Previous Page Next Page 
థ్రిల్లర్ పేజి 8


    "ఏమిటది?"

    "ఇక్కడ గది ఖాళీ చేశాను. నా సామాన్లూ, బట్టలూ ఇంటికి పంపించేశాను..."

    "పంపించి?" అందామె అనుమానంగా.

    "వింద్య పర్వతాల్లోకి వెళ్ళాను."

    ఆమె దిగ్భ్రాంతితో ".... వెళ్ళి" అని అడిగింది.

    "ఏడు సంవత్సరాలపాటు తపస్సు చేశాను" అతను కామ్ గా అన్నాడు.

    ఆమె అదిరిపడింది. "నేను నమ్మను" అంది.

    "నమ్మాలి. చాలామంది ఋషులూ, రాజులూ రకరకాల కారణాల వల్ల ఆ రోజుల్లో తపస్సు చేసేరట. నేను మాత్రం ప్రేమ కోసం తపస్సు చేశాను. నేను ప్రేమించటానికి అర్హమైన వాడినా కానా అని తెలుసుకోవటం కోసం తపస్సు చేశాను. ఏ కండిషన్లూ లేకుండా ఆ అమ్మాయి నన్ను ప్రేమించేలా చెయ్యి స్వామీ అని కళ్ళు మూసుకుని ప్రార్థించాను. కళ్ళు విప్పి తిరిగి నాగరిక ప్రపంచంలోకి వచ్చేసరికి అప్పుడే ఏడేళ్ళు గడిచిపోయాయి- అని తెలిసింది. లక్కీగా మీకింకా వివాహం కాలేదు."

    నిశ్చయంగా అతడు పిచ్చివాడని తెలిసిపోయింది. ఆమెకి ఈసారి భయం వెయ్యలేదు. ఆట పట్టించాలనిపించింది.

    "ఇంత గొడవెందుకు పడ్డారు? పెళ్ళి ప్రసక్తి తీసుకురావల్సింది."

    "ఎప్పుడు? అప్పుడా?"

    "అప్పుడే".

    "అది స్వార్థం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నన్ను ప్రేమించాలని రూలు లేదు. పెళ్ళి అన్న తాయిలం ఆశ చూపించి ప్రేమించమనటం అస్సలు భావ్యం కాదు. అది స్వచ్చమైన ప్రేమ అవదు..."   

    "మీరుచెప్పిన రీజనింగ్ కరెక్ట్ అవుతే అసలీ ప్రపంచంలో ఎవరూ ఒకర్నొకరు ప్రేమించుకోరు."

    "అందుకే.... ఆ రీజనింగ్ కి అతీతమైన ప్రేమ వుందో లేదో తెలుసుకోవటం కోసం తపస్సు చేశాను."

    "మరి దేవుడు కనపడ్డాడా?"

    "కనపడ్డాడు."

    "ఏమన్నాడు?"

    "ఒక మనిషి మనసులో ప్రేమని ఉద్భవింప చేయగలిగే శక్తి తనకి లేదనీ, అలా వుంటే ప్రపంచ యుద్ధాలే ఆపుచేసి వుండే వాడిననీ అన్నాడు. నన్నే ట్రై చేసుకొమ్మన్నాడు."

    దూరంగా పదకొండు గంటలు వినిపించాయి.

    "చాలా రాత్రయింది. ఇక..." అంటూ లేచింది.

    అతడు కూడా లేచి "మరి నా సంగతి" అంటూ "ఏమిటి చెవి దగ్గర చూసుకుంటున్నారు?" అని ప్రశ్నించాడు.

    "పువ్వులేమైనా వున్నాయేమో అని" అంది నవ్వి.

    అతడి మొహం ఎర్రబడింది. "నా మాటలు నమ్మరా?"

    "నేను కాదు ఇంగితజ్ఞానం వున్న వాళ్ళెవరూ నమ్మరు."

    "నేను నిరూపించనా? నా ప్రేమయొక్క తీవ్రత గురించి?"

    "నిరూపించండి చూద్దాం."

    "సరే- నేను వెళ్ళొస్తాను. ఈ రాత్రి తలుపులన్నీ గట్టిగా వేసుకుపడుకోండి. మీ శరీరంమీద నా స్వహస్తాలతో ప్రేమలేఖ వ్రాస్తాను. తెల్లారేసరికి లేచి చూసుకోండి."

    "అసంభవం".

    "వెళ్ళొస్తాను." అని అతడు నిశ్శబ్దంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.

    ఆమె అలాగే చాలాసేపు నిలబడింది.

    ఏం చెయ్యాలో తోచలేదు. జరిగినదంతా ఒక కలలాగా, విచిత్రంగా అనిపించింది. ఇదంతా నిజమని నమ్మబుద్ధి కాలేదు.

    బట్టలు మార్చుకుని లైటార్పి పక్కమీద వాలిపోయింది.

    తెల్లవారుఝాము నెప్పుడో నిద్రపట్టింది.

    మెలకువ వచ్చేసరికి ఎనిమిదయింది.

    ఆఫీసుకి టైమైపోతూందని హడావుడిగా లేచింది. అంతలో క్రితం రాత్రి సంభాషణ గుర్తొచ్చింది. అప్రయత్నంగా చేతులవైపూ అద్దంలో మొహాన్నీ చూసుకుంది. ఎక్కడా ఏమీలేదు. అతడేదో అంటే తనుకూడా ఓ మూర్ఖురాలిగా దాన్ని నమ్మటం ఏమిటా అని నవ్వుకుంది.

    అరగంట తరువాత ఆమె స్నానానికని బాత్ రూమ్ లో ప్రవేశించి బట్టలువిప్పి దండెంమీద పడేసింది. నీళ్ళు పోసుకోబోతూ అప్పుడు చూసింది.

    ఆమె నోట్లోంచి సన్నటికేక అప్రయత్నంగా వెలువడింది.

    ఒక అనూహ్యమైన చిత్రాన్ని చూస్తున్నట్టు ఆమె తనని తాను చూసుకుంటూ చిత్తరువులా నిలబడిపోయింది.

    నాభికి అంగుళం క్రింద ఎవరో పెన్నుతో వ్రాసినట్టు అందమైన చిన్నటి అక్షరాలు లఖించబడి వున్నాయి.

    "Tresspassers not allowed
    property belonging
    to ANUDEEP"

    ఈమె ఎంతలా భయపడిందంటే వంటిమీద నీళ్ళు పోసుకుంటే కూడా ఏదైనా అవుతుందేమో అని అనుకుంది. కానీ అదృష్టవశాత్తు అలా జరగలేదు. అక్షరాలు చెరిగిపోయాయి.

    స్నానం ఎలా పూర్తిచేసిందో తెలియదు.

    భయంపోయాక మాత్రం ఆమె మనసునిండా కుతూహలం నిండింది. అతడు తన వంటిమీద ఎలా వ్రాశాడు? ఇంతవరకూ చరిత్రలో తామర పత్రాలమీద, కలువపూవుల మీద ప్రేమ లేఖలు వ్రాసి పంపినవారిని గురించి చదివింది గానీ శరీరం మీద వ్రాసిన వారి గురించి ఎక్కడా వినలేదు.

    అయినా అతడు వ్రాసిన ప్రదేశం -

    అది తల్చుకోగానే ఆమె మొహం సిగ్గుతో ఎర్రబారింది.

    దేవుడు తపస్సు- ఇదంతా నిజంకాక ఏ అర్థరాత్రో అతడు ఎలాగో ఒకలాగ తన గదిలో ప్రవేశించి ఈ అక్షరాలు వ్రాసివుంటే మాత్రం...

    ఆపైన ఇక ఆలోచించలేకపోయింది. ఛీ-ఛీ' అనుకుంది మనసులో చాలాసార్లు అది గుర్తొచ్చినప్పుడల్లా, ఆఫీసుకొచ్చిన తరువాత కూడా ఆమె ఆలోచనల నుంచి తప్పించుకోలేక పోయింది.

    చక్రధర్ నుంచి ఇప్పుడు ఏ రకమైన ఇబ్బంది వుండటం లేదు. పోతే, ఆ ఫోటో చూపించి తనని బెదిరించిన వ్యక్తి ఎవరో తెలుసుకోవటానికి చాలా కుతూహలం చూపించాడు. తనకు తెలిస్తేకదా చెప్పటానికి-

    సాయంత్రం మూడింటికి అతను వచ్చాడు. అదే లాల్చీ పైజమా, భుజానికో బ్యాగు... మొహంనిండా చిరునవ్వు- "హల్లో నేను వ్రాసింది చదువుకున్నారా?"

    ఆమె ఏమీ ఎరగనట్టు.... "ఏం వ్రాశారు? నాకు ఏమీ తెలీదు" అంది.

    "అయితే బహుశా మీరు చూసుకుని వుండరు. ఏం వ్రాశానూ- ఎక్కడ వ్రాశానూ అన్నీ చెప్పమంటారా?"

    "అక్కర్లేదు. మీకు లేకపోయినా నాకుంది కాస్త సిగ్గు."

    "అయితే చూసుకున్నారన్నమాట".

    తను దొరికిపోయినట్టు అర్థమైంది ఆమెకు.

    "సరే మీకు మానవాతీతశక్తులున్నాయనీ ఒప్పుకుంటాను. ఇక వెళ్ళిరండి" అంది కోపం, విసుగు మిళితమైన స్వరంతో.

    "మరి నా ప్రశ్న?"

    "ఏం ప్రశ్న?"

    "అదే... నా ప్రేమ...."

    ఆమె చురుగ్గా చూసి- "చూడండి- ఏ అమ్మాయి అయినా చలాగ్గా వుండే అబ్బాయినీ, సరదాగా మాట్లాడే అబ్బాయినీ ఇష్టపడుతుంటే తప్ప మీలాటి ఋషుల్నీ, మునుల్నీ కాదు" అంది.

    "మరి సీరియస్ గానూ రిజర్వ్ డ్ గానూ వుండే అబ్బాయిల్ని ఏ అమ్మాయీ ప్రేమించదాండీ?" అమాయకంగా అడిగాడు.

    "కొంతమంది అమ్మాయిలు అలాటివాళ్ళని యిష్టపడితే పడవచ్చు" అంది.

    అతడు చొప్పున ముందుకు వంగి - "మీకెలాటి వాళ్ళు యిష్టం?" అన్నాడు.

    ఆమె చేతులు జోడించి "చూడండీ. నేనిలాటివి ఎప్పుడూ ఆలోచించలేదు. మీరిక వెళ్ళిరండి" అంది.

    అతడు కదల్లేదు. "మిమ్మల్ని బస్ లో చూసినప్పుడే దగ్గిరకి వచ్చి 'నేను సరదాగా మాట్లాడే అబ్బాయిని అని వుంటే మీరేం చేసి వుండేవారు? లాగిపెట్టి కొట్టివుండేవారు. అవునా?"

    ఆమె తలెత్తి చూసింది. అతనన్నాడు...   

    "సరదాగా మాట్లాడటమే ప్రేమకి క్వాలిఫికేషన్ అవుతే ఈపాటికి మీరు వందా రెండొందల మందిని ప్రేమించి వుండాల్సింది."

    "మహాప్రభో, మీరు చెప్పేది నాకు ఒక ముక్క అర్థం కావటంలేదు. ప్రేమ ఒక్కరిమీదే జనిస్తుంది. వందా రెండొందల మీద కాదు."

    "అయితే పెళ్ళయిన తరువాత జీవిత భాగస్వామిని ప్రేమించటం అన్నిటికన్నా ఆరోగ్యకరమైన ప్రేమ-"

    "ఇప్పటికి తెలుసుకున్నారు కదా గుడ్."

    "అంటే ఆ రోజు బస్ లో మిమ్మల్ని చూడగానే, 'మిమ్మల్ని ప్రేమించాను. పెళ్ళి చేసుకుంటాను. ఏ మ్యారేజి హాలు బుక్ చేయించమంటారు' అని అడిగివుంటే మీ రొప్పుకునేవారా?"

    విద్యాధరి అతడివైపు జాలిగా చూసి, "తపస్సు చేసిచేసి మీకు మతి పోయింది."

    "కాదు అనలైజేషన్ వచ్చింది. వివాహమే ప్రేమకి బేస్ అయితే ఈ దౌర్భాగ్య ప్రపంచంలో యింతమంది దంపతులు అనుక్షణం ఎందుకు దెబ్బలాడుకుంటూ వుంటారు అన్న విషయం గురించి ఆలోచించాను. దాన్నే మీరు తపస్సు అనండి. ధ్యానం అనండి. ఏదైనా అనండి. ఏడు సంవత్సరాలు దాని గురించే ఆలోచించాను. ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరు మనుష్యులు ఒక గృహంలో జీవించవలసి వచ్చిన రెండు క్రూరమృగాల్లా ఎందుకు ఒకర్నొకరు చంపుకోవటానికి ప్రయత్నిస్తారు?"

    ఆమెకి ఈ సంభాషణ అకస్మాత్తుగా ఆసక్తిదాయకంగా తోచింది.

    "మరి మీ ప్రశ్నకి సమాధానం దొరికిందా?" అని అడిగింది.

    "దొరికింది."

    "ఏమిటి?"

    "భార్యగానీ, భర్తగానీ తమ ప్రవర్తనకి అనుగుణంగా కొన్ని వాదనల్ని సమకూర్చుకుంటారు. ఆ రెండు వాదనల 'క్లాషే' - పోరాటానికి నాంది. బాగా కీచులాడుకునే దంపతుల్ని ప్రశ్నించి చూడండి. ఎవరి రీజన్ వారికుంటుంది. ఇద్దరూ కేవలం అవతలివారి ప్రవర్తనవల్లే తమ సంసారం ఇలా తగలబడిందని వాపోతూ వుంటారు."

    "గౌతమ బుద్ధుడు సర్వజనావళికి శాంతి సూత్రం కనుక్కున్నట్లు మీరు కూడా దంపతులు సుఖంగా బ్రతకటానికి ఏదైనా చిట్కాలు కనుక్కున్నారా?" కాస్త చురుకుదనం ధ్వనిస్తూ వుండగా అడిగింది నవ్వుతూ.

 Previous Page Next Page