ఇద్దరూ వచ్చి పెద్దాయన పక్కన కూర్చున్నారు. ఆయనేం మాటాడలేదు.
"వీరాచారిని తీసుకుని వచ్చాను, నా మాట ప్రకారం. మీరు సిద్ధమేనా?" అడిగాడు సోమయాజి.
"నాదేముంది? అంతా దైవేచ్ఛ!"
"చూశారా! ఆ మాటలతరు! విడ్డూరంగా లేదూ?" వీరాచారి ఏదో కొత్త విషయం కనుక్కున్నట్టుగా అన్నాడు.
సోమయాజి వంకరగా నవ్వాడు.
"సామాను తెప్పించారా?"
వీరాచారి అడిగాడు.
పెద్దాయన ఏమీ మాట్లాడలేదు.
"సరే! సరే! అన్నీ నేను తెప్పిస్తాను. పెద్దరికం ఒప్పుకున్నానుగా! రోట్లో తలదూర్చినాక రోకలిపోటు తప్పుతుందా! మీరు పిల్లని సిద్ధం చెయ్యండి. నేను సామాను సిద్ధం చేస్తాను" అని వీరాచారి వంక తిరిగి "ఏంకావాలో చెప్పండి?" అన్నాడు.
వీరాచారి చాలా వస్తువులు చెప్పాడు ఆర్భాటంగా. కొన్ని తన దగ్గరే ఉన్నాయి, బయట దొరకవు అన్నాడు. సోమయాజి వెళ్ళి అక్కడ ఉన్నట్టు అప్పుడే వచ్చాడు. కావలసినవన్నీ ముందే సిద్ధంగా ఉంచుకున్నట్టున్నాడు. అప్పటి వరకు వీరాచారి పలకరించటానికి ఎంత ప్రయత్నం చేసినా పెద్దాయన మాట్లాడలేదు. సోమయాజితో పాటు ఊళ్లో ఉన్న పెద్దమనుష్యులుకూడ కొంతమంది వచ్చారు. సోమయాజే లోపలికి వెళ్ళి మంగమాంబకీ, కృష్ణయార్యుని తల్లికీ తను వచ్చినపని చెప్పి, వెంకమాంబని "రా!" అంటూ మోటగా చెయ్యిపట్టుకుని లాక్కుని వచ్చాడు. తల్లికి నాయనమ్మకి అశనిపాతంలాగా అనిపించింది, నిర్ఘాంతపోయారు. తేరుకునేసరికి వెనక్కితిరిగి వస్తానుండమన్నట్టుగా చెయ్యి ఊపుతున్న వెంకమాంబని సోమయాజి లాక్కుని వెళ్ళటం కనిపించింది. చెయ్యి ఊపింది తమకా? తన అదృశ్య మిత్రుడికా? అని ఆలోచించింది మంగమాంబ.
సోమయాజి వెంకమాంబని వీరాచారి ముందుకి తోశాడు. వీరాచారి ఆపసిదాని వంక తీక్షణంగా చూసి, తలవంచుకున్నాడు. తన ఎదురుగా ఎర్రని వస్త్రం పరిచి దానిమీద కూర్చోమన్నాడు. బుద్ధిగా కూర్చుంది. ఎదురుగా ముగ్గువేశాడు, పసుపు కుంకాలతో. మందార, గన్నేరు పూలు పరిచాడు. తనతో తెచ్చుకున్న మూటలో నుండి ఏవేవో వస్తువులు తీశాడు. పెద్ద పిలక జుట్టుముడి విప్పి చేతులోకి వేపమండలు తీసుకుని వెంగమాంబ చుట్టూ తిప్పి గట్టిగా మంత్రాలు ఉచ్చరించటం మొదలు పెట్టాడు.
"ఓం! హ్రీం! ఫట్! స్వాహా... ..."
"ఓం! హ్రీం! క్రీం! స్వాహా... ..."
"ఓం! చాముండాయై విచ్చే... ..."
సోమయాజి వైపు తిరిగి "అమ్మాయి పేరు?" అడిగాడు వీరాచారి.
"మూర్ఖా! నాపేరే తెలియదా?" అంది వెంకమాంబ.
వీరాచారి అవాక్కయ్యాడు.
"నువ్వు పూజించే చాముండేశ్వరిని రా!"
వీరాచారికి నోటమాటరాలేదు.
"ఇదీ దెయ్యంపనే చూశారా! భయంలేకుండా ఎట్లా మాట్లాడుతోందో? చిన్నపిల్ల లక్షణాలేమైనా ఉన్నాయా?" సోమయాజి గట్టిగానే అన్నాడు. సోమయాజి వంక చూసింది తలతిప్పి. చూపు చూస్తే సోమయాజి గుండె ఆగినంత పనైంది. చూపులు పక్కకి తిప్పుకున్నాడు.
వీరాచారి కొంచెం ధైర్యం పుంజుకుని మళ్ళీ మొదలు పెట్టాడు.
"ఓం! ... ఓం! ... ఓం! ... ..."
అంతకు మించి సాగలేదు. ఏదో గొంతుకి అడ్డుపడుతోంది. మెదడు మొద్దుబారింది. మంత్రం ఒక్కటీ గుర్తురాలేదు.
"వీరాచారీ! ఇవాల్టినుంచి నీ నోట మంత్రోచ్చారణ మాత్రమే ఉండాలి. ఉచ్ఛాటన వినిపించకూడదు. గుర్తుంచుకో! జాగ్రత్త! లేకపోతే..." మృదుగంభీరస్వరంతో అంటున్న వెంకమాంబ మాటలు పూర్తికాకుండానే వీరాచారి లేచి వెంకమాంబకి సాష్టాంగ నమస్కారం చేసి,
"అమ్మా! అపరాధం మన్నించు, మరెప్పుడు నా మంత్రశక్తిని దుర్వినియోగం చెయ్యను" అన్నాడు.
అక్కడ ఉన్న వాటినన్నింటినీ తుడిచి, పోగుచేసి మూటకట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. సోమయాజికి తన వారందరి మధ్య పరువుపోయినట్టయింది. తన పెద్దరికానికేదో మచ్చ వచ్చినట్టనిపించింది.
"ఇది మామూలు దెయ్యంకాదు. బ్రహ్మరాక్షసి. ఇంకా పెద్దమంత్రగాణ్ణి తేవాలి" అని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. అదేదో అప్పటికప్పుడు తీసుకుని వచ్చే చిన్న వస్తువులాగా.
మంత్రోచ్చారణకి, మంత్రోచ్ఛాటనకి మధ్య తేడా మూడేళ్ళపిల్లకి ఎట్లా తెలిసింది? అని అంతో ఇంతో చదువుకున్న వాళ్ళసందేహం. వీరాచారి చేతులెత్తి పారిపోవటం ఎంతో మందికి ఎన్నో సందేహాలని కలిగించింది. కాని, ఎవరి కోసమో సోమయాజితో విరోధం తెచ్చుకోవటం ఎందుకని ఎవరూ నోరెత్తలేదు. అందరూ మౌనంగా అక్కడినించి నిష్క్రమించారు. వెంకమాంబ చిరునవ్వుతో తాతగారి ఒడిలో చేరింది. ఆయన పిల్లని ముద్దులతో ముంచెత్తారు. వెంకటేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు మనసులోనే. తలుపుచాటునుంచి అంతా గమనిస్తున్న అత్తాకోడళ్ళు బరువుదించినట్లు నిట్టూర్చారు. మంగమాంబ వచ్చి పిల్లని గుండెలకత్తుకుని లోపలికి తీసుకెళ్ళింది. నాయనమ్మ దిష్టి తీసింది.
* * *
వీరాచారి పలాయనంతో సోమయాజి బృందం ఊరుకుంటుంది అనుకోటం భ్రమ అయింది. బ్రహ్మరాక్షసిని పోగొట్టటానికి సరైనవి తురకమంత్రాలే అని నిశ్చయించాడు సోమయాజి. ఒకవేళ అది బ్రహ్మరాక్షసికాక, తురక దెయ్యం అయినా తురకమంత్రంతో పలాయనం చిత్తగిస్తుంది అని అందరికీ నచ్చచెప్పాడు. కృష్ణయార్యుడి కుటుంబ సభ్యులందరికీ గుండెల్లో రాయిపడింది. కాని చెయ్యగలిగిందేమీ లేదు. వీరాచారి బారినుండి తమ కులదైవం చాముండేశ్వరిగా రక్షించినట్లే ఫకీరుల బారినుండి కూడా ఏదో రూపంలో తమ వరపుత్రుని ఆ శ్రీనివాసుడే రక్షించాలి అని ప్రార్థనలు జరిపారు.
శుక్రవారం ముహూర్తం పెట్టాడు మౌల్వీ. తీర్థయాత్రలు చేసి ఒక ఫకీరు వస్తున్నాడట. అతడు అరబ్బీభాషలో పండితుడు, ఖురాన్ ముందునుండి వెనక్కి, వెనకనుండి ముందుకి చూడకుండా అప్పచెప్పగలడుట. మంత్రాలు బాగా తెలుసుట! ఎన్నో సాధనలు చేశాడుట! ఎప్పుడూ జపం చేస్తూనే ఉంటాడుట. జపమాల నిరంతరం అతడి చేతుల్లో కదులుతూనే ఉంటుందిట!