Previous Page Next Page 
పర్ణశాల పేజి 10


    బాబుకి కొత్తబట్టలేసి తీసుకొచ్చి అందించింది కాంతిమతి. వళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కొడుక్కీ తండ్రి పోలికలే వచ్చేయంటుంది కాంతి. అల్లరి చేయడు, ఒంటరితనం యిష్టపడతాడు.

    ముందు గార్డెన్ లో కుర్చీలో వేస్తున్నాడు నౌఖరు. రవి స్పీకర్ ను తోటలో ఏర్పాటు చేసేడు. కౌసల్య టేబుల్ మీద కేక్ అరేంజ్ చేస్తోంది. శారద లోపల వంట దగ్గర వుంది.

    బయట కారు శబ్దం వినిపించి కుర్చీలోంచి లేచి బయటకు వచ్చేడు చైతన్య.

    ఒక్కో గెస్టూ రావటం మొదలయింది.

    "రండి" చైతన్య కారు తలుపు తెరిచేడు.....

    అక్కడ రంగయ్య కోల్డు స్టోరేజి తలుపు తెరిచేడు..... లోపలికి వెళ్ళి మూసి, ప్యాకెట్స్ లెక్కపెట్టటం మొదలుపెట్టాడు. పది లక్షలు జపాన్ కన్ సైన్ మెంట్ నాలుగు లక్షలు  మామూలు స్టాకు, దూరంగా చర్చిలో ఆరు కొట్టేరు.

    ఆరయ్యేసరికి అతిథులందరూ వచ్చేసేరు. ముందు గార్డెన్ లో రకరకాల రంగు రంగుల బల్బుల కాంతి పరచుకుంది. కాంతి బాబుతో కేకు  కోయించింది. అంతా చప్పట్లు  కొట్టారు. చిన్న ముక్కతీసి బాబు నోటికి అందించాడు చైతన్య . స్పీకర్ లోంచి పాప్ మ్యూజిక్ గట్టిగా  వినబడుతోంది. దాన్నిమించిన నవ్వుల శబ్దం.


                                                                 *    *    *

    ఏదో శబ్దం వినబడి, రంగయ్య కోల్డు స్టోరేజిలోంచి బయటకు వచ్చాడు. విశాలమయిన ట్రేల మధ్య దారి శూన్యంగా వుంది. ట్రేల అవతల  ఏముందో, కనబడటం లేదు. "ఎవరదీ?" అన్నాడు గొంతు పెద్దది చేసి.

    గొంతు పెద్దది చేసి మాట్లాడుకుంటున్నారు అతిథులు. అయినా ఒకరి మాట ఒకరికి వినపడటంలేదు. క్రొత్త పరిచయాలు జరుగుతున్నాయి. ఎవరో రవిని "పెళ్ళెప్పుడు చేసుకుంటావోయ్" అని అడుగుతున్నారు. రవి నవ్వి ఓరగా  కిరణ్మయిని చూస్తున్నాడు.

    ఎప్పుడూ లేనిది ఈ మధ్య కిరణ్మయి బుగ్గలమీద సిగ్గుదొంతరలు కదులుతున్నాయి. చైతన్య చెల్లెలితో "దీపక్ కూడా వుంటే బావుణ్ణు కదూ" అన్నాడు. కౌసల్య నునుసిగ్గుతో తల వంచుకుని నేలవేపు చూసింది.

    తలవంచి నేలమీద చూసేడు రంగయ్య. తన క్రింద ఏవీలేదు. మూల చప్పుడయింది. ఈసారి రెండు అడుగుల వ్యాసార్థం గల పెద్ద పెద్ద ప్లెట్లున్నాయి. రొయ్యల్ని కడిగేసి, రంగయ్య ప్లేట్లు దగ్గరకు నడిచేడు.

    చైతన్య ప్లేట్ల వద్దకు  నడిచాడు. రెండు ప్లేట్లు ఫార్మల్ గా గెస్ట్స్ కు అందించి డిన్నర్ ప్రారంభించాడు. అందరికీ అన్నీ అందుతున్నాయని చుట్టూ చూస్తున్నాడు.

    చుట్టూ చూసేడు రంగయ్య. ఎవరూ కనబడలేదు. సంతృప్తిపడి లోపలికి వెళ్ళబోతూ వుంటే మళ్ళీ చప్పుడయింది. చప్పున వెనుదిరిగి చూసేడు. చప్పుడికి కారణం తెలిసింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. పడగెత్తిన పాము ఊహించని వేగంతో అతడి కాలు మీద కాటువేసి క్షణంలో అదృశ్యమయింది. కాలుపట్టుకుని కుప్పలా కూర్చుండిపోయేడు.

    కూర్చుంటూ, "అబ్బ! ఇంత మంచి డిన్నర్  తిని చాలా కాలమైందోయ్" అన్నాడు జైన్ తృప్తిగా. చైతన్య మనస్సులో శారద వంటలకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. స్పీకర్ లోంచి రాహుల్ దేవ్ బర్మన్ గొంతు చించుకొని అరుస్తున్నాడు.

    అరిచినా ఎవరికీ వినిపించదని తెలుసు. అరవటానికి కూడా ఓపిక లేదు. నోటినుంచి నురుగు వస్తోంది. వళ్ళంతా చెమట్లు పట్టేసినయ్. శరీరం నల్లగా మారిపోతోంది. విషం శరీరమంతా పాకేసింది. ఎవరూ లేనిచోట, ఎవరూ సహాయానికి రానిచోట నిస్సహాయంగా పడివున్నాడు. అతడు ఎంతో దయనీయమైన స్థితిలో ఒక్కో ప్రాణంపోతూ వుంటే..... మూతబడ్తున్న కళ్ళని బలవంతంగా తెరిచేడు. ఎదురుగా కోల్డు స్టోరేజి. తెరిచివున్న తలుపు చూసేసరికి.....అంత  బాధలోనూ ఉలిక్కిపడ్డాడు. అది మూసెయ్యకపోతే......మూసెయ్య.....క..... పో.....తే..... రొయ్యలు పాడైతే వచ్చే నష్టాన్ని తలచుకొంటే వళ్ళు కంపించింది. బాధకీ, స్వామి భక్తికీ ఊగిపోతూ, బాధని పళ్ళ బిగువును నొక్కి పట్టాడు- చేతులమీద లేవటానికి ప్రయత్నించేడు. ఓపిక సరిపోలేదు. నెమ్మదిగా అటువైపు దేకసాగాడు. ఒక్కో అడుగూ ముందుకు వేస్తూంటే బాధ ప్రాణాల్ని తోడేస్తుంది. ఇంకో  రెండడుగులు వేస్తే తలుపు అందుతుంది. ఒక్కసారి తోస్తే చాలు, లాక్ పడుతుంది. తర్వాత తనేమయిపోయినా ఫర్వాలేదు. బలం అంతా  కాళ్ళల్లోకి తెచ్చుకున్నాడు. అంతలో తల తిరిగినట్లనిపించింది. తూలిపోయేడు .... ఒక్క అడుగు  ముందుకి ..... ఇంకొక్క అడుగు వెళితే చాలు- తలుపు అందుతుంది. ఇంకొక్క అడుగు.... అందకపోతే ..... లోపల ఐస్ కరిగిపోతే.....

                               *    *    *

    ఐస్ క్రీం అందరికీ అందిందో లేదో స్వయంగా చూస్తున్నాడు చైతన్య. అతడికీసారి పార్టీ చాలా సంతృప్తినిచ్చింది. ఒక్కొక్కరే వచ్చి థాంక్స్  చెప్పి  వెళ్ళిపోసాగారు. నెమ్మదిగా ప్రొద్దున్నించీ చేసిన  కారు ప్రయాణంవల్లా అరేంజిమెంట్సువల్లా అతడి కళ్ళు అలసటతో మూతపడసాగినయ్.

    మూతలుపడ్డ కళ్ళని బలవంతంగా తెరిచేడు రంగయ్య. ఒక్క అడుగు దూరంలో వుంది తలుపు. సర్వశక్తుల్నీ కూడదీసుకుని లేచి, చేయి సాచేడు. గుండెల్లో కలుక్కుమంది. ఒక్కసారి నిస్సత్తువ ఆవరించింది. ఉన్న ఒక్క ప్రాణమా శరీరాన్ని వదిలేసింది. పెద్ద మూలుగు ఫ్యాక్టరీ గోడలమధ్య నిస్సహాయంగా ప్రతిధ్వనించింది. ముందుకు పడిపోయాడు.

    అతిథులు వెళ్ళిపోయినా తోటలోనూ, జీవి వెళ్ళిపోయిన కట్టెలోనూ నిశ్శబ్దం మిగిలింది.

    కోల్టు స్టోరేజిలో వాతావరణం నెమ్మదిగా వేడెక్కసాగింది.

    ఐస్ కరిగి, బొట్టు  బొట్టుగా నీరు క్రిందికి పడుతోంది.

    రొయ్యలు క్రమక్రమంగా నల్లబడ్తున్నాయి .

    హోరున కురుస్తూంది వర్షం.

    అద్దాల్లోంచి బైటికి చూస్తూ కూర్చున్నాడు చైతన్య.

    అతడికి వర్షం అంటే ఎలర్జీ. మారుమూల గుండెలో ఎక్కడో భయం కూడా.

    ప్రొద్దుట్నించీ ఎడతెరిపి లేకుండా కురుస్తూంది.

    "నిన్నే యిలా జరిగివుంటే ప్రోగ్రాం అంతా అప్ సెట్ అయివుండేది" అనుకున్నాడు.

    అతడి మనసంతా సంతృప్తిగా వుంది. ఎంతో రిలీఫ్ గా ఫీలవుతున్నాడు. కాంట్రాక్టు పూర్తవుతున్నందుకు కాదు- క్రితం రోజు ఏర్పాట్లు బాగా జరిగినందుకూ కాదు- కిరణ్మయి, రవిల మధ్య పెరుగుతున్న అనుబంధాన్ని  అతడు క్రితంరోజు  పార్టీలో గుర్తించేడు. శారద, కిరణ్మయిలని తీసుకొచ్చేడన్న మాటేగాని, అప్పటివరకూ వాళ్ళిద్దరి భవిష్యత్తు అతడికి ఒక సమస్యగానే వుంది. అది ఇంత సులభంగా తీరి బంధుత్వంగా మారుతుందని అనుకోలేదు అతడు.

    రవికి కూడా పరీక్షలయిపోయేయి తప్పక ప్యాసవుతాడు. తరువాత ఈ  విషయాల్లో సగం బాధ్యతలు అతడు తీసుకుంటే అంతకన్నా కావల్సిందేముంది?

    అతని సంతోషానికి ఇంకో కారణం కూడా  వుంది.

    అంతకు నాల్గురోజుల క్రితమే వచ్చి వెళ్ళిన దీపక్ కూడా వచ్చే వేసవిలో పెళ్ళికి సుముఖత వ్యక్తపరచేడు. రెండు పెళ్ళిళ్ళూ ఒకేసారి చేసెయ్యొచ్చు.

    చైతన్య ఆలోచనల్లో వుండగానే  కాంతి వచ్చి వైజాగ్ నుంచి ట్రంకాల్ వచ్చిందని చెప్పింది.

    "ఏమిటి విశేషాలు?" అడిగేడు ఫోన్ లో.

    పదిరోజుల్నుంచీ ష్రింప్స్ జాడే లేదని, బెస్తలు ఖాళీ చేతుల్తో తిరిగొస్తున్నారని అవతల్నుంచి జవాబొచ్చింది.

    "నెవర్ మైండ్, వేన్ తీసుకొని కాకినాడ వచ్చేయండి. కాకినాడ పరిస్థితిని చూసుకొని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేయండి."

    బిజినెస్ మేన్ గా అతడికి ఈ వార్త సంతోషాన్నే ఇచ్చింది. ఎందుకంటే అంతకు రెండు రోజుల క్రితమే అతడు జపాన్ నుంచి వచ్చిన ప్రతినిధుల్తో 'టెకీ' వెళ్ళినప్పుడు తెలిసింది. కొచ్చిన్ ప్రాంతపు సముద్రతీరాల్లో వలవేసిన వాడిది ఆలస్యం, నేల యీనినట్లు రొయ్యలు దొరుకుతున్నాయని.

    ఈ దెబ్బతో చాలామంది మధ్యతరగతి పారిశ్రామికవేత్తలు విపరీతంగా నష్టపోతారు.

    సముద్రపు అంతర్లీనంగా వుండే జల ప్రవాహాలతోపాటు రొయ్యలు కూడా ఒక తీర ప్రదేశాన్నుంచి మరో ప్రదేశానికి వలసపోతూ వుంటాయి. కాల ప్రవాహంలో మనుష్యుల్లాగా.

    మొట్టమొదట  వచ్చిన  బెస్తవాడి సరుకుని గమనించి రాబోయేవాళ్ళ క్వాలిటీ నిర్ణయించగలిగినవాడే ఈ బిజినెస్ లో పైకొస్తాడు.

    చైతన్య ఇంకో ఫోన్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పేడు  మేనేజర్ కి.

    బయట కారిడార్ లో టేబిల్ టెన్నిస్ బాల్ శబ్దం లయబద్ధంగా వినిపిస్తూంది వర్షం తగ్గింది.

    కాంతి టీ తీసుకొచ్చి ఇచ్చింది. తాగి బట్టలు వేసుకొని బయల్దేరబోతూ వుంటే "ఎక్కడికి" అని అడిగింది.

    "ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాను."

    "ఇంత రాత్రప్పుడా దేనికి! రేప్రోద్దున్నే వెళ్ళవచ్చుగా."

    చైతన్య తల అడ్డంగా వూపి, "ఫ్యాక్టరీలో పనివాళ్ళందరూ వున్నప్పుడు యజమాని అప్రమత్తంగా వున్నా ఫర్వాలేదు. తన వ్యాపారాన్ని స్వయంగా తను చూసుకోలేనివాడు. యజమానిగా  పనికిరాడు" అని కారు గేరేజ్ వైపు నడిచాడు.

    వర్షానికి తడిసిన మట్టిరోడ్డు మీద అదోలాటి మత్తువాసన వస్తోంది. రోడ్డు నిర్మాన్యుష్యంగా వుంది. రోడ్డు కిరువేపులా  వున్న పిచ్చి మొక్కలు గాలికి  నెమ్మదిగా ఊగుతున్నాయి. ఫ్యాక్టరీ ఎత్తయిన గోడలు చీకటిలో అస్పష్టంగా  కన్పిస్తున్నాయి.

    దూరంగా సముద్రపు హోరు వినిపిస్తూంది. ఎక్కడో కీచురాయి ఆగి ఆగి  అరుస్తూంది.

    మెయిన్ గేటు తీసే వుంది. కారు లోపలి వెళ్ళి ఆగింది. దిగి డోర్  వేసేడు.

    తీతువుపిట్ట ఒకటి వికృతంగా అరుచుకుంటూ తలమీద  నుంచిపోయింది. మళ్ళీ అంతా నిశ్శబ్దం. చుట్టూ చూసేడు.

    పాడయి ఎంతోకాలం నుంచీ మూలపడివున్న వేన్ దూరంగా ప్రహరీగోడ దగ్గిరగా వుంది. కిటికీ పక్కన మల్లెతీగ వర్షానికి క్రింద పడిపోయింది. శత్రురాజుల తాకిడికి పూర్వపు వైభవాన్ని కోల్పోయిన కోట తాలూకు  శిథిలంలా వుంది ఫ్యాక్టరీ.

 Previous Page Next Page