ఆమెది కాకినాడ.
విశాఖపట్నంలో ఆమె మేనత్త వుందిట. అక్కడ వుంటుందిట. అంతకు మించి అప్పటికి ఆమె ఇంటి విషయాలేమీ చెప్పలేదు.
వాళ్ళకెదురుగా ఓ రిటైరింగ్ వయసులో వున్న ఆఫీసరులా వున్నాయనా, అతని భార్యా కూర్చునివున్నారు. ఫణి ఆమెతో మాట్లాడుతూ మధ్యమధ్య వాళ్ళని గమనిస్తున్నాడు. కొంతమంది రైలుప్రయాణం తినటానికన్నట్లుగా చేస్తారు. రైలు ఎక్కినప్పటినుంచీ వాళ్ళ నోళ్ళు కదులుతూనే వుంటాయి.
వాళ్ళదగ్గర బాస్కెట్ లు, ఆ బాస్కెట్ లనిండా రకరకాల తినుబండారాలు వున్నాయి.
మొదట కమలాపళ్ళు ఒలుచుకుతిన్నారు. అంటే భార్యే ఒలిచి తొనలు ఆయనకందిస్తూ, తనూ తింటున్నది..... తర్వాత జంతికలలాంటివి బయటకు తీసి వాటిని పటపటలాడించేశారు. కాసేపటికి టిఫిన్ క్యారియర్ తీసి, గిన్నెలు విడదీసి పులిహోర, దద్దోజనం వడ్డించుకుని ఆప్యాయంగా తినేశారు.
వాళ్ళని చూస్తోంటే ఫణికి ఆశ్చర్యంగానూ వుంది, అసూయగానూ ఉంది. అంతేగాక నోరూరింది, ఆకలికూడా వేసింది.
"పులిహోర అలాంటివి ఇంట్లో అయితే తినబుద్ధికాదుగాని, రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత రుచి పెరుగుతుంది!" అన్నాడు మెల్లిగా ఫణి.
ఆమె నవ్వింది "మీకాకలి వేస్తున్నట్లుగా వుందే?"
"అబ్బే లేదనుకోండి."
"మీకు లేకపోయినా నాకు వేస్తోందిలెండి. ఆమె బాస్కెట్ లోంచి చిన్న స్టెయిన్ లెస్ క్యారియర్ విప్పింది. అందులో కాజాలూ, పులిహోరా వున్నాయి.
తినటానికి వేరే ప్లేట్లు లేవు. ఇద్దరూ చెరో గిన్నె తీసుకున్నారు. వాటిలో కొంచెం కొంచెం పులిహోర, కొద్దిగా కాజాలు ఉంచుకుని కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు.
"మీదిదివరకు విశాఖపట్టణం ఎప్పుడన్నా వెళ్ళారా?"
"లేదండీ" అన్నది.
"మీరు?"
"నాకూ ఇదే మొదటిసారి."
"మీరెక్కడ ఉంటారు?" ఆమె అడిగింది.
"బహుశా హాస్టల్ లో వుంటాను. భరించగలిగితే......."
"అంటే"
"అంటే...ఏం లేదు, తర్వాత చెబుతాలెండి."
ఫలహారం చెయ్యటం పూర్తయింది. "అబ్బ! పులిహోర ఇంత గొప్పగా వుంటుందని ఇదివరకు నాకు తెలీదు" అన్నాడు అతను తృప్తిగా.
శైలజ నవ్వింది "రైల్లో దానిరుచి పెరుగుతుందని ఇందాకే చెప్పారుగా?"
"అంతేకాదు, రైలు ప్రయాణంలో ఆకలికూడా ఎక్కువవుతుంది."
ఎదురుగా చూసేసరికి ఆ దంపతులు టిఫిన్ క్యారియర్ సర్దేసి లోపలపెట్టి, పచ్చ అరటిపళ్ళు తింటున్నారు. ఒక్కొక్కరి చేతిలో అరడజనుపైగా వున్నాయి.
"ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నారు" అనుకున్నాడు ఆబగా.
"అటు చూడకండి- మళ్ళీ మీకు నోరూరితే కష్టం. ఆ సామాగ్రి మనదగ్గర లేవు" అంది శైలజ చిన్నగా వినిపించీ వినిపించనట్లు.
కాసేపటికి ఆమెముఖంలో నిద్రవచ్చే లక్షణాలు చూసి "మీరు పడుకోండి, లేటుగా వచ్చిన రైలు అడుగడుక్కీ లేటవుతూనే వుంటుంది. విశాఖపట్నం వచ్చాక లేపుతాను" అన్నాడు.
"వెళ్ళినా అంతరాత్రివేళ మా మేనత్త ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళటం సాధ్యం కాదు. రాత్రంతా స్టేషన్ లో గడపాల్సిందే!" అని శైలజ తనలో తను అనుకుంటున్నట్లుగా మాట్లాడి మెల్లిగా ప్రక్కమీదకు వాలింది.
ఫణికికూడా కాసేపు నడుం వాల్చాలనిపించింది. అందులో శైలజను తానే పడుకోమన్నాడు గనుక ఇప్పుడు కూర్చునేందుకు కూడా చోటులేదు. లేచి మధ్యనున్న బెర్తుని బెల్టునుండి విడదీసి గొలుసును బిగించి నెమ్మదిగా ఎక్కి పడుకున్నాడు.
రైలు మధ్యమధ్య ఆగుతూ మళ్ళీ వేగం పుంజుకుంటూ సాగిపోతూవుంది. కంపార్టుమెంటులో ఎవరో ఒకరిద్దరు మాట్లాడుకోవటం తప్ప ఎక్కువభాగం నిద్రపోతున్నారు.
అతనికి అలసటగా వున్నా నిద్రపట్టడంలేదు. ఎదురుగా వున్నవైపు క్రింద బెర్తుమీద భార్యా, మధ్యబెర్తుమీద భర్తా పడుకుని గుర్రుపెట్టి నిద్రపోతున్నారు.
శైలజ ఏం చేస్తోంది? కొద్దిగా తలవంచి చూశాడు. ఒకవైపు తిరిగి చెయ్యి తలక్రింద పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుని వుంది. నిద్రపోతూ వుందా? ఇప్పుడు ముక్కుపుడక కనపడటంలేదు. 'ఎంత అందంగా వుంది? ఎప్పుడూ ఈమె ముఖాన్ని ఇటువైపునుంచే చూస్తూ వుండాలి కాబోలు.'
అలా ఆలోచిస్తూ వున్న శైలజమీద ఏదో పడినట్లయేసరికి కళ్ళు విప్పి చూసింది. ఏమిటి పడిందా అని చేత్తో తడిమి చూసుకునేసరికి పదిపైసల కాయిన్ దొరికింది. పైకిచూసింది. పైబెర్తుకున్న గీతలాంటి రంధ్రంలోంచి ఫణి జేబులోంచి జారిపడినట్లుంది. అదితీసి గుప్పిట్లో పెట్టుకుని ప్రక్కకి ఒత్తిగిలబోతుండగా మళ్ళీ ఇంకేదో పడింది. ఈసారి ఐదు పైసలు. అదికూడా వెదికి తీసి గుప్పెట్లో పెట్టుకుని కళ్ళు మూసుకోబోతుండగా మళ్ళీ ఇంకేదో పడింది. ఏమిటిది? చిల్లర శ్రీ మహారాజా!
తర్వాత ఆమెకి నిద్రపట్టలేదు. తన కాకినాడ ఇంటి పరిస్థితులు, విశాఖపట్నంలో వుండబోయె మేనత్త ఇల్లు, అక్కడి వాతావరణం ఎలా వుంటుందోనని ఆమెకు భయంభయంగా వుంది.
విశాఖపట్నం వచ్చేసరికి ఆమె లేచి మంచి నిద్రలోవున్న ఫణిని నిద్రలేపాల్సి వచ్చింది.
3
విశాఖపట్నం జీవితం మొదలయింది. ఫీజు కట్టటానికి వెళ్ళినప్పుడు ఆఫీసులో కలుసుకున్నారు.
"హల్లో" అని పలకరించబోయి తమాయించుకున్నాడు. ఆమెప్రక్కన కళ్ళజోడు పెట్టుకున్న ఓ నడివయసు స్త్రీ వుంది. మేనత్త గావును.
ఆమెకూడా కళ్ళతోనే పలకరించింది.
అతనర్థం చేసుకున్నాడు. ఆమెకు మేనత్తదగ్గర అట్టే స్వాతంత్ర్యం లేదు, పైగా భయంకూడా.