Previous Page Next Page 
అంకితం పేజి 9


    "స్కూల్ కి వద్దా? నాకీ రోజునుంచీ పరీక్షలు తెల్సా" అన్నాడు- అరుంధతి నిస్సహాయంగా నావైపు చూసింది. నేను కల్పించుకుని, ".......అవి క్లాస్ టెస్ట్ లేగా! అంత ముఖ్యమైనవి కావు" అన్నాను.

    "ఇప్పుడు మనం వెళ్ళేది ముఖ్యమైన పనా?" అన్నాడు వెంటనే. అరుంధతి న మొహంలోకి చూసింది. నేను చాలా మామూలుగా శబ్దించటానికి ప్రయత్నిస్తూ ".....అవును" అన్నాను-

    వాడు ఒక క్షణం ఊరుకుని "ఈసారి నేనే క్లాస్ ఫస్ట్ వస్తానని రత్నాకర్ తో పందెం వేసేను
 అన్నాడు.

    "అయినా ఈ పనే ముఖ్యం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నీకు మాటిమాటీకీ జ్వరం వస్తోంది కదా".

    "ఈ రోజు జ్వరం లేదుగా!"

    "రేపు రావొచ్చు మళ్ళీ-."

    "మరి రేపే వెళ్ళొచ్చుగా! రేపు నాకు పరీక్షలేదు. ఈ రోజే పరీక్ష" అన్నాడు.

    నేను కోపంగా, "ఎదురు సమాధానాలు చెప్పకు. బయల్దేరు" అన్నాను. వాడు ఫక్కున నవ్వేసి, ".....ఒకటి నుంచీ పదివరకూ లెక్క పెట్టు డాడీ. కోపం వచ్చినప్పుడు అలా చెయ్యాలని జాన్ డేవిడ్ అంకుల్ చెప్పాడుగా!" అన్నాడు. కమ్చీతో కొట్టినట్టయింది! నిస్సహాయంగా అరుంధతి వైపు చూసాను. ఆమె ఒక ప్రేక్షకురాలిలా మా సంభాషణ వింటోంది. ఆమె అభావం నాకు మరింత గిల్టీ ఫీలింగ్ కలుగచేసింది.

    నన్నా పరిస్థితి నుంచి తప్పించటానికా అన్నట్లు అంకిత్ లోపలికి వెళ్ళి స్కూల్ డ్రస్ మార్చుకుని వచ్చేస్తాడు. ముగ్గురం డాక్టర్ మహారధి దగ్గిరకు బయల్దేరాం.


                                3

    జీవితంలో రెండే రెండు .....కారణాలు! ఫలితాలు!! దురదృష్టవశాత్తు మనం "కారణాలు" వెతుక్కోవటాని కిచ్చినంత సమయం-"ఫలితం" సంపాదించటానికివ్వం.


                         *    *    *

    డాక్టర్ మహారధి!

    యాభయ్ అయిదూ, అరవై మధ్య వయసులో ఎత్తుగా దృఢంగా వున్నాడు. ఆయన ప్రవర్తన హుందాగా, పేషెంట్స్ కి సెక్యూరిటీ ఫీలింగ్ ఇస్తున్నట్టుగా వుంది.

    అంకిత్ ని పరీక్షల కోసం లోపలి పంపించాడు.

    టెస్ట్ ఫలితాలు వచ్చాక చెప్పాడు! "......అంకిత్ కి రెండు కిడ్నీలు బాగా దెబ్బతిన్నాయి, టెర్మినల్ స్టేజి".

    టె.....ర్మి....న....ల్.....స్టేజి..

    అవసాన దశ.

    ఆ మాట బాణంలా వచ్చి నా గుండెలో గుచ్చుకుంది! అరుంధతి మొహం రక్తంలేనట్టు పాలిపోయి వుంది. ఆ క్షణం అలాగే ఆమె టేబిల్ మీద వాలిపోయి, గుండెపోటుతో మరణించినా నేను ఆశ్చర్యపోను. అంకిత్ అంటే మాకు కేవలం ఇష్టమే కాదు- ప్రాణం కూడా!

    మహారధి సానుభూతిగా నా చేతిమీద తట్టాడు. "అంకిత్ ని రెండ్రోజులు మా ఆస్పత్రిలో ఉంచండి. కొన్ని పరీక్షలు నిర్వహించాలి".

    నేనూ అరుంధతీ ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం.

    చుట్టూవున్న వల- కొద్ది కొద్దిగా బిగుసుకుంటూన్న ఫీలింగ్!

    మాకు తెలియకుండానే అగాధంలోకి జారిపోతున్న భావన!!

    ఊబిలో కూరుకుపోతూన్న నిస్సహాయస్థితి.

    వంతుల వారీగా కాకుండా, అరుంధతీ నేనూ, ఆస్పత్రిలోనే ఆ రెండ్రోజులూ వుండిపోయాం!

    ఏం జరుగుతూవుందో అంకిత్ కి తెలియనివ్వలేదు. వాడు తనకేదో వైరల్ ఫీవర్ అన్న అభిప్రాయంలోనే వున్నాడు. క్లాసు పుస్తకాలు తలదిండు పక్కన పెట్టుకుని చదువుతున్నాడు మాతో జోకులేస్తూ మాట్లాడుతున్నాడు. మొహానికి నవ్వు పులుముకుని, పాత్రధారుల్లా మేమూ సంతోషంగా కనబడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ చాలా దుర్భరమైన స్థితి ఇది!

    ......రెండ్రోజుల తరువాత మహారధి నుంచి కబురొచ్చింది.

    "అకింత్ పరిస్థితి ఎలా వుంది?" కూర్చోకుండా ఆదుర్దాగా అడిగాను.

    "ఆ విషయం చెప్పాలనే మిమ్మల్ని పిలిచాను" అని క్షణం ఆగి చెప్పాడు. "అంకిత్ కిడ్నీ బయప్సీ తీసాం".

    బ.....యా......ప్సీ.....   

    ఫలితం ఏమిటని నేను అడగలేదు.

    అతనే అన్నాడు..... "ఇంకో క్లిష్టమైన పరీక్ష నిర్వహించాలి.....పిస్ట్యులా  అని...."

    "అవసాన దశలో వున్నప్పుడు ఇవన్నీ ఎందుకు?" నా కంఠం బలహీనంగా పలికింది.

    "ఏదయినా అవకాశం వుంటుందేమో అని" మహారధి అన్నాడు. ".....ఏ మాత్రం అవకాశం వున్నా మందులవల్ల బాగుపడవచ్చు".

    "మీ అభిప్రాయం ఏమిటి?"

    "చాలా కష్టం.... కానీ అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అదృష్టం బావుంటే నా అభిప్రాయం తప్పు అవ్వొచ్చు".

    "కాకపోవచ్చు కూడా" కసిగా అన్నాను.

    "అవును! కానీ పరీక్షలు నిర్వహించక తప్పదు. ఎందుకంటే....." గాఢంగా నిశ్వసించాడు డాక్టర్ మహారధి. "......ఎందుకంటే అంకిత్ రక్తం 'ఓ' నెగిటివ్".

    మరో బాంబు విస్ఫోటనం.

    'ఓ' నెగిటివ్ సాధారణంగా ఎవరికీ వుండదు- చాలా తక్కువ మందికి ఆ గ్రూప్ రక్తం వుంటుంది.

    నా భావం అర్థమయినట్టు మహారధిఅన్నాడు..... "ఈ పరిస్థితుల్లో అంకిత్ కి మరో కిడ్నీ అమర్చటం కష్టం. శరీరంలోకి కిడ్నీ స్వభావ సిద్ధంగా ఇమిడిపోవాలంటే రక్తం గ్రూప్ కరెక్ట్ గా సరిపోవాలి. అంతేకాదు, టిష్యూ మ్యాచ్ అవ్వాలి. జెనెటిక్ కోడ్ కూడా సరితూగాలి. అన్నీ సానుకూలబడటం దాదాపు అసాధ్యం".

    "మీరు చెప్పేది ఏమిటి డాక్టర్? సూటిగా చెప్పండి. అంకిత్ మాకు దక్కడు. ఆశలు వదులుకోవటం మంచిది. అంతేగా మీరు చెప్పదలుచుకున్నది?" నా కంఠంలో విసుగు, రోషం, నిస్సహాయత, కోపం ,మిళితమయ్యాయి.

    "కాదు! దీనికి ఒకే ఒక అవకాశం వుంది".

    అరుంధతి మొహంలో ఆనందం తొంగిచూసింది. "చెప్పండి డాక్టర్! ఎంత ఖర్చయినా ఫర్వాలేదు" అంది.

    "ఇక్కడ డబ్బు సమస్యకాదు" అన్నాడు మహారధి. ".....ఇంకా మూడునెలల టైముంది. అంతకాలంపాటు అంకిత్ రక్తం శుద్ధిచేస్తూ డయాలిసిస్ మీద  బ్రతికించవచ్చు".

    ఆగాడు.

    పరిస్థితిని స్మశానంగా మార్చటం కోసం అతడి చివరి వాక్యాలు అక్కడ విస్పోటించాయి.

    "మీరూ, మీ భార్యా టెస్టులు చేయించుకోండి! సాధారణంగా తల్లిదండ్రుల కిడ్నీ పిల్లలకు సరిపోవక పోవటమంటూ వుండదు. ఇందతా రెండు -మూడు నెలల్లో జరగాలి. అంకిత్ ని రక్షించగలిగేది అతని తల్లిదండ్రులు మాత్రమే...."

    నేను చాలా నిర్వేదంగా మారిపోయినట్టు నాకే స్పష్టంగా తెలుస్తోంది. బయటకు తెలిసేలా బాధపడితే అరుంధతి కూడా దక్కకపోవచ్చు.

    ఆమె కోసమైనా దుఃఖాన్ని అణుచుకోక తప్పదు. భగవంతుడు ఎంతటి నిర్దయుడో ఇప్పుడు అర్థమౌతోంది.

    పెద్దగా ఏడ్చి మనసులో బాధ దింపుకునే వీలు- మొగవాడికి కల్పించలేదు.

    అసలు బాధంటే ఏమిటి?

    'మరణం' కూడా బాధకాదని నమ్మేవాడిని నేను జాన్ డేవిడ్ సహచర్యంలో.

    'సమస్య'కు ప్రాముఖ్యత ఇవ్వటం మానేసి చాలాకాలం అయింది.

    ఇప్పుడనిపిస్తోంది- కేవలం నాకు పరీక్ష పెట్టటానికే దేవుడు ఈ విధంగా నాకీ బాధని సృష్టించి వుంటాడు.

    నేనెన్నోసార్లు శ్మశానానికి వెళ్లాను.

    శవయాత్రలో, ముందు కుంపటి పట్టుకుని కొడుకు నడుస్తూ వుంటాడు. ఘనీభవించిన దుఃఖానికి అతడి మొహం తార్కాణంలా వుంటుంది. శవాన్ని శ్మశానంలో క్రిందికి దింపుతారు. నలుగురు బలిష్టమైన యువకులు హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ ఎత్తుగా చితి పేరుస్తారు. బ్రాహ్మడు మంత్రాలు చదువుతూండగా, కుండకు మూడు చిల్లులు పొడిచి, చితికి నిప్పంటిస్తారు.

    ఒక్కసారిగా శవం తాలూకు బంధువుల్లో చిన్న కలకలం బయలుదేరి, తిరిగి సర్దుమణుగుతుంది. "నాకు ఆఫీసుకి టైమయింది" అంటాడు మరణించిన మనిషి తాలూకు భార్యని ఓదార్చటానికి పక్కన కూర్చున్నావిడ. బ్రాహ్మడు సంభావన కోసం చేతులు సాచుతాడు. శవానికి నిప్పంటించిన కుర్రవాడు స్నానం చేసి కొత్తబట్టలు వేసుకుంటాడు.

    శ్మశాన వైరాగ్యంతో బయటకు వస్తూన్న నాకు ఇదంతా వింతగా వుంటుంది. నిజమైన బాధ అంటే ఇది కాదనిపిస్తుంది నా తల్లిదండ్రులు మరణించినప్పుడు కూడా నేనీ తంతులన్నీ నిర్వహించాను. బాధగా అనిపించలేదు. అప్పుడప్పుడు వారి ప్రేమలు గుర్తొచ్చి దిగులుగా అనిపించేది! అదీ మొదట్లోనే.....

    అరుంధతికి పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్పినప్పుడు కూడా నాకేమీ పెద్ద బాధ అనిపించలేదు. అదొక ఆక్సిడెంట్ అనుకున్నానంతే!


    కానీ ఇది నిజమైన బాధ!

    మనం విషాదంగా వునప్పుడు, ఆ సమస్యే అన్నిటికన్నా పెద్ద సమస్యగా  తోచటం సహజమే! ఉధృతి అలాంటిది.

    అయితే ఇది 'నిజమైన' అని ఎందుకన్నానంటే- అంకిత్ కేవలం నా కొడుకు కాకుండా, పక్కింటి వారి కొడుకయినా- నేనింత బాధపడి వుండేవాడిని! తనతో అంత సాంగత్య వుంటే.

    ......అంకిత్ ని తెల్సిని వాళ్ళెవరూ అతడిని ఇష్టపడకుండా వుండలేరు. ఒక ఇష్టమే కాదు- ఆరాధన, ప్రేమ, చిన్నపాటి గౌరవం అన్నా కూడా నేను ఆశ్చర్యపోను. అలాటివాడు ప్రస్తుతం మరణం అంచున నిలబడి వున్నాడన్న వార్తా నా మనస్సుని రంపంలా కోసివేస్తూంది. అందుకే ఇది నిజమైన బాధ అన్నాను.

                         *    *    *

    ఇక మరుసటిరోజు......

    .......అంకిత్ ని డయాలిసిస్ వార్డులో చేర్పిస్తామనగా నేను ఒంటరి ఆస్పత్రికి వెళ్ళాను. అంకిత్ ని ఆ భయంకరమైన మిషన్స్ మధ్య ఉంచటం నా ఇష్టంలేదు. కానీ తప్పనిసరి పరిస్థితి!

    ఆ వార్డ్, మిషన్స్ ఎలా వుంటాయో. అంకిత్ ని అక్కడ ఏం చేస్తాడో తెల్సుకోవటమే నా ఉద్దేశ్యం.

    పొడవైన హాలు-

    కొన్ని మంచాలున్నాయి. కొందరు పేషెంట్లు నిద్రపోతున్నారు. మరికొంతమంది మెలకువగా వున్నారు. వారు పైకప్పుకేసి చూస్తూ నిశ్శబ్దంగా వున్నారు. ఒకరిద్దరు బంధువులు పక్కన కూర్చుని పుస్తకాలా అటెండెంట్స్ చదువుకుంటున్నారు.

    ఆ గది స్థబ్దత నన్ను సన్నగా వణికించింది. బయట ప్రపంచానికీ దీనికీ  ఎంత తేడా! అక్కడ ఉరుకులూ.....పరుగులూ.....ఉద్విగ్నత! ఏదో సాధించామన్న తపనా ఎంత సంపాదించినా తీరని అసంతృప్తి! ఇదంతా దేనికోసం? చివరికి ఇక్కడికి చేరుకోవటానికేనా?

 Previous Page Next Page