Previous Page Next Page 
పర్ణశాల పేజి 9


    అక్కడినుంచి కారులో సైట్ సీయింగ్ కి 'టేక్టీ' వెళ్ళారు.

    చుట్టూ ఎత్తయిన కొండలు.... పచ్చగా నేలమీద పరిచినట్టు కొండవాలులో తేయాకు తోటలు. రోడ్డు కొండల్ని చుట్టుకొని వెళుతోంది.

    దూరంగా కొండలమధ్య సన్నటిధార జారినట్టు జలపాతాలు-

    అయిదారు మైళ్ళకు ఒక చిన్న తేయాకు ఎస్టేటు, ఓ వందమైళ్ళు మళ్ళీ నిర్మానుష్యమైన దారి. ఇలా సాగింది ప్రయాణం.

    "ఈ తేయాకు లాభదాయకంగా వుంటుందా?' అడిగేడు జపాన్ నుంచి వచ్చిన చీఫ్.

    "ఈ కొండలమీద పండేది మంచి క్వాలిటీ.....టీ" జవాబిచ్చేడు చైతన్య. "ఒకో ఎస్టేట్ ఓనర్ కి లక్షలమీద వుంటుంది లాభం. ఈ రాష్ట్రంలో లాభసాటి వ్యాపారాలు రెండే. తేయాకు, రొయ్యలు...."

    "మీ దేశంలో టాక్సేషన్ ఎక్కువ కదూ?"

    తల వూపేడు చైతన్య.

    "ఏదో మ్యాగజైన్ లో చదివాను. ప్రభుత్వం ఎంత ఎక్కువగా పన్నులు వేస్తుందో- దాన్ని ఎగ్గొట్టటానికి అన్ని కొత్త మార్గాలు అన్వేషిస్తారట."

    చైతన్య నవ్వి వూరుకున్నాడు.

    "మిస్టర్ చైతన్యా" అన్నాడు చీఫ్. "దేవుడిమీద చాలా భక్తి వున్న ప్రజలు మీరు. ఇలా ప్రభుత్వాన్ని మోసం చెయ్యటం పాపం అనుకోరా.....దయచేసి నేనిలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి."

    "నో.... నో.... ఫరవాలేదు" అని కొంచెంసేపు ఆలోచిస్తూ వూరుకొని తర్వాత అన్నాడు-" "అతి త్వరగా పారిశ్రామికం అవుతున్న దేశం యిది. అందువల్ల ఇక్కడ మనిషి పాత సాంప్రదాయాన్ని వదిలిపెట్టనూ లేక 'యాంత్రికంగా' మారనూ లేక సతమతమవుతున్నాడు. అందువల్లనే ద్వంద్వ ప్రవృత్తి పెంపొందించుకుంటున్నాడు అని నా ఉద్దేశ్యం."

    "ద్వంద్వ ప్రవృత్తి ..... అంటే .....?"

    "దేనిదారి దానిదే అన్న మనస్తత్వం. చేసిన తప్పులన్నీ ఒక్కసారి గుడికి వెడితే పోతాయనుకోవటం....దేవుడున్నాడూ అన్న భావాన్ని గుడ్డిగా నమ్మి దాంతో పుణ్యాన్ని మూటకట్టుకోవాలని చూడటం...."

    "మీరు దేవుడున్నాడని నమ్మడం లేదా?"

    ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేదు చైతన్య. నవ్వి, కొంచెం ఆలోచించేడు. "ఈ ప్రశ్న నాకెప్పుడూ రాలేదు. అవసరం రాలేదూ అంటే  బావుంటుందేమో! నా పనేదో నేను చేసుకుపోతున్నాను. ఎవరికీ అపకారం చెయ్యటం లేదు. నాకు దేవుడితో అవసరం ఏముంది?"

    "ఉన్నదీ ఆదుకోవటంలో నమ్ముతున్నారా!" అనడిగేడు నవ్వుతూ.

    చీఫ్ నవ్వలేదు. "నమ్ముతున్నాను" అన్నాడు.

    "మీ దేశంలో దేవుడిపట్ల ఎటువంటి భావం వుంది?"

    "మీకు తెలిసే వుంటుంది. మాలో 'జెన్' అన్న సంప్రదాయం .....దీన్ని బుద్ధుడే ప్రారంభించేడని మా విశ్వాసం" మెలికలు తిరుగుతున్న రోడ్డుమీద నుంచి శూన్యంలోకి చూస్తూ అన్నాడు చైతన్య మౌనంగా వింటున్నాడు.

    చీఫ్ అన్నాడు "సర్వజనీన బుద్ధ స్వభావం ..... అంటే- ప్రతివ్యక్తి తన జీవితమందే బుద్ధుడు అవుతాడన్న సిద్ధాంతం. దాని పునాది బుద్ధత్వ ప్రాప్తికి ముఖ్య సాధనం. 'ధ్యానం' అన్నది ఎన్నో సంవత్సరాల మెడిటేషన్ ద్వారా  మా బుద్ధుడు  తెల్సుకున్న గొప్ప సత్యం. దుఃఖం వున్నది, దానికి హేతువున్నది, నిరోధమున్నది, దానికి మార్గమున్నది అని."

    "ప్రపంచంలో అన్నింటికన్నా పెద్దదైన సీ పుడ్ కంపెనీ  చీఫ్  బిజినెస్  ఎగ్జిక్యూటివ్ ఇంత లోతైన వేదాంతం మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది" అన్నాడు చైతన్య.

    చీఫ్ నవ్వేడు ..... "వేదాంతం మనిషిని అంటిపెట్టుకుని ఉంటుంది."

    కారు 'అరణ్య నివాస్' హోటల్ ముందు ఆగింది. చుట్టూ ఎత్తైన చెట్లు. పక్షుల కిలకిల రావాలు, కొండమీద హోటలు పక్కనే నది - నడికి  అవతలివేపున కొండలు - అద్భుతమైన దృశ్యం.

    "కానీ ఇక్కడి వేదాంతం కంటే మా మతపు ఉద్దేశ్యం వేరు" కారు  దిగుతూ  చీఫ్ అన్నాడు. "సుఖాలలో తేలటం, అనాశవాదాలతో శరీరాన్ని పీడించుకోవడంలాటి ఎక్స్ ట్రిమిటీవ్ వదిలి శాంతిని అన్వేషించమని మా మతం బోధిస్తుంది."

    ముందు ముందు తన జీవితం ఆ మార్గంలో నడవబోతూ వుందని తెలియని చైతన్య ఖరీదైన రిజర్వేషన్ ఎంక్వయిరీ కోసం రిసెప్షన్ వేపు నడిచాడు.

                               *    *    *

    "రియల్లీ మార్వలెస్" అన్నాడు చీఫ్.

    చుట్టూ కొండలూ, కొండమధ్య నది, నది ఎగువకి బోటు ప్రయాణం, రెండువేపులూ చిట్టడవి.

    "ఇక్కడ ఎంత లోతు వుంటుంది?" అడిగేడు.

    "నూటయాభై నుంచి, రెండు వందల అడుగుల వరకూ"

    ఊపిరి వదలడం మరచి, "రెండు వందల అడుగులు" అన్నాడు ఆశ్చర్యంగా నీటివైపు చూస్తూ.

    నీరు అమాయకంగా ప్రవహిస్తోంది.

    "ఇక్కడ ఆనకట్ట వేయడంలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగింది. నిజానికి ఇదంతా అడవి. మధ్యలో లోయ. అందుకే ఇంత లోతు ఇక్కడ."

    బోటు నడిపేవాడు తలతిప్పి "అటు చూడండి" అన్నాడు.

    అందరూ అటు చూసేరు. ఒడ్డునే నిలబడి చిన్న ఏనుగుల గుంపు జలకాలడుతోంది. పెద్ద ఏనుగు తొండంతో నీళ్ళు ఎత్తి పిల్ల ఏనుగుమీద పోస్తోంది. ఇంకో ఏనుగు గడ్డిపీకి వళ్ళు రాసుకుంటోంది.

    "బ్యూటిపుల్" అన్నాడు చీఫ్.

    చైతన్య తల అడ్డంగా వూపి "లాభంలేదు" అన్నాడు.

    "ఏం?"

    నీళ్ళమధ్య చిన్నపుల్లల్లా బయటకొచ్చిన వాటిని చూపిస్తూ "అవేమిటో వూహించగలరా?" అన్నాడు.

    "ఊహూఁ"

    "అవి చెట్లు! నది మధ్య చెట్లు. పైకి పుల్లల్లా కనబడుతున్నా దాదాపు వంద అడుగుల ఎత్తున్న చెట్లు.  బోటు ఏ మాత్రం వాటికి తగిలినా మనమందరం  మునిగిపోతాం" అన్నాడు చైతన్య. "కొన్ని చెట్లు అన్నీ కొట్టేసేరు! కానీ ప్రమాదమే.  అందుకే చెట్లున్న చోటల్లా పుల్లలు పైకి కనబడేలా కట్టారు."

    "మరి మన బోటు ఎలా నడుస్తూంది?

    చైతన్య నవ్వి "వీళ్ళందరికీ పది పదకొండు సంవత్సరాల అనుభవం వుంటుంది. ఒకే దారిలో ప్రయాణం కదా."

    బోటు నీటి మధ్య మెలికలు తిరుగుతూ, ముందుకి సాగిపోతోంది. బోటువాడు దృష్టి మరల్చకుండా ఏకాగ్రతతో నడుపుతున్నాడు. చెట్ల మధ్య నీరు సుడులు తిరుగుతూ ప్రవహిస్తూ వుంది. వంద గజాల దూరంలో ఇంకో ఏనుగుల గుంపు నీరు త్రాగుతోంది.

    "ఒకసారి ఇలాగే ఒక పడవవాళ్ళు ఏనుగుల్ని దగ్గరగా చూద్దామన్న ఆశతో ఒడ్డుకు కొద్దిగా దగ్గరగా తీసుకెళ్ళారు. అక్కడ చెట్లమధ్య చిక్కుపడిపోయింది బోటు. అందరూ భయంతో కేకలు పెట్టసాగారట. అదే వాళ్ళు చేసిన తప్పు. దాంతో ఒక ఏనుగు ఉధృతంగా ఘీంకరిస్తూ వచ్చి పడవను తలక్రిందులుగా  చేసింది" అదృష్టవశాత్తు అందరూ బ్రతికారు ఎలాగో...."

    "థ్రిల్లింగ్ రియల్లీ థ్రిల్లింగ్" అన్నాడు చీఫ్ పైప్ పీలుస్తూ. అతడికీ ఈ ట్రిప్ ఎంతగానో నచ్చింది.

    చైతన్యకి మాత్రం అది నూటయాభయ్యోసారి ఇలా రావడం - ప్రతిసారీ మొదటిసారిలాగే ఉత్సాహంగా వుంటాడు.

    అదే బిజినెస్.


   
                                                                           6


    జపాన్ నుంచి వచ్చిన చీఫ్ ని పంపి ఎయిర్ పోర్ట్ నుంచి చైతన్య వచ్చేసరికి ఇంటిదగ్గర ఎరేంజిమెంట్స్ అన్నీ పెద్ద  ఎత్తున జరుగుతున్నాయి.

    ఆ మరుసటిరోజే  బాబు పుట్టినరోజు. క్రిస్టమస్ కూడా!

    ఎక్కడ చూచినా ఇళ్ళకి వేలాడదీసిన నక్షత్రాలు, రంగు రంగుల కాగితాలు అంటించిన ఇళ్ళు- అంతా కోలాహలంగా వుంది. బాబుకి రెండో యేడు దాటి  మూడు వస్తుంది క్రిస్టమస్ కి.

    రవి పిలవవలసిన అతిథుల లిస్టు ఇచ్చేడు. చైతన్య అందులో ఇంకొన్ని పేర్లు చేర్చి ఫైనలైజ్ చేసేడు. ఒక కారులో కౌసల్య, కిరణ్మయి-  ఇంకో కారులో చైతన్య ఆహ్వానించటానికి వెళ్ళేరు. అది పూర్తయ్యేసరికి మధ్యాహ్నం రెండయింది.

    లంచ్ పూర్తిచేసుకుని చైతన్య ఫ్యాక్టరీ బయల్దేరాడు. వరుసగా మూడు  రోజులు శలవు లివ్వడంవల్ల ఫ్యాక్టరీ అంతా నిర్మానుష్యంగా వుంది.

    గేటు దగ్గర కారు ఆపి హారన్ గట్టిగా మ్రోగించేడు. నిముషంపాటు ఎవరూ రాలేదు. అతడు దిగిబోతూ వుంటే రంగయ్య లోపల్నుంచి పరుగెత్తుకు వచ్చాడు.

    "గూర్ఖా ఏడి...."

    "పది నిముషాల క్రితం వరకూ ఇక్కడే ఉండాలయ్యా- టీకి వెళ్ళి  నట్లున్నాడు."

    చైతన్య సిగరెట్ వెలిగించాడు. "ఫ్యాక్టరీలో  అందరూ వున్నప్పుడు గూర్ఖా  అవసరం లేదు రంగయ్యగారూ. ఎవరూ లేనప్పుడే కావాలి. తన పనిమీద తనకి  గౌరవం లేనివాడు నాకొద్దు. ఈరోజే అతణ్ణి తీసెయ్యండి. రెండు నెలలు జీతం  ఇవ్వండి."

    రంగయ్య మాట్లాడలేదు. యజమాని తొందరగా ఓ నిర్ణయానికి రాడనీ, వస్తే ఇక దానికి  తిరుగుండదనీ అతడికి తెలుసు.

    ఇద్దరూ లోపలికి నడిచారు. ఎత్తై ప్యాక్టరీ గోడలమధ్య నిశ్శబ్దం మందంగా  నిద్రపోతూ వుంది.

    "ఎలా వుంది కొనుగోలు?"

    "బావుందయ్యా సిక్స్ టీన్ - ట్వంటీ (రొయ్యల సైజుకి ఇదో కొలమానం ) ఈసారి ఎక్కువగా దొరికినయ్."

    "దట్స్ గుడ్" సంతృప్తిగా తలాడించేడు. "మీరు రాయవెల్లూరు ఎప్పుడు వెళుతున్నారు?"

    "వచ్చే నెల మొదటివారంలో."

    బయటకొస్తూ అన్నాడు. "రేపూ, ఎల్లుండీ శలవే. మీరు ఇక్కడ వుండి చేసేదేముంది? ఇంటికి వెళ్ళిపోండి అవతలెల్లుండి షిప్ మెంట్ కు  పని మొదలు పెడదాం."

    రంగయ్య తల అడ్డంగా వూపుతూ, "నేనుంటాన్లే అయ్యా" అన్నాడు.

    ఇక అతడు చెప్పినా వినడని చైతన్య తెల్సు. "నేను వెళుతున్నను" కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు.

    రంగయ్య నమస్కారం పెట్టేడు.....చైతన్య ఇంటికొచ్చేసరికి నాలుగయింది.

    డిసెంబరు నెల అవటం వలన అప్పుడే కొద్దిగా చలి మొదలయింది.

 Previous Page Next Page