Previous Page Next Page 
అంకితం పేజి 10


    ఏముందిక్కడ?

    భరించలేని నిరాసకత్త! వైరాగ్యానికి పరాకాష్టగా నిలిచిన శ్మశాన నిశ్శబ్దం! అధికారం కోసం దేనికయినా సిద్ధపడే రాజకీయ నాయకుల్నీ తీసుకొచ్చి ఈ వార్డులో కొంతకాలం వుంచాలి. అప్పటికయినా వాళ్ళకు తెలిసోస్తుందేమో......జీవితానికి అస్థిత్వం అనేది అధికారం వల్లా, వందిమాగధులవల్లా, డబ్బువల్లా రాదనీ, వయసుతోపాటూ పెరిగే తృప్తీ, దానివల్ల చివర్లో వచ్చే వేదాంతం- అన్నిటికీ అంతిమ మజిలీ అయిన 'మరణం' ని మనస్ఫూర్తిగా ఆహ్వానించగలిగే ధైర్యాన్ని ఈ విధమైన కష్టాలు ఇస్తాయనీ తెలుసుకోవటం కోసమైనా కొన్ని దేశాల్లో మిలటరీ ట్రెయినింగ్ కంపల్సరీ చేసినట్టే, ఈ ఆస్పత్రుల్లో పనిచేయటం కూడా కంపల్సరీ చేయాలి.

    ఈ విధమైన ఆలోచన్లతో ముందుకు నడిచాను.

    ఒక బెడ్ దగ్గర ఒక పెద్ద మిషన్ లాంటిది వుంది. డానికి కొన్ని స్విచ్ లూ, డయాల్సూ వున్నాయి. రెండు వైపులా రెండు బాటిల్స్- తల క్రిందులుగా వేలాడగట్టబడి వున్నాయి.

    మిషన్ మీద "ఆల్ట్రా ఫ్లోటూ డయలైజర్" అని వ్రాసి వుంది.

    ఆ మిషన్ నుంచి రెండు ట్యూబులు రోగి శరీరానికి గుచ్చబడిన రెండు సూదులకి కనెక్ట్ కాబడ్డాయి. ఒకదాని నుంచి రక్తం మిషన్ లోకి వెళ్ళి, శుద్ధికాబడి, తిరిగి వెనక్కి వచ్చి శరీరంలోకి చేరుతోంది.

    ప్రకృతి సృష్టి ఎంత విచిత్రమైనది! ఇంత పెద్ద మిషన్ చేసే పనిని చిన్న దబ్బపండు సైజులో వెన్నెముక దగ్గర వున్న ఒక అవయవం చేస్తుంది. చిన్న అవయవం!

    కిడ్నీ!!!

    ఒక్కసారి అది ఫెయిలైతే వారానికో పదిరోజులకో ఒకసారి- గంటల తరబడి ఇలా పక్కమీద పడుకుని- వళ్ళంతా సూదులు గుచ్చుకుని.....

    ఉన్నంత సేపూ విలువ తెలియకపోవటం అంటే ఇదేనేమో! భగవంతుడిచ్చిన ఇంత గొప్ప సంపదని మనం తాగుడూ, స్మోకింగ్ లాటి వ్యసనాల్తో కొల్లగొట్టుకుంటున్నాం.

    తమ దురదృష్టాన్ని తామే కొనితేచ్చుకున్నవారి సంగతి సరే. అంకిత్ లాతివారి సంగతేమిటి? ఏ తప్పు చేసారని వారికీ శిక్ష విధించాలి? ఏ నేరం చేసారని వారి శరీరంలో సూదులు గుచ్చి రక్తం తోడాలి?

    "సిస్టర్" అంటూ పిలిచి, శ్రీధర్ ఇచ్చిన  ఉత్తరం చూపించాను.

    "చెప్పండి. నేను మీకు ఏ సాయం చేయగలను?" ఇంగ్లీషులో ప్రశ్నించింది.

    "ఈరోజు డయాలిసిస్ జరిగే పేషెంట్ ఎవరయినా వున్నారా?" అని అడిగాను. నా వుద్దేశ్యం ఏమిటంటే- ఆ డయాలిసిస్ తీసుకునే పేషెంట్ ని వివరాలు కనుక్కుని, అవన్నీ అంకిత్ కి చెప్పి, భయంలేకుండా చేయాలని.

    "ఉంది శృతి అని. అదిగో.....ఆ చివరి బెడ్ మీద అమ్మాయి....."

    నేను కృతజ్ఞతా పూర్వకంగా తల వూపి, అటు నడిచాను.

    ఎనిమిదేళ్ళ అమ్మాయి.

    వంటికి సూదులు గుచ్చబడి వున్నాయి.

    తన జీవితంలో అవికూడా ఒక బాగామైనట్టు-వాటిని పట్టించుకోకుండా కూర్చుని, ఏదో పనిలో నిమగ్నమై వుంది.

    ముద్దుగా వుంది ఆ పాప.

    మంచంమీద కూర్చుని, ఒక ఛార్టుమీద ఏదో బొమ్మ గీస్తోంది. పాపలాగే బొమ్మకూడా చక్కగా వుంది.

    నేను దగ్గిరగా నడిచి స్టూలు లాక్కుని పక్కన కూర్చున్నాను. అలికిడికి తలెత్తి "......మళ్లీ ఏమైనా కొత్త మిషన్లు, కొత్త సూదులూ తెచ్చారా?" అని అడిగింది అభావంగా. భావరహితంగా వేసిన ఆ ప్రశ్న నా గుండెలోంచి బాణంలా  దూసుకుపోయింది. పోలీసు కస్టడీలో ప్రతిరోజూ  చిత్రహింసకు గురిఅయ్యే ఖైదీ ఆ హింసకు ప్రొద్దున్నే ఎలా ప్రిపేరవుతాడో, ఆ విధంగా వుంది ఆ పాప ప్రశ్న. మిషన్సూ సూదులూ అంటే ఎంత ఎలర్జీ ఏర్పడిందో ఆ ఒక్క ప్రశ్నతో అర్ధమయింది.

    "నేను వచ్చింది అందుకు కాదు" అన్నాను.

    "అంటే......మీరు డాక్టరు కాదా?'

    "కాదు".

    "మేల్ నర్సా?"

    నేను గట్టిగా నవ్వేసి, "నేను నీ అంకుల్ ని. అచ్చు నీలాగే వుండే ఓ కుర్రవాడి తండ్రిని" అన్నాను పొయెటిక్ గా. ఆ పాప మనోహరంగా కళ్ళు పైకెగరేసి నవ్వింది. నేనూ నవ్వేసాను.

    ఆ పాప మాటి మాటికీ తన బొమ్మవైపు చూసుకోవటం గమనించాను. "డిస్టర్బ్ చేస్తున్నానా?" అని అడిగాను.

    "నో....." అంది. ".......ఇక్కడెవరూ మాట్లాడరు. నాకు మీరొచ్చి మాట్లాడటం బావుంది".

    "నీకీ మిషను పెట్టి ఎన్ని రోజులు అవుతుంది?"

    "అబ్బో.....చాలా....." అంటూ, చేతులు గాలిలో దూరంగాసాచి, "......ఇన్ని" అంది.

    "మరి నీకు నొప్పి వుండదా?"

    "ఉంటుంది" అని, ఓ క్షణం ఆలోచించి, "అమ్మగానీ నాన్నగానీ పక్కన వుంటే వుండదు" అంది. ఆ పాప తాలూకు ఎవరూ దగ్గిర లేకపోవటం అప్పుడు గమనించాను.

    "మరి నీ కిక్కడ ఎలా తోస్తుంది?"

    "కనిపించటంలా?.....బొమ్మలు గీసుకుంటాను. ఇంకా.....ఫ్రెండ్స్ కి ఉత్తరాలు వ్రాస్తాను. పజిల్స్ సాల్వ్  చేస్తాను....."

    బాధని మర్చిపోవటానికి చక్కని మార్గాలవి. అది అంకిత్ కి చెప్పాలి. ......ఆఫ్ కోర్స్ వాడికి పుస్తక పఠనం చాలా ఇంటరెస్ట్. కాబట్టి తోచకపోవటం అన్న సమస్య వుండదు.

    ఆ పాపతో కొంచెంసేపు మాట్లాడి 'బై' చెప్పి రాబోతూంటే "మళ్లీ ఎప్పుడొస్తావంకుల్?" అని అడిగింది.

    "రేపు" అన్నాను.

    "నిజంగానా?" ఆ అమ్మాయి కళ్ళు మెరిసాయి.

    "అంతేకాదు. నేను రేపు వచ్చేటప్పుడు నీ కోసం వాల్ష్ పెయింట్ ట్యూబులు కూడా తీసుకొస్తాను".

    "థాంక్యూ అంకుల్! రేపు తప్పక రావాలి. ట్యూబులు దొరక్కపోయినా రావాలి సుమా!"

     అవును. రావాలి. రేపు అంకిత్ ని ఇక్కడే చేర్పించాలి కదా!

    అంకిత్ గుర్తు రాగానే మళ్ళీ నా మనసంతా చేదుగా అయిపోయింది.

    అక్కణ్నుంచి వచ్చేస్తూంటే నర్స్ అడిగింది- "చాలాసేపు మాట్లాడినట్టున్నారే-"

    "అవును శృతి చక్కటి అమ్మాయి."

    "వాళ్ళ అమ్మగారు ఏదో వూళ్ళో టీచర్ గా పనిచేస్తూ వుంటారనుకుంటాను. తల్లికీ తండ్రికీ పడదు" అంది సిస్టర్.

    నేనేమీ మాట్లాడకుండా వచ్చేసాను.

    .....ఆ సాయంత్రం నేనూ అరుంధతీ సముద్రం దగ్గరికి వెళ్ళాం. అంకిత్ అలిసిపోతాడని ఇంటిదగ్గరే వుంచేసాం.

    చాలాసేపు అరుంధతి సముద్రాన్నే చూస్తూ కూర్చుంది. ".....ఏమిటి ఆలోచిస్తున్నావ్" అని అడిగాను. ఆమె నెమ్మదిగా నా వైపు తల తిప్పింది.

    "అక్కడే.... ఆ బండరాయి దగ్గిరే కదూ అంకిత్ మీతో ఈత నేర్చుకున్నది?"

    ఈ జ్ఞాపకాలు మమ్మల్ని వదలవు. గాఢంగా నిశ్వసించాను. "చూడు! ఏం జరుగుతుందో మన ఇద్దరికీ తెలుసు. మనం ఏం చెయ్యాలో తెలుసు. చివరికి అంతా స్వయంగా జరిగి, అంకిత్ మునుపటిలాగానే చలాకీగా తిరుగుతాడనీ తెలుసు. ఈ సమయంలో మనకి కావాల్సింది ఓదార్పు కాదు! ఆత్మవిశ్వాసం! నువ్వే ఇలా వుంటే అంకిత్ బెదిరిపోతాడు. నేనూ చెప్తున్నాగా. వాడికేం కాదు".

    ఆమె చాలాసేపు మౌనంగా వూరుకుని "......ఇక వెళ్దాం" అంది. ఇద్దరం లేచాం. సముద్రం మీద చీకటి నగరాన్ని ఆక్రమిస్తోంది.

    ఏమీ మాట్లాడుకాకుండానే ఇంటికి వచ్చేస్తాం. మనసు మళ్ళించటంకోసం చాలాసేపటి వరకూ చదువుకుని, పక్కమీదకి చేరాను. అరుంధతి కదిలింది.

    "నిద్రపోలేదా?" అడిగాను.

    "పట్టటం లేదు".

    ఆమె మీద చెయ్యివేసి దగ్గరకి తీసుకున్నాను. గుండెలపై తల ఆన్చి"...... ఇలా బాగుంది. కాస్త స్థిమితంగా" అంది.

    "నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం ఆనందంగా వుంటే అంకిత్ ఆనందంగా వుంటాడు".

    "అవును".

    ఆమె కళ్ళు మూసుకుని నిశ్చింతగా వుండిపోయింది. ఊపిరి ఛాతీకి తగుల్తోంది. ఎక్కడో కదలిక.

    ఆమె నడుము మీద చేయివేసి, కాస్త క్రిందికి జరిపి, వేళ్ళతో చీరెని కదపబోయాను.

    ఆమె ఛివాలున తలెత్తి, ఒక్క ఉదుటున పక్కకి తొలగుతూ, "......మీకేమైనా బుద్ధుందా? ఏం చేస్తున్నారు మీరు?" అంది రౌద్రంగా.

    "అదికాదు-" అంటూ ఏదో అనబోయాను.

    "అక్కడ పక్కగదిలో వాడు నరకయాతన పడుతూంటే- ఇక్కడ మీకు పెళ్ళాం కావాల్సి వచ్చిందా? బిడ్డ బాధకన్నా మీ సుఖమే ఎక్కువ అనుకుంటే చాలామంది బయటవాళ్ళు వుంటారు. ఏ ఫీలింగూలేని వేశ్యానూ- నన్నూ ఒకటి చేయకండి" అంటూ దిండు తీసుకుని విసురుగా అంకిత గదిలోకి వెళ్ళిపోయింది.

    నేను స్థబ్దంగా ఉండిపోయాను.

    ఏం చెప్పను?

    ఆమె నా ఛాతీమీద పడుకున్నప్పుడు నాకూ కోర్కెలేదు. క్రమంగా కలిగింది. నా టెన్షన్, అంతర్గతమైన బాధ తగ్గించుకోటానికి అదో మార్గంగా  తోచింది.

    కానీ ఇదంతా చెప్పి కన్విన్స్ చేయగలనా? ఆమె వినదు. నా తరపు ఆర్గ్యుమెంట్ గా, నా కన్వీనియన్స్ కోసం ఏర్పర్చుకున్న వాదన అనుకుంటుంది.

    నిజమేనేమో!

    "దేనిదారిదాన్దే" అన్న భావం మొగవాళ్ళకి వుంటే, సెంటిమెంట్ స్త్రీ కుంటుంది కాబోలు.

    ఏది ఏమైనా నాకు చాలా గిల్టీ ఫీలింగ్ కలిగింది. నన్ను తను సరిగ్గా అర్థం చేసుకోలేదన్న భావం.

    మా వివాహం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకూ అరుంధతిలో ఇంత కోపం- విసుగూ నేనెప్పుడూ చూడలేదు. ఇంతకన్నా ఘోరమైన తప్పిదాలు చేసినప్పుడు కూడా తను నవ్వుతూనే మందలించింది.

    "మనిషిలోని టెన్షన్ అతడిలో కొత్త కోణాన్ని చూపుతుంది. అసాధారణ పరిస్థితుల్లోనే అది కోపం, విసుగూ రూపంలో బయటపడుతుంది" అంటాడు జాన్ డేవిడ్ ఒకచోట.

    మా అన్యోన్యతలో అంకిత అనారోగ్యం అపశృతిగా వినిపించబోతోందా?

    ఆ ఆలోచన రాగానే సన్నగా వణికాను. 

 Previous Page Next Page