(టెలీవిజన్ ఎప్పుడు, ఎలా పుట్టింది? ఎలా పని చేస్తుందనే వివరాలు కొన్ని అయినా ఈ సీరియల్ పాఠకులు చదవటం సముచితమని పై వివరాలు అందించాను. కథా గమనాన్ని తాత్కాలికంగా ఆపి ఈ వివరాలు ఇచ్చినందుకు పాఠకులు మన్నించాలి- రచయిత)
హంపీ కారుని చూస్తూనే 'రమణి' క్రియేషన్స్ టెలీ సీరియల్ ప్రొడ్యూసర్ రంగనాధం పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటి వరకు గందరగోళంగా వున్న ఆ ప్రాంతం ఆమె రాకతో నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది.
హీరో ప్రశాంత్, మిగతా ఆర్టిస్టులు అందరూ మేకప్ వేయించు కుంటుండగా కెమేరా యూనిట్ సభ్యులు తీయబోయే షాట్ కి సంబంధించిన ఆరేంజ్ మెంట్స్ చూస్తున్నారు.
బంజారాహిల్స్ లోని అత్యాధునికమైన బంగ్లా అది.
విల్సన్ ఆ రోజు తీయవల్సిన సీన్స్ ఉన్న ఫైల్ అందించాడు. ఆమె అది అందుకుంటూ "మిస్ నందిని వచ్చారా?" అడిగింది.
"రాలేదు మేడమ్. రావచ్చు......" అన్నాడు ఒకింత భయపడుతూ.
ఆమె ఓసారి టైమ్ చూసుకుంది.
"ఇటీజ్ వెరీ బాడ్.....ఇంతవరకూ రాలేదు. వచ్చాక మేకప్ కి ఓ అరగంట పడుతుంది." చిరాకుపడుతూ లేచి ఫీల్డ్ లోకి వచ్చింది.
"మిస్టర్ విల్సన్....... హీరోయిన్ తన ఇంటి ముందు ఉన్న గార్డెన్ లో తిరుగుతూ ఏదో పుస్తకం చదువుతుంటుంది- హీరో గేటు దగ్గరకు వస్తాడు. గేటు దగ్గర గూర్కా ఉండటం చూసి కంగారుపడి, పెరటి గేటు వేపు వెళ్ళి గోడమీంచి ఎగిరెగితి హీరోయిన్ కేసి చేస్తుంటాడు. అంతలో హీరో ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి.....అదేంటి బావ.... ఈ ఇంటి మీద కన్నేసావేంటి..... నేను చెప్పిన ఇల్లు ఇది కాదేమో..... అంటాడు. హీరో కన్ ప్యూజ్ అవడం..... ఇదీ ఇప్పుడు మనం తీయబోయేది" అని విల్సన్ కి షాట్ వివరించి ఫైల్ ఎడం చేతిలోకి తీసుకుని కుడిచేత్తో కణతలు రుద్దుకుంది.
"విల్సన్! ఈ సీరియల్ ని డైరెక్ట్ చేయడానికి ఒప్పుకొని పెద్ద తప్పు చేసామనిపిస్తోంది. హీరోయిన్ ని ఒక్కసారి చూడగానే హీరోకి లవ్ ఎలా పుట్టుకొస్తుంది......?నిన్ను ప్రేమిస్తున్నాను..... నిన్ను ప్రేమిస్తున్నాను అని వెంటబడే ఏబ్రాసి ముఖాన్ని ఉన్న ఏ అమ్మాయన్నా ప్రేమిస్తుందా.......? మోస్ట్ డిజ్ గస్టింగ్.....ఎలా అప్రూవ్ చేశారు టీవీ వాళ్ళు ఈ స్క్రిప్టుని.....?"
"అంతలో ప్రొడ్యూసర్ రంగనాధం పరిగెత్తుకుంటూ వచ్చాడక్కడికి.
"హీరోయిన్ వచ్చేశారు మేడమ్....." ఆయాసపడుతూ ఆనందంగా అన్నాడు.
హంపీ మోము చిట్లించి "విల్సన్! ఫస్ట్ షాట్ కి లైటింగ్ అరేంజ్ చూడండి....." అంది నందిని కూర్చున్నవేపు వెళ్తూ.
ఇవ్వాళ నందినికి చివాట్లు తప్పవు అనుకుంటూ కెమేరా కేసి సాగిపోయాడు విల్సన్.
అద్దంలో తన మొహాన్ని చూసుకుంటూనే
"గుడ్ మార్నింగ్ మిస్ హంపీ" అంది నందిని.
గుడ్ మార్నింగ్..." అంది హంపి ముక్తసరిగా.
ఈ రోజు సీన్ ఏమిటి?" అడిగింది నందిని తన మొఖానికి టచెప్ చేస్తున్నా మేకప్ మాన్ కేసి సీరియస్ గా చూస్తూ.
అతను కంగారుపడి మరింత జాగ్రత్తగా మేకప్ చేయసాగాడు.
అసలే లేట్ గా రావటం- ఆపైన డైరెక్టర్ అన్న రెస్పెక్ట్ ఏ మాత్రం లేకుండా దిలాసాగా కూచుని మేకప్ చేయించుకుంటూ సీన్ ఏమిటంటూ స్టయిల్ గా అడగడం హంపీకి కోపాన్ని తెప్పించింది.
"సీ..... మిస్ నందినీ.....మీ మూలంగా యూనిట్ అంతా ఖాళీగా కూర్చోవలసి వచ్చింది. ఏ మాత్రం బాధ్యత లేకుండా మీ ఇష్టమొచ్చిన టైమ్ కి రావడం ఏం బావోలేదు. ఇప్పటికే గంట లేట్. ఇప్పుడు మేకప్ అరగంట. మొత్తం గంటన్నర......ఐ యామ్ వెరీ సారీ....." హంపీ మాటలు తీక్షణంగా ఉన్నాయి.
అప్పటికే రంగనాధం కంగారుపడిపోయాడు.
ఏదో కొద్దిగా లేటయ్యేసరికి ఇలా నలుగురి ముందు అవమానించటం ఏం బావోలేదు....." అంది మేకప్ మాన్ ని విదిలించి కుర్చీలోంచి లేస్తూ. సారీ చెబుతుందనుకున్న నందిని అలా నిర్లక్ష్యంగా తననే తప్పుపట్టడంతో హంపీ ఓ క్షణం బిత్తరపోయింది.
లేటయినందుకు సారీ చెప్పకపోగా పొగరుగా తన మీదకే రావడం ఆమెకు బాధ కలిగించింది.
ఆ లోపు లౌక్యం తెల్సిన రంగనాథం నవ్వుతూ ఇద్దరి మధ్యకు వచ్చి సర్దుబాటు చేసేసరికి ఐదు నిమిషాలు పట్టింది.
హంపీ సీరియస్ గా లేచి కెమెరాకేసి విసవిసా వెళ్ళిపోయింది.
రంగనాధం గుండెల్లో రాయి పడింది.
"హంపీగారి సంగతి మీకు తెలిసిందే కదా? సృజనాత్మకత ఉన్నవాళ్ళంతా ఇంతే...... చిన్న పొరపాటున కూడా క్షమించలేరు. నా మొఖాన్ని చూసి వదిలేయండి....."
నందిని కోపంగా చూసింది రంగనాధం వైపు.
"అంటే మేం క్రియేటివిటీ లేనివాళ్ళమనా మీ ఉద్దేశ్యం? ఇంకోసారిలా జరిగితే ఈ విషయాన్ని సుశీల్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళవలసి వస్తుంది..... అంది మండిపడుతూ.
"క్షమించండమ్మా..... ఇప్పటికే చాలా పెట్టేశాను. కేవలం స్క్రిప్ట్ అప్రూవ్ చేయించుకోవడానికికే పాతిక వేలు పెట్టాను. ఆ టీవీ వాళ్ళకు అడ్డమైన పనులు చేసి పెట్టాను. నాలుగు సినిమాలు తీసిన నిర్మాతను నేను. అక్కడ కూడా ఇన్ని బాధలు పడలేదమ్మా.....సినిమాలు ప్లాప్ అయి డబ్బు నష్టపోయానుగానీ- ఇప్పుడు చేస్తున్నన్ని పరువు తక్కువ పనులు చేయలేదమ్మా నేను. ఈ టీవీ రాజకీయాల ముందు సినిమాఫీల్డ్ రాజకీయాలు చాలా తక్కువమ్మా. టీవీ ప్రొడ్యుసర్ బాధలు పగవాడిక్కూడా వద్దమ్మా... ఆ డిప్యూటీ డైరెక్టర్ కూతుర్ని, అల్లుడ్ని ఊటీకి పంపించి, అక్కడ హొటల్ రూమ్ బుక్ చేసి, సకల మర్యాదలు చేసి ఇక్కడ ఈయనకు పీటర్ స్కాచ్ లు, బ్లాక్ డాగ్ లు సప్లై చేస్తేగాని నా స్క్రిప్ట్ అప్రూవ్ చేయలేదు తల్లీ. ఇంత వరకు స్పాన్సర్స్ దొరకలేదు. కేవలం పైలట్ కే నాకు లక్ష అయిపోతోంది.......దయచేసి నా బాధ నర్ధం చేసుకోండి. ఏదో మీ ద్వారా ఆ సుశీల్ కుమార్ జీ, స్పాన్సర్ చూసి పెడతారనే ఆశతో ఉన్నాను. మీరిలా కోపం తెచ్చుకుంటే అన్యాయమై పోతాను.
రంగనాథం పరిస్థితి దయనీయంగా ఉంది.
అప్పటికామె ఒకింత శాంతించి కుర్చీలో కూర్చుంది. తిరిగి మేకప్ చేయటం మొదలయింది.
మొత్తానికి అరగంట తర్వాత షాట్ రడీ అయింది.
భవాని నందినికి షాట్ చెప్పి వెనక్కి వచ్చేశాడు.
ఆర్ట్ డైరెక్టర్ ఓ పుస్తకం తెచ్చి నందిని చేతికి అందించాడు.
"మిస్ నందిని! షల్ ఐ గోటూ టేక్" అంది హంపీ పెద్దగా.
అప్పటికి ఆమె తనలో రేగిన కోపాన్ని అతి ప్రయత్నం మీద దిగ మ్రింగుకుంది.
"ఓ.కే.' అంది నందిని.
హంపీ కెమేరాకి దూరంగా నించుని నందిని కేసే చూస్తోంది.
విల్సన్ కెమెరాను ఆపరేట్ చేస్తున్నాడు. యూనిట్ సభ్యులంతా కలిసి దాదాపు పాతికమంది ఉన్నారక్కడ.
అయినా అంతా నిశ్శబ్దం......
"ఫ్రేమ్......ఓకేనా విల్సన్?" హంపీ నందిని కేసే చూస్తూ అడిగింది.
"ఓ.కే మేడమ్...." అన్నాడు విల్సన్ వ్యూ ఫైండర్ లోంచే చూస్తూ.
"ఫస్ట్ ఎస్టాబ్లిషింగ్ షాట్ తీసుకొని, వైడ్ షాట్ కొచ్చి, చివరలో యాంగిల్ షాట్ తీసుకోవాలి."
నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో ఆమె మాటలు స్పష్టంగా, శాసిస్తున్నట్లుగా ఉన్నాయి.
హంపీ డైరెక్ట్ చేసేప్పుడు మాత్రం ఆమె సూచనల మేరకు విల్సనే కెమెరా ఆపరేట్ చేస్తుంటాడు.
"రడీ.....మిస్ నందిని....టేక్" అంది పెద్దగా. కెమెరా స్టార్ట్ అయ్యింది.
హంపీ చటుక్కున కెమెరా వెనక్కు వచ్చేసి మానిటర్ లో షాట్ ని చూడసాగింది.
ఆమె సరదాగా పుస్తకం తిరగేస్తూ వచ్చిక మీద కొంత దూరం వెళ్ళే సరికి "కట్" అంది హంపీ నందినీ దగ్గరకు వెళ్తూ.
"సీ.....మిస్ నందినీ.....వంటి మీద దుస్తుల పట్ల స్పృహ లేకపొతే ఎలా? దిసీజ్ నాట్ కమర్షియల్ సినిమా.టీవీ ఫిలిమ్. చదువురాణి పామరుల్ని కూడ టీవీ విపరీతంగా ప్రభావితం చేస్తుంది. చిన్న పిల్లలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, తల్లిదండ్రులు అందరూ టీవీ గదిలో చేరి ఈ సీరియల్ ని చూస్తారు. అప్పుడు నీ డ్రెస్ వాళ్ళనెంత ఇబ్బంది పెడుతుందో తెలుసా? ప్రజా సంక్షేమం చూడవల్సిన ప్రభుత్వ ప్రచార సాధనం టీవీ. వ్యాపారం చేసుకొనేందుకు కాదది. కట్టు, బొట్టు మాటతీరు, ప్రవర్తన, భాష అన్నీ సంస్కారయుతంగా ఉండాలి. మన సంప్రదాయాల్ని, సంస్కృతిని ప్రతి బింబించాలి. ఒక్కసారి మీరు దుస్తులు వేసుకున్న విధానం చూసుకోండి. నాభికనిపించేలా జారిన మీ చీర కుచ్చెళ్ళు, ఎక్స్ పోజ్ చేసిన మీ బ్రెస్ట్, అది కనిపించేలా పల్చటి చీర....." ఐయామ్ వెరీ సారీ......కాస్ట్యూమర్....." కేక వేసింది చిరాగ్గా.....
కాస్ట్యూమర్ పరిగెత్తుకు వచ్చాడు కంగారుపడుతూ.
"చీరను నాభి పైకి జరపండి. పైటను గుండెలమీద పల్చగా కాకుండా రెండు మూడు మడతలు ఉండేలా వెయ్యండి. మరో విషయం....ఈ సీరియల్ వరకూ ట్రాన్స్ పరెంట్ బ్లౌజ్ బ్రా స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని సయితం కెమెరా కేచ్ చేస్తుందన్న విషయం తెలీదా మీకు? దాన్ని చూసి పల్లెటూరి యువతులు మోజు పడతారు. యువకులు టెంప్ట్ అవుతారు. ప్రోవకేటివ్ గెటప్ రాకుండా జాగ్రత్త పడండి....." ఆమె మాటలు సీరియస్ గా ఉన్నాయి.
నందినికి హంపీని నమిలిమింగేయాలన్నంత కోపం వచ్చింది. అయినా సెట్ లో డైరెక్టర్ దే పైచేయి అని తెల్సినది కనుక తమాయించుకుంది. ఒక్కక్షణం హంపీ కేసి గుర్రుగా చూసి ఊరుకుంది.
ఒక్క బూతు సినిమా విడుదలైతే అదలాంటి సినిమా అని తెలిస్తే ఆ ఇంట్లోని మగవాళ్ళే. అందునా యువకులే వెళ్తారు. చెల్లెళ్ళని, అక్కల్ని, అమ్మని తీసుకెళ్ళరు. కాని ఈరోజు టీవీ ఇంట్లో సినిమా హాలు లాంటిది. దాన్ని ఇంట్లో వాళ్ళందరూ చూడకుండా నిరోధించడం సాధ్యంకాదు. ఇదే ఆఖరి హెచ్చరిక..... ఈ సీరియల్ పూర్తయ్యే వరకూ ప్రతి ఒక్కరూ ప్రతివిషయంలోనూ ఒళ్లు దగ్గర పెట్టుకు ప్రవర్తించాలి-మైండిట్! అందరికి వినిపించేలాగే అంది.
ఆమె అలా ఎవర్ని ఉద్దేశించి అన్నదో అక్కడున్న అందరికి అర్థమైంది.
నందిని ముఖం ముడుచుకుపోయింది.
ఆ తరువాత పడి నిముషాలకు షాట్ ఓ.కే. అయింది.
సరీగ్గా అదే సమయానికి జయధీర్, దాదాగంజ్ ప్రయాణీస్తున్న వాయుదూత్ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయింది.
జయధీర్ , దాదాగంజ్ ఎయిర్ పోర్ట్ బైటకి వచ్చేసరికి కారు సిద్ధంగా ఉంది. వాళ్ళు ఎక్కగానే అది సరాసరి కృష్ణా ఒబెరాయ్ కేసి బయలుదేరింది.
జయధీర్ కళ్ళు మూసుకుని కుడి చేతి చూపుడు వేలితో గడ్డాన్ని నిమురుకుంటూ ఎక్కడో ఆలోచిస్తున్నాడు.
"సార్! మన నెక్ట్స్ పోగ్రామ్....? దాదా కళ్ళు మూసుకొని ఉన్న జయధీర్ కేసి చూస్తూ అడిగాడు.