"బుద్ధుడు బాధకి కారణం అన్వేషించటం కోసం సర్వం త్యజించి తపస్సుకి వెళ్ళాడు. నేను-కేవలం మీరు ప్రేమించాలనే స్వార్థంతో తపస్సు చేశాను. నా లక్ష్యం చాలా చిన్నది."
ఒక పిచ్చివాడితో అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాననే భావం ఆమెకే కలిగింది. అప్పటికే ఆఫీసులో అందరూ కుతూహలంగా చూస్తున్నారు. చక్రధర్ అకస్మాత్తుగా మంచివాడుగా మారినప్పటి నుంచి విద్యాధరి విలువ ఆ ఆఫీసులో పెరిగిపోయింది. కేవలం చక్రధర్ బారినుంచి తనని రక్షించాడన్న కృతజ్ఞతే లేకపోతే అసలు అతడితో యింతసేపు మాట్లాడి వుండేదికాదు. ఇంతకన్నా అందమైన మాటలతో- మంచి వాదనలతో ఆమెను లొంగదీయటానికి చాలామంది యువకులు ప్రయత్నించారు. ఇంతకన్నా అందమైన వాళ్ళు -డబ్బున్నవాళ్ళు అందులో వున్నారు. ఆమె ఛరిష్మా అలాటిది...
"మీ లక్ష్యం చిన్నదని మీరే ఒప్పుకున్నారు కదా. నిజంగా తపస్సు చేసినట్టు మీరు చెపుతున్న మాటలు నిజమైనా కూడా, ఆ తపస్సువల్ల మీరు సాధించింది ఏమీ లేదు. బస్ లో చూసినప్పుడు అడిగివుంటే మీకేమి సమాధానం చెప్పి వుండే దాన్నో- ఇప్పుడు అదే చెపుతున్నాను. ప్రేమ అనేది అడిగి తీసుకునేది కాదు. దానంతట అదే పుట్టాలి. కావాలంటే ఈ ప్రపంచంలో ఇంతమంది ప్రేమికులున్నారు. వారిని అడగండి."
"పెళ్ళికి ముందే దొరికే ప్రేమకి బేస్ ఏమిటి? ఈ ప్రపంచంలో తనని అర్థం చేసుకునేవాళ్లు ఎవరూ లేరని ఒకరు అనుకుంటూ వుంటారు. ఇంట్లో తల్లి- తండ్రి - అక్క- తమ్ముడు వేర్వేరు లెవెల్స్ లో ఆలోచించేవాళ్ళు కావటంతో 'తనకి' అంటూ ఎవరూ లేరని ఒకరు ఒంటరితనం ఫీలవటం- ఆ సమయంలో ఆపోజిట్ సెన్స్ నుంచి మరొకరు పరిచయం కావటం- అతడికి కాల్గెట్ టూత్ పేస్ట్ ఇష్టమవుతే తనకి అదే ఇష్టం కావటం, ఆ తరువాత Availability of time and private place... ఇదేగా ప్రేమంటే- ఈలోగా, పెద్దలు వీళ్ళని విడదీస్తే తమంత అమిత ప్రేమ మరొకటి లేదని డైరీల్లో వ్రాసుకుని ఇంకొకరితో కాపురం చెయ్యటం...
"తపస్సు చేసి చేసి మీ మెదడు కుళ్ళిపోయింది" అందామె కోపంగా. "మీరు ఆలోచించినట్టు ఎవరూ ఆలోచించలేదు."
"ఎవరి సంగతో నాకు తెలీదుగానీ- మీరేం ఆలోచించారు?"
ఆమె తెల్లబోయి "ఎప్పుడు?" అంది.
"సంవత్సరం క్రితం ప్రొఫెసర్ రంగనాథంతో మీరేమన్నారో గుర్తు తెచ్చుకోండి" అన్నాడు తాపీగా.
* * *
ఆ రోజు ఆమె గదికి వచ్చేసరికి పది దాటింది. సాహితీ గోష్టి అంటే వెళ్ళింది. తమ జీవితంలో ఏనాడూ ఒక్క మంచి వాక్యం కూడా వ్రాయని పదిమంది కలిసి కా.ల.క్షే.పం. (కావ్య లక్షణ క్షేమ పరిరక్షణ సంఘం) అనే సంఘాన్ని స్థాపించి ప్రతి నెలా ఒక సమావేశం ఏర్పాటు చేస్తారని తెలిసి వెళ్ళింది. సామాజిక స్పృహలేని సాహిత్యం నశించాలని చాలామంది వ్యక్తులు బల్లగుద్ది మాట్లాడారు. అదంతా అయ్యేసరికి తొమ్మిదిన్నర, ఇంటికొచ్చేసరికి పది. తన జీవితంలో అతి నిష్ప్రయోజనమైన ఆ రెండు గంటల కాలాన్నీ తిట్టుకుంటూ ఆమె గది తలుపు తాళం తీసి తెరవబోతూ వుండగా బయట పంపుదగ్గర చప్పుడయింది. ఆమె చీకట్లో అటు చూసేసరికి ఏదో ఆకారం కదిలినట్టు అనిపించింది.
ఆమె భయంతో అరవబోయింది. కానీ ఆ ఆకారం అక్కణ్ణుంచి కదలకపోయేసరికి ముందు పందేమో అనుకుంది. తరువాత అది మనిషి అని తేలింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఇంటి యజమాని కొడుకు రామారావు.
వాళ్ళు ఇంటి మేడమీద వుంటారు. తండ్రి, కొడుకులు ఇద్దరే. కొడుక్కి ఇంకా పెళ్ళికాలేదు. తండ్రి యూనివర్సిటీలోనో ఎక్కడో ఫిలాసఫీ ప్రొఫెసరు. ఆయన భార్య చనిపోయి పది సంవత్సరాలైంది. కొడుకు గాలికి పెరిగాడు. ఏదో గవర్నమెంటు ఆఫీసులో పనిచేస్తూ వుంటాడు. సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా తాగి రాత్రి ఎప్పుడో ఇంటికొస్తాడు. పట్టించుకొనేవాళ్ళెవరూ లేకపోవటంతో అలా తయారయ్యాడు.
విద్యాధరికి ఏం చెయ్యాలో తోచలేదు. పై తాళం తాలూకు చెవి ఎక్కడుందో తెలీదు. ఎవర్ని పిలవాలో తెలియలేదు. ధైర్యం చేసి అతడిని తన గదిలోకి తీసుకొచ్చింది. వంటిమీద స్పృహ లేదు. నీళ్ళలో పడి చొక్కా తడిసిపోయింది. అస్సలు స్పృహలో లేడు. గదంతా డ్రింకు వాసన.
ఆమె అతడిని తన పక్కమీదే పడుకోబెట్టింది. చొక్కా విప్పి ఆరేసి క్రింద చాప వేసుకుని పడుకుంది. ఆమె ఇదంతా గొప్ప మానవతాభావంతో చేసింది. ఇంతకీ అతడలా ఆ రాత్రి నీళ్ళ తొట్టెలో పడి తెల్లార్లు వుండకుండా కాపాడింది.
రాత్రి జరిగినదంతా ప్రొద్దున్న లేచి వినగానే అతడు తల మునకలయ్యేటంత ప్రేమలో పడిపోయాడు. తామిద్దర్నీ కలపటానికి కేవలం దేవతలు కల్పించిన సంఘటనలే తప్ప మరేదీ కాదన్నాడు. ఈ మాత్రం 'ఆసరా' తనకి ముందే దొరికివుంటే తనిలా అయిపోయేవాడే కాదన్నాడు. అవటానికి కారణం ఇంట్లో చిన్నప్పటినుంచీ ఆప్యాయత దొరకకపోవటమే అట.
అతడు చెప్పినదంతా ఆమె విన్నది. మొదళ్ళనుంచీ, వెంట్రుక చివర్లవరకూ సెల్ఫ్ పిటీతో కృంగిపోతున్న అతడి గోడంతా శ్రద్ధగా విని "ఇంతకీ మీరేం చెప్పబోతున్నారు" అని అడిగింది.
"నన్ను కాపాడుకోవలసింది ఇక నువ్వే. నీ చేతుల్లో నా జీవితాన్ని పెట్టి నేనిక నిశ్చింతగా వుంటాను."
"జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు. మరొకళ్ల చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవటానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దానివల్ల మీ వ్యక్తిగతం పెరుగుతుంది. అప్పుడు ఆలోచిద్దాం ప్రేమ- పెళ్ళి సంగతి..."
"ఈ క్షణం నుంచి తాగుడు మానేస్తున్నాను విద్యాధరీ!"
"మంచిది... సంవత్సరం తర్వాత ఆలోచిద్దాం పెళ్ళిసంగతి."
వారంరోజుల తరువాత, అతడు దొంగతనంగా తాగి పట్టుబడ్డాడు. బహుశా సంవత్సరకాలం తరువాత వచ్చే ప్రేమకంటే తాగుడు ఎక్కువ సుఖమన్న సంగతి ఆ వారంరోజుల తాగుడు విరహంలోనూ గ్రహించి వుంటాడు. "నువ్వే నన్ను రక్షించుకోలేక పోయావు విద్యాధరీ, నీ నుంచి దూరమే నన్ను తాగేలా చేసింది మళ్ళీ...." విద్యాధరీ అతడివైపు అసహ్యంతో చూసింది. తన ప్రవర్తనకి మనిషి ఎంత అందంగా రీజన్ అల్లుకుంటాడో తెలియ చెప్పటానికి అది పరాకాష్ట.
ఆ తరువాత ఎక్కడైనా "ప్రేమ జాలివల్ల కలుగుతుంది" అన్న వాక్యాన్ని చదివి ఆమె మనసారా నవ్వుకునేది.
ఆ మరుసటిరోజు రాత్రి రామారావు తండ్రి వచ్చి ఆమెకి క్షమాపణ చెప్పుకున్నాడు. "నా కొడుకుని అర్థరాత్రి రక్షించినందుకు కృతజ్ఞతలమ్మా! వాడు అంతా చెప్పాడు. నీ పట్ల ఏదైనా అసభ్యంగా ప్రవర్తించి వుంటే వాడి తరఫున క్షమాపణ నేను వేడుకుంటున్నాను."
"అబ్బే అటువంటిదేమీ లేదండి. ప్రేమంటే అవతలివారికి తన బలహీనతలు చెప్పుకుని ఏడవటమే అనుకుంటున్నాడతను. అవతల్నించి ఓదార్పు ఆశించటం ప్రేమ అవదనీ- స్వార్థమవుతుందనీ నేను చెప్పానంతే".
ఆమె మాట్లాడినదానికి అదిరిపోయి చూశాడు ఆయన. ఆయన ఫిలాసఫీలో ప్రొఫెసరు. జీవితంలో ఇలాంటి అమ్మాయిని చూసి వుండడు.
"ఇంత గొప్పగా మాట్లాడటం ఎవరు నేర్పేరమ్మా?"
"మా నాన్న కృత్రిమత్వం నేర్పింది. నా ఒంటరితనం నేర్పింది." పైకి అనలేదు. మనసులో అనుకుంది.
ఆయన పచార్లు ఆపి "నిజమేనమ్మా బలమైన వ్యక్తిత్వం ముఖ్యం. జాన్ పాల్ సార్త్రే చెప్పినా, రస్సెల్స్ చెప్పినా అదే చెపుతారు. తల్లిపోయాక వాడిలా తయారయ్యాడు. తాగుడు నేర్చుకున్నాడు" అన్నాడు.
"కానీ భార్యపోయాక మీరలా అవలేదే"
"నువ్వన్నట్టుగా అందరికీ పరిస్థితుల్ని ఎదుర్కోవటం సాధ్యంకాదు. కానీ రామకృష్ణ పరమహంస ఏమన్నాడు? దుఃఖం దాచుకుని ఆనందం పంచమన్నాడు. నీ దుఃఖానని నువ్వే పంచుకుంటే అహంబ్రహ్మాస్మి. నిస్వార్థము నిర్వేదమునకు దారి. అలా అని నిర్వేదన నిర్లిప్తతకు దారి కాదు."
ఆమె అతడివైపు చూసింది.
"ఏమిటమ్మా అలా చూస్తున్నావు?"
ఆమె నవ్వటానికి ప్రయత్నించి, "మీ లక్షణాల్లో సగం మీ అబ్బాయికి వచ్చి వుంటే బాగుపడి ఉండేవాడు" అంది.
"నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. మనసులో ఏమీ దాచుకోకుండా చక్కగా మాట్లాడతావు."
"పరమహంస గురించి మీరు చెప్పేది వింటూంటే నేను ఫిలాసఫీ ఎందుకు చదవలేదా అని బాధగా వుంది."
"నా దగ్గర పుస్తకాలున్నాయి. తీసుకువెళ్ళు ఏమీ అభ్యంతరం లేదు."
"బాబోయ్ నాకంత టైమ్ లేదు" నవ్వింది. "మీరు చెపుతూ వుండండి. నేను వింటాను. అఫ్ కోర్స్, మీకు టైముంటేనే."
"ఫిలాసఫీ అంటే నిరాశపూరితమైన వేదాంతం అని చాలా మంది అనుకుంటుంటారు కానీ వేదాంతం అంటే ఆశావాదమమ్మా. చూడు నేనెప్పుడూ ఎంత ఆశావాదంతో బ్రతుకుతుంటానో. జీవితాన్ని అనుభవించాలమ్మా. ఏవో కలతలున్నాయని కృంగిపోకూడదు. నా ఫిలాసఫీ అది."
"అందుకే మీరు నాకు నచ్చారు."
ఆయన దగ్గరగా వచ్చి తలమీద చెయ్యివేసి హృదయానికి దగ్గరగా తీసుకుని "ఈ రోజునుంచీ నీ బాధ్యత నేను స్వీకరిస్తున్నాను" అన్నాడు.
'అది చెప్పడం కోసం తలమీద చెయ్యివేసి దగ్గరికి తీసుకోనవసరం లేదు' అని ఆమె అనబోయింది. అంతలో ఆయనే "మనిద్దరిమధ్యా ఏదో పూర్వజన్మ సంబంధం వుందని నిన్ను చూడగానే నాకు తోచింది. ఆ మాట ఇన్నాళ్ళకి నిజమైంది" అన్నాడదోరకమైన తాదాత్మ్యతతో. ఈసారి "అమ్మా" అనలేదు.
"దయచేసి నన్నొదలి పెడతారా?" అందామె కాస్త కటువుగా. ఆయన చప్పున "నువ్వు నా కూతుర్లాంటి దానివి" అన్నాడు సర్దుకుంటూ.
"మీ ఫిలాసఫీలో ఫ్రాయిడ్ గురించి వుందో లేదో నాకు తెలీదుకానీ ఇంత వయసున్న కూతుర్ని ఇలా హృదయానికి హత్తుకుని ఏ తండ్రీ మాట్లాడడు. మీకన్నా మీ అబ్బాయే నయం. అతనిది సెల్ఫ్ సింపతీ అయితే మీది వాక్చాతుర్యంతో ఎవర్నైనా ఆకట్టుకోగలననే ధైర్యం."
"ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?" అరిచాడు.
"చూడండి. కూతురా అని దగ్గరికి తీసుకున్నప్పుడు మీ చెయ్యి ఎక్కడ నిమిరిందో నాకూ మీకూ తెలుసు. ఆత్మవంచన లేకుండా డిస్కస్ చేద్దామా?"
ఆయన బిత్తరపోయి, క్షణంలో తేరుకుని, "ఇదిగో అమ్మాయ్! తల్లీ తండ్రీ - చివరికి ఒక అడ్రసంటూలేని నీకు ఈ గది ఇవ్వటం మాది బుద్ధి తక్కువ. ఏదో మీ నాన్న పెద్దమనిషి కాబట్టి ఇచ్చాను!"
"బ్రతికున్న రోజుల్లో మా నాన్న కూడా ఇలాగే చేసేవారు. పరిస్థితి ఎదురు తిరిగితే మీలాగే మాట్లాడేవాడు."
"నోర్ముయ్. తండ్రి గురించి అలా మాట్లాడటానికి సిగ్గు లేదు. రేపే మా గది ఖాళీ చెయ్-"
"చెయ్యను. అలాంటి ప్రయత్నం మీరు ఏదైనా చేస్తే రెంట్ కంట్రోలర్ దగ్గరికి వెళతాను."
"రాక్షసి ఎంతకు తెగించావ్- ఇంకా నయం మా అబ్బాయి అదృష్టవంతుడు కాబట్టి నీ వలలో పడలేదు."
"కొంచెం అమాయకురాలినై వుంటే నేను మీ వలలో పడి వుండేదాన్ని. ఒక ఆడదాని ట్రాప్ చేయడానికి మొగవాళ్ళు ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తారని నాకు తెలీదు. ఇంతకన్నా ఫ్రాంక్ గా నాతో పడుకుంటావా అని అడిగివుంటే సంతోషించి వుండేదాన్ని."
విద్యాధరి గుండెల్లోంచి దుఃఖం తెరలు తెరలుగా వస్తోంది. అదీ రంగనాథం గురించి కాదు. మనుష్య జాతి గురించి.... మారే రంగుల గురించి. "అయిదు నిముషాల క్రితం నేను అపురూపమైన తెలివి తేటలున్న దానిని. నేను నవ్వితే మనోహరంగా వుంటుంది. కానీ నేను మీ మనసు చీకటి కోణాన్ని స్పృశించేసరికి కిరాతకుల్ని, రాక్షసిని! వెళ్ళండి.... గెటౌట్...." హిస్టీరిక్ గా అరిచింది ఆమె తర్జని చూపిస్తూ.
* * *