ఈ లోపులో అరుంధతి వచ్చి వాడి చేతిని పట్టుకుని వెచ్చగా వుందేమో చూసి, మామూలుగా వుండటంతో నుదుట ముద్దు పెట్టుకుంది.
వాడు ప్రశ్నార్థకంగా...."మమ్మీ, ఈ పెద్దవాళ్లందరూ జ్వరం చూడటానికి ఇలా ముద్దు పెట్టుకుంటారెందుకు?" అని అడిగాడు.
ఆమె చిన్నగా నవ్వి- :ఏమో, నాకు తెలీదు. అప్పట్లో మా అమ్మ కూడా ఇలానే చేసేది" అంది.
"నాకూ జ్వరంవస్తే బావుణ్ను....." అన్నాను నవ్వుతూ.
అరుంధతి నా మోకాలిమీద చిన్నగా తడుతూ...... "ష్" అంది.
పిల్లాడి ముందు కనీసం అలా మాట్లాడటం కూడా తనకి ఇష్టం వుండదు.
చాలామంది దంపతులు తమ సంతానం ఇంకా 'చిన్న' వాళ్ళే అనుకుని, వారిముందే తమ ప్రేమ ప్రకటించుకుంటారు. అంతేకాక, ఈ బుగ్గల మీద ముద్దల ప్రహసనంలో పిల్లల్ని భాగస్వాముల్ని చేస్తారు. అది పిల్లలపై భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఊహించరు.
అరుంధతి కూడా జాన్ డేవిడ్ వి చదివింది.
.......అరగంట తరువాత అరుంధతి వంటగదిలో టిఫిన్ తయారు చేస్తోంది. ఆమెని చూస్తూ కాఫీ తాగుతున్నాను.
ఉదయం పూట అరుంధతి చాలా బావుంటుంది. ఈ విషయంలో నా అభిరుచిలో బహుశా ఏదైనా డిఫెక్ట్ వుండి వుండొచ్చు! చాలామంది మొగవాళ్ళకి సాయంత్రం పూట పడగ్గదిలోకి వచ్చే సమయంలో భార్యలు అందంగా కనపడవచ్చు. నాకు మాత్రం.....
తలంటు పోసుకుని, వదులుగానే వేసుకున్న జడ.....మడత నలగని కాటన్ చీర...... పూజ చేసి, కనుబొమ్మల మధ్య పెట్టుకున్న విభూది......పైన ఎర్రని గుండ్రని బొట్టు..... ఆ సమయంలో పవిత్రతతోపాటూ శృంగారమూ కనిపిస్తుందామెలో.....
ఆమె టిఫిన్ తయారుచేయటం పూర్తయ్యాక ముగ్గురం కలిసి డైనింగ్ టేబుల్దగ్గర కూర్చున్నాం.
అలా కూర్చొని- తింటూ మాట్లాడుకోవటం మాకు చాలా ఇష్టం. రాత్రిళ్ళు టీ.వీ. చూస్తూ అందరం ఒకే పక్కమీద కూర్చొని, అందులో దృశ్యాల గురించీ, నటీనటుల గురించీ గంటలు తరబడి నిరర్థక సంభాషణ చేసే అలావాటు అదృష్టవశాత్తు మాకు అబ్బలేదు. ఉన్న కొంచెంసేపూ 'మా' గురించే మేము మాట్లాడుకుంటాము. ఆ తరువాత అంకిత్ తన గదిలోకి వెళ్ళి చదువుకుంటాడు. వాడి అమ్మకూడా వాడికి చదువు చెప్పటానికి వెళ్తుంది.
తల్లిదండ్రుల గదిలోంచి తాము వెళ్ళిపోతున్నానన్న ఫీలింగ్ కాకుండా తండ్రి గదిలోంచి తనూ, అమ్మా వెళుతున్నామన్న ఫీలింగ్ పిల్లలకి అందంగా వుంటుంది.
అంకిత్ జ్వరం పూర్తిగా తగ్గిపోయాక మేము తిరిగి జాగింగ్ ప్రారంభించాం.
మళ్ళీ అంకిత్ నాతో కలిసి పరుగెత్తడం నాకు మరింత ఉత్తేజాన్నిచ్చింది. ఎప్పటిలా......గర్వంతో కూడిన ఆనందం!
కొంతదూరం పరుగెత్తేసరికి, ".......నేనిక పరుగెత్తలేను డాడీ" అంటూ ఆగిపోయాడు. వాడి అలసటని దూరం చేయటానికి సంభాషణ ప్రారంభించాను. చిన్న జోక్ సృష్టించాను.. "ఒకసారి ఇలాగే ప్లూ జ్వరం వచ్చినప్పుడు నాకు కోలుకోవటానికి నెలరోజులు పట్టింది తెలుసా....."
"అవునా డాడీ....... అమ్మో! నెల రోజులే....."
"కోలుకున్నాక మొట్టమొదటి రోజు నేనెంత నెమ్మదిగా పరుగెత్తానంటే, ఇదిగో ఈ ఇసుకలోనే ఓ చిన్ని నత్త నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయింది..."
అంకిత్ పగలబడి నవ్వేడు. నవ్వినప్పుడు వాడి పలువరస తళుక్కుమని మెరుస్తుంది.
"పందెం డాడీ. ఇంకో వారం పోనీ. కాస్త బలం ఎఆగానే నీకన్నా స్పీడ్ గా పరుగెడ్తాను".
"గుడ్" అన్నాను. ఇద్దరం మళ్ళీ నెమ్మదిగా పరుగు ప్రారంభించాం. అదిగో! అప్పుడే వాడు ఫిరంగి దగ్గర కుప్పకూలిపోయింది!!
* * *
ఆటో ఆస్పత్రి ముందు ఆగింది.
నేను లోపలికి పరుగెత్తాను. నర్సు గదిలో ఏదో సర్దుతోంది. అంకిత్ పక్కనే కూర్చుని వుంది అరుంధతి. నన్ను చూడగానే బావురుమని ఏడుస్తుందనుకున్నాను. అలా చెయ్యలేదు. వాడికి నిద్రాభంగం కలిగించకూడదన్న భయంతోనో ఏమో, కంఠం తగ్గించి, "....మీరు రాగానే శ్రీధర్ గారు తనని వెంటనే కలుసుకోమన్నారు" అంది.
నా మనసు కీడు శంకించింది. అంకిత్ కీ ఎలా వుంది అని కూడా అడక్కుండా, కన్సల్టింగ్ రూమ్ కేసి వేగంగా నడిచాను.
అరుంధతి కూడా బహుశా అదే టెన్షన్ ఫీలవుతూ వుండి వుండవచ్చు. అందుకే తనూ నన్ను అనుసరించింది.
"అంకిత్ తాలూకు రిపోర్ట్స్ వచ్చాయి....." అన్నాడు శ్రీధర్. ఆ తరువాత పేపర్ వెయిట్ తిప్పుతూ మౌనంగా ఆ రిపోర్టులని చూస్తూ వుండిపోయాడు.
నిశ్శబ్దాన్ని భరించలేక చిన్నగా దగ్గాను.
అతడు తలెత్తి మా ఇద్దరి వంకా చూసాడు. "నేను చెప్పాబోయే విషయం మీకు బాధ కలిగించవచ్చు. మీ కుటుంబమిత్రుడిగా నేనూ బాధపడుతున్నాను. అయినా చెప్పక తప్పటంలేదు" అంటూ ఆగాడు.
నా వెన్నులో సన్నటి జలదరింపు. అరుంధతి పరిస్థితి కూడా అలాగే వుంది.
"అంకిత్ కి ఏమైంది?" నా గొంతు కీచుగా ధ్వనించింది.
"ఈ క్షణంనుంచీ అంకిత్ ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఖరీదయినా ట్రీట్ మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. కానీ బాగా టైమ్ పడుతుంది.."
ఈ ఉపోద్ఘాతాన్ని భరించలేక "అసలు అంకిత్ కి ఏమైంది? ఆ విషయం చెప్పు" అని అరిచాను. కానీ వెంటనే నా ఆవేశం అర్థమై తల దించుకుని, "సారీ..... అన్నాను.
"నువ్వేం చెప్పినా- విని తట్టుకోవటానికి సిద్ధంగా వున్నాము" నా కంఠం వణికింది.
"అంకిత్ కి యురేమియా".
"అంటే...." ఇద్దరం ఒకేసారి అడిగాం.
శ్రీధర్ నా కళ్ళలోకి చూస్తూ "సమాధానం ఏ విధంగా కావాలి? క్లుప్తంగానా.... వివరంగానా?" అని అడిగాడు.
అర్థంలేని ప్రశ్న.
నేను విసుగును కంట్రోల్ చేసుకుంటూ, "అర్థమయ్యేలా......" అన్నాను.
శ్రీధర్ చెప్పసాగాడు! వింటూంటే నా రోమాలు నిక్కబొడుసుకోసాగాయి. అతడు చెప్పటం పూర్తికాగానే అరుంధతి స్పృహ తప్పింది.
అతడీ విధంగా చెప్పసాగాడు. "ఒకప్పుడు సముద్రంలో సింగిల్ సెల్ ఆర్థానిజమ్స్ తో సృష్టి ప్రారంభమైంది. అవి అక్కడ ఉండే నిరుపయోగమైన పదార్గాలని ఆహారంగా తీసుకొని, వాటినే తిరిగి సముద్రంలోకే విసర్జిస్తూ వుండేవి. తద్వారా మరింత క్లిష్టమైన ఆర్గానిజమ్స్ ఏర్పడేవి. ఫైలం ప్రోటోజోవా నుంచి పోరిఫెరాలాగా అన్నమాట......" ఆగి, కొనసాగించాడు. "సరీగ్గా ఈ విధంగానే, మనిషిలోని రక్తం కూడా ఒకసముద్రంలాంటిదే! అయితే ఈ సముద్రం ఒకప్రవాహంలాగా- మనలో ప్రతి అవయవం విసర్జించే కల్మషాన్నంతా సేకరించి, చివరికి ఒక పార్టుకి వడబోయటం కోసం అందిస్తుంది. అలా వడబోసే పార్టే కిడ్నీ!"
శ్రీధర్ ఆగాడు! అతడేం చెప్పబోతున్నాడో నాకు కొద్దిగా అర్థమైంది. ఒకేసారి విషం ఇవ్వకుండా, కొద్దికొద్దిగా ఇంజెక్ట్ చేస్తున్నట్టు అతడు చెపుతున్నాడు.
"రక్తాన్ని శుద్ధిచేసి, మూత్ర రూపంలో కిడ్నీ ఈ విషాన్నంత శరీరంలోంచి బయటకు పంపేస్తుంది. ఈ విషయంలో నేను స్పెషలిస్ట్ ని కాకపోయినా, అది ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. ఒకసారి కిడ్నీ ఫెయిల్ అవుతే, రక్తం శుద్ధి అవదు. మూత్రం వస్తుంది కానీ వడపోత వుండదు. దాంతో శరీరంనిండా విషం నిండిపోతుంది. అలాంటి స్థితి ఏర్పడినప్పుడు రెండే మార్గాలున్నాయి. కృత్రిమమైన మిషన్ ద్వారా అంటే- డయాలిసిన్ ద్వారా వారానికో నెలకో ఒకసారి రక్తాన్నంతా శరీరం నుంచి బయటకు తోడి శుద్ధిచేయటం...... లేదా....." ఆగాడు. "ఆ రోగి తాలూకు రక్త సంబంధీకులు, తమ కిడ్నీ దానం చేయటం".
నేను వినటం మానేసాను! నా మెదడులో ఏదో హొరు సన్నగా ప్రారంభమైంది!
సముద్రం మీది తుఫానులా!
డాక్టర్ కాబట్టి అంతకు ఇలాంటి దృశ్యాలు ఎన్నో చూసి ఉంటాడు.
శ్రీధర్ చెప్తున్నాడు. "దేవుడు మనిషికి రెండు కిడ్నీ లిచ్చాడు. ఒకటి పాడయినా, బహుశా రెండోది జీవితాన్ని మరికొంతకాలం పొడిగిస్తుందనే ఉద్దేశ్యంతోనేమో.....అయితే..... అంకిత్ విషయంలో..... రెండు కిడ్నీలూ ఫె......యి....ల.....య్యా.....యి".
చెప్పదల్చుకున్నది చెప్పెసినట్టు అతడు గాఢంగా విశ్వసించాడు. నాకు మాత్రం ఒక పెద్ద విధ్వంసానికి అది ప్రారంభంలా తోంచింది!
అంకిత్ రక్తం పూర్తిగా విషపూరితమైపోయిందా?" అడగాలి కాబట్టి అడిగాను. సమాధానం తెలుస్తూనే వుంది.
"ఏ స్టేజిలో వుందో తెలీదు! దానికోసం మనం డాక్టర్ మహారథిని కలుసుకోవాలి....."
"మహారధి?'
"అవును! యురాలజీలో నెంబర్ వన్ ఆయన. నెఫ్రాలజీలో స్పెషలైజేషన్ కూడా చేసాడు. మీరు ఆయన్ని కలుస్తే తప్పక ఫలితం వుంటుంది. రేపు ఉదయం అప్పాయింట్ మెంట్ తీసుకుని వెళ్దాం".
యూరాలజీ- నెఫ్రాలజీ -యురేమియా- మనిషిని కబళించటానికి ఎన్ని అందమైన రాక్షసపదాలు!
నేను లేచాను! నాతో పాటు అరుంధతి కూడా లేచి నిలబడి, వెంటనే తూలిపడబోయింది. నేను పట్టుకోబోయే లోపులోనే ఆమె శరీరం కుప్పకూలి నేలమీదకు జారింది.
డాక్టర్ శ్రీధర్ ఆమెకి గ్లూకోజ్ ఎక్కించసాగాడు.
నిర్లిప్తంగా నేనా తంతునంతా గమనించసాగాను. నా మనసు దేన్నీ స్వీకరించే స్థితిలో లేదు. ఒకటే కోరిక. అంకిత్ నీ, అరుంధతినీ విసిరేసి నేనూ దూకెయ్యాలని.
గతంలోకి-
* * *
ప్రొద్దున్నే నేనూ, అరుంధతీ లేచి తయారవుతున్నాము. డాక్టర్ మహాంధి అప్పాయింట్ మెంట్ మూడు రోజుల తరువాత దొరికింది. ఈ లోపులో అంకిత్ ని శ్రీధర్ నర్సింగ్ హొం నుంచి వెనక్కి తీసుకొచ్చేసేము.
నా పర్సులో పెట్టటానికి అరుంధతి డబ్బులు లెక్కపెడుతోంది.
"అంకిత్ ని లేవలేకపోయావా? డాక్టర్ దగ్గరకు వెళ్ళటానికి టైమౌతోంది" అన్నాను.
"వాడు మనకన్నా ముందే లేచి తయారవుతున్నాడు" ఆమె మాటలు పూర్తి కాకుండానే-" ....నేనెప్పుడో రెడీ డాడీ" అంటూ లోపల్నుంచి అంకిత్ పరుగెత్తుకుంటూ వచ్చాడు.
మేమిద్దరం స్థాణువులమై, ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం.
అంకిత్ స్కూల్ డ్రస్ లో వున్నాడు. చేతిలో పుస్తకాలున్నాయి.
ముందుగా సర్దుకున్న అరుంధతి "......ఈ రోజు స్కూలుకి వద్దు బాబూ! మనం వేరే పనిమీద వెళ్ళాలి" అంది.
ఒక్కసారిగా వాడి మొహంలో అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనబడింది. వేరే కుర్రాడయితే పుస్తకాలు విసిరికొట్టేవాడేమో గానీ, అంకిత్ కి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలిగే విద్య చిన్నతనం నుంచీ ఎలాగో అబ్బింది.