క్లాసులో అందరూ కొత్త. మొదటిరోజు మనసంతా పిచ్చిపిచ్చిగా వుంది. ఇల్లు వదిలిరావటం అది మొదటిసారి కావటాన బిడియంగా ఏదో వంటరి వాడయినట్లు రకరకాలుగా వుంది.
క్లాసులో చొరవచేసి శైలజను పలకరిద్దామనుకున్నాడు. కానీ అంతమంది ముందు మొదటిరోజునే మాట్లాడటానికి సంకోచంవల్ల ఆ ప్రయత్నం మానుకున్నాడు.
ఆ సాయంత్రం యూనివర్సిటీ గేటుదాటి యివతలికొచ్చి సిటీబస్ కోసం ఎదురుచూస్తుండగా శైలజ కనిపించింది. ఆమెకూడా బస్ కోసం చూస్తూ నిలబడింది. దగ్గరకు వెళ్ళాడు. ఆమె చూసింది.
"హాస్టల్ లో చేరలేదా?"
"లేదు."
"ఎందుకని."
"ఎందుకంటే....." అతను నవ్వాడు. "ఇంకా చేరలేదు కాబట్టి."
ఆమెకూడా నవ్వింది.
"మీ మేనత్తగారింట్లో బాగుందా?"
"బాగాలేదు."
"ఎందుకని?"
"ఎందుకంటే..." ఒక్కక్షణం ఆగి నవ్వుతూ అంది, "బాగాలేదు కాబట్టి."
అతనికి కూడా నవ్వు వచ్చింది, ఆ నవ్వు అతని పెదవులమీద నుంచి దిగిపోకముందే అతను ఎక్కవలసిన బస్సుకూడా వచ్చింది. ఆమెకూడా అతన్తోపాటు అదే బస్సులో ఎక్కింది. లోపల జనం క్రిక్కిరిసి వున్నారు. ఇద్దరూ ప్రక్క ప్రక్కన నిలబడ్డారు. భుజం భుజం రాసుకుంటోంది. జనం తోపుడుకి ఒక్కొక్కసారి మరింత దగ్గరగా రావల్సివస్తోంది.
"ఇదేమిటి? ఇద్దరం ఒకే చోటుకు పోతున్నాం?" అతనన్నాడు.
"ఒకే చోటుకు పోవటంలేదు. ఒకేవైపుకు వెళుతున్నాం" ఆమె సరిదిద్దింది.
"ఇద్దరిలో ముందెవరు దిగుతారు చెప్పండి."
"నేను."
"ఎలా తెలుసు?"
"నిజంగా చెప్పెయ్యమంటారా?" ఆశ్చర్యం ప్రకటిస్తున్నట్లు అంది.
"చెప్పండి."
"తెలుసు కాబట్టి."
బస్సు ఒకచోట ఆగింది. "కాని మీకు నిజంగా తెలియదు, ఎందుకంటే... నేనిక్కడ దిగిపోతున్నాను కాబట్టి."
జనంలోంచి యివతలపడి బస్సు దిగిపోయాడు.
* * *
"మొదటి రెండురోజులూ హోటల్లోనే వున్నాడు. రాత్రిళ్ళు నిద్రపట్టక పొర్లుతూ ఆలోచిస్తున్నాడు. హాస్టల్ కి వెళ్ళి మెస్ బిల్లూ వగైరాలు ఎంతవుతాయో వాకబుచేసి వచ్చాడు. అతననుకున్న బడ్జెట్ కి ఎంతో ఎక్కువగా వుంది. ముందు ముందు స్కాలర్ షిప్ వస్తే రావచ్చు. కానీ మిగతాఖర్చుకూడా తట్టుకునే స్థితిలో తను లేడు. ఎంతో పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి. కఠినంగా జీవించాలి. తక్కువ అద్దెకు ఎక్కడయినా గది దొరికితే తీసుకోవాలి. ప్రొద్దుటపూట ఏదయినా చౌకబారు హోటల్లోనో, ప్లేటుమీల్స్ యిచ్చే చోటో తినవచ్చు. రాత్రిళ్లు కొద్దిగా టిఫిన్ లేకపోతే అరటిపళ్లు-ఇలాంటి వాటితో సరిపెట్టుకోవచ్చు.
ఈ నిర్ణయానికి వచ్చాక వారం రోజులపాటు యూనివర్సిటీ నుంచి వచ్చాక సాయంత్రాలు గదికోసం తెగ తిరిగాడు. చివరకు అతని కష్టం ఫలించింది. ఒక మురికివీధిలో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు నివసించే ఓ లాడ్జివంటిదాన్లో గది అద్దెకు దొరికింది. నెలకు ఇరవై రూపాయలు. దగ్గర్లోనే ప్లేటుమీల్స్ సప్లయిచేసే చిన్న హోటలుకూడా ఉంది. రాత్రిళ్ళు తేలికైన ఫలహారం లేకపోతే అరటిపళ్ళు. ఈ పద్ధతి బాగానే వుంది. కొన్నాళ్ళకు అలవాటయిపోయింది.
ఫణి, శైలజ క్లాసులో ఒకరు ఫస్టు, ఇంకొకరు సెకండ్.
అనుకున్నట్లుగా అతనికి స్కాలర్ షిప్ వచ్చింది. శైలజకూ వచ్చింది.
యూనివర్సిటీలో ఇద్దరూ కలిసి మాట్లాడుకునేందుకు అవకాశం చిక్కేది. ఆమె ఇంటికి వెళ్ళిపోయాక కలుసుకోవటానికి సాధ్యపడేదికాదు.
"మీ మేనత్త పెద్దపులా?" అనడిగాడు ఒకసారి.
"ఏం?"
"మిమ్మల్నంత నిఘాలో వుంచుతున్నందుకు."
"అది ఆవిడకు అవసరం?"
ఆమె చెప్పటానికి సిద్ధపడినట్లు కనిపించింది. కాని ఎందుకో సంకోచించింది. ఆమె ముఖంలో దిగులు కనిపించింది.
"చెబుతాను-తర్వాత."
అతను గుచ్చిగుచ్చి అడగలేదు.
ఓ మధ్యాహ్నం లీజర్ అవర్ లో క్లాసురూంలో ఇద్దరేకూర్చుని వున్నారు. సబ్జక్టుగురించి చర్చించుకుంటున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ శైలజకు వెట్ సబ్జెక్ట్. అతనికేదో డౌట్ వచ్చింది. ఆమె సబ్జెక్టులో లీనమై ఆవేశంగా, గడగడమని అనర్గళంగా చెప్పటం మొదలుపెట్టింది.
పైన ఫేన్ గాలికి ముఖంమీద పడుతోన్న ముంగురులు, నల్లటి కళ్లు, తెల్లటి కంఠంమీద నల్లటి ఆ పుట్టుమచ్చ, అందమైన అమాయకత్వంతో కూడిన ఆమె ముఖం.....కాని....
కళ్లార్పకుండా అలా చూస్తూ ఉండిపోయాడు.
ఆమె చెప్పటం పూర్తయింది కానీ అతను చూడటం పూర్తికాలేదు.
ఆమె కొంచెం ఇబ్బంది పడింది.
"ఏమిటలా చూస్తున్నారు?"
అతను తెరిపిన పడ్డాడు "ఊ?"
"ఏమిటలా చూస్తూ ఉండిపోయారు?"
"చెప్పనా?"
"ఊ"
"మీ......."
"చెప్పండీ?"
"ముక్కుపుడక."