ప్రక్కనున్న స్నేహితురాలు ఆమె తలమీద ఒక్కటిచ్చుకుని "ఆపవే పిచ్చిమొద్దూ! నీ వాగుడు" అంది మందిలిస్తూ.
మొదట వాళ్లనా ప్రాంతంలోచూసి ఇబ్బందిలోపడి అక్కడ్నుంచి వెళ్ళిపోదామనుకున్నాడు. ఈ ధోరణిచూసి చకితుడై శిలావిగ్రహంలా నిలబడినాడు. ఆ సూర్యాస్తమయకాంతిలో, ప్రకృతి శోభలో ఆ లేతమగువ వనదేవతలా గోచరించింది అతనికి.
"మాట్లాడక నిలబడ్డారేం? రండి. ఆ ఇసుక రాసులమీద కూర్చుని కబుర్లు చెప్పుకుందాం" అని అటుకేసి దారితీసింది. రాజ్యలక్ష్మి మిత్రురాలు కొంచెం ఇరకాటంలో పడింది. ఐనా యీ కొత్త అబ్బాయిముందు నోరు మెదల్చలేక అనుసరించింది.
స్నేహితురాళ్ళిద్దరూ ప్రక్కప్రక్కన చతికిలపడినారు. మధుబాబు కొంచెం ఎడంగా కూర్చున్నాడు.
"మీ కథలంటే నాకు చాలా ఇష్టమండి" అంది రాజ్యలక్ష్మి సంభాషణ ప్రారంభిస్తూ.
ఒక అందమైన అమ్మాయినుంచి ఈ కాంప్లిమెంటు లభించిందంటే ఎవరు మధురానుభూతిని పొందరుగనుక? అతను చిరునవ్వు నవ్వాడు మనసులో ఆశ్చపడుతూ.
రాజ్యలక్ష్మి ఒక్కనిముషం మౌనం వహించి "మీరు అంతా వూహించి రాస్తారు, జీవితాన్నుంచి చూచి రాస్తారా?" అని ప్రశ్నించింది.
కొన్నాళ్ళక్రితం ఐతే అతనీ ప్రశ్నకు తికమకపడివుండేవాడు. ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాడయ్యె!
"నా మనస్సు చాలా చిన్నది" అన్నాడు. ప్రప్రంచంలో నాకు తెలీని విషయాలు ఎన్నో వున్నాయి. నా అనుభవం చాలా కొద్దిపాటి. వూహిస్తాను. కాని వూహించేటప్పుడు నన్నా పరిస్థితులలో ఇమాజిన్ చేసుకుని వ్యక్తిగతమైన అనుభూతి పొందుతాను. అదే రాస్తాను."
నిజానికి ప్రపంచాన్ని విమర్శనాదృష్టితో పరిశీలించి, అది సాహిత్యంగా రూపొందించగలిగే శక్తి అతనికింకా అలవడలేదు. కాని అతను వూహించి రాసేవన్నీ..... ఎక్కడో నిజాలుగానే వున్నాయి.
"మీ ఆశయం ఏమిటి?" అనడిగింది రాజ్యలక్ష్మి.
"అది నేనింకా స్పష్టంగా తెలుసుకోలేదు. నన్ను బాధించే వేధించే సమస్యలు అనేకం కనిపిస్తున్నాయి. వాటిల్లో నేను మనస్పూర్తిగా దేన్ననుసరించాలో తెలుసుకోలేని స్థితిలో వున్నాను. రోజురోజుకు నాలో కొత్తదనం ఫీలౌతున్నాను. ఈ నూతనత్వం ఆగిపోయేవరకూ నాకు నేను స్పష్టంగా అర్థంకాను. దానంతట అది సహజంగా సిద్ధంచేవరకూ నేనేమీ సిద్దాంతాలు లేవదియ్యను. వాటిని ఇతరులమీద ప్రయోగించను. నేను స్వంతంగా కొన్ని అనుభవాలు పొందాలి. ఐనా యీ అతివాదాలూ, ఇజమ్సూ నాకు సరిపడవు. మానవత్వానికి దెబ్బకొట్టే ప్రతి అంశమూ నాకు వస్తువే. ఈ మానవత్వపు విలువల్ని ప్రదర్శించటమే బహుశః నా ఆశయమనుకుంటాను. జీవితాన్ని కప్పివేసే అనేక తెరలు వుంటాయి. ఈ తెరచాటున అసలునిజం ఎక్కడో దాగొని వుంటుంది. వాటిని తరుచుకుంటూ పోయి, ఈ నిజాన్ని ప్రకటించడమే బహుశా నా లక్ష్యం" మధుబాబు ఆగాడు.
అతనిప్పుడు మాట్లాడిన మాటల్లో పూర్తినిజాయితీ వుంది. కొంతమందికి ఓ ప్రకృతి వుంటుంది. ఫలానా అందాన్ని గురించి స్థిరమైన అభిప్రాయమంటూ ముందునుంచుండదు. ఎవరైనా దానిగురించి గ్రుచ్చి గ్రుచ్చి ప్రశ్నించినప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ సమాధానం మొదలెడతారు. ఒకే సమయంలో అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవటమూ, దాన్ని యితరులకి వ్యక్తం చేయటమూ జరుగుతుంది.
"అసలు మీరు రాయటం ఎందుకు మొదలుపెట్టారు?" అనడిగింది రాజ్యలక్ష్మి ముగ్దురాలై. స్నేహితురాలు ఇసుకని గుప్పిళ్ళలో తీసి క్రిందకు విడుస్తోంది.
ఈ ప్రశ్నకు ఆనాడు ఉమాపతికి జవాబు చెప్పలేక తికమకపడ్డాడు. ఓ ముఖ్యమైన సంఘటన అతనికప్పుడు గుర్తురాలేదు.
"ఓసారి ఓ దృశ్యం తిలకించాను. నేను ఎంతగానో ప్రేమించిన మా అక్కయ్య ముద్దులకొడుకు, అనుకోకుండా జేజిలో కలిసిపోయాడు. మేమంతా ఏడుస్తున్నాం. ఆ సమయానికి దారినపోతున్న ఓ చిన్నపిల్ల అక్కడకు వచ్చి హృదయవిదారకమైన యీ దృశ్యం చూసి జలజల కన్నీరు కార్చివేసింది. ఆ సంఘటన నా హృదయాన్ని ఊపివేసింది. ఆ అనుభూతి, మమత కాగితంపై పెట్టాలనిపించింది. మొట్టమొదటి కథ రాసేశాను."
రాజ్యలక్ష్మి తన విశాలనేత్రాలను ఎత్తి అతనివంక చూస్తూ "ఆ కథ ఇప్పుడుందా?" అని అడిగింది.
"ఎక్కడో వుండాలి. వెదకాలి" అన్నాడు మధుబాబు.
"వెదకండి. కనిపిస్తే నాకు తప్పక ఓసారి ఇవ్వాలి మీరు" అంది ఆమె.
"అలాగే."
క్రమంగా చీకటి తెరలు క్రమ్ముకు వస్తున్నాయి. రాజ్యలక్ష్మి చిన్నగా నిట్టూర్చింది. "నా కెందుకో మీ రచనలంటే అంత ఇష్టం. మరి ఎవరివి చదివినా వాటిల్లో కావలసినంత గడుసుదనం అగపడేది. మీ రచనల్లో మాత్రం నిష్కల్మషమైన మీ హృదయం ఎల్లెడలా వెల్లివిరుస్తూ వుంటుంది" అన్నది.
కాసేపు మౌనంగా కూర్చున్నారు. రాజ్యలక్ష్మి స్నేహితురాలు ఆమెను నెమ్మదిగా చేతిమీద గిచ్చి "వెడదామా?" అన్నట్లు సంజ్ఞ చేసింది. "ఇంక పోదామండి" అన్నది రాజ్యలక్ష్మి. ముగ్గురూ లేచి నిలబడ్డారు. ఓ పది నిముషాలపాటు నడిచి చుట్టుగుంట దగ్గర రోడ్డుమీదకు వచ్చారు.
"బస్సులోనే వస్తారా?" అనడిగింది రాజ్యలక్ష్మి.
"తప్పదుగా."
ముగ్గురూ రోడ్ ప్రక్కగా నిల్చున్నారు. బస్ వచ్చేలోగా ఆమె ఎన్నో కబుర్లు చెప్పింది. ఆమెకు డ్యాన్సంటే చాలా అభిరుచి. మొన్న మొన్నటిదాకా నేర్చుకుంటూనే వుంది. కాలేజీలో చేరాక ఇంకా యీ తైతక్కలాడటమేమిటని వాళ్ల పిన్ని కోప్పడితే నాన్నగారు మానిపించేశారట. తనకు చదువంటే పెద్ద ఇంటరెస్టు లేదుట. అందులో ఈ సైన్సు గ్రూపంటే మహాచిరాకు. కాని తండ్రిపోరు మీదట తప్పలేదు. పుస్తకాలు యెక్కువ చదువుతుందిట. అందులో ట్రాజడీలంటే చెవి కోసుకుంటుంది.
బస్ వచ్చింది.
గవర్నరుపేట సెంటరు రాకముందే ఓ స్టాప్ లో ఆమె స్నేహితురాలితో దిగిపోయింది వాళ్ల ఇల్లు సమీపంలో వున్నదని. మధుబాబు వంటరిగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. అనుకోకుండా అకస్మాత్తుగా ఈ అమ్మాయితో పరిచయం లభించింది. ఒకవేళ తను కథకుడు కాకపోతే ఈ అవకాశం లభించివుండేది కాదేమో! చాలామంది చాలా పద్ధతులలో అమ్మాయిలతో పరిచయం చేసుకుంటారు. తను మరోరకంగా చేసుకోలేడు. ఎంత చనువుగా మాట్లాడింది! తాము అలా దగ్గరదగ్గరగా కూర్చుని మాటలాడటం యెవరయినా చూశారా? ఈ కాలేజీలో వదంతులకు లోటులేదు.
అన్నిటికన్నా.... తనని రచయితగా అభిమానించటం అతనికి నచ్చింది. బహుశా ఇంత మనస్పూర్తిగా ఇంతవరకూ ఎవ్వరూ తనని అభిమానించ లేదేమో!
8
డిశంబరు ప్రవేశించింది. కాలేజీలో సాంస్కృతిక వారోత్సవాలు జరుగుతాయి. నాటకాలతో, ఉపన్యాసాలతో, ఇంకా అనేక ఇతర ముచ్చట్లతో ఆకర్షణీయంగా గడిచే కాలం.
మధుబాబు దగ్గరకు కొందరు విద్యార్థులు వచ్చి వారోత్సవాల్లో ప్రదర్శించటానికి ఒక నాటకం రాసి పెట్టమని అడిగారు. నాటకం! అతను మొదట సంకోచించాడు. ఇంతవరకూ ఎప్పుడూ రాయలేదు. "ప్రయత్నిస్తానండి" అన్నాడు.
"టైం లేదండీ. చాలా త్వరగా రాసివ్వాలి. మళ్ళీ రిహార్సల్సు, వగైరాలు వుంటాయికదండి."
మధుబాబు అంగీకరించాడు.
అంతే. ఇతివృత్తంకోసం ఎడతెరిపిలేకుండా బుర్ర బద్దలుకొట్టుకున్నాడు. ఎవరో అన్నట్లు కథ రాయటం మొదలుపెట్టేటప్పుడు ఒక మాదిరిది అయినా ఫర్వాలేదనే ఉద్దేశం వుండొచ్చుగాని, నాటకం అయితే మాత్రం బ్రహ్మాండమైంది రాయాలన్న సంకల్పంతో ప్రారంభిస్తారు. వచ్చిన చిక్కేమిటంటే స్త్రీ పాత్ర వుండకూడదు. నాలుగైదు రంగాలకంటే ఎక్కువ వుండకూడదు. ఈ నాలుగయిదిట్లోనూ రంగస్థలం మారకూడదు.
మొదలుపెడితే....ఆ పని పూర్తయ్యేవరకూ నిద్రపట్టే స్వభావం కాదయ్యె ఇతివృత్తం స్పురించడమేమిటి? మూడురోజులు ఏకబిగిన కూర్చుని రాసెయ్యటమేమిటి.....నాటకం పూర్తయిపోయింది. పుస్తకం పట్టుకెళ్ళి ఆ విద్యార్థుల కిచ్చాడు. వాళ్ళది చదివి "బాగుందండి" అన్నారు. రిహార్సల్సు ప్రారంభమైనాయి.
మధుబాబు ఉత్సాహంగా రిహార్సల్సుకి వెళ్ళసాగాడు. సాంస్కృతికోత్సవాల్లో ఇదేగాకుండా ఇంకా మూడునాలుగు నాటకాలు ప్రదర్శించబడుతున్నై. అవన్నీ ప్రసిద్ధ రచయితలు వ్రాసినవే. తన నాటకం వాటిముందు నిలుస్తుందా అని భయపడ్డాడు మధుబాబు. తోచినప్పుడల్లా సంభాషణలు మారుస్తూ వచ్చాడు.
ఇంతలో ఒక తమాషా జరిగింది. ఆ నాటకంలో కథానాయకుడి వేషం వేస్తోన్న అబ్బాయికీ, మిగతా విద్యార్థులకూ ఏదో సందర్భంలో తగాదా వచ్చింది. అతను నటించనని భీష్మించి వెళ్లిపోయాడు. మిగతావాళ్ళకు వెళ్లి అతన్ని బ్రతిమిలాడే సహృదయం లేకపోవటంలో వింతలేదు. ఇంకా గడువు అయిదురోజులే వుంది. నాటకప్రదర్శన ఆగిపోయే పరిస్థితి వచ్చింది.
"ఇంకెవరూ లేరా హీరోగా పనికివచ్చేవాడు?" అని అడిగాడు మధుబాబు.
"ఎవరున్నారు?హీరోలమని చెప్పుకు తిరిగేవాళ్లంతా ఎందులోనో ఒకదాన్లో నటిస్తున్నారు. మేము ఇందులో మిగతాపాత్రలు తీసుకొంటిమాయె. ఇప్పుడీ విషయం డ్రమెటిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కి తెలిస్తే మండిపడటమే గాక మన నాటకాన్ని స్టేజీ చేయనివ్వరు" అన్నారు వాళ్ళు.
మధుబాబు ఆలోచనలో పడ్డాడు.
ఇంతలో వాళ్లలో ఒకడు "మీ పర్సనాలిటీ బాగుంటుందండీ. మీరే యాక్టు చేసెయ్యకూడదూ?" అన్నాడు.