స్కూల్ కి దూరంగా ఒక చిన్న గదిలో ఒంటరిగా వుంటూంది ఆమె. ఆ గదిలో సామాన్లు కూడా ఏమీలేవు. గోడమీద మాత్రం, ఒకరి తరువాత ఒకరుగా వెళ్ళిపోయిన తండ్రి, తమ్ముడు, చెల్లి, తల్లి ఫోటోలు వున్నాయంతే.
గదికి వచ్చి ఫ్లాస్కులో వున్న టీ తాగి, పిల్లల ఎక్సర్ సైజు పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది. ఆమె పుస్తకాలు దిద్దటం పూర్తి చేసేటప్పటికి టైమ్ ఎనిమిదయింది. మరీ ఆలస్యంచేస్తే బావోదని ఆమె తయారయి బయల్దేరింది.
ఆ రోజే ప్రార్థనా, ఆమె తండ్రి వసుమతిని భోజనానికి పిలిచింది. ఆమె వెళ్ళేసరికి ప్రార్థన ముందు వరండాలో నిలబడి చూస్తూంది. టీచర్ ని చూడగానే ఉత్సాహంగా మెట్లు దిగుతూ "రండి టీచర్" అంది. వసుమతి గేటు తెరుచుకుని లోపలికి ప్రవేశించింది.
చుట్టూ బాగా ఖాళీస్థలం వున్న ఇల్లు అది. ఖాళీలో వున్న మొక్కలు సరయిన పోషణ లేక అస్తవ్యస్తంగా పెరిగినా, అదో రకమైన శోభనిచ్చినయ్. 1910 సంవత్సరపు కట్టడం అది. క్రింద పోర్షను మేడ అయినా పై రెండు గదుల మీదా పెంకులున్నాయి. కప్పు చాలా ఎత్తుగా వుండటంవల్ల హుందాగా వుంది. పైన గోడ అక్కడక్కడా పెచ్చులూడిపోయినా అంతగా పట్టించుకోలేదు భార్గవ. ఇంటి పక్కనించి పైకి చెక్కమెట్ల కట్టడం వుంది. బ్రిటిషు కాలంనాటి కలెక్టరాఫీసులా వుంటుంది ఆ ఇల్లు. ఈ రకమైన వాతావరణం అంటే భార్గవకు చాలా యిష్టం.
"చాలా సేపట్నుంచి చూస్తున్నాను టీచర్ మీ కోసం" అంది ప్రార్థన. ఆ పాపకి టీచర్ తమ మాట మన్నించి ఇంటికి రావటం, ప్రెసిడెంట్ సాధారణ స్నేహితుడి ఇంటికి వచ్చినట్టు వుంది. వసుమతి జిన్నీని దగ్గరికి తీసుకుంటూ "ఎంతమంది చెల్లెళ్లు నీకు?" అనడిగింది.
"మేమిద్దరమే టీచర్? శ్రీనూ కూడా మాతోనే వుంటాడు" అంది ప్రార్థన.
"శ్రీనూ ఎవరూ?"
ఆమె వళ్ళో కుందేలు పిల్లలా కూర్చొని వున్న జిన్నీ కదలకుండానే "... పాలూ నీళ్ళలాగా మా జీవితాల్తో పెనవేసుకుపోయిన శ్రీనూ నాకు బావ. ఏ శక్తీ మమ్మల్ని వేరుచెయ్యలేదు" అంది. ఒక్కసారిగా వళ్ళో బాంబు పడినట్టూ వసుమతి ఆ మాటలకి బెదిరి జిన్నీవైపు చూసింది.
ప్రార్థన ఆమె కంగారు గుర్తించి, "భయపడకండి టీచర్! జిన్నీ, శ్రీనూ అప్పుడప్పుడు అలానే మాట్లాడతారు" అంది.
"అప్పుడప్పుడా" అంది అయోమయంగా వసుమతి.
"అవును టీచర్; వారానికి రెండు మూడు రోజులు అలా మాట్లాడుకుంటారు. తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతారు. కారణం తెలీదు. డాడీ డాక్టర్ కి చూపించారు కూడా, అయినా తగ్గలేదు".
"డాడీ ఏరీ?"
తొందర తొందరగా మాట్లాడుతున్న ప్రార్థన ఒక్కసారిగా ఆగి ఆ ప్రశ్నకి జవాబు చెప్పటానికి తటపటాయిస్తూ "ఇంకా రాలేదు" అంది. వసుమతికి కూడా ఇది ఇబ్బందికరమయిన పరిస్థితే- విందుకు పిలిచిన హోస్టు ఇంట్లో లేకపోతే గెస్టు వచ్చి కూర్చోవటం- కానీ ఆమె వెంటనే, ప్రార్థన పరిస్థితి గమనించింది. తన రాకవల్ల ఆ చిన్న పిల్ల మొహంలో కనపడిన సంతోషం, తండ్రి లేకపోవటంవల్ల పడ్తున్న ఇబ్బందీ- అన్నీ చూడగలుగుతూంది. ఒక టీచర్ గా పిల్లల మనస్తత్వాన్ని చదవగలగటం ఆమెకు కష్టమేమీ కాదు. తనే ఆ పరిస్థితి నుంచి ఆ పిల్లల ఆలోచనను మార్చటానికి ప్రయత్నిస్తూ, "నాకు మీ ఇల్లు చూపించరా ఏం?" అనడిగింది. ఆమె ట్రాప్ లో వాళ్ళు సరీగ్గానే పడ్డారు- ముగ్గురూ ఉత్సాహంగా "రండి టీచర్, రండి" అని అన్ని గదులూ చూపించారు.
వసుమతికి తన గది జ్ఞాపకం వచ్చింది. ఈ పిల్లలు చాలా ఒద్దికతో, క్రమశిక్షణతో తమ చేతనయినంతలో ఈ యింటిని అందంగా తీర్చి దిద్దుతున్నారు. చాలా మంచి పిల్లలు. కాని ఎక్కడో ఏదో లోపిస్తూంది. ఆ లోపాన్ని నిస్తేజంగా వున్న ఆ గదుల గోడలూ, వంటిల్లూ చెపుతున్నాయి.
"డాడీ వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో, మనం భోజనం చేసేద్దామా" అంది ప్రార్థన.
సాధ్యమయినంత వరకూ పెద్దమనిషి తరహా ఆ ఇంటి బాధ్యతలు స్వీకరించటానికి ఆ పన్నెండేళ్ళ పాప చేసే ప్రయత్నాలు చూస్తూ వుంటే వసుమతికి లోలోపల నవ్వొస్తూంది. దాన్ని కనపడనివ్వకుండా "ప్రతిరోజూ ఇలాగే అవుతుంటుందా?" అనడిగింది.
"అవుతూ వుంటుంది. ఎప్పుడైనా మరీ అవసరం అయితే తప్ప ఫోన్ ఇవ్వరు".
"డిస్టర్బ్ అవుతుందనేమో".
"ఫోన్ చెయ్యనా"
"ఉహు. వద్దు వద్దు" అంది వసుమతి. "మీరు చేసెయ్యంది భోజనం. నేను ఉంటాను".
ప్రార్థన వప్పుకోలేదు. కానీ మరో అరగంట గడిచేసరికి ఆకలికి ఆగలేక పోయింది. ముగ్గురికీ వడ్డించింది వసుమతి.
"కూరలో కొంచెం ఉప్పు తక్కువైంది జిన్నీ" అన్నాడు శ్రీనూ భారంగా.
"నన్నపార్థం చేసుకోకు శ్రీనూ. నీ జ్ఞాపకాల్లో పడి ఉప్పు వేయటం మర్చిపోయి వుంటాను".
"నేనంత దుర్మార్గుణ్ని కాదు జిన్నీ..."
"అంత త్యాగాన్ని నేను భరించలేను శ్రీనూ! నేను ముత్తయిదువగానే నన్ను ఈ లోకంనుంచి వెళ్ళిపోనీ".
ప్రార్థన అరచేతిలోనికి నీళ్ళు తీసుకొని వాళ్లిద్దరి తలమీద నూనె మర్దించినట్టూ మర్దించింది. వసుమతి అదిరిపోయి వాళ్ళవైపు చూడసాగింది. వారానికి రెండ్రోజుల పాటూ సోకే ఈ గాలి ఏమిటో ఆమెకి అర్థంకాలేదు.
అంతలోనే పిల్లల భోజనాలు పూర్తయ్యాయి.
రాత్రి తొమ్మిదిన్నరయింది. పిల్లలు నిద్రకు జోగసాగారు. వసుమతి ఇప్పుడు నిజంగా ఇరకాటంలో పడింది. "నేను వెళతాను, మళ్ళీ ఇంకొకసారి వస్తాను" అంది.
"వద్దు టీచర్, ప్లీజ్" అంది అర్థిస్తున్నట్టు. "డాడీ వచ్చేస్తూవుంటారు. ఇంత ఆలస్యం ఎప్పుడూ చెయ్యలేదు. బహుశా ఏదో మీటింగ్ వుండి వుంటుంది".
* * *
మీటింగు జరిగి, మెట్లు దిగుతూంటే, శేఖరం అన్నాడు.
"నేను జీవితంలో భయపడేది మూడింటికే గురూగారూ! అందులో ఒకటి, మైకు పట్టుకుని వదలని మనిషి".
"మిగతా రెండూ ఏమిటి?"
"రెండోది పందికొక్కు"
భార్గవ నవ్వాపుకొని ".... పందికొక్కా" అనడిగాడు.
"అవును. చిన్నప్పుడు నిద్రపోతూంటే నా కాలి చిటికెన వేలు కొరికింది. అప్పట్నుంచీ అదంటే భయం"
"... మూడోది"
"మ్మ్ మ్మ్ మ్మ్... మూడోది చెప్పక తప్పదంటే చెపుతాను. స్త్రీ అంటే అందరూ కాదు, డేపంజాతి స్త్రీ"