భార్గవ విస్మయంతో "పద్మినిజాతి వగయిరా వుందని తెలుసుకానీ డేపంజాతి వుందని నేనెక్కడావినలేదే..." అన్నాడు.
"ఉంది గురూగారూ ఉంది. తన గురించి సెల్ఫ్ పిటీతో ఎప్పుడూ ఆలోచిస్తూ- అందరూ ఎప్పుడూ తన గురించే మాట్లాడుకుంటున్నారని దురభిప్రాయపడే స్త్రీలని డేపంజాతి స్త్రీలు అంటారు. తమ కాంప్లెక్స్ నుంచి బయటపడాలని ఇతరుల సానుభూతిని కోరుతూ వుంటారు వీరు. ఉదాహరణకి మీరు 'రాముడు చాలా గొప్పవాడు. పితృవాక్య పరిపాలనాదక్షుడు. బ్రతికితే రాముడిలా వ్యక్తిత్వంతో పదిరోజులు బ్రతికినా బావుణ్ను. సీతని అడవులకి పంపించటం ఒక్కటే అతను చేసిన తప్పు' అన్నారనుకోండి. ఆ రాముడి దగ్గరికి వీళ్ళు పనిగట్టుకుని వెళ్లి "ఫలానా అన్నాబత్తుల సోమశేఖరం మీ గురించి ఏం అన్నాడో తెలుసా రాముడు గారూ?
మీరు సీతని అడవులకి పంపటం మీకు వ్యక్తిత్వం లేకపోవటాన్ని సూచిస్తుందట. పితృ వాక్యాన్ని ఎంత గొప్పగా అమలు జరిపారో, ఒక చాకలివాడి మాటని కూడా మీరు అంత గొప్పగానూ అమలు జరుపుతారట" అంటారు. అలా అనేసి రాముడి సానుభూతి పొందటానికి చూస్తారు. ఇలాంటి మనుష్యుల మొహంలో ఎప్పుడూ జాలితో కూడిన నవ్వు వుంటుంది. కళ్ళు విచారంగా, సాడిస్టిక్ గా వుంటాయి. ఆంత్రోపాలజీ ప్రకారం ఇలా డేగకళ్ళనూ, పందికొక్కు పళ్ళనీ సంతరించుకున్న స్త్రీలని 'డేపంజాతి స్త్రీలు' అంటారు..."
భార్గవ నవ్వాపుకోలేక "నువ్వు ఎప్పుడూ సీరియస్ గా ఆలోచించవా శేఖరం?" అనడిగాడు.
"పొరపాటు పడుతున్నారు గురూగారూ! సీరియస్ గా ఆలోచించడము వేరు, సీరియస్ గా వుండటం వేరు. సీరియస్ గా ఆలోచించేవాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ వుండకూడదని రూలేం లేదు".
"కానీ నువ్వు కేవలం స్త్రీలనే దుయ్యబట్టడం బావోలేదు. పురుషుల్లో డేపంజాతి వాళ్ళు లేరనా?"
"ఎందుకులేరూ? తప్పకుండా వున్నారు. కానీ వీళ్ళని 'డయోకాన్' జాతి పురుషులంటారు".
"డయో-కానా? అంటే?"
"డయోరియా ఆఫ్ స్పీచ్... కాన్ స్టిపేషన్ ఆఫ్ థాట్"
మళ్లీ నవ్వులు. శేఖరం అన్నాడు- "మన చంపాలాల్ ఆ జాతికి చెందినవాడే. ఏదో పని మీరు చేసుకుపోతూంటే మీ గురించి దుష్ప్రచారం చెయ్యవలసిన అవసరం ఏముంది చెప్పండి? నా వుద్దేశ్యం అతడు డయోకాన్ పురుషుడి సంపర్కంవల్ల డేపంజాతి స్త్రీకి పుట్టినవాడై ఉంటాడు".
భార్గవ మొహంలో నవ్వు మాయమైంది. బాధాపూరిత స్వరంతో అన్నాడు- "అవును, నేనూ వింటున్నాను. నా థియరీని హేళన చేస్తూ అందరి దగ్గరా అంటున్నాడట కదా".
శేఖరం మాట్లాడలేదు.
"కెమిస్ట్రీకి సంబంధించిన అణువు (ఆటం)కీ జీవశాస్త్రానికి సంబంధించిన అణువు (సెల్) కీ ముడిపెట్టటం హాస్యాస్పదమైన విషయమే. కానీ సైన్సులో మనకు తెలిసినంతవరకూ ఏదీ హాస్యాస్పదం కాదు...
...ఇక్కడ నేను చెప్పేది ఎవరూ అర్థం చేసుకోవటానికి ప్రయత్నము చెయ్యటంలేదు. వైరస్ అయినా, క్రోమోజోము అయినా ఏది అయినాసరే అణువులతోనే నిర్మితమై వుండాలి కదా- ఇనుము, ఉదజని, జీవకణానికీ మరణించిన కణానికీ గల భౌతికమైన తేడా ఇంకా శాస్త్రజ్ఞులు కనుక్కోలేదు. జీవకణపు అణువుల్లో వున్న ప్రోటాన్లూ, ఎలాక్రాన్లలో ఏదయినా దారుణమైన మార్పు జరిగి వుండాలి, లేదా అణువుల స్థానభ్రంశమైనా జరిగి జీవకణం చచ్చిపోయి వుంటాయి. జీవకణంలో ఎక్కడో మధ్యలో సూక్ష్మాతి సూక్ష్మమైన మార్పుచాలు దాన్ని చంపివేయటానికి అన్నది నిర్వివాదాంశం! అది కనుక్కుంటే మహమ్మారిలా వ్యాపిస్తూన్న ఈ కేన్సర్ ను నాశనం చేయవచ్చు. కణాల వ్యాప్తిని నిరోధించవచ్చు. అదే కేన్సర్ కి మందు.
అసలు మరణం అంటే కణపు అణువుల్లో జరిగే ఇంటర్ ఛేంజా? అన్నది. దీన్ని తెలుసుకోవటానికి ఇప్పటికి రెండొందల కుందేళ్ళనీ, వెయ్యికి పైగా ఎలుకల్నీ చంపాను గానీ రహస్యం బోధపడలేదు" అంటూ నవ్వాడు విషాదంగా. ".. ఈ పరిస్థితిల్లోనే నాకు కొద్దిగా ఓదార్పు కావాలి. కొద్దిగా ఓదార్పూ- నేనున్నాననే ఒక స్నేహితుడూ...." అంటూ శేఖరం చేతిమీద చెయ్యివేసి "నువ్వు నా పక్కనుంటావా శేఖరం? ఐ యామ్ బాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ సమ్ వన్ లైక్ యూ" అన్నాడు శేఖరం కదిలిపోయి "తప్పకుండా" అన్నాడు. ఆర్ద్రత నిండిన కంఠంతో.
ఏదో తెలియని ఆత్మీయ భావంతో యిద్దరూ కొద్దిసేపు మాట్లాడలేదు. చీకటిలో రోడ్డు నల్లత్రాచులా మెరుస్తూంది. వాతావరణాన్ని తేలిక చేస్తూ శేఖరం "అయితే మీరు నాకు స్నేహితుడూ, బ్రదరూ కాదు" అన్నాడు.
"మరి?"
"డాడీ"
భార్గవ కెవ్వున అరిచినంత పనిచేసి "వ్వాట్" అన్నాడు.
"అవును. ప్రార్థన 'అన్నయ్య' అంది కాబట్టి మీరు మా కందరికీ డాడీ అన్నమాట. ఊరందరికీ మరదలు అంటారే- అలాగే ఊరంతటికీ తండ్రి అన్న మాట".
భార్గవ ఇబ్బందిగా ... "నాకు ఇంకా నలభై నిండలేదు శేఖరం" అన్నాడు.
"ఇంకేం మరీ మంచిది. కంగ్రాచ్యులేషన్స్ నాన్నగారూ! మీరు నాకు మంచి పార్టీ ఇవ్వాలి. చెప్పండి ఈ రోజే ఇస్తారా?"
"ఏమిటి?"
"డిన్నర్"
హఠాత్తుగా ఏదో స్ఫురించినట్టూ భార్గవ కారు సడెన్ బ్రేక్ వేసి, "మైగాడ్ మేము ఆమెని డిన్నర్ కి పిలిచాం... ఈ రోజే-" అంటూ వాచీ చూసుకున్నాడు కంగారుగా.
* * *
"మీరు నన్ను క్షమించారని తెలుసు. కానీ ఇంకొకసారి అడుగుతున్నాను. అసలు నేను చేసిన పని తలుచుకుంటుంటే నాకే సిగ్గుగా వుంది. అతిథిని ఇంటికి పిలిచి నేను లేకపోవటం-"
"మీరు దాన్ని గురించి మర్చిపోరా ఏం?" అంది వసుమతి కూరగిన్నె అతడివేపు జరుపుతూ. ఆమె చాలా ఇబ్బందిపడిన మాట నిజమే. శ్రీనూ, జిన్నీ ముందే నిద్రపోయారు. ప్రార్థన చాలా సేపటివరకూ మెలకువగా వుండటానికి ప్రయత్నించి సోఫాలోనే నిద్రపోయింది. ఆ తరువాత వసుమతి ఒక్కతే అంత పెద్ద ఇంట్లో తనని భోజనానికి పిలిచిన మహాశయుని కోసం ఇబ్బందిగా ఎదురు చూడసాగింది. ఆమెకి కోపం రాలేదు- కానీ చాలా ఇబ్బందికరంగా వుండింది. ఆ ఇబ్బందికన్నా భార్గవ రాగానే మొదలుపెట్టిన క్షమాపణల పరంపర మరింత ఇబ్బందికరమైంది. భార్గవ కారు శబ్దం వినపడగానే ఆమె ప్రార్థనని నిద్ర లేపటానికి ప్రయత్నించింది- కానీ ఆ పాపకి నిద్రాభంగం కలిగించటం ఇష్టంలేకపోయింది. దాంతో ఆ ప్రయత్నం విరమించుకుంది.