రంగయ్య కళ్ళవెంబడి నీళ్ళు తిరిగేయి. కృతజ్ఞతతో నోటమాట రాలేదు. ఏదో అందామనునే లోపులోనే చైతన్య అక్కడినుండి వెళ్ళిపోయేడు.
అతడు తేరుకొని నెమ్మదిగా లోపలికి వెళ్ళేడు. పనివాళ్ళు రొయ్యల్ని మధ్య ప్రెస్ చేస్తున్నారు. ఆ అచ్చుల్ని కొందరు స్టోరేజిలో భద్రపరుస్తున్నారు.
సాయంత్రం అయిదయింది. రంగయ్య ఫ్యాక్టరీలోంచి బయటకొచ్చి నడవ సాగేడు. అతడి మనసు ఆనందంతో నిండిపోయింది. పాపకి పూర్తిగా నయమై పోయినట్లేనని భావిస్తున్నాడు. యకమానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
రోడ్డు సముద్రం పక్కగా సాగిపోతోంది. దూరం నుంచి తీరంవేపు వస్తున్న బోట్లు కాగితం పడవల్లా వున్నాయి. మనుష్యుడి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు నిండుగా, వ్యధని దాచుకున్న సామాన్యుడి మనసులా గంభీరంగా వుంది సముద్రం.
సూర్యుడు పశ్చిమంవైపు కృంగిపోతున్నాడు. చీకటి త్రాచుపాములా పాక్కుంటూ వస్తోంది.
5
ఆ మరుసటిరోజు దీపక్ వచ్చేడు.
ఎర్రగా పొడుగ్గా వున్నాడు. వయసు ఇరవై ఆరయినా మొహంలో ఇంకా అమాయకత్వం పోలేదు. ఫర్గూసన్ కంపెనీలో ఛీఫ్ అకౌంటెంటుగా పనిచేస్తున్నాడు.
అతడి పూర్వీకులు చాలాకాలం క్రితమే కొట్టాయంలో స్థిరపడిపోయేరు. వాళ్ళకి మలబారు ప్రాంతంలో తేయాకు తోటలున్నాయి. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు.
అతడికీ, కౌసల్యకీ పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది.
కౌసల్యకి టెన్నిస్ ఆట గురించి ఏమీ తెలీదు.
అయినా బలవంతం మీద ఒకరోజు చెల్లెల్ని టెన్నిస్ మ్యాచ్ కి తీసుకెళ్ళాడు రవి. అందులో దీపక్ పాల్గొంటున్నాడు.
ఆట అయిపోయాక రవి అతడికి పరిచయం చేశాడు.
ఇద్దరికీ చొరవ తీసుకొని మాట్లాడటం అలవాటు లేకపోవటంతో విష్ చేసుకుని వూరుకున్నారు.
ఇద్దరూ ఒకే కాలేజిలో చదివే వారవటంచేత ఆ తరువాత ఎప్పుడయినా కనబడితే నవ్వుతో పలకరించుకునేవారు.
ప్ర్రేమ ఒక సంఘటనతో ఉద్భవిస్తుంది, అనటం అనౌచిత్యం. కేవలం ఒక్క సంఘటనతో- గొప్ప వంశంలో పుట్టి, చదువూ సంస్కారము వున్న యువతి ప్రభావితం కాదు! ఆ సంఘటనలో యువకుడు ఎంత ధీరోదాత్తుడయినా సరే! ధీరోదాత్తత కధానాయకుని లక్షణం కాబట్టి నవలాకారులు సంఘటనలతో మాల అల్లి సంయమనాన్ని చిత్రీకరిస్తారు. కానీ అటువంటి సంఘటనలేవీ లేకుండానే వారు దగ్గరయ్యేరు.
ప్రేమపట్ల ఇంత బిడియం చూపించిన దీపక్, పెళ్ళి విషయం వచ్చేసరికి చాలా ధైర్యం చూపించేడు. కౌసల్య ఇంట్లో చెప్పటానికి భయపడింది.
ఆమె చెప్పి వుంటుందనుకొని, దీపక్ తల్లిదండ్రులతో దిగే సమయానికి, చైతన్యకి అసలీ విషయం ఏమీ తెలీదు.
వీళ్ళని చూసి ముందు ఆశ్చర్యపోయినా, సంగతంతా తెలుసుకొని సంతోషించేడు.
కౌసల్యని, చైతన్య కుటుంబాన్ని చూసేక దీపక్ తల్లిదండ్రులకి కూడా అభ్యంతరం ఏమీ కనబడలేదు.
ఆ తరువాత అతడు కూడా ఈ కుటుంబంలో ఒకడయ్యేడు.
అతడి రాకతో ఆ ఇంటిలో కొత్త సందడొచ్చింది.
అసలే మితభాషి అయిన కౌసల్య అతడి రాకతో పూర్తిగా మౌనవ్రతం పట్టింది. రవికి మాత్రం చెల్లెల్ని ఏడిపించడానికి మంచి సమయం దొరికింది. కిరణ్మయి మొదటిరోజు వూరుకున్నా దీపక్ అమాయకత్వమూ నెమ్మదీ చూసి, రవితో కలిసి వాళ్ళని ఆట పట్టించసాగింది.
ఈ అల్లరిలో పాల్గొననిది శారద ఒక్కతే. ఆమె చాలా లోతైన మనిషి అని చైతన్య మొదటిరోజే గుర్తించేడు. తన పనేదో తను చేసుకుపోవడం. ఏ పనీ లేకపోతే పుస్తకాలు చదువుకోవటం......ఇదీ ఆమె దినచర్య.
ఒకరోజు శారద కౌసల్య గదిలోకి వెళ్ళేసరికి కౌసల్య వీణ మీద సాధన చేస్తూంది.
"నీకు వీణ బాగా వచ్చా?" అడిగింది శారద.
కౌసల్య కొద్ది సిగ్గుతో, "ఉహూ.... రాదు ఏదో కాలక్షేపం కోసం నేర్చుకుంటున్నాను" అంది. శారద పరీక్షగా వీణవంక చూడటం గమనించి, "నీకు వచ్చా?" అని అడిగింది కౌసల్య.
"ఏదో కొద్దిగా."
కౌసల్య పక్కకి జరిగి, "ఏదీ చూపించు ఎంత వచ్చో" అంది.
శారద కొద్ది మొహమాటంతో "ఇప్పుడు కాదు" అని అంటున్నా వినిపించుకోకుండా చెయ్యిపట్టి కూర్చోపెట్టింది. ఇక తప్పలేదు ఆమెకు. వీణముందు కూర్చున్న మరుక్షణం ఆమెకి తండ్రి జ్ఞాపకం వచ్చేడు. ఏదో వ్యధ. ఒకసారి తీగెల్ని మీటి శృతి చూసుకుంది. ఆ తరువాత ఆమె వ్రేళ్ళు తీగెలపై కదలసాగేయి మరుక్షణం ఆ పెద్ద భవనపు ఎత్తయిన గోడలమధ్య ధ్వని తరంగాలు అలల్లా వ్యాపించాయి.
అప్పటివరకూ నవ్వుతూన్న కౌసల్య పెదవుల మీద అప్రయత్నంగా నవ్వు మాయమైంది. ఏదో అద్భుతం చూస్తున్నట్లు ఆమె అలాగే నిశ్చేష్టురాలై కూర్చుండి పోయింది.
కారిడార్ లో కూర్చున్న చైతన్య కర్ణపుటాలకి ఈ వీణానాదం వినిపించగానే చదువుతున్న పుస్తకం పక్కన పడేసి కుర్చీలోంచి లేవకుండానే, కళ్ళమీద చెయ్యి వేసుకుని అలాగే మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు.
రకరకాల వ్యాపార విషయాలలో అలసట చెందిన అతడి మనసు ఈ అపురూపమైన వీణానాదానికి సేదతీరసాగింది.
కీర్తన పూర్తి చేసి శారద తలెత్తేసరికి గదిలో రవి, కాంతిమతి ఆమెవంకే చూస్తూ నిలబడటం కనబడింది.
"సూపర్భ్" అని రవి చప్పట్లు కొడుతూ, చెల్లెల్ని చూసి "కౌసల్య వాయిస్తూ వుంటే విరిచి పొయ్యిలో పెట్టేద్దామనిపించేది. వీణ ఇంత బావుంటుందని మాకు తెలీదు" అన్నాడు. కౌసల్య నాలుక బయట పేట్టి అన్నని వెక్కిరించింది. ఇంతమంది పొగడటం చూసేసరికి శారద సిగ్గుతో తల వంచుకుంది.
అప్పుడే అటుగా వచ్చిన కిరణ్మయిని చైతన్య అడిగేడు....."ఎవరు ఇప్పటి వరకూ వీణ వాయించింది?"
"శారద......?"
అతడి ముఖంలో క్షణంపాటు ఆశ్చర్యం కనిపించింది.
"ఓ ......... " అని "నీకు వచ్చా" అని అడిగేడు.
కిరణ్మయి నవ్వి "నాకెలాంటి కళలోనూ ప్రవేశం లేదు" అని వెళ్ళిపోయింది అక్కణ్ణుంచి.
చైతన్య కళ్ళు మూసుకుంటూ అనుకున్నాడు. 'అక్కా చెల్లెళ్ళలో ఒకరు సౌందర్యాన్ని పుణికి తెచ్చుకుంటే, రెండోవారు తప్పక ఏదో ఒక విద్యలో ఆరితేరుతారు. వాళ్ళలో వున్న కాంప్లెక్సే దానికి తోడ్పడుతుంది కాబోలు.....'
చాలాసేపటి వరకూ ఆ వీణానాదమే అతడి చెవులలో మ్రోగసాగింది.
* * *
ఆ మరుసటి రోజు చైతన్య ఆఫీస్ రూమ్ లో కూర్చుని కాగితాలు చూసుకుంటూ వుండగా శారద అక్కడికి వచ్చింది. ఆమె అక్కడికి రావటం అదే మొదటిసారి. కిరణ్మయి అయితే ఆఫీసులో కూడా ఇంట్లో తిరిగినట్లే తిరుగుతూ వుంటుంది.
చైతన్య తలెత్తి చూసి సంభ్రమంగా కుర్చీలోంచి లేస్తూ "రా శారదా" అన్నడు ఆప్యాయంగా.
ఆమె కుర్చీలో కూర్చుంటూ చుట్టూ చూసింది. పార్టీషన్ చెక్కలు అందంగా మెరుస్తున్నాయి. ఎయిర్ కండిషనర్ చప్పుడు చిన్నగా వినిపిస్తూంది.
"చెప్పు, ఏం కావాలి?" అన్నాడు చైతన్య వెనక్కివాలి, శారద తత్తరపడి "ఏం లేదు" అంది.
ఆమె మొహమాటం సంగతి తెలిసిన చైతన్య మాట మారుస్తూ..... "అంత బాగా వీణ వాయించటం ఎక్కడ నేర్చుకున్నావు?" అన్నాడు.
"నాన్నగారి దగ్గర" అంది. క్షణం నిశ్శబ్దంగా గడిచింది. తండ్రి జ్ఞాపకం రావడంతో ఆమె కళ్ళలో నీరు గిర్రున తిరిగింది. చైతన్య గమనించి, 'ఇంత సున్నిత హృదయురాలు ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతుందో' అనుకున్నాడు. ఆ భావంతోనే అతడు ఆమెని "ఇక్కడ మీకు అంతా సవ్యంగానే జరుగుతూ వుంది కదా" అన్నాడు.
ఊహించని ఈ ప్రశ్నకు ఆమె విచలితురాలైంది. తన కృతజ్ఞత ఎలా చెప్పాల్లో మాటలు రాక క్షణం తడుముకొని "నిజంగా ఆ రోజు మీరు రక్షించకపోయివుంటే మేం ఎక్కడ వుండేవాళ్ళమో తల్చుకోవటానికే భయంగా వుంది" అంది.
ఆ సంగతి కాదు.....ఇక్కడ బాగానే వుంది కదా..."
శారద కంఠంలో ఎన్నడూ కనపడని ఉద్వేగం కనబడింది. "నిజంగా ఇంత ప్రేమాభిమానాల్ని మా జీవితంలో మేం ఎరగం. మీ అందర్నీ చూస్తూంటేనే మనసు నిండిపోతోంది...."
చైతన్య నవ్వి, "కానీ కిరణ్మయి ఇదంతా డబ్బుతో వచ్చిందంటూంది" అన్నాడు.
తన మనసులో ఎప్పట్నుంచో చెప్పాలనుకుంటున్న మాటని చెప్పే అవకాశం వచ్చినందుకు, ఆమె తన స్వభావసిద్ధమైన కవచాన్ని తొలగించుకుని, "అక్క మాటల పట్టించుకోకండి దయచేసి...." అంది.
"నేనసలా ఆర్గ్యుమెంటే ఒప్పుకోను. డబ్బువల్లే ఆప్యాయతలు రావటం ఏమిటీ?" అన్నాడు చైతన్య శారద మాట్లాడలేదు. ఆమె తయారై వుండటం చూసి, "బయటికి వెళదామనా.....?" అన్నాడు మాటమారుస్తూ.
శారద మొహమాటంతో, నిన్న రాత్రి వీణతీగ ఒకటి తెగిపోయింది" అంది.
చైతన్య కుర్చీలోంచి లేస్తూ, "దానికేముంది, వెళ్ళు" అని. బెల్ కొట్టబోయి, ఆగి, "ఈరోజు డ్రైవర్ రాలేదనుకుంటా; పద నేనొస్తాను" అన్నాడు.
ఆమె కంగారుగా "మీరెందుకు?" అంది.
"ఫర్లేదు" కుర్చీలోంచి లేచేడు.
"మీరు పని చేసుకుంటూంటే మధ్యలో వచ్చి పాడుజేశానేమో!"
"ఓ విషయం తెలుసా?" బయటికి నడుస్తూ అన్నాడు.
"ఏమిటి?"
"ఈ ఇంటికి వచ్చిన ఇన్నాళ్ళకి నీ అంతట నువ్వు నోరు విప్పి ఒక కోర్కె కోరావు" అంటూ కారు స్టార్టు చేసేడు. శారద ఆలోచించుకుంది. బిడియంతో.
కారు నెమ్మదిగా కదిలింది. చల్లగాలి అలలు అలలుగా వీస్తోంది.
టేబిల్ పైన కాగితాల కట్టమీద ఇన్సూరెన్సు కాగితం గాలికి ఊగుతోంది.
* * *
ఆ మరుసటిరోజు చైతన్యకి అనుకోని ప్రోగ్రాం తగిలింది.
జపాన్ నుంచి హమాషో తోషిమా సేల్స్ చీఫ్ రావటంతో అతడితో కలిసి కొచ్చిన్ వెళ్ళవలసి వచ్చింది.