Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 8

ఇల్లొక బృందావనం అయింది. నిరంతరం కృష్ణస్మరణం ఇంట్లో ఎవరినోట విన్నా కృష్ణ కీర్తనమే. పలకరింపులు, పులకరింపులు, పలవరింతలూ, ప్రల్లదనాలు కూడా కృష్ణమయమే పసిపిల్ల ముద్దుకోసం అని సర్వం కృష్ణమాయం చేసిన వారికి ఇప్పుడది అలవాటయ్యింది. కృష్ణయార్యుని తండ్రికి ఎంతో అద్భుతంగా, ఆనందంగా అనిపిస్తోంది. అందరూ మౌలికంగా ఆస్తికులే. భక్తులే. కాని అంతా కృష్ణార్పణంగా జీవితం సాగించటం ఇప్పుడే అలవాటు అయింది. వెంకమాంబ ఏడవకుండా ఉండటం కోసం ఎవరో ఒకరు తోచిన విధంగా సంకీర్తనమో, స్తుతో, పాటో పలుకుతూనే ఉంటారు. మేలుకున్న దగ్గర నుంచి నిద్రపోయేదాకా అన్ని మాటలూ, చేతలూ కృష్ణపరమే. ఒక్కబిడ్డ కోసం నలుగురిలో ఇంతటి మార్పు రావటం ఎంత విశేషం!
ఆటల్లో అందరూ నందయశోదలూ, బలరాముడూను. తాతగారు ప్రతిరోజు ఒకటైనా కొత్త కథచెప్పనిదే వెంకమాంబ నిద్రపోదు. భాగవత కథలు ముఖ్యంగా కృష్ణకథలు ఎంతో ఇష్టం. మర్నాడు ఆటల్లో ఆ కథాంశాలే.
ఒకరోజు బియ్యం కడిగివడేసే వెదురుబుట్టని తనచేతిపైన పెట్టుకుని
"అందరూ రండి. గోవర్ధన పర్వతం కింద దాక్కోండి" అంటుంది.
ఇంకోరోజు ఇంట్లో చీరలన్నీ తెచ్చి చుట్టలుగా చుట్టి వాటిమీద ఎక్కి "ఇదిగో ఇదే కాళియ మర్దనం" అంటుంది.
మరోసారి పాలకుండ కింద పెట్టే కుదురు తెచ్చి దానిని దొర్లించి
"కృష్ణుడు శకటాసురుణ్ణి ఇట్లాగే ఎగరగొట్టాడు" అంటుంది.
ఇంటిల్లిపాదికీ నిత్యభాగవత జీవనమే మూడేళ్ళ వెంకమాంబతో.
                                   * * *
"ఈ సంగతి తెలుసా లక్ష్మిందేవీ!" పారిజాత బిందె చెరువులో ముంచుతూ అడిగింది.
    "నువ్వు చెప్పలేదుగా ఇంకా!" లక్ష్మిందేవి మూతిమూడు వంకర్లు తిప్పింది.
   రామక్క వచ్చి ఇద్దరిమధ్య నిలబడింది తనకెక్కడ వినపడదో అని.
    "మంగమ్మ కూతురికి గాలి సోకిందట!"
    "అయ్యో! పాపం!" రామక్క సానుభూతిగా అంది.
    "దెయ్యం పట్టిందా?" లక్ష్మిందేవి కుతూహలంగా అంది.
    "ఏమోమరి. అట్లాగే ప్రవర్తిస్తోంది" పారిజాత అంది.
    "నువ్వు చూశావా?"
    "ఎప్పుడూ అందరినీ దేవుడి పాటలు పాడమంటుందిట!..." ఆగింది పారిజాత అందరూ తన మాటలు వింటున్నారో లేదే చూడటానికి. అందరి కళ్ళు చెవులూ తన మీదే ఉన్నాయని నమ్మకం కుదిరింది. కొనసాగించింది.
    "ఇంట్లో అందరినీ యశోద, నందుడులాగా నటించమంటుందిట. తనని కృష్ణుడులాగా అలంకరించ మంటుందిట."
    "మంచిదేగా! ఇంట్లో అందరికీ భక్తికదా! అందులోనూ మంగమాంబ కడుపుతో ఉన్నప్పుడు విపరీతమైన భక్తితో ఉండేదికదా! పిల్లకి తల్లి కడుపులో ఉండగానే భక్తిబీజం పడింది కాబోలు. అందుకే అంతభక్తి" - రామక్క అంది.
    "అంత వరకు అయితే పరవాలేదు. బాగా ముదిరిపోయింది ఎప్పుడూ ఎవరితోనో మాట్లాడుతూనే ఉంటుంది గాలిలోకి చూస్తూ. మన లోకంలోనే ఉండదుట"
    "ఇంట్లో వాళ్ళు అది భక్తి అని, పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నారుట."
    "పాపం! వాళ్ళకి కూడా దెయ్యం పట్టిందేమో!" రామక్క జాలిగా అంది.
    "ఊరుకోండి మీ పిచ్చిమాటలు దేవుడికి నిత్య పూజలు, ధూపదీపనైవేద్యాలు ఉన్న ఇంట్లో దెయ్యాలూ ఉండవు, భూతాలూ ఉండవు. ఆ పిల్ల కారణజన్మురాలై ఉంటుంది" స్నానం పూర్తి అయి ఒడ్డుకి వచ్చిన నాంచారమ్మ కసురుకుంది.
    "అయినా ఎవరెట్టా పోతే మనకెందుకు?" పారిజాత విసవిసా నడిచింది బిందె చంకన పెట్టుకుని.
    "అంతేలే!"
    ఒక్కొక్కరూ ఇంటిముఖం పట్టారు, చంకన బిందెతోపాటు మనసులో ఒక అనుమాన బీజాన్ని కూడా మోసుకుంటూ.
                                                           * * *
    వీధి అరుగుమీద కూర్చుని ఏదో ఆలోచనలో నిమగ్నమై ఉన్నారు కృష్ణయార్యుని తండ్రి. ఆయన మనసులో సోమయాజి అన్నమాటల పదేపదే గుర్తుకి వస్తున్నాయి. 'జనులు ఎంత మూర్ఖులు! మామూలుకన్న కొద్ది భేదం ఉంటే అదేదో మహాపరాధం అన్నట్టు ప్రవర్తిస్తారు. ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క లక్షణం ప్రాధాన్యం వహిస్తుంది. అంత మాత్రాన అది పిచ్చో, దెయ్యమో భూతమో అనుకుంటే ఎట్లా? గొప్పవాళ్ళంతా ప్రత్యేకంగానే ఉంటారు. అందరిలాగా ఉంటే వాళ్ళూ అందరిలో ఒకరై పోతారు. ప్రత్యేకత ఉండదు. ఇంతమాత్రం తెలియదు. తనే పెద్ద వేత్తననుకుంటాడు, ఆయన బ్రాహ్మణీకాని కంతా పెద్ద. ఆయన మాటకాదనటానికి వీలులేదు. వాడవాడంతా కట్టు కడుతుంది. అవుననటానికి మనసురాదు, అది సత్యంకాదు కనక. పసిబిడ్డకి దైవం కనపడటం వింతేమీ కాదే! అందరు పసిపిల్లలకీ కనపడతాడనే అంటారు కదా! వాళ్ళు నిద్రలో నవ్వుతుంటే దేవుడు వాళ్ళని మెచ్చాడని, అకారణంగా ఏడుస్తుంటే తిట్టాడనీ పసిపిల్లలున్న అందరి ఇళ్ళలో అనుకునేమాట. అందరికీ నెలల వయసులో మాత్రమే దైవదర్శనం అవుతూ ఉంటే తమ వర ప్రసాదినికి ఆ అదృష్టం మూడేళ్ళవరకు లభించింది. ఇది గొప్ప విషయం. ఈ అదృష్టం లేనివాళ్ళు అసూయ పడవచ్చు.
    "అవును! సోమయాజికి మూర్ఖత్వంతోపాటు అసూయకూడ ఉండి ఉంటుంది. అతగాడి ఈర్ష్య చాలా సందర్భాల్లో బయటపడింది కాని, ఏం చేయలేక పోయాడు. ఇప్పుడు అభంశుభం ఎరగని పసిపిల్లమీద తన ప్రతాపం చూపిస్తున్నాడు.
    "ఇందులో తను చెయ్యగలిగిందేమీలేదు. కనక బాధపడి ప్రయోజనం లేదు. చెయ్యగలిగిందీ, చెయ్యవలసిందీ భగవంతు డొక్కడే. తన భక్తుని కాపాడుకోటం ఆయన బాధ్యత. అందులోనూ పసిపిల్ల. లోకం తెలియదు.
    ఆ ఏడు కొండలవాడు తనిచ్చిన ప్రసాదాన్ని తనే జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రహ్లాదుడిని, ధ్రువుణ్ణి రక్షించిన వాడికి, తన మనవరాలిని కాపాడుకోటం చిటికెలో పని. ఆయన్ని ప్రార్థించటం ఒక్కటే కర్తవ్యం.'
    అప్రయత్నంగా చేతులు జోడించి, శిరసుపైభాగానచేర్చి గట్టిగా అన్నారు. "ఏడుకొండల వాడా! వెంకట రమణా! అనాథ రక్షకా! దీనశరణ్యా! ప్రహ్లాద వరద! పాహిమాం! పాహిమాం!"
    లోపలినుండి ఆయన భార్య వచ్చింది ఏమయిందా అని, అదే అడిగింది కూడా.
    "ఏంలేదు. ఏదో ఆలోచిస్తూ అన్నాను. అంతే! లోపలికి వెళ్ళు" అన్నారు. ఆవిడ కొంగు పట్టుకుని ఉన్న వెంకమాంబకూడ నాయనమ్మతో లోపలికివెళ్ళింది. అటే చూస్తూ ఉండిపోయాడాయన, ఆ పసిదాని నడకలో ఉన్న విశ్వాసాన్ని, దర్పాన్ని గమనిస్తూ.
    ఆయన ఏకాగ్రదృష్టిని సోమయాజిరాక చెదరగొట్టింది. అలికిడికి వీధివైపు తిప్పారు చూపుని. సోమయాజి, వెనక వీరాచారి వస్తూ కనిపించారు. వీరాచారికి మంత్రగాడనే పేరుంది. ఎటువంటి భూతప్రేతాలనైనా పోగొడతాడని, నుదురు బెదురులు వదిలిస్తాడని, రోగాలు రొష్టులు తగ్గిస్తాడని, గ్రహాలని శాంతింపచేస్తాడని చుట్టుపక్కల చాలా గ్రామాలవారి నమ్మకం. దానికి తగ్గట్టుగానే ఉంటుంది వీరాచారి రూపం. ముఖాన నుదురంతా పరుచుకున్న కుంకుమ, పిలక ఎంత పెద్దదంటే, ఆడవాళ్లలాగా చక్కగా సిగచుట్టవచ్చు. ముఖంలో సహజంగా ఉండే కాఠిన్యాన్ని తెచ్చి పెట్టుకున్న ప్రశాంతతో కప్పిపుచ్చే ప్రయత్నం కనపడుతుంది జాగ్రత్తగా చూసేవాళ్ళకి. వీరాచారిని ఎప్పుడు చూసినా ఏదో అసహనం కలిగేది. ఇప్పుడొక్కసారి వళ్ళు జలదరించినా, మరుక్షణం మామూలు స్థిరత్వం వచ్చేసింది.

 Previous Page Next Page