ఎప్పుడెప్పుడా అని సోమయాజి ఉబలాటపడిపోతున్నాడు. వెంకమాంబ ఇంట్లోవాళ్ళు ఆ గండం ఎట్లా గడుస్తుందా అని క్షణమొక యుగంగా గడుపుతున్నారు.
అనుకున్న శుక్రవారం రానే వచ్చింది.
"వెంకమ్మని మసీదు దగ్గరికి తీసుకురమ్మని" వర్తమానం పంపాడు సోమయాజి.
తప్పనిసరి అయి కృష్ణయార్యుడు తండ్రిని, వెంకమాంబని తీసుకుని మసీదుకి బయల్దేరాడు. వాళ్ళని అల్లంత దూరంలో ఉండగా చూసిన ఆ ఫకీరుకి ఆ ఐదేళ్ళ పసిబిడ్డ 'అరబ్బుకాలి'లాగా కనిపించింది. మంత్రోపాసన చేసినప్పుడు దర్శనం ఇవ్వని మంత్రాధి దేవత ఇప్పుడు దర్శనం ఇచ్చిందే అని ఆనందించేలోపే తనని "కాఫిర్" అని సంబోధించి నట్లనిపించింది. అటూ ఇటూ చూస్తుంటే "నిన్నేరా బద్మాష్!" అన్నట్టుగా తోచింది.
"నీ విద్యలు నా మీద చూపుతావా?" అని కన్నెర్ర చేసినట్టనిపించింది.
తనశక్తి అంతా తననుండి జారిపోతున్నట్టు, తను నిర్వీర్యమౌతున్నట్టు, ఆ కంటిచూపులమంటలో తాను దగ్ధమైపోతున్నట్టు....
ఒళ్ళంతా మంటలు, కళ్ళుమంటలు, ముక్కులు చెవులలోంచి ఆవిర్లు, కడుపంతా మంట, గుండెల్లోమంట...
అంతామంటలు! మంటలు!! వేడి! సెగలు! పొగలు! నెమ్మదిగా కూడదీసుకుని అక్కడే ఆగిపొమ్మని సైగచేశాడు.
సోమయాజి "అదేమిటి?" అని ప్రశ్నించాడు.
"ఆడవాళ్ళు మసీదులోకి రాకూడదు."
"చిన్నపిల్లేగా!"
"అయినాసరే!" అన్నాడు కొంచెం సమయం చేజిక్కించుకోటానికి.
తానేమీ చెయ్యలేడు. తన శక్తులు తక్కువేం కావు. కాని, ఇక్కడ పనికిరావు. ఏదో విధంగా పరువు కాపాడుకోవాలి. మనసులోనే అల్లాని ప్రార్థించాడు. మహమ్మదు ప్రవక్తని తనకు సహాయపడమని వేడుకున్నాడు. తాను సాధించిన మంత్రాల అధిదేవతలనందరినీ తనకు సహాయపడమని కోరాడు. తన సంప్రదాయంలోని గురువులందరితోడ్పాటునీ అర్థించాడు.
"నేను చేసే ప్రయోగం ఒంటరిగా చేయాలి. మీరంతా మసీదులోకి వెళ్ళండి. నేనీ బేటీని పాకలోకి తీసుకువెళ్ళి పూజచేస్తాను" అన్నాడు.
పిల్లని ఒంటరిగా ఫకీరుతో పంపటానికి ఎవరూ అంగీకరించలేదు.
ఆ ఘనమైన దృశ్యాన్ని చూచే అదృష్టం కోల్పోతామని సోమయాజిబృందం, పిల్లని ఒంటరిగా ఏం చేస్తాడోనని కృష్ణయార్యుని బృందం ఒప్పుకోలేదు.
"అయితే దూరంగా ఉండి చూడండి! మంత్రాలు ఎవరూ వినకూడదు. వింటే పిచ్చిపడుతుంది" అన్నాడు ఫకీరు.
అందరూ దూరంగా వెళ్ళి నిలబడ్డారు.
భయపడుతూనే వెంకమాంబని చూసి
"అమ్మా! రా!" అని చెట్టుకిందకి నడిచాడు.
వెంకమాంబ అతడిని అనుసరించింది.
"అమ్మా! కాలీ! నన్ను క్షమించు తల్లీ! నువ్వని తెలియక వచ్చాను. అయినా ఈ వంకన నీ దర్శన భాగ్యం లభించింది. నా పరువు నిలుపుకోటానికే ఇటు పిలిచాను. నా అహంకారం నశించింది. నన్ను కాపాడు" అంటూ గుగ్గిలం, సాంబ్రాణి ధూపం వేశాడు. ఆ పొగని వెంకమాంబ అతడి ముఖంపై ఊదింది. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నెమలీకల కుచ్చుని పాదాల దగ్గరపెట్టి దానితో విసనకర్రలాగా వీచాడు. అతడి చేతిలో ఉన్న దాన్ని తీసుకుని అతడి వీపుపై కొట్టింది. అది నిజానికి అతడు చెయ్యవలసిన పని. "బుద్ధిగా మసలుకో! మంత్రశక్తిని దుర్వినియోగం చెయ్యకు" అంది. "అచ్ఛా! అమ్మా! జరూర్!" అన్నాడు. దూరంనుండి ఇదంతా చూస్తున్న వాళ్ళకేం జరుగుతోందో అర్థం కావటంలేదు.
పదినిమిషాలు కష్టంమీద గడిపి, చిన్నారి వెంకమాంబని ఎత్తుకుని తెచ్చి, "ఇప్పుడు బేటీ అల్లాతో సమానం. ఏ చెడూలేదు. అంతా పూజచెయ్యచ్చు" అన్నాడు.
"కాడ్ బీబీలాగానా?" అంది వెంకమాంబ.
అందరినీ తెరిచిననోళ్ళు అలాగే ఉండి పోయాయి. మహమ్మదీయ మత సంప్రదాయంలోని వివరాలన్నీ ఎట్లా తెలుసీపిల్లకి అని.
నెలరోజులీ ప్రాంతంలో తిరుగుతూ మసీదులో ఉంటానని చెప్పిన ఫకీరు మరుక్షణం జోలెసద్దుకుని బయల్దేరాడు. కారణం ఎవరికీ అంతుబట్టలేదుకాని ఊహించగలిగారు కొంతమంది. సోమయాజి ముఖం జేవురించింది. ఏమనటానికీ వీలులేని పరిస్థితి. తన గెలిచినట్టా? ఓడినట్టా? తోటివారికేం చెప్పాలి?
తండ్రి ఒక చెయ్యి, తాత ఒక చెయ్యి పట్టుకుంటే విలాసంగా నడిచివెళ్ళింది వెంకమాంబ సోమయాజి ముందునుండి
ఫకీరు దగ్గర ఏవైనా శక్తులు సంపాదిద్దామని అక్కడికి చేరిన వారిలో మురాషావలి వారిని అనుసరించాడు. పదిహేనేళ్ళ మురాషావలికి వెంకమాంబలో ఒక సోదరి, గురువు, దైవం గోచరించారు.
* * *
సుబ్బన్న దీక్షితులు ఆ ఊరి పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేసే గురువు. అందరితోపాటు వెంకమాంబకూడ ఆయనదగ్గర అక్షరాలు దిద్దింది. ఇంటి అరుగుమీద పిల్లలని మందవేసి వ్రాయను, చదవను నేర్పుతాడు. నేలమీద ఇసుకో, బూడిదో పోసి, దానితో వేలితో అక్షరాలు రాయటం నేర్పిస్తాడు. కొన్ని పద్యాలు, పాటలు నోటి లెక్కలు కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగహారాలు - ఇంతలో ఆడపిల్లలకి పెళ్ళీడు వస్తుంది. అంతే వారి చదువు. మగ పిల్లలయితే మదనపల్లె వెడతారు పై చదువుకి.
అక్షరాలు దిద్దమని పద్యం వల్లెవేయమని చెప్పి గురువుగారు లోపలికి వెళ్ళగానే అందరూ వెంకమాంబ చుట్టూ చేరేవారు. అప్పటికే గుడిలో ఆటలమధ్య వెంకమాంబ తన మిత్రబృందానికి కథలు చెప్పటం అందరికీ తెలిసిపోయింది. బాగా చెపుతుందని కూడా ప్రచారమయ్యింది. కృష్ణగుణగానం వెంకమాంబకి ఎంతో ప్రీతికరం. అడిగిందే తడవుగా తను తాతగారు అమ్మలా నుండి విన్న పురాణగాథలన్నీ చెప్పేది. గురువుగారికి పిల్లలందరూ వెంకమాంబ చుట్టూ చేరటం కొంచెం కష్టం అనిపించినా, సంతోషమే కలిగేది. ఎందుకంటే బడివదిలిపెట్టి తానెన్ని పనులు చేసుకున్నా క్రమశిక్షణ సమస్య లేదు. పైగా తను చెప్పకుండానే విధ్యార్దులకి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. తనపని తేలిక అవుతోంది. అంతేకాదు తాను చిన్నప్పుడేదో చదువుకుని మర్చిపోయిన విషయాలు గుర్తుచేసుకోటం, అసలే చదవనివి తెలుసుకోటం జరుగుతోంది. తన పాఠశాల చండామార్కుల ఆశ్రమంలా ఉందని రోజుకొక్కసారైనా అనుకుంటాడు. ప్రహ్లాదుడిలాగా వెంకమాంబ ఉంటేచాలు.
ఒకరోజు వెంకమాంబ ప్రహ్లాదుడి కథ చెపుతోంది. అందరూ శ్రద్దగా విన్నాడు. వెంకన్న అనే కుర్రాడికి ఒక సందేహం వచ్చింది. అంతలో అక్కడికి వచ్చిన గురువుగారిని అడిగాడు.
"అయ్యగారూ! భక్తి ఉండాలి సరే! తండ్రి మాట కూడా వినాలి కదా! ప్రహ్లాదుడు తండ్రి మాట వినలేదు. విష్ణుమూర్తి కనపడి రక్షించాడు. మరి మేము తల్లితండ్రుల మాట వినాలా? ప్రహ్లాదుడిలాగా ఎదిరించాలా?"