Previous Page Next Page 
థ్రిల్లర్ పేజి 10


    "ప్రేమించేవరకూ ఇద్దరికీ కాల్గెట్ టూత్ పేస్ట్ నచ్చుతుంది. ప్రేమ ఫలించాక (లేక విఫలమయ్యాక) ఒకరు ఫోర్ హాన్స్, మరొకరు సిగ్నల్ కొనుక్కుంటారు. సంవత్సరం క్రితం మీరా ముసలాయనతో అన్న మాటలే తిరిగి నేనంటే మీకంత కోపం దేనికి?" నవ్వుతూ అడిగాడు అనుదీప్.

    "మీకీ విషయాలన్నీ ఎలా తెలిసినయ్? ఆయన చెప్పాడా?"

    "అంత లజ్జాకరమైన పని ఆయన చేస్తాడని నేననుకోను పైగా ఆయనిప్పుడు వైస్ - ఛాన్సలర్ కూడా. నాకెలా తెలిసింది అన్నది సమస్య కాదు, సమస్య మన ప్రేమ గురించి! రామారావుకి ఏవో బలహీనత లుండబట్టి మీ ప్రేమకి అనర్హుడయ్యాడు. రంగనాధం డైరెక్టుగా ప్రపోజ్ చేసి మీతో చివాట్లు తిన్నాడు. ఈ పరిస్థితుల్లో నేను నా ప్రేమని వెల్లడిచేసి వుండాల్సిందా చెప్పండి? అందుకే తపస్సు చేశాను. "భగవంతుడా! ఈ ప్రపంచంలో ఒక మనిషి మరో మనిషితో ప్రేమను గురించి చెప్పాలంటే ఏం చెయ్యాలి? అవతలి మనిషి తనని ఏ అనుమానం లేకుండా ప్రేమించాలంటే ఎలా ప్రపోజ్ చెయ్యాలి? చెప్పు భగవాన్" అని అడిగాను.

    "అది చెప్పటానికి భగవంతుడు అవసరం లేదు. నేనే చెపుతాను."

    అతడు ఆశగా ముందుకు వంగి "చెప్పండి" అన్నాడు.

    "మీరు సర్వకాల సర్వావస్థల్ని తెలుసుకోగలిగే మునులు కదా. నేనేం చెప్పబోతానో మీరే గ్రహించండి స్వామీ-" అంది నాటకీయంగా.

    "అయితే మీ చెయ్యి ఒకసారి ఇవ్వండి. నాడి చూసి గ్రహించెదను గాక" అన్నాడు.

    "ఇది ఆఫీసు, అందరూ వెళ్ళిపోయారు. మీరిక ఈ సుత్తి ఆపుచేస్తే నేనూ వెళ్ళిపోతాను."

    "ఓహో! అసలు మీరు ఏదైనా ప్రయివేటు స్థలమున మీ నాడి చూపించటానికి కుతూహల పడుతున్నారన్నమాట. మంచిది. అటువంటిది ఏర్పాటు చేసెదను."

    "షటప్" అని ఆమె వెళ్ళిపోయింది. ఆమెకెందుకో ఆ సాయంత్రమంతా ఏదో తెలియని ఉత్సాహంతో పెదవుల మీద నవ్వు నాట్యమాడుతూనే వుంది. అయితే అది అనుదీప్ పట్ల ప్రేమవల్ల వచ్చిందికాదు, కారణం సరీగ్గా తెలీదు.

    ఆ రాత్రి ఆమెకో కల వచ్చింది.

    ఒక రాజకుమార్తె చేతిరుమాలు సింహాలు పోరాడే వినోద స్థలంలో జారిపోతుంది. ఆమెకి ఎంతో ప్రియమైన చేతిరుమాలు అది. ఆమె ప్రియుడు మరేమీ ఆలోచించకుండా ఆ ఎరీనాలోకి దూకి సింహాలతో పోరాడి ఆ రుమాల్ని భద్రంగా తీసుకొచ్చి ఆమెకి అందజేస్తాడు. అతడి శరీరమంతా రక్తంతో నిండివుంటుంది. తన కోసం అంత సాహసం చేసిన ఆ రాకుమారుడిపట్ల పెల్లుబికే ప్రేమతో ఆమె అతడిని స్పృశించగానే అతడి గాయాలు మాయమవుతాయి.

    విద్యాధరీకి మెలకువ వచ్చింది. ఆ కల గమ్మత్తుగా తోచింది. దాని గురించే ఆలోచిస్తూ చాలాసేపు ఉండిపోయింది. అప్పటికి రాత్రి పన్నెండు దాటింది.

    బల్లమీద ఆ పుస్తకం అలాగే వుంది. ఆమె దాన్ని చేతుల్లోకి తీసుకొని వ్రాయటం ప్రారంభించింది....

    "ప్రేమంటే ఏమిటో ఇప్పుడు ఇన్నాళ్ళకి నాకు అర్థమైంది. ఒకరు గురించి ఒకరు దేన్నైనా వదులుకోగలగటమె ప్రేమ."

    "అలాగా" అని వినిపించింది వెనుకనుంచి.

    ఆమె కెవ్వున అరిచి వెనుదిరిగి చూసింది.

    వెనుక ఎవరూలేరు.

    తన భ్రమకి తానే నవ్వుకొని పక్కమీద పడుకుంది.

    ఆ రాత్రి కూడా ఆమె చాలా హాయిగా నిద్రపోయింది.

                                        *    *    *

    మే, 12
    రాత్రి ఎనిమిది గంటలు.
    అలంకార్ టాకీస్.

    గత కొన్ని రోజులుగా అనుదీప కనపడకపోవటం గురించి ఆమె ఎంత కాదనుకున్నా ఆలోచిస్తూనే వుంది. అంత అర్థంతరంగా అతడు ఎక్కడ మాయమయ్యాడో ఆమెకి తెలియలేదు. మొదటిరోజు అంత పట్టించుకోలేదు గానీ రోజులు గడుస్తూంటే అతడి ఆలోచన్లు బాగా సతాయించసాగాయి.

    అతడిమీద చిరుకోపం ఉన్నమాట నిజమే. కానీ అతడి అల్లరి - అతడు మాట్లాడే విధానం ఆమెకి తెలియకుండానే ఆకట్టుకున్నాయి. మళ్ళీ అహం మరోవైపు. నేనూ చిన్నపిల్లలా ఆలోచిస్తున్నానేమిటి అనుకునేది. 'పదహారు- ఇరవై మధ్యలో ప్రేమలో పడితే స్నేహితుడు కాస్త కనపడకపోతే ఆడపిల్లల మొహం ఎలా "డల్" అవుతుందో, అలాటి ఆడోలసెన్స్ నుంచి నేనెప్పుడో బయటకి వచ్చాను కదా' అని కూడా అనుకుంది.

    తెరమీద విలన్ హీరోచేత తెగ బాదించుకుంటున్నాడు. ప్రక్కనున్న స్నేహితురాలు బాగా ఎంజాయ్ చేస్తూంది. విలన్ ని బాదిన సందర్భంలో హీరోకి హీరోయిన్ వంకాయలగుత్తిని ప్రెజెంట్ చేసింది, పాట ప్రారంభమయింది.

    "బయటికి పోదామా- తలనొప్పిగా వుంది" అంది విద్యాధరి. ఆకాశం విరిగిపడినట్టు స్నేహితురాలు ఉలిక్కిపడి "బయటికా?" అంది.

    "అవును. ఇంటికి-"

    "నీకేమైనా మతిపోయిందా?"

    "ఈ సినిమా పూర్తిగా చూస్తే అది ఖాయం."

    ఇంతలో ఎవరో కుర్చీల వరుసలోంచి నడుస్తూ వచ్చి పక్క సీట్లో కూర్చున్నారు. విద్యాధరి యిబ్బందిగా చూసింది- అన్ని సీట్లు ఖాళీగా వుండగా అతడొచ్చి పక్కన కూర్చోవటం....

    ఆమె కదలటం చూసి అతడు ఆమె వైపుకి తిరిగి రహస్యమైన గొంతుతో, మళ్ళీ జెడపిన్ను తీసే ప్రయత్నం ఏమీ చేయకండి విద్యాధరిగారూ.....నేనే-" అన్నాడు.

    ఆమె గుండె ఓ క్షణం ఆగి కొట్టుకోవటం ప్రారంభించింది.

    "అనుదీప్" అంది.

    "ఆ పాటకన్నా మీ కంఠం బావుంది."

    స్నేహితురాలు కూడా అంత మంచి పిక్చర్ ని వదలి తమవైపు ఇంటరెస్టింగ్ గా చూడటం గమనించి విద్యాధరి మౌనం వహించింది.

    ఇంటర్వెల్ వచ్చింది.

    స్నేహితురాలు వీళ్ళిద్దర్నీ వదిలి వెళ్లలేక తప్పదన్నట్టు టాయిలెట్ వైపు వెళ్ళింది.

    "చెప్పండి ఎలా వున్నారు?" అనుదీప్ అడిగాడు.

    "ఇంతకాలం ఏమయ్యారు?"

    "ఆస్పత్రిలో వున్నాను."

    "అరె, ఏమైంది" నిజాయితీగా అడిగింది.

    "మీరన్నారు కదా! ప్రేమలో ఏదైనా సరే ఇచ్చెయ్యాలి అని-"

    "అయితే-"

    "నా కిష్టమైంది నా చెయ్యి-"

    "అందుకని."

    "మీరు ఆ పుస్తకంలో డైరీ వ్రాసుకున్న రోజు రాత్రే నా కిష్టమైన ఆ చేతిని మీ కోసం వదులుకున్నాను-"

    ఆమె ఏదో అనుమానం, సందిగ్ధం కలిసిన స్వరంతోనే "అంటే-" అడిగింది.

    "చేతిని కట్ చేసుకున్నాను విద్యాధరిగారూ" అంటూ చొక్కాని కాస్త పక్కకి తొలగించాడు.

    భుజం దగ్గర్నుంచీ కుడిచెయ్యి లేదు.

    ఆమె కళ్ళు విస్ఫారితం చేసుకుని చూసింది.

    నిజంగానే... కుడి... చెయ్యి... లే....దు!

    భుజంనుంచీ బాండేజి కట్టబడి- శూన్యంగా వుంది-

    ఆమె కెవ్వున అరిచింది.

    భయోద్వేగాలు ముప్పిరికొనగా - స్వరతంత్రులు తెగిపోయేలా అరుస్తూ వుంది. హాల్లో జనం అంతా అటు తిరిగేరు. గేట్ మెన్ లు పరిగెత్తుక్కుంటూ వస్తున్నారు. అంతా గందరగోళంగా తయారయింది.

    సాధారణంగా సినిమాహాలు లోపల ఏదైనా గొడవ జరిగితే, వెంటనే లైటార్పి, పిక్చర్ మొదలు పెట్టేస్తారు. విద్యాధరి అరుపులకి ప్రొజెక్టర్ దగ్గరున్న ఆపరేటర్, క్రింది తరగతిలో ఆడవాళ్ళ మధ్య ఏదో గొడవ జరుగుతూ వుందనుకుని ఆ విధంగానే చేశాడు.

    ఒక్కసారిగా హాలులో లైట్లు ఆరిపోయేసరికి, గేట్ మెన్ లు కూడా కన్ ఫ్యూజ్ అయ్యారు. ఈ లోపులో విద్యాధరి సర్దుకుంది.

    అకస్మాత్తుగా భుజం దగ్గిర్నుంచి చెయ్యి లేకుండా వున్న ఆ వ్యక్తిని చూసి ఆమె గుండెలవిసిపోయిన మాట నిజమే. కానీ సర్దుకోవటానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. అదీగాక అతడు అనుదీప్. తనకి పరిచయం వున్నవాడు.

    ఈ భావం రాగానే ఆమె చప్పున అరవటం మానేసింది.

    ఈ లోపులోనే జనం అక్కడ మూగారు.

    ఒంటరిగా ఇద్దరమ్మాయిలు సినిమాకి వచ్చి- అలా అందులో ఒకమ్మాయి అరిచిందీ అంటే సానుభూతికేమి తక్కువ? ఉత్సుకత కాదా వెల్లువ!!! రకరకాలుగా ప్రశ్నలూ, జాలి, సానుభూతి మనసులో "ఒంటరిగా ఎందుకు రావాలి" అన్న వెటకారం, షో మొదట్లోనే వచ్చి వారి పక్కన కూర్చోలేకపోయామే అన్న ఆశాభంగం, అన్నిటికన్నా ముఖ్యంగా ఏం జరిగిందో తెలుసుకోవాలనే తపన....

    అనుదీప్ పెట్టిన భయంకన్నా ఈ గొడవే ఎక్కువ బాధాకరంగా పరిణమించిందామెకు. ఏదో సర్ది చెప్పింది.

    ఎలాగయితేనేం చివరికి జనం సర్దుకున్నారు.

    "ఏం జరిగింది?" అని ప్రశ్నించింది స్నేహితురాలు. ఆ ప్రశ్నలో ఏం జరిగిందో పాపం అన్న స్నేహపూరితమైన వాకబుకన్నా ఏం జరిగిందో తెలుసుకుని పదిమందికీ పంచాలన్న ఆకాంక్ష ఎక్కువ వుంది.

    "ఏదో పాకింది" అంది విద్యాధరి.

    "వ్హాట్"

    "అవును. కాళ్ళ మధ్యనుంచి ఏదో పాక్కుంటూ వెళ్ళింది. నిశ్చయంగా పామే."

    స్నేహితురాలు భయంగా, అనునయంగా చూస్తూ -

    "ఛా .... పాము ఎలా వస్తుంది సినిమా హాల్లోకి?" అంది స్వగతంగా

    విద్యాధరి మాట్లాడలేదు.

    ఒక నిముషం గడిచింది. హీరో హీరోయిన్ని పాములమధ్య నుంచి రక్షించే ప్రయత్నంలో ఒక పాము కరవగా మరణించాడు. హీరోయిన్ నాగదేవతని ప్రార్థించగా ఆ దేవత కన్యారూపంలో వచ్చింది. సెక్సూ-దైవభక్తీ సమానంగా కలిపిన దర్శకుడు అన్ని వర్గాలనుంచీ ఆదరణ పొందాడు. అతని పెదవుల్ని ముద్దు పెట్టుకున్న నాగకన్య వెంటనే ప్రేమలో పడి, భూలోకంలోనే వుండిపోదల్చుకుంది. రెండువేల పాముల బ్యాక్ డ్రాప్ లో హీరో, సెకండ్ హీరోయిన్ డాన్స్ ప్రారంభమయింది.

    "మరి ఈ విషయం అందరికీ ఎందుకు చెప్పలేదు?" అంది స్నేహితురాలు తెరమీద పాములకేసి భయంగా చూస్తూ.

    అనుదీప్ ఆలోచన్లతో సతమతమవుతున్న విద్య, అనాసక్తంగా "ఏమని చెప్తాం? అలా చేస్తే హాలు ఖాళీ అయి యజమానికి నష్టం రాదూ?" అంది.

    "మరి ఇప్పుడెవర్నన్నా కరుస్తే?"

 Previous Page Next Page