Previous Page Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 9


    "ఇప్పుడే వచ్చింది."

    "ఏమంటున్నాడు అతడు?"

    "మనుషులు దగ్గరకెళ్తేనే భయంగా పెద్దగా కేకలు వేస్తున్నాడు. అసలు మన లోకంలో వున్నట్టు లేడు. డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు."

    "యశ్వంత్ సాలోచనగా నిఖిల్ వైపు చూస్తూ "ఆ ఎగిరే పళ్ళెం ఎలా కనబడిందో వర్ణించు నిఖిల్" అన్నాడు.

    నిఖిల్ చెప్పాడు. "దానికి మీ వాహనం ఎంత దూరంలోకి వెళ్ళి వుంటుంది అనుకుంటున్నావు?"

    "దాదాపు ముప్పైవేల మైళ్ళు."

    "అప్పుడు నువ్వేం చేస్తున్నావు?"

    "ఆ సమయానికి మేమేమీ ప్రమాదాన్ని వూహించలేదు. విశ్రాంతిగా కూర్చుని మ్యూజిక్ వింటున్నాను."

    యశ్వంత్ కుర్చీలో నిటారుగా అయ్యాడు.

    "మ్యూజిక్ వింటున్నావా?"

    ఆ ప్రశ్న ఎందుకు రెట్టిస్తున్నాడో అర్థంకాక నిఖిల్ "అవును వింటున్నాను. ఏం?" అన్నాడు.

    యశ్వంత్ చప్పున కుర్చీలోంచి లేచి "మనం ఆ పైలెట్  దగ్గిరకి వెళ్ళాలి." అని మిగతావారి కోసం చూడకుండా గది బైటకు నడిచాడు. నిఖిల్ అతడిని అనుసరించాడు. వాళ్ళు వెళ్ళేసరికి రోగి పరిస్థితి ఘోరంగా వుంది. పిచ్చికుక్క కరిచి హైడ్రోఫోబియా వచ్చినవాడిలా ఊగిపోతున్నాడు. మనుష్యుల్ని చూసి ముడుచుకుపోతున్నాడు. "ఏం జరుగుతుంది" యశ్వంత్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ "అదే తెలియడం లేదు. స్కానింగ్ చేస్తే కాని చెప్పలేం" అన్నాడు డాక్టర్.

    "ఆల్ట్రాస్పోక్ శబ్దాన్ని ప్రసారం చేస్తూ షాక్ ట్రీట్ మెంట్  ఇవ్వడం వల్ల రోగికి ఈ పరిస్థితుల్లో ప్రమాదం వుందంటారా?"

    "అదేం ట్రీట్ మెంట్?"

    "నా కెందుకో అలా చేస్తే అతడు మామూలుగా అవుతాడనిపిస్తుంది డాక్టర్! ప్రమాదం లేదని మీరు హామీ ఇస్తే అలా చేసి చూద్దాం. "డాక్టర్ అయిష్టంగానే డానికి ఒప్పుకున్నాడు. రోగి కణతలకి ట్రీట్ మెంట్ ఇవ్వబడింది.

    అయిదు నిమిషాలు తరువాత ఆ పైలెట్ కళ్ళు విప్పి బలహీనస్వరంతో, "నేనెక్కడున్నాను?" అన్నాడు. చుట్టూ వున్న వాళ్ళ ముఖాలు వికసించాయి.

    డాక్టర్ యశ్వంత్ దగ్గరకొచ్చి "కంగ్రాచ్యులేషన్స్. ఎలా తట్టింది మీకు?" అన్నాడు. యశ్వంత్ మాట్లాడకుండా నిఖిల్ తో కలిసి బయటకు నడిచాడు.

    డాక్టర్లు మిగతా పరీక్షలకోసం ఆ పైలెట్ చుట్టూ మూగారు. నిఖిల్  యశ్వంత్ NSARI వైపు  వెళుతున్నారు. "నువ్వు  ఆ సమయంలో మ్యూజిక్  వింటూ వుండడమే, నిన్నూ, వాహనాన్నీ రక్షించింది నిఖిల్" అన్నాడు యశ్వంత్. నిఖిల్ అతడివైపు ఆశ్చర్యంగా చూశాడు. యశ్వంత్ గాఢమైన ఆలోచనలో  వున్నట్టు మాట్లాడసాగాడు.

    "ఆ పళ్ళెంలో వున్న మాయాస్- మనుష్యులకన్నా ఎన్నోరెట్లు తెలివైనవాళ్ళు, సాంకేతికంగా అభివృద్ధి చెందినవాళ్ళు అయివుండాలి. ఆ గ్రహాంతర వాసులు మిమ్మల్ని నాశనం చేయటానికో ప్రయత్నించారు. అయితే  దానికి వాళ్ళు తమ శక్తి ఉపయోగించకుండా, టెలీపతి ద్వారా మిమ్మల్ని కంట్రోల్ చేశారు.

    "టెలీపతీ?"

    "అవును. అంతకన్నా వేరే  పదం దొరకడం లేదు నాకు."
   
    "కానీ  కంప్యూటర్ కూడా తప్పు చెప్పింది."

    "......అందుకే అంతకన్నా పెద్ద పదం దొరకడం లేదన్నాను. మనకు  తెలిసిన విజ్ఞానం చాలా తక్కువ నిఖిల్. నువ్వు వాళ్ళ శబ్దతరంగాలకి  అతీతంగా మ్యూజిక్ వింటూ వుండటమే నిన్ను ఆ భ్రమలో పడకుండా  రక్షించింది. ఇదంతా  నేను ఊహిస్తున్నదే సుమా. నా లాజిక్ తప్పు అయుండవచ్చు. ఆ  గ్రహాంతరవాసులు మిమ్మల్ని ఎంత మాయలో పెట్టారంటే చివరికి మీకు  భూమి సూర్యుడు లాగానూ, వాళ్ళ వాహనం భూమి లాగానూ కన్పించింది. నువ్వు  మూర్ఖంగా సూర్యుడివైపు వెళ్ళిపోతున్నానన్న భ్రమలో రాయ్ -  మిమ్మల్ని వదిలి శూన్యంలోకి వెళ్ళిపోయాడు."

    "కాని కంప్యూటర్....." అనుమానం తీరనట్టు అన్నాడు.

    "వంద సంవత్సరాల క్రితం మనిషి టెలీపతిని నమ్మేవాడు కాడు నిఖిల్. రీజనింగ్ లేకుండా ఏదీవుండదు. సైన్స్ పురోగమించేకొద్దీ శబ్ద  ప్రకంపనాలు మనిషిమీద ఏ విధమైన ప్రభావం చూపిస్తాయో తెలుసుకుంటూ వచ్చాం. దివ్యదృష్టి, అవతలి మనిషిని మనం కంట్రోల్ లోకి తెచ్చుకునే  టెలీపతి, ఇవన్నీ  ఇంకా మనకి అంతుబట్టడంలేదు కానీ ఆ 'మాయాస్' మనకన్నా  సాంకేతికంగా ముందుకెళ్ళి మన కంప్యూటర్ ని కూడా తమ ప్రభావంలోకి తీసుకున్నారు. అలాంటి వాళ్ళతో మనం త్వరలో యుద్ధం చేయబోతున్నాం."

    అప్పటివరకూ ఆసక్తిగా వింటున్న నిఖిల్ ఈ చివరి మాటకు ఉలిక్కిపడి "యుద్ధమా?" అన్నాడు.

    "వాళ్ళు కావాలనుకుంటే మీముగ్గురితో స్నేహసంబంధాలు ఏర్పర్చుకోవచ్చు. మీరు అంతరిక్షంలో తిరుగుతున్నారని వాళ్ళకి తెలుసు. నా ఊహ నిజమైతే మీ  పేర్లు, మీరు మాట్లాడుకునే భాషతో సహా వాళ్ళకి తెలుసు. నా ఊహ నిజమైతే మీ పేర్లు మీరు, మాట్లాడుకునే భాషతో సహా వాళ్ళకి ఈ  పాటికి అర్థమయి వుండాలి. అయినా ఎందుకు మిమ్మల్ని మోసం చేశారు? అంత  ఆధునిక విజ్ఞానం వున్నవాళ్ళు కావాలనుకుంటే తమ వాహనాన్ని మీకు దగ్గరగా తీసుకొచ్చి సంధానం చేయవచ్చుగా. నాకెందుకో ఆ 'మాయాస్' చాలా ప్రమాదకరమైనా వాళ్ళుగా తోస్తున్నారు."

    అతడి మాటలు పూర్తికాలేదు. తలుపు డఢాలున తోసుకుంది. వాయుపుత్ర గుమ్మం దగ్గర నిలబడి వున్నాడు. అతడి చేతిలో కంప్యూటర్  అందించిన కాగితం వుంది. అయితే మొహంలో డీ - కోడ్ చేసిన ఆనందం కనబడటంలేదు. భయం కొట్టొచ్చినట్టు కపబడుతోంది.

    వాయుపుత్ర చేయి వణుకుతున్నట్టు కదులుతూంది.

    "ప్లానెట్ ఆల్ఫా* వాసులు తమకు కావాల్సిన శక్తిని సూర్యుడి* నుంచి పోందదల్చుకుని, ఆ విషయమై ఇంటర్ ప్లానెటరీ సొసైటీకి* కి నివేదిక పంపారు. సూర్యుడిమీద ఆధారపడిన జీవరాసులు ఏమీ  లేవని ఈ నివేదిక సారాంశం. ఈ చర్య ఎవరికైనా ఏ విధమైన నష్టమైనా కల్గిస్తుందని భావించే పక్షాన ఆ విషయాన్ని ఇంటర్ ప్లానెటరీ సొసైటీకి తెలియపర్చగలరు-"

    యశ్వంత్ దానివైపే చూస్తూ చాలాసేపు వుండిపోయాడు.

    వివిధ దేశాల్లో శాస్త్రజ్ఞులు తమ తమ  విభిన్న పద్ధతుల ద్వారా ఈ వార్తా యొక్క సత్యాసత్యాలను, వాయుపుత్ర అనుసరించిన పద్ధతినే  పరీక్షిస్తున్నారు.

    యశ్వంత్ వీటి గురించి పట్టించుకోలేదు. వాయుపుత్ర ఇచ్చిన వార్త కరక్టే అని అతను నమ్ముతున్నాడు. నిఖిల్ కి  కనిపించింది గాలి పళ్ళెమే అని అతడి అనుమానం.

    అతడు ఒక్కొక్క విషయమే సమీకరించుకుంటూ వచ్చారు.

    1. వారికి భూమ్మీద జీవరాశి వుందని తెలుసు.

    2. ఆ జీవరాశిలో 'మనుష్యులు' అనే ప్రాణి తాలూకు భాష కూడా వారికి తెలుసు. ఈ ప్రాణికోటి అంతా సూర్యుడిమీద ఆధారపడి వుందని వారికి తెలుసు. అయినా కూడా సూర్యుడినే వారు ఎన్నుకొన్నారు. ఈ గాలక్సీలో కొన్నికోట్ల నక్షత్రాలున్నాయి. అయినా వాటిని వదిలేసి సూర్యుడు కోసమే వారు వచ్చారు.

    3. మన గాలక్సీలోనో, లేక  ఇతర గాలక్సీలోనో కొన్ని కోట్ల కోట్ల మైళ్ళ అవతల  ఆల్ఫా గ్రహంమీద  వున్నట్టే, మరి కొన్ని  గ్రహాలమీద ప్రాణికోటి వుంది. అక్కడ 'మాయాస్' మన కన్నా  కొన్ని వందల రెట్లు అధికమైన తెలివైన వాళ్ళు సాంకేతికంగా ముందున్నవారు. మనకి చిన్న చిన్న  దేశాలు, వాటికి ఐక్యరాజ్య సమితి ఎలా వున్నాయో, అక్కడ వేర్వేరు గ్రహాల వారందరికీ కలిపి ఒక ఇంటర్ ప్లానెటరీ సొసైటీ వుంది. విశ్వంలో ఇతర గాలక్సీల్లో వున్న ప్రాణులకూ, ఈ  సొసైటీకి సంబంధాలు వుండి వుండవచ్చు. మనం విమానాల్లో ఒక దేశంనుంచి మరొక దేశానికి ప్రయాణం చేస్తున్నట్టే, వారు గ్రహాంతర యానం చేస్తూ వుండవచ్చు. వీరిలొ ఆల్ఫాగ్రహం మీద వున్న ప్రాణులకు ఎనర్జి అవసరం వచ్చి గాలక్సీలో ఒక  మూలగా వున్న  సూర్యుడిని ఎన్నుకొని దాన్నించి శక్తిని అదునానతమైన పరికరాల ద్వారా లాక్కుంటున్నారు.

    ఇక్కడివరకూ అర్ధమైన విషయాలు ఇక అర్ధంకానివి కొన్ని వున్నాయి.

    1. సూర్యుడి శక్తిని కూడా కొన్ని క్షణాలపాటు నిర్వీర్యం చేయగలిగేటంతటి ఆధునాతనమైన పరికరాలున్న ఆల్ఫా గ్రహవాసులు, ఇంకొక నక్షత్రాన్నీ గ్రహాన్ని ఎన్నుకోకుండా, సూర్యుడునే ఎందుకు ఎన్నుకున్నారు? మనం రోడ్డుమీద నడుస్తూ వుంటే చీమ ల్లాంటి చిన్న చిన్ని ప్రాణులు ఎన్నో కాళ్ళక్రింద పడిచస్తూవున్నా వాటిని మనం పట్టించుకోము. అలాగే అ గ్రహాంతరవాసుల దృష్టిలో మనం చీమలకన్నా అల్పులమైన  ప్రాణులమా? మన గురించి పట్టించుకునే అవసరం లేదనుకున్నారా?

    2. రాయ్, ఆ రెండో పైలెట్ - ఈ ఇరువురునీ టెలీపతి ద్వారా భ్రమింపచేసింది ఆ ఎగిరే పళ్ళెంలోని మాయసేనా? అదే జరిగిన పక్షంలో వారెందుకు ఆ పని చేశారు? కేవలం ఆనందం కోసమా? లేక భూలోకవాసుల మీద యుద్ధం ప్రకటించదల్చుకున్నారా?

    3. సూర్యశక్తిని ఆ మాయాస్ తమతోపాటూ తీసుకువెళ్తూవుంటే  ఎంతకాలానికి సూర్యుడు నిర్వీర్యమైపోతాడు?

    4. ఈ గ్రహాంతర వాసులు ఉపయోగించే పరికరాలవల్ల సూర్యుడు  అస్థిరతార(Variable star)గా  మారే ప్రమాదం వెంటనే  వుందా? నోవా- సూపర్ నోవా స్థాయికి చేరుకొని అది బ్రహ్మాండమైన విస్ఫోటనతో పేలిపోతుందా? అలా పేలిపోని పక్షంలో సకల జీవాలకూ ఈ హెచ్చరిక ఎందుకు?

    5. పరీక్ష కోసం వెళ్ళిన నిఖిల్ కీ, మిగతా వారికి కనిపించింది నిజంగా గాలి పళ్ళెమేనా? అది  ఆల్ఫా గ్రహవాసులదేనా? వారు అంతదూరం నుంచే కంప్యూటర్ ని కూడా ఎలా 'మాయ'లో పడేయగలిగారు? మన సాంకేతిక జ్ఞానమంతా వారు అద్దంలో చూసినట్టు చూడగల్గుతున్నారా?

    వాయుపుత్ర ఈ వార్త కనుక్కున్న రెండు గంటలకి వివిధ దేశాల మధ్య శాస్త్రజ్ఞుల సమావేశం హాట్ లైన్ ఛానెల్ లో జరిగింది. దాదాపు అరవైమంది ప్రముఖులు తమ తమ దేశాల్నుంచే ఈ సమావేశంలో పాల్గొన్నారు.

    మాయాస్ అనబడే ఈ గ్రహాంతరవాసులు సూర్యశక్తిని వినియోగించటం అప్పటికే ప్రారంభమయింది. ఆ విషయం, అంతరిక్ష నగర విధ్వంసకాండ ద్వారా అర్థమైంది. అంతరిక్ష నగరం సూర్యుడితోపాటే పరిభ్రమిస్తూ వుంటుంది కాబట్టి, ఇక వేరే సూర్యశక్తిని నిలువ చేసుకునే ఏర్పాట్లు ఏమీ చేసుకోలేదు. సూర్యకాంతిని నిరోధించటం అన్న ఆపద ఎవరూ వూహించలేదు.

    ఆల్ఫా గ్రహవాసులు ఇదంతా తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలీదు.

    చివరికి శాస్త్రజ్ఞులు ఒక నిర్ణయానికి వచ్చారు.

    ఆ ఎగిరే గాలిపళ్ళెం మకాం వేసిన దిశగా ఒక వాహనాన్నిపంపి, దాని ఉనికి నిర్ధారణగా తెలుసుకోవటం. వీలైతే దానిలోకి ప్రవేశించి, మాయాస్ తో కమ్యూనికేషన్ ఏర్పరచుకోవటం. వారికి ఈ భూమి గురించి చెప్పి, సూర్యుడి నుంచి వారిని తొలగిపొమ్మని చెప్పటం.....ఇదీ ఆ నిర్ణయం.

    యశ్వంత్ కి ఈ ఆలోచన నచ్చలేదు.

    మాయాస్ కి భూమి గురించి, భూమిమీద జీవరాసుల గురించి బాగా తెలుసనే అతడి నమ్మకం. వారిని బ్రతిమాలటం, ప్రాధేయపడటం అనవసరం. ఏదైనా చేయల్గితే, ఇంటర్ ప్లానెట్ సొసైటీకి ఫిర్యాదు చేయగలగటమే మంచిపని కానీ కొన్ని కోట్ల కోట్ల మైళ్ళ దూరంలోవున్న ఆ సొసైటీకి ఏ విధంగా తమ దయనీయమైన స్థితి గురించి చెప్పగలుగుతారు? తాము పంపే (ధ్వని) తరంగాలు ఏ రకంగా వారిని చేరుకుంటాయి? వారు ఏ రకంగా దీనికి స్పందిస్తారు?

    అతడు తన భావాల్ని బయటకు చెప్పలేదు.

 Previous Page Next Page