Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 10


    ఆమె ముఖంలో సిగ్గుతోకూడిన ఎర్రటి ఎరుపు వచ్చింది. ఇష్టమైన వార్త వింటే కలిగే సంతోషం సిగ్గురూపంలో బయటకు పొంగినట్లయింది.

 

    "బాగుంది కదూ?"

 

    అతని గొంతులో పచ్చివెలక్కాయ అడ్డుపడినట్లయింది.

 

    "ఎంతో మోజుపడి చేయించుకున్నాను. బి.ఎస్.సి.లో వచ్చిన ప్రైజులన్నీ అమ్మి ఎంతో కష్టమ్మీద చేయించుకున్నాను."

 

    ఏం చెప్పాలి?

 

    "అలా మెదలకుండా వుండిపోయారేం?"

 

    "ఏమీ లేదులెండి, రండి, బయటకు వెళదాం."

 

    "కాదు ఇక్కడే కూర్చుందాం, చెప్పండి."

 

    "తర్వాత చెబుతాలెండి."

 

    "కాదు. ఇప్పుడే చెప్పాలి."

 

    అతను చాలా ఇబ్బందిలో వున్నాడు. "ముక్కుపుడక పెట్టుకునే ఆడవాళ్ళంటే నాకు ఇష్టంలేదు" సెంటెన్స్ ఎలా కంపోజ్ చేసుకోవాలో తెలీక అవకతవకగా చెప్పేశాడు.

 

    ఆమె ముఖంలో ఇందాకటి అందాలన్నీ పోయి కోపం ఆక్రమించుకుంది.

 

    "ముక్కుపుడక అంటేనా, ముక్కుపుడక పెట్టుకునే ఆడవాళ్లంటేనా?"

 

    "రెండూనూ" అనబోయి సర్దుకుని "ముక్కుపుడక అంటేనే......" అన్నాడు.

 

    "ఇందాక.... పెట్టుకునే ఆడవాళ్ళంటే అన్నారు?"

 

    అతను తికమకపడ్డాడు. పరిధిలోకి వచ్చేవరకూ మొగవాడిది ఆధిక్యత పరిధిలోకి వచ్చాక ఆధిక్యత ఆవిడ సొత్తు.

 

    "ఎలా చెప్పాలో తెలీక అన్నాను."

 

    "అయినా ముక్కుపుడక అంటే ఇష్టంలేనప్పుడు అది పెట్టుకునే ఆడవాళ్లంటే మాత్రం ఎందుకిష్టముంటుంది?"

 

    "మీరు కొంచెం అపార్థం చేసుకుంటున్నారు. నేను జనరల్ గా చెప్పాను."

 

    ఆమె ఏమీ రాజీ పడలేదు. "అసలు మీకు ఎందుకని ఇష్టంలేదు?"

 

    "ఏమిటి?"

 

    "ముక్కుపుడక అంటే......."

 

    "ఎందుకంటే....."

 

    ఆమె ఆత్రుతగా చూస్తోంది.

 

    "ఎందుకంటే....ఇష్టంలేదు కాబట్టి."

 

    "ఓహో!" అంటూ చేతిలో పుస్తకాన్ని టేబిల్ మీద విసురుగా కొట్టి అక్కడ్నుంచి బయటకు వెళ్ళిపోయింది, అతను "ఏమండీ! ఏమండీ!" అని పిలుస్తున్నా.

 

    అతని మనసంతా కలచివేసినట్లయింది. "ఊరుకున్నవాడిని ఊరుకోక అనవసరంగా ఆ ప్రసక్తి తెచ్చాను" అని తనని తాను తిట్టుకున్నాడు.

 

    సాయంత్రం బస్ స్టాప్ దగ్గర పలకరించటానికి ప్రయత్నించాడు. ఆమె పలక్కపోగా ముఖం ప్రక్కకి త్రిప్పుకుంది.

 

    బస్సులో క్రిక్కిరిసిన జనం. ఇద్దరూ ప్రక్కప్రక్కనే నిలబడ్డారు. భుజం భుజం రాసుకుంటున్నాయి.

 

    "శైలజా! నేను జనరల్ గా చెప్పాను, మీగురించి కాదు."

 

    ఆమె ఏమీ జవాబు చెప్పలేదు.

 

    "శైలజా, ప్లీజ్!"

 

    బస్సు ఒకచోట ఆగింది. ఆమె నిలబడ్డచోట ఓ సీటు ఖాళీ అయింది. చప్పున వెళ్ళి ఆ సీట్లో కూర్చుంది.

 

    అంతకుముందు ఆమె నిలబడ్డచోటు ఓ లావుపాటామె ఆక్రమించుకుంది. శైలజరూపాన్ని అతనికి కనిపించకుండా కప్పేసింది.

 

    అతను దిగవలసిన స్టాప్ వచ్చి క్రిందికి దిగి నిస్పృహగా నడుస్తున్నాడు. శైలజకు కిటికీలోంచి అతను కనిపిస్తున్నాడు. అప్రయత్నంగా అతనికేసే చూస్తోంది. బస్సు కదిలి వెళుతోండగా, అతను వెనుదిరిగి చూసేసరికి ఆమె చప్పున ముఖం ప్రక్కకి త్రిప్పుకుంది.

 

    ఫణి గదికి వచ్చి మంచంవాల్చి నీరసంగా పడుకున్నాడు. చీకటి పడేదాకా అలా ఆలోచిస్తూ పడుకుని కాఫీ త్రాగాలనిపించి లేచికూర్చున్నాడు. జేబులు తడుముకుంటే చిల్లరేం తగల్లేదు. పెట్టె తెరిచి చూశాడు. ఖాళీ. డబ్బులన్నీ అయిపోయాయి.

 

    ఈ ఊరొచ్చి రెండు, మూడు నెలలయిపోయింది. ఎంత పొదుపుగా వాడుకున్నా పుస్తకాలకీ, కనీసపు అవసరాలకూ డబ్బంతా అయిపోయింది. అతని గుండెల్లో రాయి పడ్డట్లుగా అయిపోయింది. ఈ సమస్యగురించి ఇంతవరకూ తెలియకపోలేదు. ఆలోచించటానికి భయంవేసి వాయిదా వేసుకుంటూ వచ్చాడు, ఇప్పుడిహ తప్పదు.

 

    ఏం చెయ్యాలి?

 

    చన్నీళ్ళతో ముఖం కడుక్కుని గదితలుపు తాళంవేసి బయటకు వచ్చాడు. తనకు రోజూ అరటిపళ్ళు యిచ్చే బండివాడు వీధిలో కనిపించాడు.

 

    "బాబూ! పళ్ళివ్వనా?" అన్నాడు.

 

    "వద్దు" అన్నట్టు తలాడించి ముందుకు నడిచాడు. ఆకలి తీరనప్పుడూ, అప్పుడప్పుడూ వెళ్ళి బన్నురొట్టె తిని టీ త్రాగే టే దుకాణం కనిపించింది. గల్లా పెట్టె దగ్గర కూర్చుని డబ్బులు వసూలుచేసుకుంటూన్న దుకాణం యజమాని యధాలాపంగా తలత్రిప్పి అతనివంక పలకరింపుగా చూశాడు. చిరునవ్వుతో సమాధానం చెప్పి, ఆ సందుదాటి ఇవతలకు వచ్చాడు.

 

    రాత్రి పదయ్యేవరకూ గమ్యంలేనివాడిలా అటూఇటూ తిరిగాడు. నీరసంగా ఉంది, కాని కసిగా వుంది.

 

    "ఏం చెయ్యాలి?"

 

    "చెల్లెలు వసుమతికి రాస్తే? అది హిందీ టీచరు. అది హిందీ పరీక్షలకు చదివేటప్పుడు దాన్ని "ముసలమ్మా!" అని ఏడిపించేవాడు. హిందీ చదివేవాళ్ళు అతని కంటికెందుకో ముసలివాళ్ళలా కనిపించేవారు. ఆ హిందీపరీక్షలే పట్టుదలగా ప్యాసయి అదిప్పుడు సంసార భారాన్ని ఈదుకువస్తోంది....దాని దగ్గర ఏముంటుంది? తననెలా ఆదుకుంటుంది?"

 

    పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. రిక్షా త్రొక్కితే.....?

 

    అతను కాసేపు రిక్షా త్రొక్కేవాడయాడు. అతని రిక్షాలో శైలజ ఎక్కింది. అతనికి తెలుసు, కాని ఆమె గమనించలేదు. రిక్షాలో కూర్చుని సీరియస్ గా కెమిస్ట్రీగురించి ఆలోచిస్తోంది. గమ్యంవచ్చింది. దిగి డబ్బులివ్వబోతూ అతని ముఖంలోకి చూసి నిర్ఘాంతపోయింది. 

 Previous Page Next Page