Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 10


    పాత్రలో లీనమై నటిస్తున్నాడు మధుబాబు.

    రాజ్యలక్ష్మి స్టేజిప్రక్కగా నిల్చుని ఆశ్చర్యంగా చూస్తోంది. ఆమెకు జరిగిందంతా గుర్తురావటంలేదు. కన్నార్పకుండా పరిశీలిస్తోంది. ఎంత బావున్నాడు. ఏదో కవ్విస్తోంది అతన్నుంచి. తన ఊహకి అందని అంతస్థులో వున్నాడు. ఎక్కడికో, గొప్పగా పెరిగాడు. ఉన్నతమైన, సుకుమారమైన అతని మూర్తి ఆమెను ప్రలోభపెట్టింది. జాలి కలుగుతోంది! ఏమిటో! ఆమె నేత్రాంచలాలలో నీళ్లు నిలిచాయి.

    మధుబాబుకు భయం వెయ్యటంలేదు.  అతను సర్వం విస్మరించాడు. హృదయం పరవశత్వంతో పొంగిపోతోంది. తను కళాకారుడు. అతని కంటికి ఎవరూ కనబడ్డంలేదు. ప్రేక్షకులు కంటికి అతనుతప్ప ఎవరూ కనబడ్డంలేదు. అవి సంభాషణలు కావు. హృదయ వీణాతంత్రులు. ఎలా రాశాడని ఏమీ తెలియని మధుబాబు? అది సాంఘిక నాటకంకాదు. చారిత్రకం కాదు. కాలానికీ పరిధులకూ అందీ అందని ఓ  అపూర్వ మనస్తత్వ చిత్రణ.

    గంటన్నర గడిచాక నాటకం ముగిసింది. మధుబాబుని స్టేజిమీద పరిచయం చేస్తోంటే ప్రేక్షకులు కరతాళధ్వనులు చేశారు. కాలేజి ప్రిన్సిపాల్ కళాపిపాసి, ఆయన పులకరించిపోయాడు. గ్రీన్ రూంలోకి వెళ్ళి అతన్ని కావలించుకున్నంత పనిచేసి అభినందించాడు.

    మధుబాబుకు తెలియటంలేదు. కలగావుంది. ఎవ్వరికీ జవాబు చెప్పటం లేదు. ఓ మూలకు పోయి మౌనంగా కూర్చున్నాడు.

    రాజ్యలక్ష్మి అతన్ని చూసింది. ఎలాగైనా వెళ్ళి పలకరించాలని తారట్లాడ సాగింది. ఇంతలో అతన్ని చెంపమీద కొట్టినసంగతి జ్ఞప్తికి వచ్చింది. కళ్లలో నీళ్ళు గిర్రున తిరిగాయి. వెళ్లి ఆ చెంప.... అలా...మృదువుగా రాయాలనుకుంది. శరీరం మరచి ముందుకు కదలబోయింది. ఎవరో ఆమె భుజంమీద చెయ్యివేశారు. "రావే మతిమరుపుదానా, అప్పుడే ఎనౌన్స్ కూడా చేసేశారు. భలేదానివే."

    మధుబాబు ముఖంఎత్తి ఆమెవంక చూశాడు. అదే సమయంలో ఆమె జాలిగా చూసి అక్కణ్నుంచి వెళ్లిపోతోంది. "రాజ్యలక్ష్మీ" అన్నాడతను బలహీనంగా. ఆమెకు వినపడలేదు.

    తబలా, హార్మోనియం శ్రుతినందుకున్నాయి.

    నాట్యం మొదలయింది.

    మరోలోకంలోకి ఎగిరివెళ్లింది రాజ్యలక్ష్మి.

    "అనిల తరళ కువలయ నయనేన

    సఖి! యారమితా వనమాలినా...."

    మధుబాబు విభ్రాంతుడై అవలోకిస్తున్నాడు. రాజ్యలక్ష్మిలో ఇంతటి కళారాధన గూడుకట్టుకుని వుందని తెలియదు యింతవరకూ.

    "వికసిత సరసిజ లలిత ముఖేన

    స్ఫుటతివసా మనసిజ విశిఖేన"

    పెదవులు.....తను మలినపరచిన ఆ మృదువైన అధరాలు జంకించిపోతున్నాయి. లలిత లలితంగా, మధుర మధురంగా.

    "లేదు లేదు" అనుకున్నాడు మధుబాబు ఆరాటంతో కొట్టుకుపోతూ. "నేనామెను ప్రేమించలేదు. మహొజ్వలమైన ప్రేమ ఎక్కడ? నా చంచల ప్రవృతి ఎక్కడ? ఒక పుష్పసౌరాభాన్ని ఆఘ్రాణించినట్లు ఈ సోయగాన్ని ఆస్వాదించటానికి చపలచిత్తుడనై చలించాను. నాది స్వార్థం"

    ఎక్కడినుంచో ఓ రాయి విసురుగా వచ్చి నర్తకి ముఖంమీద కొట్టుకుంది. "అబ్బా" అని నుదురు పట్టుకుని నిలబడిపోయింది ఆమె. కళ్ళు గిరగిరమని తిరిగాయి. క్రిందకు ఒరిగిపోసాగింది.

    ప్రేక్షకుల్నుంచి హడావుడి బయల్దేరింది. అంతా అల్లకలోల్లమైపోయింది. కొంతమంది విద్యార్థినులు గబగబ స్టేజిమీదకు వచ్చి రాజ్యలక్ష్మిని పడి పోకుండా పట్టుకున్నారు. మధుబాబులో ఆవేశం పొంగులువారింది. క్రిందకు దూకి బయటకు పరిగెత్తాడు.

    ఈ ఘనకార్యం చేసినవాడికి యింత కల్లోలం చెలరేగేసరికి గుండె బెజారైపోయింది. అటూ ఇయటూ చూసి ప్రక్కనున్న చెలికానితో కాలికి బుద్ధిచెప్పాడు.

    వాళ్లను మధుబాబు వెంటాడుతున్నాడు.

    చీకటి, మనుషుల లీలామాత్రమైన స్వరూపాలు గోచరిస్తున్నాయంతే. మధుబాబుకు ఎక్కడలేని బలం, వేగం వచ్చాయి. రెండు ఫర్లాంగులు వెళ్లాక కాలవ సమీపంలో అవతల వాళ్ళలో ఒకడ్ని పట్టుకున్నాడు.

    "వదులు, నన్నొదులు" అని గింజులాడ్తున్నాడు వాడు.

    "దుర్మర్గుడా! ఆ అమ్మాయి నీకేం అపరాధం చేసిందిరా?" అంటూ దవడ పగిలేటట్లు ఒక్కటి తగిలించాడు మధుబాబు.

    కొంచెం ముందుకు పరిగెత్తిన అతని మిత్రుడు పరిస్థితి గమనించి వెనక్కి తిరిగివచ్చాడు.

    "విడిచిపెట్టు" అంటున్నాడు మొదటివాడు.

    ఎక్కడలేని ఆగ్రహంతో మధుబాబు నెత్తిమీద కొట్టాడు. అతని తల తిరిగింది. శక్తినంతా కూడతీసుకుని వెనక్కి తిరగబోయాడు. కాని  అవతలివాడు అదేచోట మరోదెబ్బ దబ్ మని కొట్టి గట్టిగా అవతలకు తోశాడు మధుబాబుకు కాళ్లలో బలం నశించింది. ఆ తాకిడికి తట్టుకోలేక నేలమీద పడిపోయాడు. లేద్దామని ప్రయత్నిస్తున్నాడు. మొదటివాడు తాను చేసే పనేమిటో తెలుసుకోలేని స్థితిలో, క్రిందినుంచి ఓ రాయితీసి విపరీతమైనా కసితో దాంతో అతని తలపై మోదాడు. "అమ్మా" అని ఒక్కసారి మూలిగి తల వాల్చేశాడు మధుబాబు.

    యువకులిద్దరూ వెనుదిగిరి చూశారు. కాలేజీ ఆవరణనుంచి జనం యిటువేపు గుంపుగా పరిగెత్తుకు రావటం గోచరించింది. గబగబ పరిగెత్తి కాలవలో దూకి, ఈదుకుంటూ అవతలిఒడ్డుకు వెళ్ళిపోయారు.

   
                                                                        9

    అంత రాత్రివేళప్పుడు కొడుకు తలనిండా గాయాలతో తీసుకురాబడటం చూసి సుందరమ్మగారి గుండె గుభేలుమంది. "ఇదేం ఖర్మరా దేవుడా, నిక్షేపంగా కాలేజికి వెళ్ళిన కుర్రాడికి?" అంటూ ఏడ్చింది.

    విశ్వనాథంగారు డాక్టరుకి కబురుచేసి వచ్చి "వీడసలే అర్భకపు సన్నాసిగదా. ఆ రౌడీళ జోలికి పోకపోతే ఎం చెప్పు? చేతులు కలపటానికి తగిన బలం ఏడిసింది గనుకనా?" అన్నాడు.

    మధుబాబు నీరసంగా మంచంమీద పడుకున్నాడు. తండ్రిమాటలకు అతనికి దుఃఖం కలిగింది. "నేనింత బలహీనంగా ఎందుకు పుట్టాను?"

    అనుకున్నాడు.

    తల్లి అతనిప్రక్కలో కూర్చుని గుండెమీద చెయ్యివేసి "ఎంతరక్తం పోయిందో ఏమో? పిల్లాడు డీలా పడిపోయినాడు" అంటోంది.

    తనకు అతనిప్రక్కలో కూర్చుని గుండెమీద చెయ్యివేసి" ఎంత రక్తం పోయిందో ఏమో? పిల్లాడు డీలా పడిపోయినాడు" అంటోంది.

    తనకు పద్దెనిదేళ్ళు. తను పిల్లవాడా? అంత నీరసస్థితిలోనూ తాను గ్రీన్ రూంలో చేసినపని జ్ఞాపకం వచ్చింది. అది పిల్లవాళ్లు చేసేపనా? అతనికి రాజ్యలక్ష్మి ఎలావున్నదో తెలుసుకోవాలని ఆతృత కలిగింది. కాని ఎవర్నడుగుతాడు? అతన్ని దింపి మిగతా విద్యార్థులంతా వెళ్లిపోయారు.

    తలంతా మండుతోంది, గాయాలతో, ఆలోచనలతో.

       

                                                                *    *    *


    రెండురోజులు గడిచాక అతన్ని వెదుక్కుంటూ రాజ్యలక్ష్మి వచ్చింది. ఉదయం పది దాటుతోంది. విశ్వనాథంగారు ఇంట్లో లేరు. సుందరమ్మగారు అప్పుడే వంటపని ముగించుకుని ముందుగదిలోకి వస్తోంది.

    రాజ్యలక్ష్మి గుమ్మంలో నిలబడి సిగ్గుపడుతూ "మధుబాబుగార్ని చూడ్డం కోసం వచ్చానండీ" అన్నది.

    "లోపలకు రామ్మా. నీ పేరు ఏమిటి?"

    చెప్పింది.

    "అదిగో! ఆ గదిలో వున్నాడు, తీసుకువెడతాను రామ్మా. మధూ! నీకోసం ఎవరో వచ్చారు చూడు" అని ఆమెను అక్కడ దింపి ఇవతలకు వచ్చేసింది.

    "రాజ్యలక్ష్మీ" అన్నాడు మధుబాబు ఆశ్చర్యంగా.

    "ఎలావుంది?" అనడిగిందామె ముఖంమీదకు వంగి ఆదుర్దాగా.

    "ప్రమాదమేం లేదు. వట్టి నీరసం తప్ప. నాలుగయిదురోజుల్లో లేచి ఫ్రీగా తిరగగలుగుతాను. ఆ కుర్చీ ఇలా లాక్కో రాజ్యలక్ష్మీ, ఏమీ అనుకోకపోతే."

    ఆమె కుర్చీని అతనికి సమీపంగా లాక్కుని కూర్చుంది. చాలా మామూలుగా, పరికిణీ, వోణీ వేసుకుని వచ్చింది. రాజ్యలక్ష్మి. ఎండలో నడిచి రావటంవలన ముఖమంతా స్వేదబిందువులు అలుముకుని, కొంచెం వడిలివుంది. ముఖంలో ఏదో విషాదం తాలూకు జీర్ణరేఖలు స్ఫుటంగా దృగ్గోచరమౌతున్నాయి. తలనిండా కట్లుకట్టుకుని పడుకున్న ఆ యువకుడిని చూస్తే ఆమెకు విచారం కలిగింది.

    "ఎందుకలా చేశారు?" అంది బాధగా.

    "ఏంచేశాను?" అన్నాడతను సందిగ్ధముతో సతమతమౌతూ.

    "రౌడీలజోలికెందుకు పోయారు?"

    "దుర్మార్గులు నిన్ను రాయిపెట్టి కొట్టలేదూ? అయ్యో అసలు విషయం మరిచాను. నీకు బాగా దెబ్బతగిలిందా రాజ్యలక్ష్మీ" అంటూ అతను ఆతృతగా ఆమెముఖంకేసి పరీక్షగా చూశాడు. పాలభాగంమీద ఎడంవైపుగా చిన్నమచ్చ కనిపించింది.

    ఆమె నిర్లక్ష్యంగా పెదవి విదిల్చి "కొంచెం కళ్ళు తిరిగాయి అంతే. హాయిగా వున్నాను ఇప్పుడు" అంది.

    మధుబాబు  ఆనాటి దృశ్యం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకవిధంగా ఆమెముఖంకేసి చూడాలంటే సిగ్గుతో చచ్చిన చావుగా వుంది.

    "నేను పాపిష్టిదాన్ని. నా వలననే మీకు గాయాలు తగిలాయి. మీకు నయమయ్యేవరకూ సపర్యలు చేస్తూ ఇక్కడే వుండిపోతాను."

 Previous Page Next Page