Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 9


        మధుబాబు కంగారుపడుతూ "నేను ఇంతవరకూ ఎప్పుడూ నటించలేదే?" అన్నాడు.

    "దానిదేముందండి? మీరు రాసిన నాటకమయ్యె. మీ కన్నా పాత్రను ఎవరెక్కువ అర్థం చేసుకుంటారు గనుక? పోర్షన్ రాదనే బెంగకూడా వుండదు. అదీగాక మీలో మంచి గెప్చర్ వుంది."

    తను ఇలా నటుడిగా స్టేజిమీద ప్రత్యక్షమయ్యే అవకాశం వస్తుందని కలలోకూడా అనుకోలేదు. ఒకవేళ ఊహాలోకంలో చాపల్యానికి ఎప్పుడైనా యీ యోచన మెదిలివుంటే" ఆ! సులభంగా తప్పించుకోగలను.... ఆ పరిస్థితి నుంచి" అని తేలిగ్గా  భావించివుంటాడు. కాని ఒకళ్ళు బలవంతం చేసినప్పుడు తమకు ఇష్టంలేని పనులు చేయటానికి మనుషులు ఎలా సంసిద్దులౌతారో ఇప్పుడు గ్రహించాడు.

    వాళ్ళంతా కలిసి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. చివరకు "ఊ" అనిపించారు.

    కాని యీ రిహార్సల్సు, హడావుడీ చాలాకాలం వ్యయమౌతుంది. చాలా రాత్రాయేవరకూ కాలేజీలో గడపాల్సి వుంటుంది. చదువుకునేందుకు స్నేహితుడింటికి పోతున్నానని ఇంట్లో అబద్ధం చెప్పాల్సివచ్చింది. రిహార్సల్సు అట్టహాసంగా జరిగిపోతున్నాయి.

    ఈ విషయం రాజ్యలక్ష్మికి తెలిసింది. "హీరో అయ్యారుటగా" అంది నవ్వుతూ గరల్స్ రూంముందు.

    "మీరు నర్తకి అయినప్పుడు...."

    "చచ్చాం. అయితే అప్పుడే మీదాకా వచ్చిందీ? ఇంగ్లీషు లెక్చరర్ వచ్చి ఒప్పుకునేదాకా తెగ వేధించారనుకోండి."

    "మన యిద్దరి ప్రోగ్రామ్సూ ఒకేరోజున తెలుసా?" అన్నాడు మధుబాబు.

    "ఏమిటి? మీదీ ఆ వేళేనా? స్పెషల్ డే కాదా అది లేడీస్ కు?" అనడిగింది రాజ్యలక్ష్మి విస్మయపూర్వకంగా.

    "మీకు స్పెషల్ డే అంటూ ఏమీ లేదు. ఆ వేళ ఎక్కువభాగం అతిథులుగా స్త్రీలు వస్తారంతే."

    "మీ రిహర్సుల్సు చూడాలని వుందండి" అంది రాజ్యలక్ష్మి గారాబంగా.

    "వద్దు బాబూ! నాటకం చూడకుండానే ఉడాయించాల్సి వస్తుందప్పుడు" అని మధుబాబు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.


                              *    *    *

    ఆ రోజు వచ్చింది.

    అనుకున్నట్లు బయటినుంచి వచ్చిన అతిథులలో అధికం స్త్రీలే. ఐతే కాలేజీ విద్యార్థులుకూడా రోజుకంటే ఎక్కువగా వచ్చారు. విద్యార్థినుల బుర్రకథ, ఫాన్సీడ్రెస్- చాలా ఉత్సాహజనకమైన అంశాలున్నాయి. గ్రీన్ రూమంతా హడావుడిగా, అట్టహాసంగా వుంది. ఆడవాళ్ళదే మెజారిటీ ఐపోయింది. వాళ్ళందరూ మేకప్ చేసుకోవటం, హంగామా చాలా వుంటుంది కాబట్టి నాటకంలో వేసేవాళ్ళు కర్టెన్ దాటి అవతలకు రాకూడదని ఆంక్షపెట్టి, వాళ్ల చుట్టూ ఒక తెర కట్టేశారు. "మరి బ్రహ్మండమైన అవసరం ఏమైనా వస్తేనో" అన్నాడు ఓ విద్యార్థి తలకాయ ఇవతలకు పెట్టి. "ముందా తలకాయ ఇవతలకు దూర్చండి. అవసరం వుంటే అవతల్నుంచి కేకెయ్యండి" అందో యువతీమణి.

    ప్రోగ్రాంలో ఎందువలననో కొన్నిమార్పులు జరిగాయి. దానిప్రకారం మొదట ఫాన్సీడ్రెస్, తర్వాత నాటకం, పిదప డ్యాన్స్. ఈ విషయం వెల్లడి అయేసరికి "అరెరే! స్టేజి ఎరేంజ్ చేసుకోవాలే" అంటూ అప్పటికి మేకప్ పూర్తయిన మధుబాబు తెర తొలగించుకుని ఇవతలకు వచ్చాడు.

    "అయ్యయ్యో! ఆడవాళ్ళం వున్నాం" అంది సోదెవేషం వేస్తున్న అమ్మాయి.

    "ఐతే భయపడాల్సింది నేను" అన్నాడు చప్పున మధుబాబు పరిహాసంగా.

    "వసేవ్! అతను కవే జాగ్రత్త" అని హెచ్చరించింది ప్రక్కనున్న ఓ  ఎలజవ్వని.

    "కవిగారూ! సోదె చెప్పమంటారా?" అంది ముందుకొస్తూ ఆ పాత్రధారిణి.

    "చెయ్యిచూశా? ఐతే ఇదిగో నా చెయ్యి."

    ఆ అమ్మాయి చనువుగా అతనిచెయ్యి పట్టుకొని పరిశీలిస్తూ "సోది సెపుతానయ్య సోది సెపుతాను. ఉన్నది వున్నట్లు- లేనిది లేనట్లు. అరిచెయ్యి.... చూసి, అరమరిక లేక" అని "పెట్టవుందా బాబు నీకు?" అని ప్రశ్నించింది.

    "ఇద్దరు" అన్నాడు మధుబాబు.

    "ఊఁ, ఉషారైన పోతు. గుసగుసలాడుతున్నాడు" అని అతని చెయ్యి విసిరికొట్టింది.

    ఇంతలో అక్కడికి డ్రమెటిక్ వైస్ ప్రెసిడెంట్ వచ్చి హడావుడి పడ్తూ, "ఇంకా ఇలాగే వున్నారా టైమయిపోతుంటే? ఫ్యాన్సీడ్రెస్ వాళ్ళంతా ఒకరివెంట ఒకరు తెరముందుకు వచ్చేయ్యండి. వూఁ క్విక్" అన్నాడు.

    "మనసంతా కంగారు- మన పోతురాజుకు

    వట్టిపోతేగాని గట్టితనమే లేదు."

    "ఓసి పదవే అల్లరి చెయ్యకుండా" అని మరో యువతీలలామ ఆమెను ముందుకు తోసింది. అంతా కిలకిలమని నవ్వుకుంటూ ప్రక్కకి వెళ్ళారు.

    గోడకు ఓ క్యాలెండర్ తగిలించాలి రంగస్థలాలంకరణకు. క్యాలెండరైతే వుందిగాని, అది గుడ్డకి తగిలించటానికి ఏమీలేదు. మధుబాబు అన్వేషిస్టోన్న నేత్రాలతో అటూ ఇటూ చూశాడు. లోపల కర్టెన్ వెనక కదలిక అయింది.

    అటుకేసి వెళ్లాడు.

    "అయ్యో! అంది స్త్రీ కంఠం. వెంటనే నేలజీరాడుతున్న పమిటను భుజంమీద కప్పేసుకుని "ఎవరండి మీరు? చెప్పా పెట్టకుండా ఇలా వస్తే" అని కోపాన్ని వెలిగ్రక్కింది.

    "రాజ్యలక్ష్మీ" అన్నాడు మధుబాబు ఆమెముఖంలోని సౌందర్యరేఖలకు విభ్రాంతుడై.

    ఆమె చాకితయై, అతని ముఖంలోకి తీక్షణంగా చూసి, మరుక్షణంలో కిలకిలమని నవ్వేస్తూ "అబ్బ! మీరా? ఎంత మారిపోయారు వేషంలో?" అన్నది.

    మధుబాబు కొంచెం లజ్జితుడై, ప్రక్కకి చూస్తూ "పిన్నీసు వుందా రాజ్యలక్ష్మి మీదగ్గర?" అన్నాడు.

    ఆమె ఓసారి గాజులు సవరించి చూసుకుని "లేదే! ఎందుకూ?" అంది. 

    "తెరకి కాలెండర్ గుచ్చాలి. ఇప్పుడు మా నాటకమే ప్రారంభమౌతోంది తెలుసా? మీ నాట్యం ఆ తర్వాత."

    "అయ్యబాబోయ్! అంతసేపూ ఈ అలంకరణ అంతా భరిస్తూ జపం చెయ్యాలా?" ఎందుకు మారింది ప్రోగ్రాం?" అనడిగింది విసుగ్గా.

    "ఏమో! నాకు తెలీదు. వస్తాను. స్టేజి ఎరేంజి చేసుకోవాలి" అని మధుబాబు అక్కడ్నుంచి కదలబోయాడు.

    "ఉండండి."

    అతను ఆగాడు.

    "పిన్నీసు కావాలన్నారు కదూ? కొంచెం అటు తిరగండీ ఇస్తాను."

    "తిరక్కపోతే ఇవ్వరా?"

    "సరే తిరక్కండి" అని ఆమే అటుతిరిగి జాకెట్ నున్న పిన్నును వూడదీసి, చెయ్యిజాచి ఇచ్చింది.

    "థాంక్స్" అన్నాడు మధుబాబు అందుకుంటూ.

    "నేను బాగున్నానా?" అంది రాజ్యలక్ష్మి.

    "ఏదీ? ఇంకోసారి చూడనివ్వండి. ఇటు తిరగండి మరి పూర్తిగా."

    "అబ్బ! నాకు సిగ్గేస్తుంది బాబూ. చెప్పక్కర్లేదులే వెళ్ళండి."

    ఓ చిత్రమైన పరిమళం ఆమె శిగనుండి వ్యాపించి అతన్ని ఆవహించింది. ఆ మెర్క్యురిక్ లైట్ల వెలుగులో ఆమె తెల్లటి శంఖంలాంటి కంఠం, సుకుమారమైన ఆమె లేతభుజాలమీద సౌందర్యం అతడ్ని మత్తెక్కించింది. ఎక్కడినుంచో మధురమైన సుగంధం వీచినట్లయింది. ఒక్కక్షణం... ఒక్కక్షణంలో అతను వ్యామోహాంధకారంలో మునిగిపోయాడు. చప్పున ఓ  అడుగు ముందుకు వేసి ఆమెను భుజాలమీద పొదివిపట్టుకుని బలవంతగా తనవైపు త్రిప్పు కున్నాడు.

    "మధుబాబూ?" అంది రాజ్యలక్ష్మి కంపితస్వరంతో.

    అతని కళ్ళు జిగేల్ మన్నాయి. అట్లాగే కళ్ళు విప్పి చూడసాగింది. ఆ కాంతిని, సహజలాలిత్యపు సౌందర్యాన్ని, తేజోమయ రూపాన్ని భరించలేక పోయాడు. మోహావేశంలో ఆమె ముఖంమీదకు వంగాడు.

    ఛళ్ మంది అతని చెంప.

    అతనికి తెలియలేదు. ఆమె సుందర నయనాలకేసి చూస్తున్నాడు. ఆమె కన్నార్పకుండా అతన్ని చూస్తోంది. చప్పున మళ్ళీముందుకు వంగి తన  పెదాలతో ఆమెపెదాలను తాకాడు.  అతని చెంపమీద  ఎవరో ఈడ్చి కొట్టినట్లయింది. నిజానికి ఎవరూ కొట్టలేదు. ఇందాకటి దెబ్బ ఇప్పుడు స్పురించింది. ఆమెను వదిలి, గబగబ ఇవతలకు వచ్చేశాడు.

    "టైం అయిపోవచ్చింది. ఎరేంజిమెంట్సు పూర్తయినయ్యా?" అంటున్నాడు వైస్ ప్రెసి డెంట్ హడావుడిగా వచ్చి.

    మధుబాబు జవాబు చెప్పకుండా కుర్చీఎక్కి క్యాలెండర్ని తెరకి గ్రుచ్చుతున్నాడు. అతని చెంప మంటపెడుతోంది. రాజ్యలక్ష్మి పెదాలుకూడా మండుతున్నాయి గావును ఇలాగే. అవతల-ఆవంక. ఎట్టా భరిస్తుంది ఈ అవమానాన్ని?

    "టైం లేదు" అంటున్నాడు వైస్ ప్రెసిడెంట్.

    మూడే మూడు నిముషాల్లో బల్లలూ, అవీ సర్దేశారు. మధుబాబు అన్నీ యాంత్రికంగా చేస్తున్నాడు. అతనితోనే మొదలౌతుంది నాటకం. వైస్ ప్రెసిడెంట్ ఏదో ఎనౌన్స్ చేశాడు మైకులో. తెర లేచింది.

    జీవితంలో మొదటిసారిగా కొంచెం పేరు తెచ్చుకున్న రచయిత మధుబాబు నటిస్తున్నాడు.

    అతనికి కీర్తివుంది, ధనం వుంది, విద్యవుంది, యవ్వనం వుంది కాని సుఖంలేదు. ముందుకువేసే ప్రతి అడుగూ అశాంతిని రెచ్చగొడుతున్నాయి. అతనికి ఏ ఆడదీ మనసు ఇవ్వదు. ఇచ్చీ యివ్వలేని స్థితి. స్నేహితులెవరూ అర్థంచేసుకోరు. ఒక్కనిముషం మనశ్శాంతి లేదు. ఆత్మహత్య చేసుకోవాలంటే అనేక అవాంతరాలు.

 Previous Page Next Page