూనే క్షణంసేపు అలా ఉండిపోయింది.
కలకాదు కదా! డాక్టర్ అంబిక తన కోడలు అయింది. యెలా! ఆవిడ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. పొంగిపోతూ కొడుకుని, కోడల్ని మనసారా ఆశీర్వదించింది.
49
కొడుకుని కోడల్ని మేడమీదకు వెళ్ళమని చెప్పి సుభద్రమ్మ ఆలోచనల్లో పడింది.
తనకు నచ్చిన అమ్మాయినే కోడలిని చేశాడు ఆ దేవుడు.