భార్గవ చేతిలోంచి ఫోన్ జారిపోయింది. మనసంతా చికాకైన భావన. అ కుర్రవాడిని అతడు చూడను కూడా లేదు. కానీ ... కానీ...
మరియమ్మ దీనవదనం కళ్ళముందు కదలాడింది. ప్రొద్దున్నే ఆమె ఆశీర్వదించింది- "నిన్నూ, నీ పిల్లల్ని ప్రభువు చల్లగా చూస్తాడు బాబూ" అని.
ప్రభువు!!
ఒక చిన్నారి గులాబీ పూర్తిగా విచ్చుకోకముందే దాని రేకుల్ని నిర్థాక్షిణ్యంగా నలిపివేసే కాన్సర్ ని సృష్టించింది ఆ ప్రభువే అయితే అతడి చల్లదనం నాకఖ్కర్లేదు.
5
కొన్ని కొన్ని సంఘటనల ప్రభావం మనిషి మీద విపరీతంగా వుంటుంది. పర్సు జేబులో పెట్టుకోవడం మర్చిపోవడం వల్ల రైలుమిస్సయి ఆ రైలుకి తరువాత ఆక్సిడెంటవ్వచ్చు. కేవలం పర్సువల్ల మనిషి రక్షింపబడవచ్చు.
ఒక సిటీబస్సు ఎక్కబోయి, ఆ డ్రైవరు ఆపక ఇంకో బస్సు ఎక్కవలసివస్తే, అందులో చిన్నప్పుడు తెలిసిన అమ్మాయి కనబడి ఆ పరిచయం వివాహానికి దారితీసి జీవిత గమనాన్నే మార్చెయ్యవచ్చు. ఇలాటి ఉదాహరణలు ఎన్నో.
ఆ రోజు సాయంత్రం టీచర్స్ రూములో వసుమతితో పాటూ డ్రాయింగ్ టీచర్ పద్మావతి, శారద కాక మరో ఇద్దరు టీచర్లు కూర్చుని వున్నారు. అయిదున్నరయింది. చీకటి పడబోతూంది.
పద్మావతి టీచర్ పుస్తకాలు ఎక్కువ చదువుతుంది. అందులోనూ ఇంగ్లీషు నవలలు మరీను. ఆ రోజు పేపరు బల్లమీద వుంటే యధాలాపంగా తీసి చూస్తూ 'అరె' అంది. అందరూ అటు చూసేరు.
"ఐయామ్ రాండ్ పాసెస్ అవే" అంది హెడ్డింగ్ చదువుతూ.
"ఐయామ్ రాండ్ ఎవరు?" అని అడిగాడు ఒక డ్రాయింగ్ టీచర్.
"ఫౌంటెన్ హెడ్ అని, ఒక గొప్ప నవల రైటర్".
ఎవరూ మాట్లాడలేదు. ఆ వార్తతో పద్మావతి బాగా డిస్టర్బ్ అయినట్టూ ఆమె మొహమే చెపుతుంది. ఆమె అంటే అందరికీ గౌరవమే. ఎవరి విషయాల్లోనూ జోక్యం కల్పించుకుంటూ ఒక మూల కూర్చొని పుస్తకం చదువుకోవటమో, తనపని తాను చేసుకోవటమో చేస్తూ వుంటుంది. తనలో తానే ఆలోచిస్తున్నట్టూ ఆమె అంది... "చాలా గొప్ప రైటర్, సూడో కమ్యూనిస్టుల్ని దుయ్యబడుతూ నిలబడ్డ ఒకే ఒక రైటరు".
శారద ఎందుకో తెలీదు కానీ ఇబ్బందిగా కదిలింది.
"ఫోటో చూశాను. అరవయ్యేళ్ళ వయసులో కూడా మొహంలో ఒక ధీమా.... వర్చస్సూ వున్నాయి. ఆ స్టెయిల్ మామూలు వాళ్ళకి రాదు. క్రితం సంవత్సరం మనదేశం రావటం జరిగిందట. అది నిజమో కాదో తెలీదు కానీ మన ఎయిర్ పోర్ట్ లో ఒక అరగంట ఆగినప్పుడు చాలామంది అభిమానులు వెళ్ళి చూశార్ట కూడా".
శారద చప్పున "క్రితం సంవత్సరం ఎప్పుడు?" అని అడిగింది. పద్మావతి ఆమెవైపు అనుమానంగా చూస్తూ "క్రితం వేసవిలో" అంది.
"ఆ! నాకు తెలుసు. నా ఫ్రెండ్ రమ్మంటే నేనూ వెళ్ళాను" అంది. అందరూ ఆమెవైపు ఇంటరెస్టింగ్ గా చూశారు. ఉన్నట్టుండి ఆమె ప్రాముఖ్యత అక్కడ పెరిగింది.
"చాలా మందేమీ రాలేదు. ఓ పదిమంది దాకా వుంటాం".
"ఏదీ ఐయామ్ రాండ్ వచ్చినప్పుడా?" విస్మయంగా అడిగింది పద్మావతి.
"ఐయామ్ రాండే! మీరంతగా పొగిడే వర్చస్సు అతడిలో నాకేమీ కనపడలేదు. అఫ్ కోర్స్! మీరు కేవలం ఫోటోలో చూశారు కాబట్టి మోసపోతున్నారు.. నేను చూశాను, మాట్లాడాను కూడా. అసలు అంతమందిలోనూ నన్నూ, నా ఫ్రెండ్ ని గుచ్చి గుచ్చి చూశాడు. నా ఫ్రెండ్ కి ఆటోగ్రాఫ్ ఇస్తున్నప్పుడు వేళ్ళు నొక్కాడట కూడాను".
"ఎవరి సంగతి మీరు చెప్తున్నది? ఐయామ్ రాండ్ సంగతా?"
"అవును, ఆ మహాశయుడి సంగతే. ఫౌంటెన్ హెడ్ సంగతి నా కింకా జ్ఞాపకం. ఆ నవల మీరెందుకు వ్రాశారు అని అడిగాను. నీలాటి అమ్మాయిల అభిమానం సంపాదిద్దామని- అన్నాడు లేకిగా" అంది ఆనాడు జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ శారద. మిగిలిన టీచర్లు యిద్దరూ శారదవైపు అడ్మిరేషన్ తో చూస్తున్నారు. ఐయామ్ రాండ్ ని ఆకర్షించటం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనూ ఆమె చెపుతున్న విషయం మరింత ఇంటరెస్టింగ్ గా వుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక ప్రముఖ వ్యక్తి బలహీనతతో తనుకున్న అతి దగ్గర సంబంధం గురించి.
"మీరు చెపుతున్నది ఐయామ్ రాండ్ గురించేనా?"
"ఆహాఁ? మా ఫ్రెండ్ ఆటోగ్రాఫ్ లో అతడేం వ్రాశాడో తెలుసా? 'నాకు మూడు అన్న నెంబర్ అంటే చాలా యిష్టం. సీరాక్ హోటల్ మూడు పదాల పేరున్న హోటలు.. మూడొకట్లు నా రూమ్ నెంబర్? నా మూడో నవల బాగా పాపులరాయింది. దాన్ని మధ్యాహ్నం మూడింటికి ప్రారంభించాను" అని వ్రాశాడు. మేం అందులో అర్థం అంత గ్రహించలేం అనుకున్నాడు కాబోలు. ఆ రోజు మూడింటికి ఫోన్ చేశాం. హుషారుగా మాట్లాడబోయాడు. తల వాచేటట్లు చివాట్లు పెట్టాం ఫోన్ లోనే. నాకు యింకా జ్ఞాపకం వుంది... అదీ ఐయాన్ రాండ్ చరిత్ర".
"కానీ ఐయాన్ రాండ్ మొగవాడు కాదే. ఆమె ఒక రచయిత్రి..."
ఆ గదిలో బాంబు పేలినట్టయింది. ఇంకా ఏదో చెప్పబోతున్న శారద నోరు సగం తెరిచింది అలాగే వుండిపోయింది. గదంతా నిశ్శబ్దమై పోయింది.
వసుమతి ఒక్కసారి బిగ్గరగా నవ్వబోయి, అతికష్టంమీద ఆపుకుంది. అయినా తెరలు తెరలుగా నవ్వు వస్తూంటే చేతిరుమాలు అడ్డుపెట్టుకుంది. శారద ఆమెవైపు కోపంగా చూడబోయింది. పద్మావతి తన పుస్తకాలు సర్దుకొని ఆమె దగ్గిరకివచ్చి నిలబడి తాపీగా, "కొందర్ని చూస్తే కోపం వస్తుంది. కొందర్ని చూస్తే అసహ్యమేస్తుంది.... మరికొందర్ని చూస్తే మొహంమీద ఉమ్మెయ్యాలనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు జాలేస్తుంది" అనేసి అక్కణ్ణుంచి విసవిస వెళ్ళిపోయింది.
నవ్వుతో ఎర్రబడ్డ తన మొహం కనిపించకుండా వసుమతి తల దించుకుంది. ఏమీ తోచనట్టూ శారద అటూ ఇటూ చూసి ఆ గదిలోంచి బైటకొచ్చేసింది. ఆట స్థలమంతా నిర్మానుష్యంగా ఉంది. పిల్లలు ఇళ్ళకి వెళ్ళిపోయారు. కసీ, ఉక్రోషం కలగలుపుగా ఆమె నల్లటి మొహం మరింత వికృతమైంది. అత్త తిట్టినందుకుగాక తోటికోడలు నవ్వినందుకు అన్న సామెత అక్షరాలా వర్తించినట్టూ ఆమెకి వసుమతిమీద పీకెలదాకా కోపం వచ్చింది. నేలమీద పడివున్న బొగ్గు తీసుకొని విరిగిన గోడమీద బరబరా వ్రాసింది.
'వసుమతి ప్లస్ భార్గవ రాసక్రీడ = జూనియర్ ప్రార్థన' అని.
ఆమె తను వ్రాసిన అక్షరాల వైపు పైశాచిక అనందంతో చూసుకుంది. తననెవరూ గమనించటం లేదుకదా అని మళ్ళీ ఇంకొకసారి చుట్టూ చూసి, సంతృప్తి చెంది, అక్కణ్నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత అరగంటకు వసుమతి స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరింది. అప్పటికే చీకట్లు దట్టంగా అలుముకోవటం వల్ల గోడమీద రాతలు ఆమెకు కనపడలేదు.